హోం మంత్రిత్వ శాఖ
జాతీయ సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 పనితీరుపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమీక్ష
వ్యవస్థను మరింత మెరుగ్గా రూపొందించాలని ఆదేశం
సైబర్ నేరాలు, సైబర్ రంగంలో ఆర్థిక మోసాల నుంచి పౌరులకు తక్షణ ఊరట కలిగించడంలో పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇస్తున్న వివిధ యంత్రాంగాలపైనా కేంద్ర హోం మంత్రి సమీక్ష
ఏఐ సహా ఆధునిక సాంకేతికతల సాయంతో సమగ్ర ఆధునికీకరణ దిశగా 1930 హెల్ప్‌లైన్ వ్యవస్థ
భద్రతతో కూడిన, సాంకేతిక ఆధారిత, పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిచ్చే సైబర్ నేర నివారక, ప్రతిస్పందనపూర్వక యంత్రాంగాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం
సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన విషయాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1930 కాల్ సెంటర్లను బలోపేతం చేయాలంటూ కేంద్ర హోం మంత్రి దిశానిర్దేశం
సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్ఎమ్ఎస్) పని తీరుపైనా సమీక్ష
సీఎఫ్‌సీఎఫ్‌ఆర్ఎమ్ఎస్‌లో భాగంగా మనీ రెస్టొరేషన్ మాడ్యూల్ (ఎమ్ఆర్ఎమ్)తో పాటు గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ (జీఆర్ఎమ్)పై నిరంతర సమీక్షకు ఆదేశాలు
మనీ రెస్టొరేషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థలతో ఇంతవరకూ దాదాపు లక్ష మంది పౌరులకు లబ్ధి
సైబర్ నేరాల్లో ఉపయోగించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాలను పకడ్బందీగా అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
17 JUN 2026 8:04PM by PIB Hyderabad
సైబర్ నేర బాధితులకు సహాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన 1930 వ్యవస్థపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ వ్యవస్థను మరింత ఉత్తమమైందిగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలు, ప్రత్యేకించి సైబర్ ఆర్థిక మోసాల వలలో చిక్కుకొన్న పౌరులకు వెంటనే ఊరటనివ్వడానికి ఏర్పాటు చేసిన వివిధ వ్యవస్థలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.
సైబర్ నేరాలపై, మరీ ముఖ్యంగా ఆర్థిక నేరాల విషయంలో ఫిర్యాదులను సులభంగా, తక్షణమే ఫిర్యాదు చేయడానికి ఒక ముఖ్య వేదికగా నేషనల్ సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930 అందుబాటులోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా సహాయాన్ని ఆశించే పౌరులందరికీ సకాలంలో సహాయం అందేట్లు చూడాలనీ, ఏ ఫిర్యాదునీ ఉపేక్షించవద్దనీ, అపరిష్కృతంగా ఉంచవద్దని ఆయన సూచించారు.
కృత్రిమ మేధ (ఏఐ) సహా ఉన్నత సాంకేతికతలను అనుసరిస్తూ 1930 సహాయ వ్యవస్థను సంపూర్ణంగా మార్పు చేసి, ఇప్పుడున్న స్థాయిని ఉన్నతీకరించి సేవల్నీ, ప్రతిస్పందన సామర్థ్యాన్నీ మరింత మెరుగుపరచాలని శ్రీ అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కొత్త రూపును సంతరించుకొనే వ్యవస్థ పౌరుల ఫిర్యాదుల్ని త్వరగా నమోదు చేసుకొని కాల్ రూటింగ్, సేవల అందజేత విషయాల్లో చురుకుగా ప్రతిస్పందించాలని ఆయన అన్నారు.
పక్కాగా ఉండే, సాంకేతికత సాయాన్ని తీసుకొనే, పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చే సైబర్ నేరాల నివారణ, ప్రతిస్పందన పూర్వక వ్యవస్థను తీర్చిదిద్దడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 1930 కాల్ సెంటర్లను సాంకేతికత, మౌలిక సదుపాయాల పరంగా మరింత బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. హార్డ్‌వేర్‌తో పాటు ఉన్నత సాంకేతికతకు అవసరమైన సహాయాన్ని హోం వ్యవహారాల శాఖ సమకూరుస్తుందనీ, ఫిర్యాదులను జాప్యానికి తావీయకుండా పరిష్కరించగలిగేలా ఈ సెంటర్లకు చాలినంత మంది సిబ్బందిని నియమించాల్సిందిగా రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ సూచించనున్నారు.
కాల్స్‌ను నిర్దిష్ట స్థాయులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మళ్లించి, కాల్స్ నిర్వహణలో దక్షతను పెంపొందించడానికి వీలుగా పటిష్ఠ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) వ్యవస్థల్ని అన్ని రాష్ట్రాల్లో 1930 కాల్ సెంటర్లకు సమకూర్చాల్సిందిగా కూడా శ్రీ అమిత్ షా ఆదేశాలిచ్చారు.
జాతీయ సైబర్ నేరాల ప్రతిస్పందన వ్యవస్థను మరింత పటిష్ఠపరిచే లక్ష్యంతో తగినంత మంది సిబ్బందినీ, కాల్స్ నిర్వహణ సామర్థ్యాన్నీ జతపరిచి జాతీయ స్థాయిలో 1930 కాల్ సెంటరును ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీ అమిత్ షా ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో సమాధానాలు లభించని కాల్స్‌ను ఈ జాతీయ కాల్ సెంటర్ పట్టించుకుని, ప్రతి బాధితుని, ప్రతి బాధితురాలి ఫిర్యాదును తక్షణం నమోదు చేసుకొని సకాలంలో సాయాన్ని అందుకొనేటట్లు చూస్తుంది.
సైబర్ ఆర్థిక మోసాలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల శాఖ అమలు చేస్తున్న కీలక కార్యక్రమం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్ఎమ్ఎస్) పనితీరుపైనా సమావేశంలో సమీక్షించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మోసం చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలను త్వరగా అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ సాయపడుతుంది. దీంతో బాధితులు డబ్బు నష్టపోకుండా తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.
సైబర్ ఆర్థిక మోసం కేసులను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో 2026 జనవరిలో ప్రామాణిక కార్యకలాపాల నిర్వహణ ప్రక్రియను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్..ఎస్ఓపీ) హోం వ్యవహారాల శాఖ తీసుకువచ్చిందని కేంద్ర హోం మంత్రి గుర్తు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ నిలిపి ఉంచిన డబ్బును బాధిత పౌరులకు వెంటనే వెనుకకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, నేర నియంత్రణ సంస్థలతో పాటు ఇతర ఆసక్తిదారుల మధ్య సమన్వయంతో కూడిన చర్యలను ఎస్ఓపీ తీసుకొంటుంది. ఈ ఎస్ఓపీని అమలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టులకు ఆదేశాలిచ్చింది.
సీఎఫ్‌సీఎఫ్‌ఆర్ఎమ్ఎస్‌లో భాగంగా రూపొందించిన మనీ రెస్టొరేషన్ మాడ్యూల్ (ఎమ్ఆర్ఎమ్)తో పాటు గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ (జీఆర్ఎమ్)పై క్రమం తప్పక సమీక్ష చేపట్టాలని సమావేశంలో శ్రీ అమిత్ షా ఆదేశించారు. ఈ మాడ్యూళ్లను పక్కగా ఉపయోగించుకొంటూ బాధితుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, నిధులు వారికి వెంటనే అందేటట్లు చూస్తున్నదీ, లేనిదీ రాష్ట్రాల స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. అనవసరంగా స్తంభింప చేసిన బ్యాంకు ఖాతాలతో ముడిపడిన కేసులపై శీఘ్రంగా స్పందించాలనీ, ఇలాంటి కేసుల్లో బాధ్యులను గుర్తించాలనీ శ్రీ షా కోరారు. ఇంతవరకు, డబ్బును తిరిగి ఇప్పించడం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతో దాదాపు లక్ష మంది పౌరులకు ప్రయోజనం కలిగింది.
ఎస్ఓపీలో భాగంగా, ప్రారంభించిన మనీ రెస్టోరేషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థలో ఇంతవరకు 94 లక్షల బ్యాంకు ఖాతాల వివరాలను పొందుపరిచినట్లు అధికారులు కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనితో డబ్బును వెనుకకు ఇవ్వడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
ఆర్థిక మోసాల్లో సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే మ్యూల్ బ్యాంకు ఖాతాల సమస్యను పరిష్కరించడానికి మరింత ప్రభావవంత చర్యలు తీసుకోవడం ముఖ్యమని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. హోం వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), రాష్ట్ర ప్రభుత్వాలు, నేర నియంత్రణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థల సమన్వయపూర్వక ప్రయత్నాలతో సైబర్ నేరగాళ్ల బాధితులకు సత్వరం సహాయం అందేటట్లు మనం చూడడమే కాక, దేశంలో సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయగలమని ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 2274777)
आगंतुक पटल : 4