పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్యలపై వివిధమంత్రిత్వ శాఖల తాజా సమాచారం
దేశంలో మెరుగైన స్థితిలో ఎరువుల నిల్వలు; నిన్నటివరకు మొత్తం అవసరాలలో దాదాపు 27 శాతం కొనుగోలు చేసిన రైతులు
యూరియా ప్లాంట్లకు సహజ వాయువు సరఫరా గత ఆరు నెలల సగటు వినియోగంలో దాదాపు 100 శాతానికి చేరిక
గడిచిన 4 రోజుల్లో దాదాపు 1.66 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గాను సుమారు 1.84 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా
నల్లబజారు అమ్మకాలు, అనధికారిక మళ్లింపులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ ఆదేశం
దాదాపు 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్‌జీతో ఈ రోజు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన దిశ నౌక; జూన్ 18, 2026 నాటికి భారతదేశానికి చేరుకునే అవకాశం
प्रविष्टि तिथि:
15 JUN 2026 6:07PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మీడియా సమావేశం జరిగింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఇంధన లభ్యత, నౌకాయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయ పౌరులకు సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై తాజా వివరాలను అందించారు. రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా దేశంలో ఎరువుల లభ్యత, నిల్వల పరిస్థితికి సంబంధించిన వివరాలను పంచుకుంది.
ఎరువుల నిల్వ - లభ్యత
*దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉంది.
*ఖరీఫ్ 2026 కోసం, ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ 383.9 లక్షల మెట్రిక్ టన్నులుగా తాజాగా అంచనా వేసింది. ఈ రోజు వరకు నిల్వలు దాదాపు 196.65 లక్షల మెట్రిక్ టన్నులుగా (51 శాతం కంటే ఎక్కువ) ఉన్నాయి. ఇది దాదాపు 33 శాతం సాధారణ స్థాయి కంటే గణనీయంగా ఎక్కువ. ప్రభుత్వ మెరుగైన ప్రణాళిక, ముందస్తు నిల్వలు, సమర్థవంతమైన రవాణా నిర్వహణను ఇది ప్రతిబింబిస్తుంది.
*ప్రస్తుత ఖరీఫ్-2026లో 14.06.2026 వరకు దేశంలోని రైతులు ఇప్పటికే మొత్తం 102.78 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను కొనుగోలు చేశారు. ఇది మొత్తం అవసరంలో దాదాపు 27 శాతం.
*·దేశంలో సేంద్రియ ఎరువుల నిల్వ దాదాపు 22.60 లక్షల మెట్రిక్ టన్నులుగా అందుబాటులో ఉంది.
*గత ఏడాది ఇదే కాలంలో జరిగిన 3.31 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో పోలిస్తే, యుద్ధం తర్వాత భారతీయ రైతులు 11.82 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువులను (పంజాబ్ 2.91 లక్షల మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్ 2.94 లక్షల మెట్రిక్ టన్నులు, హర్యానా 1.44 లక్షల మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ 1.34 లక్షల మెట్రిక్ టన్నులు, గుజరాత్ 1.0 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్ర 0.87 లక్షల మెట్రిక్ టన్నులు) కొనుగోలు చేశారు ఈ గణనీయమైన పెరుగుదల సేంద్రియ పోషక వనరులను ఎక్కువగా వాడే సానుకూల ధోరణిని, రసాయన ఎరువుల నుంచి సేంద్రియ ప్రత్యామ్నాయాల వైపు రైతుల ప్రాధాన్యత క్రమంగా మారుతున్నట్లు సూచిస్తోంది.
*ప్రస్తుతానికి, ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల లభ్యతలో ఎలాంటి పెద్ద సవాలు లేదు.
సంక్షోభం తర్వాత ఎరువుల దేశీయ ఉత్పత్తి, దిగుమతి;-(లక్షల టన్నులలో)
|
|
సంక్షోభం తరువాత దేశీయ ఉత్పత్తి
|
సంక్షోభం తరువాత భారతీయ రేవులకు చేరుకున్న దిగుమతులు
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
· సంక్షోభ పరిస్థితి తర్వాత దిగుమతులు, దేశీయ ఉత్పత్తి ద్వారా దాదాపు 163.01 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వచ్చాయి.
· ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభ కాలంలో భారతదేశం 50 లక్షల మెట్రిక్ టన్నుల పైగా యూరియా, పీ అండ్ కే ఎరువులను సేకరించింది.
· విదేశాలలోని 28 రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ, భారతదేశం ఓమన్, మలేషియా, వియత్నాం, జార్జియా, నైజీరియా, రష్యా, ఫిన్లాండ్, ఈజిప్ట్, అల్జీరియా, టర్కీ, నెదర్లాండ్స్ నుంచి యూరియా సరఫరాను, ఎర్ర సముద్రం మొదలైన మార్గాల ద్వారా రష్యా, మొరాకో, ఈజిప్ట్, అమెరికా, జోర్డాన్, దక్షిణ కొరియా, ట్యునీషియా, సౌదీ అరేబియా నుంచి డిఎపి/ఎన్‌పికెల సరఫరాలను సురక్షితం చేసుకుంది.
· ప్రస్తుత జూన్ నెలలో, భారతీయ ఓడరేవులకు 25 లక్షల మెట్రిక్ టన్నుల పైగా దిగుమతి చేసుకున్న యూరియా, డిఎపి, ఎన్పీకే ఎరువులు చేరుకుంటాయని భావిస్తున్నారు.
· 17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు కోసం భారత్ అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేసింది, ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
· ·ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల, అంటే యూరియా, పి అండ్ కఎరువుల లభ్యతను ఎరువుల శాఖ నిరంతరం సమీక్షిస్తోంది.
· ·కంపెనీలు సమర్పించే అన్ని సబ్సిడీ బిల్లులను ఎరువుల శాఖ ప్రతి వారం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎరువుల సబ్సిడీ చెల్లింపుల కోసం తగినంత బడ్జెట్ అందుబాటులో ఉంది.
· తగినంతగా ఎరువుల లభ్యత కోసం ఇప్పటివరకు 'ఉన్నతాధికార కార్యదర్శుల బృందం' 12 సమావేశాలను నిర్వహించింది. లభ్యతలో ఎదురైన చాలా సవాళ్లను ఈ బృందం పరిష్కరించింది.
· దేశంలో ఎరువుల భద్రత పటిష్టంగా, స్థిరంగా, సువ్యవస్థితంగా ఉంది. అన్ని ప్రధాన ఎరువుల లభ్యత నిరంతరం అవసరానికి మించి ఉంటోంది.
ఇంధన సరఫరా - లభ్యత
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా వివరాలను అందించింది. పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా లభించేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
క్రూడ్ నిల్వలు - రిఫైనరీల పనితీరు
*తగినంత ముడి చమురు నిల్వలతో అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో నడుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా సరిపడా స్థాయిలో నిర్వహిస్తున్నారు.
*గృహ వినియోగానికి సరిపడేలా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
*దేశీయ మార్కెట్ కోసం పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ లభ్యతను నిర్ధారించడానికి వివిధ మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ణయించిన ప్రకారం కీలక రంగాల కోసం కనీస పరిమాణంలో సి3, సి4 స్ట్రీమ్స్‌ను అందుబాటులో ఉంచేందుకు చమురు శుద్ధి కంపెనీలతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లకు భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతి ఇచ్చింది.
*ఫార్మాస్యూటికల్స్ శాఖ, రసాయనాలు, పెట్రో కెమికల్స్ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగాల నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా, ఫార్మా, రసాయన, పెయింట్ రంగ కంపెనీల కోసం ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1120 మెట్రిక్ టన్నుల సి3-సి4 మాలిక్యూల్స్ కేటాయింపు నిబంధన తెచ్చారు.
01-జూన్-26 నుంచి ముంబై, కొచ్చి, వైజాగ్, చెన్నై, మథుర, గుజరాత్ రిఫైనరీల ద్వారా రసాయన, ఫార్మా, పెయింట్ పరిశ్రమలకు 5860 మెట్రిక్ టన్నుల పైగా సి3-సి4 మాలిక్యూల్స్ (ప్రొపిలీన్ బ్యూటిలీన్‌లతో కూడినవి), దాదాపు 5050 మెట్రిక్ టన్నుల బ్యూటైల్ అక్రిలేట్ విక్రయించారు.
రిటైల్ ఇంధన లభ్యత- ధరలు
*దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయ కేంద్రాలు (పెట్రోల్ బంకులు) యథావిధిగా పనిచేస్తున్నాయి.
*పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, వినియోగదారుల ప్రయోజనం కోసం భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.
*కొన్ని ప్రాంతాలలో రిటైల్ విక్రయ కేంద్రాల (పెట్రోల్ బంకుల) వద్ద అసాధారణంగా ఎక్కువ అమ్మకాలు, విపరీతమైన రద్దీ కనిపించింది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులలో తగినంత మొత్తంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
సహజ వాయువు సరఫరా- పీఎన్జీ విస్తరణ చర్యలు
*గృహ వినియోగ పైప్‌డ్ సహజ వాయువు (డీ- పీఎన్జీ), రవాణా రంగానికి చెందిన సీఎన్‌జీ లను 100% సరఫరాను అందిస్తూ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చారు.
*యూరియా ప్లాంట్‌లకు సరఫరా గత ఆరు నెలల్లో వాటి సగటు వినియోగంలో దాదాపు 100% వద్ద ఉంది.
*సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ( సీజీడీ) నెట్‌వర్క్‌ల ద్వారా అందించే సరఫరాలతో సహా, ఇతర పారిశ్రామిక,వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80% వరకు పెంచారు.
*వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తమ పరిధిలోని అన్ని ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్‌ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్‌లను ప్రాధాన్యత క్రమంలో అందించాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
*సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన దరఖాస్తుల ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది.
*ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీ వైపు దీర్ఘకాలిక మార్పునకు ఆమోదించే రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీని 10% అదనంగా అందించేందుకు భారత ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతిపాదన చేసింది.
*పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులను 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందుకుంటున్నాయి.
*మరింత స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వయంసమృద్ధ ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం, భారత ప్రభుత్వం ఒక మోడల్ డ్రాఫ్ట్ 'స్టేట్ సీబీజీ పాలసీ'ని రూపొందించింది. ఇది రాష్ట్రాలు తమ పరిధిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ( సీబీజీ)!అభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు అనుకూలమైన, సులభంగా అమలు చేయగల వ్యవస్థను సృష్టించుకునేందుకు ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక ప్రణాళికగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు తదుపరి విడత అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తారు.
*మార్చి 2026 నుంచి దాదాపు 9.76 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాస్ సరఫరా ప్రారంభించారు. అదనంగా మరో 3.19 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనితో మొత్తం కనెక్షన్‌ల సంఖ్య 12.95 లక్షలకు చేరుకుంది. కొత్త కనెక్షన్‌ల కోసం దాదాపు మరో 9.72 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరా స్థితి:
ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి కారణంగా ఎల్‌పీజీ సరఫరాకు అంతరాయం కొనసాగుతోంది.
గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యత కొనసాగుతోంది.
ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో సరఫరా నిలిచిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
నిన్న పరిశ్రమ ప్రాతిపదికన ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు సుమారు 99 శాతానికి పెరిగాయి.
పంపిణీదారుల స్థాయిలో దారి మళ్లింపును నివారించడం కోసం డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలను సుమారు 96 శాతానికి పెంచారు. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డీఏసీ అందుతోంది.
గత 4 రోజుల్లో, సుమారు 1.66 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గానూ... దాదాపు 1.84 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
10 శాతం సంస్కరణల ఆధారిత కేటాయింపులు సహా, మొత్తం వాణిజ్య కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిలో 70 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
గత 4 రోజుల్లో -
దాదాపు 2.18 లక్షల – 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
871 శిబిరాల ద్వారా 14,500లకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయించారు.
మొత్తం 24184 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీని విక్రయించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సుమారు 722 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్‌పీజీని విక్రయించాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడానికి... అక్రమనిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధాన సమావేశాల ద్వారా పునరుద్ఘాటించింది.
తగినంత ఇంధనం లభ్యత గురించి పౌరులకు భరోసా ఇచ్చేందుకు... ప్రజలకు వాస్తవ పరిస్థితి గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన అవసరాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో అనుసంధాన సమావేశాల ద్వారా స్పష్టం చేసింది.
పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల ద్వారా హెచ్‌ఎస్‌డీని అనధికారికంగా కొనుగోలు చేయడాన్ని నివారించడం కోసం జిల్లా వారీగా హెచ్‌ఎస్‌డి/ఎంఎస్ కొనుగోళ్ల సరళిని పర్యవేక్షించి, సమీక్షించాలనీ... అక్రమ కొనుగోళ్లకు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ప్రధాన రవాణా-పారిశ్రామిక కారిడార్ల వెంబడి తనిఖీలను, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలనీ... నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తక్షణ శిక్షా చర్యలు ప్రారంభించేలా రాష్ట్రాలు, జిల్లాల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలనీ భారత ప్రభుత్వం 26.05.2026 తేదీ నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కోరింది.
పీఎన్‌జీ అందుబాటులో ఉన్న చోటల్లా ఎల్‌పీజీ వినియోగదారులను పూర్తిగా పీఎన్‌జీకి మారేలా ప్రోత్సహించడానికి, ఒత్తిడి చేయడానికి, సంబంధిత ఎస్ఎల్‌సీలు, సీజీడీ సంస్థలతో కలిసి పనిచేసేలా జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్, పట్టణ సంస్థల కమిషనర్, ప్రత్యేక అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను భారత ప్రభుత్వం 10.06.2026 తేదీ నాటి లేఖ ద్వారా కోరింది. జిల్లా, పట్టణ స్థాయి పరిపాలన భాగస్వామ్యం... పీఎన్‌జీ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాల ఫలితాన్ని మెరుగుపరుస్తుంది.
భారత ప్రభుత్వం 11.06.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కింది వాటిని నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది–
రిటైల్ అవుట్‌లెట్‌లు వాహన ట్యాంకుల్లో, పీఈఎస్‌వో ఆమోదించిన కంటైనర్లలో మాత్రమే డీజిల్‌ను అందించాలి. ప్రతి వినియోగదారునికి లేదా వాహనానికి రోజుకు గరిష్ట పరిమితి 200 లీటర్లు. రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి విక్రయించరాదు.
పారిశ్రామిక, ప్రత్యక్ష లేదా సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల ద్వారా ఇంధనాన్ని కొనుగోలు చేయడం నిషిద్ధం. వారు తమ అవసరాల కోసం కన్స్యూమర్ పంపుల ద్వారానే ఇంధనాన్ని పొందాలి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రిటైల్ అవుట్‌లెట్ డీలర్లు నిర్దేశించిన పరిమితులకు అనుగుణంగా ఉండేలా చూడటానికి... ఉత్తర్వులోని నిబంధనలను తప్పించుకోవడానికి చేసే ఏవైనా ప్రయత్నాలను నిరోధించడానికి బాధ్యత వహిస్తారు.
సామాన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు గానూ బ్లాక్ మార్కెటింగ్, అనధికారిక మళ్లింపు వంటి ఏవైనా అవకతవకలకు వ్యతిరేకంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలను భారత ప్రభుత్వం ఆదేశించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్, పర్యవేక్షణ చర్యలు
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి.
ఎల్‌పీజీ సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు – 2026 మార్చి నెల నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1330 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. 311 మందిని అరెస్టు చేశారు. దాదాపు 75,960 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ సంబంధిత చర్యలు - 27 మే 2026 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 12,307 లీటర్ల పెట్రోల్, 91,263 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 50కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, సుమారు 39 మందిని అరెస్టు చేశారు.
అదేవిధంగా, పీఎస్‌యూ ఓఎంసీల అధికారుల ద్వారా ఆకస్మిక తనిఖీలూ కొనసాగుతున్నాయి.
రిటైల్ అవుట్‌లెట్లు – గత 4 రోజుల్లో... మార్కెట్ క్రమశిక్షణ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 3 రిటైల్ అవుట్‌లెట్లపై జరిమానాలు విధించగా, 866 రిటైల్ అవుట్‌లెట్లను సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ... దేశంలో ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (రవాణా)లకు 100 శాతం సరఫరాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. ఫార్మా, ఉక్కు, ఆటోమొబైల్, విత్తనాలు, వ్యవసాయం మొదలైన రంగాలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు.
వలస కార్మికులు, విద్యార్థులు మొదలైన వారి ఎల్‌పీజీ అవసరాలకు మద్దతుగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సరఫరాను పెంచారు.
రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం, సరఫరా కోసం నిర్ధిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి అనేక హేతుబద్ధీకరణ చర్యలను ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండు వైపులా అమలు చేసింది.
ప్రజలకు సూచనలు, పౌరులకు అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పౌరులు భయాందోళనలతో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దనీ, ఎల్‌పీజీని బుక్ చేసుకోవద్దని సూచించారు.
వదంతుల పట్ల జాగ్రత్త వహించాలి. సరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.
పౌరులకు పీఎన్‌జీ, ఇండక్షన్/ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌లు మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
అధిక మొత్తంలో కొనుగోలు చేసేవారు, పారిశ్రామిక వినియోగదారులు అధీకృత కొనుగోలు మార్గాల నుంచి డీజిల్‌ను పొందాలని కోరడమైనది.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలని కోరడమైనది.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు-సిబ్బంది భద్రతను, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది సమాచారాన్ని పేర్కొన్నారు:
ఎస్‌సీఐ ఆధ్వర్యంలోని కన్సార్టియం నిర్వహణలో ఉన్న మాల్టా జెండా గల ఎల్ఎన్‌జీ క్యారియర్ 'దిశ' (IMO: 9250713)... భారత్‌లోని దహేజ్‌కు సుమారు 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్‌జీతో వస్తోంది. ఈ రోజు అంటే జూన్ 15, 2026న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక జూన్ 18, 2026న భారత్ చేరుకునే అవకాశం ఉంది.
భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి... అన్ని విధాలా సహాయాన్ని అందించడం కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత మిషన్లు, షిప్పింగ్ కంపెనీలు, ఇతర సంబంధిత భాగస్వాములతో మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ అప్‌డేట్: యాక్టివేషన్ అయినప్పటి నుంచి ఈ కంట్రోల్ రూమ్ 12,737 కాల్‌లు, 28,299 కంటే ఎక్కువ ఈమెయిళ్లనూ నిర్వహించింది. గత 96 గంటల్లో, నౌకా వాణిజ్య సిబ్బంది, వారి కుటుంబాలు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాముల నుంచి మొత్తం 406 కాల్‌లు, 784 ఈమెయిళ్లూ అందాయి.
స్వదేశానికి రప్పించడంపై తాజా సమాచారం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా, గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 96 గంటల్లో స్వదేశానికి చేరిన 50 మందితో సహా... ఇప్పటివరకు మొత్తం 3,587 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.
దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి, ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
***
(रिलीज़ आईडी: 2273272)
आगंतुक पटल : 24