ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: స్లోవేకియా ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
प्रविष्टि तिथि:
15 JUN 2026 4:58PM by PIB Hyderabad
గౌరవనీయులు,
ప్రధానమంత్రి ఫికో గారికి,
ఉభయ దేశాల ప్రతినిధులకు,
మీడియా మిత్రులకు,
నమస్కారం!
'దోబ్రీ దెన్'
మాకు లభించిన ఈ ఆత్మీయ, ఘన స్వాగతానికి నేను ప్రధానమంత్రి ఫికో గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఆయన కేవలం ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు మాత్రమే కాదు భారతదేశానికి ఒక నిజమైన మిత్రుడు కూడా. భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన స్నేహం, అచంచలమైన నిబద్ధత ఎంతగానో దోహదపడ్డాయి. ఈ రోజు వారితో జరిగిన సమావేశం ద్వారా మన ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం కలగడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
స్లోవేకియా దేశంలో ఒక భారత ప్రధానమంత్రి పర్యటించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక సందర్భంలో మన ద్వైపాక్షిక సంబంధాలను 'సమగ్ర భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని మేం నిర్ణయించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది పరస్పరం మనకున్న నమ్మకాన్ని.. మన ఉమ్మడి ప్రాధాన్యతలు- భవిష్యత్తును తెలియజేస్తోంది.
మిత్రులారా,
ఈ రోజు నేను, ప్రధానమంత్రి గారు మన పరస్పర సహకారానికి ఒక కొత్త దిశ, సరికొత్త వేగాన్ని అందించడంపై సుదీర్ఘంగా చర్చించాం. మన ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారంలో జరుగుతున్న పురోగతి మాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది.
అయితే మన సామర్థ్యాలు చాలా విస్తృతమైనవి. అలాగే మన ఆకాంక్షలు మరింత పెద్దవి. వాహనాలు, రైల్వేలు, అధునాతన ఉత్పాదక రంగం, హరిత సాంకేతికతలు మనం ప్రత్యేకంగా దృష్టి సారించిన రంగాలు. ఈ రంగాలన్నింటిలోనూ ఉభయ దేశాల ప్రజల సంక్షేమం కోసం మన పరస్పర సామర్థ్యాలను జోడిస్తూ ఈ రోజు మేం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం.
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో స్లోవేకియా అందించిన మద్దతుకు గాను నేను ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఒప్పందం వీలైనంత త్వరగా అమలులోకి వచ్చేలా మేం కలిసి పనిచేస్తాం. తద్వారా రెండు దేశాల పరిశ్రమలు, అంకురాలు, వ్యాపారులు దీని నుండి గరిష్ఠ ప్రయోజనాన్ని పొందొచ్చు.
మిత్రులారా,
మన భవిష్యత్తు భాగస్వామ్యానికి సాంకేతికత ఒక ముఖ్యమైన ఆధారం. డిజిటల్ సాంకేతికతపై ఈ రోజు కుదిరిన ఎంఓయూ.. 'డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' రంగంలో పరస్పర సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుంది.
స్లోవేకియాలోని ఒక విశ్వవిద్యాలయంలో 'కృత్రిమ మేధస్సుపై భారతీయ పీఠం’ ఏర్పాటు కానుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. కృత్రిమ మేధ మానవాళి సేవ, ప్రగతికి ఒక శక్తిమంతమైన సాధనంగా మారాలనేది మన ఉమ్మడి నమ్మకం. ఏఐ భవిష్యత్తు కేవలం ఆవిష్కరణలపైనే కాకుండా.. నమ్మకం, బాధ్యత, మానవ గౌరవం అనే పునాదులపై నిర్మితమవ్వాలని మేం నమ్ముతున్నాం.
అంతరిక్ష రంగంలో మన సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. 2017లో స్లోవేకియా మొట్టమొదటి ఉపగ్రహాన్ని భారతదేశమే ప్రయోగించింది. ఈ రోజు భారత అంతరిక్ష రంగం మునుపెన్నడూ లేని వేగంతో సరికొత్త శిఖరాలను తాకుతోంది. ఈ వృద్ధి పయనంలో భాగస్వాములు కావాల్సిందిగా స్లోవేకియా కంపెనీలను నేను ఆహ్వానిస్తున్నాను.
పౌర అణుశక్తి కూడా మన రెండు దేశాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. ఈ రంగంలో ఉభయ దేశాల పరిశ్రమలు, నిపుణుల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరంపై మేం దృష్టి సారించాం.
రక్షణ రంగంలో సహకారం.. మన మధ్య ఉన్న లోతైన పరస్పర నమ్మకానికి, వ్యూహాత్మక ఐక్యతకు ప్రతిబింబం. ఈ కీలక రంగంలో ఈ రోజు మనం ఒక 'ఆసక్తి ప్రకటన పత్రం’పై సంతకం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది రెండు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య ఉమ్మడి అభివృద్ధి, సహోత్పత్తి, పరస్పర సహకారానికి సరికొత్త వేగాన్ని అందిస్తుంది.
మిత్రులారా,
అంతర్జాతీయ వేదికపై కూడా భారత్, స్లోవేకియా దేశాలు అత్యంత సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అన్ని రకాల వివాదాలు, ఉద్రిక్తతలను శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలన్న అంశంపై మేం ఏకీభవించాం. మా భాగస్వాములందరితో కలిసి ఈ దిశగా మేం మా ప్రయత్నాలను కొనసాగిస్తాం.
ఇరవై ఒకటో శతాబ్దపు వాస్తవ పరిస్థితులు, సవాళ్లకు అనుగుణంగా... అంతర్జాతీయ సంస్థలు తమను తాము పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేం అంగీకరించాం. ఈ అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలను బలోపేతం చేసే దిశగా మేం కలిసి పనిచేస్తాం.
మిత్రులారా,
మన రెండు దేశాల మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక, ప్రజా సంబంధాలు మన బంధానికి ఒక బలమైన పునాదిని అందిస్తున్నాయి. భారత దేశపు ప్రాచీన 'ఉపనిషత్తులను' స్లోవేకియా భాషలోకి అనువదించడం.. మన సాంస్కృతిక సామీప్యతకు ఒక అద్భుతమైన ఉదాహరణ.
స్లోవేకియాలో నివసిస్తున్న భారతీయ సంతతి ప్రజలు అక్కడి ఆర్థిక వ్యవస్థ, సమాజానికి ఎంతో గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నారు. మన రెండు దేశాల మధ్య నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి ఈ రోజు మేం కార్మిక వలసలపై ఒక అవగాహన ఒప్పందాన్ని ప్రకటించాం. దీనితో పాటు సామాజిక భద్రతపై ఒప్పందాన్ని కూడా మేం త్వరలోనే ఖరారు చేస్తాం.
గౌరవనీయులైన ప్రధాని గారికి,
ఈ రోజు జరిగిన అత్యంత అర్థవంతమైన చర్చలు, భారతదేశం పట్ల మీకున్న సానుకూల దృక్పథానికి నేను మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
140 కోట్ల మంది భారతీయుల తరఫున భారత్‌ను సందర్శించవలసిందిగా నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మీరు కూడా ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీకు భారత్‌లో ఘన స్వాగతం పలకడానికి మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
రాబోయే సంవత్సరాల్లో మన 'సమగ్ర భాగస్వామ్యం' సరికొత్త అవకాశాలకు, ఉమ్మడి శ్రేయస్సుకు, మన ఉభయ దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
మీకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు.
***
(रिलीज़ आईडी: 2273866)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam