సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ పునరుద్ధరణ ప్రయత్నాలతో 4కే ఫార్మేట్లో పెద్ద తెర మీదకు తిరిగి వస్తున్న మలయాళం క్లాసిక్ చలనచిత్రం ‘కిరీడమ్’
प्रविष्टि तिथि:
09 JUL 2026 12:41PM by PIB Hyderabad
మలయాళ చలనచిత్ర రంగంలో దృశ్యకావ్యంగా పేరు తెచ్చుకున్న ‘కిరీడమ్’ రేపు... అంటే 2026 జులై 10న... భారత్‌తో పాటు విదేశాల సినిమా థియేటర్లలో డాల్బీ ఎట్మాస్ సౌండ్, 4కే పునరుద్ధరణ వెర్షన్‌లో కనువిందు చేయబోతోంది. దీనికి జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థకు చెందిన జాతీయ చలన చిత్ర పురావస్తు విభాగం (ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ) సరికొత్త వన్నెలద్ది మరీ ముస్తాబు చేసింది. పునరుద్ధరించిన ఈ చలన చిత్రాన్ని సెవెన్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో ఎన్ఎఫ్‌డీసీ సమర్పిస్తోంది. ఈ సినిమాను హైజిన్ గ్లోబల్ వెంచర్స్ పంపిణీ చేస్తోంది.
ఈ చలన చిత్ర పునరుద్ధరణ ఘట్టం భారత్‌లో చలనచిత్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇస్తున్న ప్రాధాన్యానికి అద్దం పడుతోంది. 1989 నాటి ఈ చలన చిత్రానికి సంబంధించిన అసలు సిసలు కెమెరా నెగెటివ్ జీర్ణావస్థకు చేరి, పునరుపయోగానికి అనువుగా లేదు. అయినప్పటికీ, మొదట ఈ చిత్రాన్ని విడుదల చేసినప్పటి ప్రింటులలో ఒక 35 ఎమ్ఎమ్ ప్రింటును నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియా 30 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటు భద్రపరిచింది. ఈ ప్రింటును ఆధారంగా చేసుకొనే దానిని 4కే వెర్షన్‌గా పునరుద్ధరించారు.

కిరీడమ్ చిత్రానికి రచయిత శ్రీ ఎ.కె. లోహితదాస్. ఈ సినిమాకు శ్రీ శిబి మలయిల్ దర్శకత్వం వహించారు. సేతుమాధవన్ పాత్రలో శ్రీ మోహన్‌లాల్, హెడ్ కానిస్టేబుల్ అచ్యుతన్ నాయర్ పాత్రలో శ్రీ తిలకన్ నటించారు. మలయాళ సినీ రంగంలో అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా ఈ చలన చిత్రం పేరు తెచ్చుకుంది.
ఈ చలనచిత్ర పునరుద్ధరణ కార్యక్రమాన్ని సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎస్. కుమార్, దర్శకుడు శ్రీ శిబి మలయిల్ పర్యవేక్షణలో చేపట్టారు. అధిక స్పష్టతను కలిగి ఉండే స్కానింగ్, డిజిటల్ ఇమేజి పునరుద్ధరణ సాంకేతికత, కలర్ గ్రేడింగ్ పూర్తి చేశారు. డాల్బీ అట్మాస్ సౌండ్ ను జతపరిచి ఈ సినిమా రీమాస్టర్ వెర్షనును తీసుకువచ్చారు. థియేటర్లకు ఇవ్వాలనుకున్న వెర్షను పనులను ప్రసాద్ కార్పొరేషన్ పూర్తి చేసింది. ఈ పనులకు హై స్టూడియోస్ సహకారాన్ని అందించింది. శ్రీ బోనీ అస్సనార్ క్రియేటివ్ విజనరీ హెడ్‌గా వ్యవహరించారు.

విడుదలయినప్పటి ప్రింటును దశాబ్దాల పాటు కాపాడినందువల్లే ఈ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకులకు అందించడం సాధ్యపడుతోందని ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ప్రకాశ్ మగుడమ్ అన్నారు. భారత చలనచిత్ర వారసత్వాన్ని సంరక్షించడానికి ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ ఎంత నిబద్ధతతో పనిచేస్తోందో ఈ చలన చిత్రం పునరుద్దరణే తెలియజేస్తోందని ఆయన అన్నారు.
చిత్రం ప్రింటును పదిలపరచడంతో పాటు నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా దీనిని పునరుద్ధరించినందుకు ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐకి దర్శకుడు శ్రీ శిబి మలయిల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని చాలా కాలం నుంచీ ప్రశంసిస్తున్న అభిమానులే కాకుండా, దీనిని సరికొత్త వెర్షన్లో పెద్ద తెర మీద చూడబోతున్న ఈ కాలం ప్రేక్షకులు ఈ చిత్రం అందించే అనుభూతిని ఆస్వాదించగలరన్న ఆశాభావాన్ని ఈ చిత్ర దర్శకుడు శ్రీ శిబి మలయిల్ వ్యక్తం చేశారు.
పునరుద్ధరించిన చిత్రాన్ని భారత 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మొదటి సారిగా ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు తొలిసారి ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షక వర్గంతో పాటు చలనచిత్ర రూపకర్తలు కూడా చూసి, ఎంతో ఉత్సాహంగా ప్రతిస్పందించారు.
భారత్‌కున్న ఘనమైన శ్రవణ, దృశ్య మాధ్యమ వారసత్వాన్ని కాపాడుతూ, పునరుద్ధరణ పనులను చేపట్టి ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతను ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ నిరంతరంగా సాకారం చేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో పరిరక్షణ, డిజిటలీకరణ, పునరుద్ధరణ ప్రక్రియల ద్వారా ఈ సంస్థ చలనచిత్ర కళాఖండాలను సమకాలీన ప్రేక్షకులకు పెద్ద తెరపై మరో సారి పరిచయం చేస్తుండడమే కాకుండా, ఇవి భావి తరాల వారికి కూడా అందుబాటులో ఉండేటట్లు ఈ సంస్థ శ్రద్ధ వహిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2282806)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Kannada
,
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Tamil
,
Malayalam