రక్షణ మంత్రిత్వ శాఖ
2025 జూలై 28 నాటి రక్షణ మంత్రి పార్లమెంటు ప్రసంగాన్ని వక్రీకరించడంపై ప్రకటన
प्रविष्टि तिथि:
27 JUN 2026 6:00PM by PIB Hyderabad
2025 జూలై 28న పార్లమెంటు వేదికగా రక్షణ మంత్రి చేసిన ప్రసంగాన్ని తప్పుగా చిత్రీకరించేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు చెలామణి అవుతున్నాయి. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత సైనికులెవరూ ప్రాణాలు కోల్పోలేదని రక్షణ మంత్రి చెప్పినట్లు అర్థం వచ్చేలా ఈ పోస్టులు ఆయన ప్రసంగంలోని ఎంపిక చేసిన ఒక భాగాన్ని మాత్రమే విడిగా ఉదహరిస్తున్నాయి. ఇవి పూర్తిగా ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేవి మాత్రమే కాకుండా వాస్తవ విరుద్ధమైనవి.
రక్షణ మంత్రి పార్లమెంటు ప్రసంగాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్న వారు ఆయన వ్యాఖ్యల పూర్తి సందర్భాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. రక్షణ మంత్రి ప్రసంగ సమయం నాటికి 'ఆపరేషన్ సింధూర్'లో భారతీయ పైలట్లు ప్రాణాలు కోల్పోయారంటూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం సాగించారు. ఇది పూర్తిగా అసత్యమైనప్పటికీ ఆపరేషన్ విజయాన్ని తగ్గించి చూపించాలనే, ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే స్పష్టమైన ఉద్దేశంతో దీనిని తీవ్రంగా ప్రచారంలో పెట్టారు. ఈ నిర్దిష్టమైన, ఉద్దేశపూర్వక దుష్ప్రచారాన్ని ఉద్దేశించి మాత్రమే రక్షణ మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆ సమయంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక ప్రమాదకరమైన అబద్ధాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతో ఒక నిర్దిష్ట సందర్భంలో మాత్రమే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
రక్షణ మంత్రి ప్రసంగాన్ని దాని పూర్తి, సరైన సందర్భంలోనే ప్రస్తావించటం కూడా అంతే ముఖ్యం. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగం మొత్తంలో 'ఆపరేషన్ సిందూర్' సాధించిన అద్భుతమైన విజయం గురించి గర్వంతోనూ కచ్చితత్వంతోనూ వివరించారు. ఈ ఆపరేషన్‌లో భారత రక్షణ దళాలు సాటిలేని కచ్చితత్వాన్ని, సంకల్పాన్ని, సైనిక నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ఈ ఆపరేషన్ సమయంలో 100 మందికి పైగా ఉగ్రవాదులు, పాకిస్థానీ సైనికులు హతమయ్యారు. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న వారి సైనిక మౌలిక సదుపాయాలు భారీ ఎత్తున నష్టాన్ని చవిచూశాయి. భారత రక్షణ దళాల ధైర్యసాహసాలకు, సామర్థ్యానికి దక్కిన తగిన గుర్తింపు ఈ ప్రసంగం. భారతదేశానికి హాని తలపెట్టాలని చూసే వారికి ఇచ్చిన ఒక స్పష్టమైన సందేశం ఇది.
భారత రక్షణ దళాల్లో ప్రతి ఒక్కరి పట్ల, అన్నింటికంటే మిన్నగా మాతృభూమి రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారి పట్ల రక్షణ మంత్రి, భారత ప్రభుత్వం అత్యంత గౌరవాన్ని, కృతజ్ఞతను, భక్తిభావాన్ని కలిగి ఉన్నాయి. దేశ రక్షణ కోసం వారు చేసిన త్యాగం మాతృభూమికి అందించే అత్యున్నత సేవ. ఆ త్యాగానికి తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీరిని ఎల్లప్పుడూ గర్వం, గంభీరమైన నిశ్శబ్దంతో స్మరించుకుంటూ ఉంటాం.
వారి సర్వోన్నత త్యాగానికి గుర్తింపుగా ప్రభుత్వం జాతీయ యుద్ధ స్మారకం గోడలపై వారి పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించేలా చర్యలు తీసుకుంది. ఈ వీరజవాన్ల కుటుంబాలకు లేదా వారిపై ఆధారపడిన వారికి విద్య, వైద్యం, ఇతర సదుపాయాలలో రాయితీలను కల్పించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది.
***
(रिलीज़ आईडी: 2278766)
आगंतुक पटल : 21