హోం మంత్రిత్వ శాఖ
‘మాదక ద్రవ్యాల నియంత్రణపై దార్శనిక పత్రం 2026-2029’ని ఆవిష్కరించిన కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
న్యూఢిల్లీలో నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌కార్డ్) 10వ ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి
దేశవ్యాప్తంగా పట్టుబడిన ₹6,000 కోట్లకు పైగా విలువైన 2,09,500 కిలోల మాదక ద్రవ్యాల ధ్వంసంపై ‘మాదకద్రవ్యాల నిర్మూలన పక్షం’ ఆన్‌లైన్ కార్యక్రమానికి శ్రీకారం
మాదక ద్రవ్యాలు... ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్ సహా డార్క్‌నెట్ ద్వారా సరిహద్దుల గుండా దొంగ రవాణాపై పోరుతోపాటు కొత్త ముప్పుల నిరోధంలో సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ‘ఎన్‌సీబీ’ దార్శనిక పత్రం లక్ష్యం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన మరో మూడేళ్లలో మాదక ద్రవ్యాల వ్యాపార వ్యవస్థ దశబ్దాలపాటు కోలుకోలేని రీతిలో చావుదెబ్బ కొడతాం: శ్రీ అమిత్ షా
“గుర్తింపు.. అడ్డుకట్ట.. ధ్వంసం’ విధానంతోపాటు మానవ-సాంకేతిక నిఘా.. సామాజిక పోలీసింగ్ ద్వారా మూలం నుంచి సూత్రధారుల దాకా మాదక ద్రవ్యాల విష వలయాన్ని కూకటివేళ్లతో పెకలించాలి”
“బాధిత యువతపై సానుభూతి చూపుతూనే.. మాదక ద్రవ్యాల దొంగ రవాణాదారులపై మనం కఠిన వైఖరి అవలంబించాలి”
“ఎన్‌డీపీఎస్’ ప్రధాన కేసులలో ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు సహా నేరపూరిత ఆర్జన స్తంభన-స్వాధీనానికీ ప్రాధాన్యమివ్వడం అవశ్యం”
“రాష్ట్రాలన్నీ తమ మాదకద్రవ్య నిరోధక బృందాలను (ఏఎన్‌టీఎఫ్) పూర్తికాలపు.. ప్రత్యేక.. సర్వశక్తియుత.. జవాబుదారీతనం గల విభాగాలుగా మార్చాలి”
“విదేశాల్లో నక్కిన స్మగ్లర్లు.. గ్యాంగ్‌స్టర్లపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ సహా అప్పగింత ప్రక్రియ.. సీబీఐ ద్వారా సత్వర చర్యల దిశగా రాష్ట్రాలు ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి”
“డిమాండ్ తగ్గింపు.. ‘మాదకద్రవ్య రహిత వలయాల’ ఏర్పాటు సహా తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు.. విద్యాసంస్థలు.. యువజన సంఘాలు.. మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలను ప్రారంభిస్తాం”
“ప్రధాన కేసులలో విచారణను వేగిరపరచే దిశగా ప్రత్యేక ‘ఎన్‌డీపీఎస్’ కోర్టుల ఏర్పాటుకు మా శాఖ కృషి చేస్తోంది.. రాష్ట్రాలు కూడా తమ హైకోర్టుల పరిధిలో ఇలాంటి ఏర్పాటు చేయాలి”
“సరిహద్దులు.. ఓడరేవులు.. విమానాశ్రయాలు.. గ్రామాలలో నిఘా సహా సామాజిక పోలీసింగ్.. నేరాల విశ్లేషణ ద్వారా ప్రతి డ్రగ్ నెట్‌వర్క్‌ను గుర్తించాలి”
“మాదకద్రవ్య ముఠాల ఆర్థిక వనరులు.. నాయకత్వం సహా యావత్ వలయాలను దెబ్బకొట్టాలి; ప్రధాన కేసులలో ‘ఈడీ’ ద్వారా ఆర్థిక దర్యాప్తును తప్పనిసరి చేయాలి”
“అమలు-నిఘా-కార్యా
प्रविष्टि तिथि:
26 JUN 2026 5:08PM by PIB Hyderabad
కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌కార్డ్) 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘ఎన్‌సీబీ వార్షిక నివేదిక-2025’ సహా ‘మాదక ద్రవ్యాల నియంత్రణపై దార్శనిక పత్రం 2026-2029’ని కూడా ఆయన ఆవిష్కరించారు. దీంతోపాటు జమ్ము, గువహటి నగరాల్లో ‘ఎన్‌సీబీ’ జోనల్ కార్యాలయాలను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పట్టుబడిన ₹6,000 కోట్ల విలువైన 2,09,500 కిలోల మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా ‘మాదకద్రవ్యాల నిర్మూలన పక్షం’ పేరిట ఒక ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ- మాదక ద్రవ్యాలపై పోరాటంలో దేశం నేడొక కీలక మలుపులో నిలిచిందని పేర్కొన్నారు. మరో మూడేళ్లలో ఈ వ్యసనం మనల్ని ఓడించడం కాకుండా దాన్నే మనం కూకటివేళ్లతో పెళ్లగిస్తామన్నది వాస్తవం కాగలదన్నారు. రాబోయే వందేళ్ల దేశ భవిత కోసం మనమంతా దృఢ సంకల్పంతో, సమష్టి కృషితో ఈ యుద్ధం గెలవడం అనివార్యమన్నారు. ఇది ఏదో్ ఒక శాఖ, రాష్ట్రం, ప్రభుత్వం లేదా వ్యక్తితో సాధ్యమయ్యేది కాదని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, సంబంధిత శాఖలు, విభాగాలన్నీ ఒకే వేదికపైకి రావాలని సూచించారు. ప్రజలను ఉత్తేజపరిచే వ్యక్తులను, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతను, మహిళా శక్తిని కూడా ఇందులో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మన విజయం పూర్తిగా ఈ కృషిపైనే ఆధారపడిఉందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల సమస్య శాంతిభద్రతలు లేదా ప్రజారోగ్యంతో మాత్రమే ముడిపడినది కాదని శ్రీ అమిత్ షా చెప్పారు. జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ, యువతరం భవిత సహా దేశ పురోగమనంతో పెనవేసుకున్న అంశమని తెలిపారు. దీనిపై సంపూర్ణ విజయమే దేశంలోని రాష్ట్రాలన్నిటి సమష్టి జాతీయ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాల దొంగ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, నార్కో-ఉగ్రవాద వనరులు, సరిహద్దు ఉగ్రవాద మూకలకు నిధులు సమకూర్చడం సహా నేడు ఈ బెడద నార్కో-ఉగ్రవాద వ్యవస్థగానూ పరిణామం చెందిందని ఆయన వివరించారు. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ, యువతరం భవిష్యత్తు కోసం ఈ ముప్పుపై మనం పూర్తిస్థాయిలో విజయం సాధించడం అవశ్యమని చెప్పారు. మాదకద్రవ్యాల పీడ రీత్యా మనం భౌగోళికంగా ‘మరణ త్రిభుజం’, ‘మరణ అర్ధచంద్రాకారం’ నడుమ ఉన్నామని గుర్తుచేశారు. డ్రోన్లతో డ్రగ్స్ జారవిడవడం, సముద్ర మార్గాల్లో కంటెయినర్లలో రవాణా, డార్క్‌నెట్, క్రిప్టో చెల్లింపులు, ఆర్డర్-టు-డెలివరీ పద్ధతులు, పార్శిల్ రవాణా తదితర పద్ధతుల్లో దొంగ రవాణాదారులు మన పోరాటాన్ని మరింత సవాలుగా మారుస్తున్నారని తెలిపారు. ఈ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో మరింత శక్తి పుంజుకుని, నెట్‌వర్క్ ఆధారిత కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. తద్వారా బహుళ రంగ నేర స్వరూపంతో మనతో తలపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి, ఈ సంక్లిష్ట పోరాటంలో మన ప్రతిస్పందన కూడా సామూహికంగా, వ్యవస్థీకృతంగా, వ్యూహాత్మకంగా, ఆధునికంగా, పటిష్ట నిఘా ఆధారితంగా ఉండాలని చెప్పారు. అలాగే, సాంకేతికతతో నడిచే విధానం ద్వారా నిర్దాక్షిణ్య వైఖరితో నెట్‌వర్క్ కేంద్రక యుద్ధం చేస్తేనే ఈ మహమ్మారిని నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల దొంగ రవాణాలో పాలుపంచుకునే వారిపై కఠిన వైఖరి వీడకుండానే బాధితులపై సానుభూతితో వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. మన కరుణ, సద్భావనతో మాత్రమే వ్యసనపరులను తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకురాగలమని, ఆ మేరకు వారిని చేయి పట్టుకుని సన్మార్గంలోకి నడిపించాలని సూచించారు.
ఈ బెడద నిర్మూలనలో మన పోరాట రూపాన్ని నాలుగు మూలస్తంభాల కింద నేటి ప్రదర్శనలో వివరించామని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అలాగే, ప్రతి మూలస్తంభం కింద ఉప స్తంభాలను స్పష్టంగా నిర్వచించడమేగాక ఒక్కొక్కదానికి నిర్దిష్త లక్ష్యాలు సహా వాటి సాధనకు వ్యవధిని కూడా నిర్దేశించామని ఆయన తెలిపారు. ఏడాది తర్వాత ఈ వ్యూహం అమలును సమీక్షించి, అవసరమైన మేర పునర్నిర్వచించడం ద్వారా ఈ పోరాటంలోని చివరి రెండేళ్ల అంకం దిశగా నవ్యోత్తేజంతో ముందడుగు వేస్తామన్నారు.
ఇందులో భాగంగా ఇవాళ ‘మాదకద్రవ్య నిర్మూలన పక్షం’ మొదలైందని, దీనికింద ఈ ఒక్క రోజునే రూ.6,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ధ్వంసం చేయడం ఓ కీలక విజయమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అలాగే, ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ (ఎన్‌సీబీ) వార్షిక నివేదికతోపాటు ‘నషా ముక్త్ భారత్’ వ్యూహాత్మక ప్రణాళికపై దార్శనిక పత్రాన్ని కూడా ఆవిష్కరించడాన్ని గుర్తుచేశారు. మరోవైపు గువహటి, జమ్ము నగరాల్లో ‘ఎన్‌సీబీ’ జోనల్ కార్యాలయాలను కూడా ఆన్‌లైన్ మాధ్యమంలో ప్రారంభించామని తెలిపారు. ఇప్పటిదాకా ‘ఎన్‌కార్డ్’ 15,876 జిల్లా స్థాయి, 266 రాష్ట్ర స్థాయి, 7 కార్యనిర్వాహక కమిటీ స్థాయి సమావేశాలను నిర్వహించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ 10వ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాల్గొన్న అన్ని రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ‘డీజీపీ’లు ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేసి, సత్ఫలితాలు సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.
దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా రూపుదిద్దడంతోపాటు ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనకు నిర్దేశించారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. ఈ లక్ష్యం దిశగా 2026 నుంచి 2029 దాకా అమలు చేసేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక ప్రణాళిక నాలుగు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఈ మేరకు అమలు-నిఘా-కార్యాచరణ, ముందస్తు చర్యలు-సింథటిక్ డ్రగ్ నియంత్రణ, డిమాండ్ తగ్గింపు-పునరావాసం, సామర్థ్య వికాసం-సమన్వయం-పర్యవేక్షణ’ ఇందులో కీలకాంశాలని వివరించారు. యావత్ నెట్‌వర్క్‌పై లక్షిత నిఘా ప్రాతిపదికన చర్యలు చేపట్టి, పూర్తిగా నాశనం చేయడమే దీని ధ్యేయమన్నారు. మాదకద్రవ్యాలను ఉత్పత్తి దశలోనే అరికట్టేందుకు పటిష్ట ప్రణాళిక అవసరమని చెప్పారు. డిమాండ్-హాని తగ్గించడం వంటి కార్యకలాపాలతోపాటు సామాజిక, విద్య, పునరావాస కార్యక్రమాలతో ముందడుగు వేద్దామన్నారు. వ్యవస్థ మొత్తాన్నీ సమర్థంగా, సమన్వయంతో, జవాబుదారీగా, ఆధునికంగా తీర్చిదిద్దడం కోసం సామర్థ్య వికాసం, సమన్వయం-పర్యవేక్షణలను నాలుగో స్తంభంగా నిర్దేశించామని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక ప్రణాళికను ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’, ‘ఏకోన్ముఖ సమాజం’ పంథాలో రూపొందించామని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడి పాత్ర ఇందులో కీలకమనని, వారిని ఉత్తేజపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహా కేంద్రంలోని సంబంధిత శాఖల కార్యదర్శులందరూ సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సకాలంలో లక్ష్యాలను సాధించడమన్నది ఉమ్మడి బాధ్యత ద్వారానే సాధ్యమని, అప్పుడు మాత్రమే ఈ వ్యూహాత్మక ప్రణాళిక విజయవంతం కాగలదని చెప్పారు. ఇందుకోసం ఒక సముచిత పర్యవేక్షణ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
మాదకద్రవ్యాల నిర్మూలన పోరాటాన్ని “గుర్తింపు.. అడ్డుకట్ట.. ధ్వంసం” అనే మూడు పదాలతో సంక్షిప్తంగా వివరించవచ్చునని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘విదేశాల నుంచి దేశంలోకి తరలించేవారు, సరిహద్దుల నుంచి రాష్ట్రాలకు చేరవేసే వారు, రాష్ట్రాల నుంచి తుది వినియోగదారులకు సరఫరా చేసేవారు’ అనే 3 రకాల ముఠాలను నాశనం చేయడానికి మనం ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం మానవ-సాంకేతిక నిఘాతోపాటు సరిహద్దు, కల్లోలిత జిల్లాల్లో సామాజిక పోలీసింగ్ పద్ధతిని అనుసరించాలని చెప్పారు. డార్క్ వెబ్, హవాలా-క్రిప్టో లావాదేవీలు, ఓడరేవులు-విమానాశ్రయాల వినియోగంపై పర్యవేక్షణ దిశగా ఆర్థిక సంస్థలన్నీ పూర్తి సమన్వయంతో ఉమ్మడి కార్యక్రమాన్ని సిద్ధం చేయాలన్నారు. ‘త్రిసూత్ర’ విధానంలోని ‘అడ్డుకట్ట’ కింద స్మగ్లర్ల మూలాలు, రవాణా మార్గాలు, ఆర్థిక వనరులు, నాయకత్వం వంటి స్థాయులన్నిటా వాటి చట్రాన్ని తిరుగులేని దెబ్బకొట్టాలి. దొంచాటుగా పంటల సాగును ధ్వంసం చేయడానికి మనమొక కార్యక్రమం చేపట్టాలి. అక్రమ ప్రయోగశాలలను గుర్తించి, పూర్తిగా ధ్వంసం చేసే వ్యవస్థను ప్రభుత్వ నిఘా సంస్థలు రూపొందించాలి. నియంత్రిత సరఫరా కార్యకలాపాల కొత్త పద్ధతిని ఎదుర్కోవడానికి వినూత్న మార్గాలను అన్వేషించడంతోపాటు వాటిని నిరంతరం మెరుగు పరచుకుంటూ తార్కిక ముగింపు వైపు సాగాలన్నారు. ‘పీఎంఎల్‌ఏ’, ‘ఈడీ’ ద్వారా స్మగ్లర్లపై కఠిన ఆర్థిక విచారణ చేపట్టాలని శ్రీ అమిత్ షా అన్నారు. తద్వారా వారి నెట్‌వర్క్‌నిర్మూలన కూడా మన బాధ్యతేనని చెప్పారు. ‘ధ్వంసం’ అనే సూత్రం కింద ఆ నెట్‌వర్క్‌లు మళ్లీ పుంజుకోకుండా నిర్దాక్షిణ్యంగా అంతం చేయాలని, పట్టుబడిన ప్రధాన సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని చెప్పారు. తదనుగుణ నిబంధనలను ఇప్పటికే మన చట్టాలలో పొందుపరిచామని తెలిపారుఏ. వ్యసన విముక్తి-పునరావాసం ద్వారా డిమాండును తగ్గించి, సరఫరాకు అడ్డుకట్ట వేసే దిశగా పయనించాలని చెప్పారు. ఇలా అన్నివైపులా పటిష్ట చర్యలతో కూడిన “గుర్తింపు.. అడ్డుకట్ట.. ధ్వంసం” త్రిసూత్ర పునాదితో వ్యూహాత్మక ప్రణాళిక రూపొందిందని వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని కేంద్ర-రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు క్షేత్రస్థాయిలో మాదకద్రవ్యాలపై సమష్టిగా ఉక్కుపాదం మోపాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. ‘ఎన్‌డీపీఎస్’ ప్రధాన కేసులలో, రాష్ట్ర పోలీస్ శాఖ అధిపతితో ఆర్థికపరమైన విచారణను తప్పనిసరి చేయాలన్నారు. నేరం ద్వారా ఆర్జించిన సొమ్ము ఆనుపానులను గుర్తించి వాటి స్తంభన, స్వాధీనానికి కృషి చేయాలన్నారు. అలాగే, జైలు నుంచి నిందితులకు తిరిగి చేరకుండా చూసుకునే ప్రక్రియను సాక్ష్యాధారితం, ఆధునిక పరిజ్ఞానాధారితం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, తగినంత మంది న్యాయమూర్తుల నియామకం, ప్రధాన కేసుల సత్వర విచారణ దిశగా నిత్య విచారణలకు ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలను హోం మంత్రిత్వ శాఖ అన్ని హైకోర్టుల దృష్టికి తీసుకువెళ్లిందని ఆయన తెలిపారు. సమాచార ప్రత్యక్ష ఆదానప్రదానం సాధ్యమైతేనే దొంగ రవాణాదారుల నగదు లావాదేవీల జాడను సమర్థంగా పసిగట్టలేమని, అందువల్ల సమాచారాన్ని తక్షణం పంచుకునే పరిస్థితి ఉండాలని స్పష్టం చేశారు.
ముందస్తు కార్యకలాపాలు, ‘ఎన్‌డీపీఎస్’ పదార్థాల షెడ్యూలింగ్‌ను కూడా సమీక్షించి నార్కో ఆర్థిక వనరులపై సమర్థ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. సామాజిక న్యాయం-ధికారత మంత్రిత్వ శాఖ తనవంతుగా ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. తద్వారా సామాజిక భాగస్వామ్యంతోపాటు చికిత్స-పునరావాస సేవలను విస్తరించాలన్నారు. తద్వారానే డిమాండ్ తగ్గింపులో విజయం సాధించగలమని చెప్పారు. ఇక ఔషధాల దారి మళ్లింపు, ఆన్‌లైన్ ఫార్మసీలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠిన పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. అలాగే, పాఠశాల-ఉన్నత విద్య విభాగాలు ‘డ్రగ్ రహిత ప్రాంగణం’ చట్రాన్ని ఏర్పాటు చేయడంపై విద్యా మంత్రిత్వ శాఖ శ్రద్ధ వహించాలని తెలిపారు. దీంతోపాటు భాగస్వామ్య సంస్థలన్నటి ఏకాభిప్రాయంతో ఈ భావనను ప్రోది చేస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలోనూ అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు.
మాదకద్రవ్య ముఠాలను గుర్తించే దిశగాఈ “ఎన్‌సీఆర్‌బీ, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ, డీఎఫ్‌ఎస్‌ఎస్, ఐ4సి, న్యాట్‌గ్రిడ్” వ్యవస్థలు తమతమ స్థాయులలో విస్తృతంగా కృషి చేయాల్సి ఉంటుందని శ్రీ అమిత్ షా అన్నారు. రాష్ట్రాలు తమ ‘ఏఎన్‌టీఎఫ్’లను పూర్తికాల యూనిట్లుగా మలచి, ప్రత్యేక విభాగాలుగా రూపొందించడంతోపాటు అన్నిరకాల వనరులు సమకూర్చడం ద్వారా జవాబుదారీతనంతో పనిచేసేలా చూడాలని, రాష్ట్ర పోలీస్ విభాగం అధిపతులు దీనిపై వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలని నిర్దేశించారు. వాణిజ్య పరిమాణంలో మాదకద్రవ్యాల ప్రమేయం గల కేసులలో ఆర్థిక దర్యాప్తు, గత సంబంధాల పరిశీలన విచారణలో కీలక భాగం కావాలన్నారు. ఇలాంటి పటిష్ట కార్యాచరణ లేకపోతే మొత్తం నెట్‌వర్క్‌ను నాశనం చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ‘ఎన్‌కార్డ్’ సమావేశాలను ఫలితాలు లక్ష్యంగా నిర్వహిస్తూ సమర్థంగా పర్యవేక్షించాలని తెలిపారు. బలమైన ఛార్జిషీట్లు, సమర్థ విచారణ కోసం మనం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలన్నారు. ప్రత్యేక ‘ఎన్‌డీపీఎస్’ కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తమ హోం శాఖల ద్వారా హైకోర్టులను సంప్రదించాలని సూచించారు. డిమాండ్ తగ్గింపు, చికిత్స, పునరావాసం, అవగాహన కార్యక్రమాలు సహా తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించడానికి ప్రతి రాష్ట్రం తమ శాఖలలో ఒక నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు. అంతేగాక పరారీలో ఉన్నవారిని తిరిగి తీసుకురావడానికి సీబీఐ ద్వారా ఒక కార్యక్రమం ప్రారంభించి, గణనీయ విజయం సాధించాం. విదేశాలలో దాక్కున్న ఆయా రాష్ట్రాల మాదకద్రవ్యాల స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లు లక్ష్యంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలన్నారు. వారిని దేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం కోసం సీబీఐ సహా ఇతర ఏజెన్సీలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ కోరారు.
దేశవ్యాప్తంగా 2004-2014 మధ్య రూ.40,000 కోట్ల విలువైన (26 లక్షల కిలోల సింథటిక్) మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. దీనికి భిన్నంగా 2014-2026 మధ్య రూ.1,84,000 కోట్ల విలువైన (కోటి 18 లక్షల కిలోల) మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మన పోరాటం విజయవంతంగా సాగుతోందనడానికి ఇదే నిదర్శనం. ఇక 2004-2014 మధ్య రూ.8,000 కోట్ల విలువైన (3,26,000 కిలోలల) మాదకద్రవ్యాలను ధ్వంసం చేయగా, 2014-2026 మధ్య రూ.89,896 కోట్ల విలువైన (42,47,000 కిలోల) మాదకద్రవ్యాలను ధ్వంసం చేశామన్నారు. మరోవైపు అక్రమ సాగును ధ్వంసం చేసే చర్యలను ముమ్మరం చేశామని, 2020లో 10 వేల ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశామని తెలిపారు. అలాగే 2025లో 42,282 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇక 2004-2014 1,73,000 కేసులో 1,95,000 మందిని అరెస్టు చేయగా, 2014-2026 మధ్య 8,75,000 కేసులు నమోదు చేసి, 10,97,000 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం కచ్చితంగా లభిస్తుందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయన్నారు. ఈ కృషికి ఒక నిర్దిష్టతను, లక్ష్యాలకు స్పష్టతను కల్పించడంతో పాటు మోదీ ప్రభుత్వం వాటికి కాలపరిమితి నిర్దేశించిందని చెప్పారు. మాదకద్రవ్యాలపై పోరు సంబంధిత అంశాలన్నిటినీ గుర్తించి, ఈ కార్యాచరణ ప్రణాళికను తాము రూపొందించామని తెలిపారు.
ఐక్య పోరాటంతో విజయం కచ్చితంగా సాధించగలమని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల ముఠాల నిర్మూలనలో అసాధారణ పురోగతి సాధించగలమన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడేళ్ల కాలానికిగాను విస్పష్ట లక్ష్య నిర్దేశంతో, ఉమ్మడి ప్రణాళికతో సమష్టిగా కృషి చేస్తే నిర్ణీత వ్యవధిలో విజయం సాధించడం తథ్యమని విశ్వాసం వెలిబుచ్చారు.
***
(रिलीज़ आईडी: 2278324)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam