ప్రధాన మంత్రి కార్యాలయం
‘జీ7 శిఖరాగ్ర సమావేశం - విస్తృత భాగస్వామ్య సదస్సు: కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావ పునరుద్ధరణ’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
प्रविष्टि तिथि:
16 JUN 2026 10:12PM by PIB Hyderabad
అధ్యక్షుడు మాక్రాన్,
గౌరవనీయ పెద్దలూ,
నమస్కారం!
జీ-7 శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ఆత్మీయ స్వాగతానికి, ఆయన అందించిన ఆతిథ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మిత్రులారా,
ప్రపంచం నేడు గతంలో ఎన్నడూ లేనంత పరస్పర అనుసంధానంగా, పరస్పర ఆధారితంగా ఉంది. ఒక దేశ ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, సైబర్ భద్రత, ఆర్థిక భద్రత మొదలైనవన్నీ.. ఇకపై ఆ దేశ సరిహద్దుల లోపలే జరిగే పరిణామాలపై మాత్రమే ఆధారపడి ఉండవు. రాకపోకలు, డేటా, ద్రవ్యం, సాంకేతికత... ఇవన్నీ మనల్ని అనుసంధానిస్తున్నాయి.
ఇలాంటి సమయాల్లో బలమైన భాగస్వామ్యాలకు ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. అయితే, నమ్మకం ప్రాతిపదికగా నిర్మించుకునే భాగస్వామ్యాలు మాత్రమే విజయవంతమవుతాయి. ఖనిజాలు, సాంకేతికత, మార్కెట్లు... ఇవి కాదు, పరస్పర విశ్వాసమే నేడు అత్యంత వ్యూహాత్మకమైన ఆస్తి.
సాంకేతికతను, సరఫరా వ్యవస్థలను ఆయుధాలుగా కాకుండా, ప్రపంచ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారన్నది ఆ నమ్మకం.. అభివృద్ధి అవకాశాలు కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాబోవన్నది ఆ నమ్మకం.. అంతర్జాతీయ సంస్థలు అన్ని దేశాల ఆకాంక్షలనూ నెరవేరుస్తాయన్నది ఆ నమ్మకం.
మిత్రులారా,
గత శతాబ్దంలో మానవాళి రెండు ప్రపంచ యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక త్యాగాల ఫలితంగా.. శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు దిశగా పురోగమించేలా కొన్ని వ్యవస్థలను అంతర్జాతీయ సమాజం నిర్మించుకుంది. ఈ వ్యవస్థలకు కూడా నమ్మకమే ప్రాతిపదిక.
అయితే, అనేక దశాబ్దాలుగా, ఎన్నో తరాల కృషితో ఏర్పరచుకున్న ఈ నమ్మకానికి నేడు ముప్పు పొంచి ఉంది. విశ్వాసం, సంఘీభావాల ప్రకటనలు చాలావరకూ ప్రజలు భావించిన దానికన్నా బలహీనమైనవని కోవిడ్-19 తేల్చింది.
వనరుల కొరతతో కాదు.. విశ్వాస లోపంతో నేడు ప్రపంచం సతమతమవుతోంది. ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవడంపైనే మన భాగస్వామ్యాల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఒకసారిలా అన్నారు – ‘‘నమ్మండి, కానీ సరిచూసుకోండి’’. ఈ సందేశం నేటికీ సముచితమైనదే. నూతన యుగ అవసరాలకు అనుగుణంగా.. పరస్పర విశ్వాసం, నియమాలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించడమన్నది భావి తరాల పట్ల మన బాధ్యత.
మిత్రులారా,
భారత్ ప్రపంచమంతటినీ కుటుంబంలా భావిస్తుంది. సర్వజనుల సంక్షేమాన్ని, సంతోషాన్ని కాంక్షించే ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అన్న సూత్రం మా కార్యాచరణకు మార్గనిర్దేశం చేస్తుంది.
ప్రజల ఆకాంక్షలే దేశ పురోగతిని ముందుకు నడిపితే.. ఆ అభివృద్ధి అత్యంత అర్థవంతంగా ఉంటుందని భారత అభివృద్ధి ప్రస్థానం మనకు చాటుతోంది. మన అంతర్జాతీయ భాగస్వామ్యాలకు కూడా ఈ సూత్రం రూపుదిద్దుతోంది. ఈ లక్ష్యంతో సాగుతూ... అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్ వంటి పలు అంతర్జాతీయ కార్యక్రమాలను భారత్ ముందుండి నడిపిస్తోంది.
సంక్షోభ సమయాల్లో అందరికన్నా ముందుగా స్పందిస్తూ దేశాలకు సాయమందించడాన్ని భారత్ ఎల్లప్పుడూ తన బాధ్యతగా భావిస్తుంది. కోవిడ్ - 19 విపత్తు సమయంలో 150కి పైగా దేశాలకు ఔషధాలను, టీకాలను భారత్ అందించింది.
శ్రీలంకలో తుపాను వచ్చినా, ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వచ్చినా, మొజాంబిక్‌లో వరదలొచ్చినా, లేదా క్యూబా, జమైకాల్లో హరికేన్లు దెబ్బతీసినా... ‘మానవీయతే ప్రథమం’ అన్న ధోరణితో భారత్ అందరికన్నా ముందుగా స్పందించింది. భాగస్వామ్య దేశాల్లో సామర్థ్యాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తూ... ఇదే స్ఫూర్తి మన అభివృద్ధి భాగస్వామ్యాలకూ నిర్దేశం చేస్తోంది.
ఇతరుల కోసం మనం ఏ నిర్మించామన్నది కాదు.. తమంతట తాముగా నిర్మించుకునేందుకు వారికి మనం ఎలా దోహదపడతామన్నదే భాగస్వామ్యానికి నిజమైన పరీక్ష అని భారత్ భావిస్తుంది.
మిత్రులారా,
నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలపై అంతర్జాతీయ సమాజానికి భారీ అంచనాలున్నాయి. అయితే సాయం కోసమో, చేయూత కోసమో మాత్రమే అవి చూడడం లేదు.. నిజాయితీతో కూడిన భాగస్వామ్యాన్ని అవి కాంక్షిస్తున్నాయి. అంతర్జాతీయ అభివృద్ధి ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు.. దానికి దోహదపడుతూ, ప్రపంచ పురోగతిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాయి.
దాత - గ్రహీత అన్న పాతకాలపు ధోరణిని అధిగమిస్తూ మనం ముందుకు సాగుతూ, సమానత్వం ప్రాతిపదికగా భాగస్వామ్యాలను నిర్మించుకోవాలి. ఒకరితో ఒకరం పని చేయడానికి బదులు.. ఉమ్మడి లక్ష్యాల సాధన దిశగా మనమంతా కలిసి పనిచేయాలి. ఆధీనత కాదు.. గౌరవమూ, పరస్పర ఆదరణా మన భాగస్వామ్యాలకు ఆధారంగా ఉండాలి. తద్వారా భావితరాల కోసం సుస్థిరాభివృద్ధికి బలమైన పునాదులను మనం నిర్మించగలం.
మిత్రులారా,
ఉమ్మడి సవాళ్లను అదిగమించే దిశగా మనమంతా కలిసి పనిచేస్తేనే అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ప్రపంచస్థాయి సంఘీభావం అర్థవంతంగా ఉంటాయి. చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ద్వారానే.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉధ్రిక్తతలు, ఘర్షణలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భారత్ దృఢంగా విశ్వసిస్తోంది.
పశ్చిమాసియాలో శాంతి దిశగా పురోగతిని మేం స్వాగతిస్తున్నాం. ఆ ప్రాంతంలోని మన మిత్ర దేశాల్లో విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టానికి ఈ ఘర్షణ కారణమైంది. హార్ముజ్ జలసంధి గుండా నౌకా వాణిజ్యంలో అంతరాయాలు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయి. చాలా మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ నౌకా వాణిజ్యం ద్వారా దేశాలను అనుసంధానిస్తున్న నావికుల భద్రత మనందరి భాధ్యత. నౌకా వాణిజ్య మార్గాల భద్రతతోపాటు నావికులు నిర్భయంగా విధులు నిర్వర్తించేలా మనం భరోసా ఇవ్వాలి.
మిత్రులారా,
ఈ అంశాలపై భాగస్వామ్య పక్షాలన్నింటితో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉంది.
ధన్యవాదాలు.
గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన అనువాదమిది. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2274318)
आगंतुक पटल : 9