ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రేలియా-భారత్ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
प्रविष्टि तिथि:
09 JUL 2026 11:33AM by PIB Hyderabad
ప్రధానమంత్రి అల్బనీస్ మహోదయా...
రెండు దేశాల ప్రతినిధులు... మాధ్యమాల మిత్రులందరికీ...
నమస్కారం!
మున్ముందుగా మెల్బోర్న్‌లో నాతోపాటు మా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికి, విశేష ఆతిథ్యమిచ్చిన నా మిత్రులు ప్రధానమంత్రి శ్రీ అల్బనీస్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు సమున్నత శిఖరాలకు చేరడంలో, రెండు దేశాల భాగస్వామ్య పరిధి విస్తరణలో ఆయన వ్యక్తిగత నిబద్ధత, కృషి అమూల్యం. ఈ దిశగా ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు నా ప్రశంసలు.
మిత్రులారా!
భారత్ - ఆస్ట్రేలియా ప్రపంచంలోనే
రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలు,
రెండు బహుళ సాంస్కృతిక సమాజాలు,
రెండు కీలక సముద్ర రంగ శక్తులు.
అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.
రెండు దేశాల మధ్య 2022 నాటి ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పరిధి నిరంతరాయంగా విస్తరిస్తూ వచ్చింది. ఈ ముందడుగు ప్రాతిపదికగా ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (సీఈసీఏ) సత్వరం ఖరారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం సమతులంగానే కాకుండా ఉభయతారకంగానూ ఉంటుంది. దీంతోపాటు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఖరారు దిశగానూ మేం వేగం పెంచుతాం.
కాలుష్య రహిత ఇంధనం, వాతావరణ పరిరక్షణ చర్యల సంబంధిత సంయుక్త కృషికి మా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్యం నిర్దిష్ట రూపమిస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పరిశ్రమల మధ్య సహకారంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం.
భారత్‌లో ‘పీఎం సూర్య ఘర్ యోజన’కు పటిష్ట అమలు లక్ష్యంగా గుజరాత్‌లో సంయుక్త ‘రూఫ్‌టాప్ సోలార్ ట్రైనింగ్ అకాడమీ’ని ఏర్పాటు చేశాం. దీని ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు సహా యువతరంలోనూ సామర్థ్యం ఇనుమడిస్తుంది.
అణుశక్తి రంగానికి సంబంధించి మేమివాళ ఓ కీలక ఒప్పందం చేసుకున్నాం. తద్వారా ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరా మార్గం సుగమమవుతుంది. ఇది మా కాలుష్య రహిత ఇంధన లక్ష్యాల సాధన దిశగా అదనపు బలాన్నిస్తుంది.
రెండు దేశాల వ్యూహాత్మక భద్రత, కాలుష్య రహిత ఇంధనం వైపు మళ్లడంలో కీలక ఖనిజాల రంగంలో సహకారం ఎంతో ముఖ్యం. ఈ దృక్కోణంతోనే ఈ రోజున సైబర్ రంగం సహా కీలక సాంకేతికతలు, సరఫరా వ్యవస్థలపై ఆస్ట్రేలియా-భారత్ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో కీలక ఖనిజాల కారిడార్ విషయంలోనూ సంయుక్తంగా కృషి చేస్తాం.
మిత్రులారా!
ఇండో-పసిఫిక్ అంటే రెండు మహా సముద్రాల సంగమం ఒక్కటే కాదు... అది భారత్-ఆస్ట్రేలియా వంటి భావసారూప్య ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక.
రక్షణ, భద్రత రంగాల్లో సహకార విస్తృతి లక్ష్యంగా ఇవాళ మేమొక ముఖ్యమైన సంయుక్త ప్రకటన చేశాం. దీని ప్రకారం భారత్-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇన్నొవేషన్ కారిడార్ ద్వారా రక్షణ రంగ అంకుర సంస్థలు, భారీ పరిశ్రమల అనుసంధానానికి కృషి చేస్తాం.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సంయుక్త కృషిని మా సముద్ర భద్రత సహకార వ్యూహాత్మక ప్రణాళిక మరింత పటిష్టం చేస్తుంది. తదనుగుణంగా నౌకా నిర్మాణం-మరమ్మతు-నిర్వహణ వంటి రంగాల్లోనూ కలిసి ముందడుగు వేస్తాం.
మిత్రులారా!
వీటన్నిటితోపాటు అనేక ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై మేం విస్తృతంగా చర్చించాం. ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించి- అది ప్రపంచంలో ఏదో ఒక దేశానికి పరిమితమైనది కాదని, దానివల్ల యావత్ మానవాళికీ తీవ్ర ముప్పు పొంచి ఉందని భారత్-ఆస్ట్రేలియా పూర్తిగా ఏకీభవిస్తున్నాయి. అందుకే, ఆ మహమ్మారిపై సంయుక్త పోరాటం దిశగా మా దృఢ సంకల్పానికి నానాటికీ బలోపేతమవుతున్న మా సహకారం ఇతోధికంగా తోడ్పడుతుంది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సంఘర్షణలకు పరిష్కారం చర్చలు, దౌత్యంతోనే సాధ్యమని మేం విశ్వసిస్తున్నాం. ఇండో-పసిఫిక్ ప్రాంతమంతటా శాంతి, స్థిరత్వం, నౌకాయాన స్వేచ్ఛ, నిబంధనాధారిత వ్యవస్థ మరింత బలోపేతం తదితరాల కోసం మేం భుజం కలిపి కృషి చేస్తాం.
మిత్రులారా!
రెండు దేశాల ప్రజల మధ్యగల బలమైన బంధమే మా ద్వైపాక్షిక స్నేహసంబంధాలకు అత్యంత విశిష్ట వారధి. ఇక్కడి ప్రవాస భారతీయులు ఆస్ట్రేలియా ఆర్థిక-సామాజిక ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు.
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా ఒక ప్రధాన గమ్యంగా కొనసాగుతుండగా, మా దేశంలో ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల శాఖలు ఏర్పాటు కావడం రెండు దేశాల విజ్ఞాన భాగస్వామ్యానికి నూతనాధ్యాయాన్ని జోడిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వృత్తి నిపుణులు, పర్యాటకుల ఆదానప్రదానం పెంపు దిశగా మా వంతు కృషిని కొనసాగిస్తాం.
మిత్రులారా!
నేడు మనం ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్బోర్న్ నగరంలో ఉన్నాం కాబట్టి, క్రీడల ప్రస్తావన లేకపోతే అది ‘టాస్ వేశాక క్రికెట్ మ్యాచ్ మొదులు కాకపోవడం’ వంటిది! రెండు దేశాల సంబంధాల్లో క్రికెట్ ఒక ప్రత్యేక దౌత్య భాష. అందుకే మా సమావేశాలు కూడా సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లనే తలపిస్తాయి... ఆ మేరకు:
కార్యక్రమం - వన్-డే మ్యాచ్ తరహాలో ఏకాగ్రత సహితంగా ఉంటుంది.
నిర్ణయాలు - టి20 తరహాలో వేగంతో ముడిపడి ఉంటాయి.
మా భాగస్వామ్యం - టెస్ట్ మ్యాచ్ తరహాలో హుందాగా, దీర్ఘకాలికమైనదిగా ఉంటుంది.
భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రధాన క్రీడా కార్యక్రమాలకు రెండు దేశాలూ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. తద్వారా ద్వైపాక్షిక క్రీడా సహకారం విస్తృతం కావడమేగాక క్రీడా మౌలిక సదుపాయాలలో పెట్టుబడులకు అపార అవకాశాలు అందివస్తాయి.
మిత్రులారా!
మొత్తం మీద భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం సమకాలీనం మాత్రమే కాదు... భవిష్యత్తుతోనూ సదా ముడిపడి ఉంటుంది. సంయుక్త దృక్కోణం ప్రాతిపదికగా కలసిమెలసి ముందుకు సాగుతామన్నది నేటి చర్చల సారాంశం.
ప్రధానమంత్రి అల్బనీస్ మహోదయా...
మీ స్నేహార్ద్రత, నిబద్ధతలతోపాటు మనమధ్య సాగిన నేటి అర్థవంతమైన చర్చలలో మీ సౌహార్దతకు మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నాను. వీలైనంత త్వరగా భారత పర్యటనకు రావాల్సిందిగా మా 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీకు మళ్లీ ఆహ్వానం పలుకుతూ ఈ ప్రసంగం ముగిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు...
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(रिलीज़ आईडी: 2283184)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam