గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా నేటినుంచి ‘వీబీ-జీ రామ్‌-జీ’ పథకం అమలు


గ్రామీణ భారతానికి ఇదొక చరిత్రాత్మక దినం: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షాన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జూలై 2న జాతీయ స్థాయి ప్రారంభోత్సవం

ఈ పథకం కింద వేతన సవరణ ప్రకటన... జాతీయ సగటు వేతనం 10 శాతానికి పైగా పెంపు... నిర్ణీత రోజువారీ కనీస వేతనం ₹300

प्रविष्टि तिथि: 01 JUL 2026 6:22PM by PIB Hyderabad

   దేశంలో గ్రామీణ జీవనోపాధి బలోపేతం సహా వికసిత గ్రామీణ భారత్‌ లక్ష్య సాధనలో ఒక చారిత్రక ఘట్టంగా ‘వికసిత్ భారత్ – గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ-జీ రామ్-జీ చట్టం-2025) నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అర్హత గల గ్రామీణ కుటుంబాలకు ఇకపై ఏడాదిలో 125 రోజుల పాటు వేతన హామీతో ఉపాధి పొందే హక్కు లభిస్తుంది. గ్రామీణ ఉపాధిని మరింత సమర్థంగా, పారదర్శకంగా, ఫలితాధారితంగా మార్చడం దీని ధ్యేయం. అలాగే, గ్రామీణ శాశ్వత ఆస్తుల సృష్టి, సహజ వనరుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, జీవనోపాధికి ప్రోత్సాహం, మహిళల సారథ్యంలో ప్రగతిని వేగిరపరచడం ఈ చట్టం లక్ష్యాలు.

ఈ చట్టం అమలు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నిర్దేశిత వేతన ప్రాంతాల కోసం దీనికింద సవరించిన వేతన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా దేశంలో ఎక్కడా నిర్దేశిత రోజువారీ వేతనం ₹300కన్నా తక్కువ ఉండటానికి వీల్లేదు. అంటే- జాతీయ సగటు రోజువారీ నిర్దేశిత వేతనం సగటున 10 శాతానికి పైగా పెరుగుదలతో ₹298.80 నుంచి ₹327.40కి చేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పరిధిలో వేతన పెరుగుదల 15 నుంచి 25 శాతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచే చట్టం సజావుగా, సమర్థంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయం పూనింది. తదనుగుణంగా నిరంతర ఉపాధి కల్పన, సకాలంలో వేతన చెల్లింపు, అభివృద్ధి పనుల నిర్వహణకు తగినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం ₹95,692.31 కోట్ల మేర మధ్యంతర నిధులను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో “గ్రామీణ భారతానికి ఇదొక చరిత్రాత్మక, అపూర్వ దినం” అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం-రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన అమలులోకి వచ్చిన ‘వీబీ-జీ రామ్‌-జీ’ చట్టం ఒక శాసనపత్రానికి పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. లక్షలాది గ్రామీణ కార్మికుల ఆత్మగౌరవం, జీవనోపాధి భద్రత సహిత నవ శకానికి నాంది పలికిన ఒక పరిణామాత్మక కార్యక్రమమని అభివర్ణించారు. అర్హత గల ప్రతి గ్రామీణ కుటుంబానికీ ఇకపై ఏడాదిలో 100 రోజులకు బదులుగా 125 రోజుల ఉపాధి పొందే చట్టబద్ధ హక్కు దఖలు పడిందని ఆయన చెప్పారు. గ్రామీణ కార్మికులో ఏ ఒక్కరూ ఉపాధికి దూరం కాకుండా చూడటమే ప్రభుత్వ అగ్ర ప్రాథమ్యమని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు.

ఈ చట్టాన్ని సజావుగా అమలు చేసే దిశగా పాలనపరమైన, ఆర్థిక-సాంకేతిక ఏర్పాట్లన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పూర్తి చేశాయని ఆయన తెలిపారు. గ్రామాల్లో కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు దీర్ఘకాలిక ఆస్తుల కల్పనను ఈ పథకం వేగిరపరుస్తుందని చెప్పారు. దీంతో పాటు మహిళా సాధికారతను బలోపేతం చేస్తూ- ‘స్వయంసమృద్ధ, వికసిత గ్రామీణ భారత్‌’ లక్ష్య సాధనకు నవ్యోత్తేజమిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుసంపన్న, సాధికార, స్వయం సమృద్ధ గ్రామాలను రూపుదిద్దడంలో భాగస్వాములు కావాల్సిందిగా పౌరులకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లె మండలం, ముక్కవారిపల్లె గ్రామంలో ‘వీబీ-జీ రామ్‌-జీ చట్టం-2025’ జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జూలై 2న నిర్వహిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, శ్రీ కమలేష్ పాశ్వాన్ సహా ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పథకాన్ని అధికారికంగా ప్రారంభించడం సహా లబ్ధిదారులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డుల పంపిణీ, వీబీ-జీ రామ్‌-జీ సాఫ్ట్‌వేర్ వేదికతోపాటు కీలక ప్రచురణల ఆవిష్కరణ చేస్తారు. అలాగే, లబ్ధిదారులతో మాటామంతీ సహా చట్టం సమర్థ అమలు లక్ష్యంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

 

***


(रिलीज़ आईडी: 2280113) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Odia , Tamil , Telugu_Vw , Malayalam