ప్రధాన మంత్రి కార్యాలయం
జూన్ 20, 21 తేదీల్లో ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ పర్యటన
జూన్ 20న హుగ్లీలో పశ్చిమబంగ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని
రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పాలన, పశు సంవర్ధక రంగాల్లో
వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితమివ్వడంతో పాటు
కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
పశ్చిమ బెంగాల్‌లో అనేక కేంద్ర వ్యవసాయ పథకాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని
ఈ పథకాల్లో.. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’, ‘అగ్రిస్టాక్’, ‘ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్’తో పాటు ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ కూడా
రూ.18,880 కోట్ల విలువైన పీఎమ్-కిసాన్ 23వ కిస్తీ సొమ్ము పంపిణీ చేయనున్న ప్రధాని.. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల కన్నా ఎక్కువ మంది రైతులకు లబ్ధి
దేశీయంగా డిజైన్ చేసి నిర్మించిన మూడు నౌకాదళ నౌకలు.. ‘ఐఎన్ఎస్ దునాగిరి’, ‘ఐఎన్ఎస్ సంశోధక్’, ‘ఐఎన్ఎస్ అగ్రే’లను కోల్‌కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఈ నౌకల నిర్మాణంలో భారతీయ పరిశ్రమ విస్తృత భాగస్వామ్యం.. 200 కన్నా ఎక్కువ ఎమ్ఎస్ఎమ్ఈలకూ దీనిలో పాత్ర
జూన్ 21న కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలకు ప్రధానమంత్రి సారథ్యం
యోగా దివస్ 2026 ఇతివృత్తం: ‘‘ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగాభ్యాసం’’
प्रविष्टि तिथि:
19 JUN 2026 11:54AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 20, 21 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు, హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో పశ్చిమబంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేస్తారు. మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
జూన్ 21న ఉదయం సుమారు ఆరున్నర గంటలకు కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.
దేశీయంగా రూపుదిద్ది నిర్మించిన మూడు నౌకాదళ నౌకలు.. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్‌తో పాటు ఐఎన్ఎస్ అగ్రేలను ప్రధానమంత్రి ఉదయం సుమారు 9:15 గంటలకు కోల్‌కతా లోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఒక సభలో ఆయన ప్రసంగిస్తారు.
హుగ్లీలో ప్రధాని
పశ్చిమబంగ దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో ముడిపడిన చారిత్రక ప్రాధాన్యం కలిగిన హుగ్లీలోని తారకేశ్వర్‌లో రాష్ట్ర స్థాయి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
‘‘పశ్చిమ బెంగాల్: వారసత్వం, సద్భావన, అభివృద్ధి’’ని ఈ సంవత్సరం పశ్చిమబంగ దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్యాంశంగా ఎంపిక చేశారు. ఈ ఇతివృత్తం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికీ, సామాజిక భావనకీ, అభివృద్ధి ప్రధాన ఆకాంక్షలకీ ప్రతీకగా నిలుస్తోంది.
అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమిస్తారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పాలన, పశు సంవర్ధక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పటిష్టపరిచి, జీవనోపాధిని మెరుగుపరిచి, రైతుల సంక్షేమాన్ని విస్తరించడంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎమ్-కిసాన్) 23వ వాయిదాను ప్రధాని పంపిణీ చేయనున్నారు. ఈ వాయిదాలో భాగంగా, రూ.18,880 కోట్ల కన్నా ఎక్కువ సొమ్మును దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.
ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే రూ.900 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని 45 లక్షలకు పైగా లబ్ధిదారులకు జమ చేయనున్నారు. దీంతో ఈ పథకం కింద రాష్ట్రంలో ఇంతవరకు పంపిణీ చేసిన సొమ్ము రూ.15,000 కోట్లకు చేరుకోనుంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు దేశం నలుమూలలా రూ.4.46 లక్షల కోట్లకు పైగా అందించారు.
పశ్చిమ బెంగాల్‌లో పలు కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకాల్లో ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’, డిజిటల్ వ్యవసాయ మిషన్‌కు చెందిన ‘అగ్రి స్టాక్’, ‘ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్’, ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ వంటివి ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (పీఎమ్ఎఫ్‌బీవై)ని ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో ప్రపంచంలో అతి భారీ పంట బీమా పథకం ప్రయోజనాలు రాష్ట్ర రైతులకు అందుబాటులోకి వస్తాయి. 2026-27లో, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 50 లక్షల మంది రైతులకు, సుమారు 14 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికీ బీమా రక్షణను సమకూర్చి చెప్పుకోదగిన మొత్తంలో ప్రీమియం సబ్సిడీ రూపంలో అందించడమే కాకుండా సుమారు రూ.28,140 కోట్ల బీమా విలువ కలిగివుండే పంటలను సంరక్షించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు.
డిజిటల్ వ్యవసాయ మిషన్‌లో భాగంగా అగ్రిస్టాక్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఎరువుల పంపిణీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలతో పాటు కనీస మద్దతు ధర వ్యవస్థ పరిధిలో సేకరణ వంటి ప్రామాణిక వ్యవసాయ సంబంధిత సేవలను ఈ డిజిటల్ వేదిక అందిస్తుంది. ఈ కార్యక్రమం వ్యవసాయంలో డిజిటల్ సేవల్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు అందజేయదలిచిన సేవలను సమర్థంగా అందించేందుకు తోడ్పడుతుంది.
పశ్చిమ బెంగాల్‌లో ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఎలాంటి రసాయనాలనూ ఉపయోగించకుండా భారతీయ సాంప్రదాయిక సాగు పద్ధతుల్నీ, దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే సాగు పద్ధతుల్నీ ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం. 2026-27కు ఆమోదించిన వార్షిక ప్రణాళికలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 346 ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. వీటితో 17,300 హెక్టార్ల ప్రాంతాన్ని పర్యవేక్షించవచ్చు. బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. పర్యావరణానుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించడాన్ని పటిష్ఠపరిచేందుకు ‘కృషి సఖి’ల తోడ్పాటును తీసుకుంటారు.
ప్రధాని పశ్చిమ బెంగాల్‌లో ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (పీఎమ్‌డీడీకేవై)ని కూడా ప్రారంభిస్తారు. ఏకీకృత వ్యవసాయాభివృద్ధి దిశగా తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయం ఇది. ఈ పథకాన్ని పురులియా, డార్జిలింగ్, అలీపుర్ద్వార్, ఝాడ్గ్రామ్లలో అమలుచేస్తారు. ఈ పథకంలో భాగంగా.. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టిని కేంద్రీకరిస్తూ, పంటల వివిధకరణనీ, దీర్ఘకాలిక సాగును ప్రోత్సహిస్తూ, పంట కోతల అనంతర కాలంలో మౌలిక సదుపాయాల కల్పననీ, సేద్యపునీటి సదుపాయాలనీ బలోపేతం చేస్తూ, సంస్థాగత పరపతి లభ్యతను పెంచుతూ, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర పథకాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడంపై శ్రద్ధ తీసుకుంటారు.
దక్షిణ 24 పరగణాల్లోని ఫ్రేజర్‌గంజ్‌లో ఆధునికీకరించి, సామర్థ్యాన్ని విస్తరించిన ఫిషింగ్ హార్బరునూ, బీర్భూమ్లోని సైంథియాలో నిర్మాణ పనులు పూర్తి చేసిన ఆధునిక చేపల బజారునూ ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులతో మత్స్య పాలనకు సంబంధించిన మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు పంట కోతల అనంతర కాలంలో నిర్వహణ మెరుగుపడనుంది. చేపల రైతులకూ, వ్యాపారులకూ మెరుగైన మార్కెటింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.
నాదియా జిల్లా లోని హరింగ్‌హాటాలో మేకల పెంపకందారుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతీయ వీర్య ఉత్పాదన ప్రయోగశాలనూ, వీర్య బ్యాంకునూ ప్రధాని ప్రారంభిస్తారు. పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ విభాగానికి చెందిన జాతీయ పశుగణ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు భారతదేశ తూర్పు ప్రాంతాలలో ఈ తరహా మొదటి కేంద్రాలు. ఇవి పశుగణాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పెంపొందింప చేయడానికీ, జన్యుపరంగా మెరుగుదల, ఉత్పాదకత పెంపులో కీలక తోడ్పాటును అందిస్తాయి.
సుమారు రూ.590 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రధాన రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. హౌరా జిల్లాలో సంక్‌రాయిల్-సంత్రాగాఛీ లింక్ లైన్ ప్రాజెక్టును దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు భారత తూర్పు ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే రైల్ కారిడార్లలో ఒకటైన కారిడార్‌లో రద్దీ సమస్యను తగ్గించడంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తుంది. ప్రయాణికుల రైళ్లే కాక సరకు రవాణా రైళ్లు కూడా రాకపోకలను సాఫీగా పూర్తి చేసుకోవడంలో ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.
హౌరాలో 300 పడకలతో ఒక కొత్త డివిజనల్ రైల్వే ఆసుపత్రి నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆధునిక ఆరోగ్యసంరక్షణ కేంద్రాలు, ఉన్నత స్థాయి రోగనిర్ధారణ కేంద్రాలు, విశిష్ట వైద్య సేవలతో పాటు అత్యవసర చికిత్స కేంద్రాలతో కూడిన ఈ ఆసుపత్రి రైల్వే సిబ్బందికే కాకుండా ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యసంరక్షణ సేవల్ని చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరుస్తుంది.
పూర్వ మేదినీపూర్ జిల్లాలో హౌర్, రాధామోహన్‌పూర్ మధ్య ఒక రోడ్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు రైలుమార్గంలో, రహదారి మార్గంలో భద్రతను పెంచడమే కాక, రాకపోకలలో అంతరాయాలు చోటుచేసుకోకుండా సహాయపడుతుంది.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎమ్‌జీఎస్‌వై-III)లో భాగంగా రూపొందించిన 49 రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. మొత్తం 315 కి.మీ. కి పైగా పొడవైన ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్‌లో వివిధ జిల్లాల్లో విస్తరించి, గ్రామీణ అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. మార్కెట్లకూ, విద్యాసంస్థలకూ, ఆరోగ్యసంరక్షణ కేంద్రాలకూ చేరుకోవడంలో ఉపయోగపడతాయి. సమతుల ప్రాంతీయాభివృద్ధికీ తోడ్పాటును అందిస్తాయి.
ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్‌లో మౌలిక సదుపాయాల రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు సాధికారతను సమకూర్చడం, జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు కొత్త ఆర్థిక అవకాశాలను కల్పించే దిశగా కీలక పాత్రను పోషిస్తాయి. ఈ కార్యక్రమాలు సమ్మిళిత వృద్ధినీ, ఆధునిక మౌలిక సదుపాయాలనీ, దీర్ఘకాల ప్రాతిపదికన అభివృద్ధినీ ప్రోత్సహిస్తూ ‘వికసిత్ పశ్చిమ బెంగాల్’కు బాట వేసి, ‘వికసిత్ భారత్’ దార్శనికతను సాకారం చేయడానికి దోహదపడతాయి.
కోల్‌కతాలో ప్రధానమంత్రి
దేశం ఈ నెల 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించనుండగా, కోల్‌కతా లోని రెడ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రధానమంత్రి సారథ్యం వహించనున్నారు. వేల మంది యోగాభ్యాసకులతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకుంటారు. సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
‘‘ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృద్ధాప్యాన్ని ఆహ్వానించడం’’ అన్న విషయాన్ని 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య ఇతివృత్తంగా ఎంపిక చేశారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ, భావనాత్మక దృఢత్వాన్నీ, క్రియాశీల వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడంలో యోగా పోషించే పాత్రను చాటుతూ, జీవన నాణ్యత మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. జీవన కాలాన్ని పెంచుకోవడం పట్ల మనిషి తపన పెరుగుతూ, స్వస్థ, క్రియాత్మక, గౌరవపూర్వక వార్ధక్యం వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య అధికమవుతున్న ప్రస్తుత కాలంలో ఈ ఇతివృత్తానికి సందర్భశుద్ధి చాలా ఉంది. ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)ఊగా పాటించాలని భారత్ తెచ్చిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించిన తరువాత 2015లో మొదటిసారి ఐడీవైని పాటించారు. అది మొదలు న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూరు, ఐక్యరాజ్యసమితి ప్రధానకేంద్రం నెలకొన్న న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నం సహా వివిధ చోట్ల యోగా దినోత్సవాలకు ప్రధానమంత్రి నాయకత్వం వహించారు.
యోగా దినోత్సవ కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2,500 ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. వాటిలో 210 కన్నా ఎక్కువ భారత దౌత్య కార్యాలయాలు, తత్సంబంధిత పోస్టులు పాలు పంచుకుంటున్నాయి. ఆరోగ్యం, సద్బావన, ఉమ్మడి సంక్షేమాల్ని ఆకాంక్షించే ఒక అంతర్జాతీయ ఉద్యమంగా యోగా స్థాయిని ఐడీవై బలపరుస్తోంది.
నౌకాదళం అవసరాల కోసం దేశీయంగా డిజైనును రూపొందించి, నిర్మించిన మూడు నౌకలు.. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో ఐఎన్ఎస్ దునాగిరి ఉన్నత స్థాయి స్టెల్త్ ఫ్రిగేట్. ఐఎన్ఎస్ సంశోధక్ సర్వేకు ఉపయోగపడే పెద్ద నౌక. ఐఎన్ఎస్ అగ్రే శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేయడానికి, నిఘాకీ, తీర ప్రాంతాలను రక్షించడానికీ లోతు తక్కువగా ఉండే సముద్ర జలాల్లో సమర్థంగా పనిచేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న యుద్ధనౌక.
వీటి చేరికతో దేశంలో యుద్ధ కార్యకలాపాల నిర్వహణ సంబంధిత సామర్థ్యాలు చెప్పుకోదగినంతగా పెరగనున్నాయి. నౌకావాణిజ్య రంగానికి సంబంధించిన అవగాహన పెంపొందుతుంది. భౌగోళిక, రాజకీయ ముప్పులకు వ్యతిరేకంగా మన కోస్తా తీర జల రంగ భద్రత బలోపేతమవుతుంది.
భారతీయ నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ఈ మూడు నౌకల్నీ డిజైన్ చేయగా, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) వీటిని కోల్‌కతాలో నిర్మించింది. అయితే ఈ పనిలో 200 కన్నా ఎక్కువ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలు (ఎమ్ఎస్ఎమ్ఈ) సహా భారతీయ పరిశ్రమ విస్తృత స్థాయిలో పాలుపంచుకుంది. మూడు వంతుల కన్నా ఎక్కువ స్వదేశీ సామగ్రితో నిర్మించిన ఈ నౌకలు స్వయంసమృద్ధి విషయంలో భారత్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2275328)
आगंतुक पटल : 14