ఎన్నో స్వరాలు, ఒకే ప్రాంతం: ఈశాన్య భారత చిత్రాల ప్రదర్శనకు19వ ఎంఐఎఫ్ఎఫ్ ప్రత్యేక విభాగం ఖాసీ కొండల నుంచి మణిపూర్‌లో తేలియాడే గడ్డి మైదానాల వరకు ఈశాన్య భారత గొప్ప సంప్రదాయాలు, చారిత్రక, పర్యావరణ వైవిధ్యాన్ని చాటిచెప్పే ఎంఐఎఫ్ఎఫ్-2026
జూన్ 15 నుంచి 21, 2026 వరకు జరిగే 19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్-2026)లో సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఈశాన్య రాష్ట్రాల లఘు చిత్రాలు, డాక్యుమెంటరీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ ఈశాన్య ప్రాంతాల సుసంపన్న సంప్రదాయాలను, చారిత్రక, పర్యావరణ వైవిధ్యాన్ని ఈ చిత్రాలు కళ్లకు కడతాయి. అసాధారణ వ్యక్తుల జీవిత విశేషాలు, సనాతన సంప్రదాయాలు, విభిన్న సమాజాలు, ప్రకృతి రమణీయత ద్వారా భారతదేశంలోని ఈశాన్య ప్రాంత విశిష్టతను ఈ చిత్రాలు తెలియజేస్తాయి. ఖాసీ, నాగమీస్, ఆవో, కోక్‌బోరోక్, భూటియా, అస్సామీ, మణిపురి, మిజో వంటి స్థానిక భాషల్లో రూపొందించిన ఈ చిత్రాలు... ఈ ప్రాంత దైనందిన జీవితాన్ని నిరంతరం ప్రభావితం చేసే వారసత్వం, గుర్తింపు, స్థిరత్వాన్ని, ప్రకృతి వంటి శక్తిమంతమైన వైవిధ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాయి.
క పటెంగ్ (ఖాసీ)
నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పతాకంపై పొన్విశాల్ చిదంబరనాథన్ నిర్మించిన ఈ చిత్రానికి సంకీరంగ్ ఎల్. ఖోంగ్‌వీర్ దర్శకత్వం వహించారు. 30 నిమిషాల ఖాసీ భాషా కల్పిత కథా లఘు చిత్రం ‘క పటెంగ్ ’(2023).
తల్లి మరణం తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఎన్నో ఏళ్లుగా విడిపోయి, ఒకరికొకరు దూరంగా ఉంటున్న ముగ్గురు తోబుట్టువులను ఆమె మరణం మళ్లీ ఒకచోటుకి చేరుస్తుంది. నగరంలో చాలా కాలం గడిపిన పెద్దన్నయ్య తిరిగి వస్తాడు. రెండో సంతానం చిన్ననాటి చేదు జ్ఞాపకాల భారంతో నలిగిపోతుంటాడు. అందరికంటే చిన్నదైన చెల్లెలికి త్వరలో తల్లి కాబోతున్నాననే విషయంలో అనుమానం కలిగించేలా, ఆమె మనసులో రహస్యం దాగి ఉంటుంది.
లెంటీనా ఆవో - ఎ లైట్ ఆన్ ద ఈస్ట్రన్ హారిజన్ (ఆంగ్లం, నాగమీస్, ఆవో)
2023లో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ చిత్రానికి సంజీబ్ పరాశర్, నీలాక్షి మేధి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆంగ్లం, నాగమీస్, ఆవో భాషల్లో ఉంది. నాగా ప్రజల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదలకు జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త లెంటీనా ఆవో అసాధారణ జీవితాన్ని, ఆమె అందించిన సేవలను ఈ చిత్రం కళ్లకు కడుతుంది. 1955లో మారుమూల నాగా కొండల్లో మంత్రసానిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన లెంటీనా ఆవో... సమాజంలోని అన్యాయాలను, పక్షపాతాన్ని, వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొంటూ దశాబ్దాల పాటు ప్రజలకు అలుపెరగని సేవలందిస్తారు.
మై లాస్ట్ ఫేస్: ఫ్లాట్-నోస్ (మై లాస్ట్ ఫేస్: కుంగ్‌బారా) (కోక్‌బోరోక్, కౌబ్రూ)
సుజిత్ దెబ్బర్మ, ప్రణబ్ జ్యోతి దేకా దర్శకత్వంలో ప్రణబ్ జ్యోతి దేకా, దిలీప్ దెబ్బర్మ, సుజిత్ దెబ్బర్మ 2024లో నిర్మించిన ఈ డాక్యుమెంటరీని కోక్‌బోరోక్, కౌబ్రూ భాషల్లో ప్రదర్శించారు. త్రిపురలోని పచ్చని ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో ఈ చిత్రం రీయాంగ్ సమాజ సాంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాల ద్వారా గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది. చిత్రంలో చూపించిన దుస్తులు, ఆభరణాలు కేవలం అలంకరణ వస్తువులుగా మాత్రమే కాక.. సౌందర్యం, ఆధ్యాత్మికత, గుర్తింపు, రక్షణకు శాశ్వత చిహ్నాలుగా నిలుస్తాయి. ఇవి తరాలుగా పూర్వీకుల కథలను, నమ్మకాలను, విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్నాయి. ఈ సజీవ సంప్రదాయాలను డాక్యుమెంటరీగా చేయటం ద్వారా సమాజంలోని సాంస్కృతిక పద్ధతులు, ఉమ్మడి జ్ఞాపకాలు, గుర్తింపును పరిరక్షించటంలో ఆచారాలు పోషించే కీలక పాత్రపై లోతైన అవగాహన కలుగుతుంది.
షాంగ్రిలా -ది హిడెన్ పారడైజ్ [సిక్కిమీస్ (భూటియా)]
సామ్టెన్ భూటియా దర్శకత్వంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2025లో నిర్మించిన ఈ డాక్యుమెంటరీ సిక్కిమీస్ (భూటియా) భాషలో రూపొందిన 90 నిమిషాల చిత్రం. కాంచన్‌జంగా పర్వత నీడలోని హిమాలయ రాష్ట్రమైన సిక్కిం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి దృశ్యాలు, పర్యాటక ఆకర్షణకు అతీతంగా ఆ ప్రాంతం గురించి అంతగా తెలియని చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలను తెలియజేస్తుంది. రాష్ట్ర వారసత్వాన్ని, గుర్తింపును విశ్లేషించటం ద్వారా ప్రపంచానికి అంతగా పరిచయం లేని అద్భుతమైన భూభాగపు జీవన చిత్రాన్ని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది.
టీన్స్ ఆఫ్ 1942 (బియల్లిసర్ లరాలి) (అస్సామీ)
సమీరన్ దేకా దర్శకత్వంలో.. సమీరన్ దేకా, భాస్కర్ జ్యోతి దాస్ సంయుక్తంగా 2023లో నిర్మించిన అస్సామీ డాక్యుమెంటరీ చిత్రం "టీన్స్ ఆఫ్ 1942”. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. భోలానాథ్ నగరియా, రాధా బోరా అనే ఇద్దరు యువ స్వాతంత్ర్య సమరయోధుల అసాధారణ దేశభక్తిని ఈ చిత్రం కొనియాడుతుంది. చెదిరిన వారి జ్ఞాపకాలను ఎంతో సున్నితంగా పునర్నిర్మించటం ద్వారా తెరమరుగైన వీర నాయకులను ఈ డాక్యుమెంటరీ గౌరవిస్తుంది. త్యాగాలను, దేశ స్వాతంత్ర్య పోరాటం పట్ల వారికున్న నిబద్ధతను, ధైర్యాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిపేలా వారి కథలను ఈ చిత్రం ద్వారా భద్రపరిచారు.
ది హీలింగ్ ప్రీస్ట్ (పుఇథియం) (మిజో)
నెపోలియన్ ఆర్‌జెడ్ థాంగా దర్శకత్వం వహించిన 2026 నాటి మిజో-భాషా లఘు చిత్రమిది. సాంప్రదాయం, నమ్మకం, ఆధునిక ఆందోళనలను ఆవిష్కరించే 9 నిమిషాల కథాచిత్రం. అనారోగ్యానికి కారణమయ్యే దుష్ట శక్తులను తరిమికొట్టేందుకు ఒక పుఇథియం (అనారోగ్యాన్ని నయం చేసే పూజారి) ఆచారాలను ప్రదర్శించి, లెంగ్లెప్‌ను వేలాడదీసే పురాతన మిజో స్వస్థత ఆచారమైన దైబావల్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా.. గతానికి, వర్తమానానికి మధ్య వారధిని నిర్మించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని రక్షించుకోవటానికి మార్గాలను అన్వేషించే నిరాశ్రయుడైన యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది సంప్రదాయ వైద్య పద్ధతులకు, ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆధునిక కోరికలకు మధ్య సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. మిజో సాంస్కృతిక వారసత్వాన్ని, అనారోగ్యం, స్వస్థతకు సంబంధించి వారిలో బలంగా నాటుకుపోయిన నమ్మకాలను ఈ చిత్రం పరిచయం చేస్తుంది.
మణిపూర్ బ్రౌ-యాంట్లర్డ్ డీర్ (సంగై) (మణిపురి, ఆంగ్లం)
ఆకాంక్ష సూద్ సింగ్ దర్శకత్వంలో రోష్ని నాడార్ మల్హోత్రా, ఋషికేష్ ఆత్మారామ్ చవాన్ సంయుక్తంగా నిర్మించిన 2025 నాటి ఈ డాక్యుమెంటరీ.. మణిపురి, ఆంగ్ల భాషల్లో రూపొందించిన 30 నిమిషాల ద్విభాషా చిత్రం. మణిపూర్ రాష్ట్రానికి ఐకానిక్ చిహ్నంగా మారిన, అంతరించిపోతున్న జింకల ఉపజాతి సంగై కథను ఈ చిత్రం చూపిస్తుంది. జాతి, రాజకీయ ఉద్రిక్తతలతో ఉన్న ఆ ప్రాంత నేపథ్యానికి అనుగుణంగా ఈ డాక్యుమెంటరీ.. ఆ రాష్ట్రంలో ప్రత్యేకమైన తేలియాడే గడ్డి మైదానాల్లో సంచరించే సుందరమైన జంతువును అద్భుతంగా చిత్రీకరించింది. మనుగడ కోసం సుదీర్ఘకాలంగా ఆ జంతువు సాగిస్తున్న పోరాటాన్ని ఎత్తి చూపింది. ఈ సంగై కథ ద్వారా వన్యప్రాణులు, వాటి నివాస స్థలాల పరిరక్షణ, ఆ ప్రాంత సామాజిక-రాజకీయ పరిస్థితుల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది.
ఎంఐఎఫ్ఎఫ్‌లో జరిగే రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన పత్రికా ప్రకటనలు, నాణ్యమైన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
रिलीज़ आईडी:
2274322
| Visitor Counter:
7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada