నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి


ఇతివృత్తం: 2047 కల్లా వికసిత్ భారత్ సాధనను దృష్టిలో పెట్టుకొని అందరికీ సమ్మిళిత అభివృద్ధి ఫలాలు

प्रविष्टि तिथि: 10 JUN 2026 1:36PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశాన్ని 2026 జూన్ 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ సాధనకు ‘టీమ్ ఇండియా’ను రూపొందించాలన్న ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా, ‘2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం అందరికీ సమ్మిళిత అభివృద్ధి ఫలాలు’ను ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఎంపిక చేశారు. దీనిలో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరికీ... వారి వయసు, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం ఎలాంటివి అన్న అంశాలను లెక్కలోకి తీసుకోకుండా అందరి సంక్షేమం, అందరి ప్రగతిపై శ్రద్ధ వహించనున్నారు. ఈ దార్శనికతను సాకారం చేయడానికి, దీనిని దేశంలో ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట, గణనయోగ్య ఫలితాలను అందించడానికి అవలంబించాల్సిన విధానంపై పాలక మండలి సమావేశం చర్చిస్తుంది.
ఇదే పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు కలిసికట్టుగా సమ్మిళిత మానవాభివృద్ధి ప్రాథమిక ప్రణాళికను చర్చిస్తారు. వారు నాలుగు ముఖ్యాంశాల ఆధారంగా చర్చలు జరుపుతారు. ఆ నాలుగు కీలకాంశాలలో:
1. మూలాధార మానవ పెట్టుబడి, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నద్ధంగా ఉండే నైపుణ్యాలు,
2. ఉత్పాదక ఉపాధికల్పన, ఔత్సాహిక పారిశ్రామికత్వం, వికేంద్రీకరించిన అభివృద్ధి,
3. ఆరోగ్యం, పోషణ, సంక్షేమం,
4. అందరికీ సమాన అవకాశాలు, ఆత్మగౌరవం.. భాగంగా ఉన్నాయి.
సమావేశంలో దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని, నైపుణ్యాల సాధనను ప్రోత్సహించడంతో పాటు దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఏయే చర్యలు తీసుకోవచ్చో చర్చిస్తారు.
పాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), భాగస్వామ్యాలు, డేటా ఆధారిత వ్యవస్థలు సహా ప్రధాన సహాయకారి అంశాలను వినియోగించుకుంటూ ఒక కార్యాచరణ నమూనాను రూపొందించడంపై ఈ చర్చలలో శ్రద్ధ వహిస్తారు. దీనితో పాటు స్వల్ప, మధ్య కాలిక, దీర్ఘ కాలిక ఫలితాలపై దృష్టి సారించడానికి ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. దీనితో జవాబుదారుతనాన్ని, గణన యోగ్య ప్రభావాన్ని నిర్ధారించినట్లు అవుతుంది. సమ్మిళిత మానవ అభివృద్ధిపై జాతీయ దృష్టికోణానికి, రాష్ట్రాల దృష్టికోణాలకు మధ్య పొందికను సమకూర్చడంపై దృష్టి సారిస్తారు. ఫలితంగా సమాన, దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా ఏకీకృత, సహకార ప్రధాన విధానాన్ని అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.  
నీతి ఆయోగ్ పాలక మండలి 2025 డిసెంబరు 26 నుంచి 28 మధ్య నిర్వహించిన ముఖ్య కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం సిఫారసుల పైనా తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ కింద పేర్కొన్న 5 ముఖ్య ఇతివృత్తాలపై ముఖ్య కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం సిఫారసులు చేసింది:
1. బాల్యంలో ముందస్తు విద్యాబోధన: పునాదిని వేయడం;
2. పాఠశాల విద్యాబోధన: మూలాధారంగా నిలిచే నిర్మాణం;
3. నైపుణ్యాలను నేర్పించడం: భవిష్యత్తు అవసరాల కోసం సన్నద్ధులై ఉండే శ్రమ శక్తి;
4. ఉన్నత విద్యాబోధన: జ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేయడం;
5. క్రీడలు, పాఠ్యాంశేతర కార్యకలాపాలు: తరగతి గదులకు ఆవల సన్నాహక చర్యలు.
నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలకులు, ఎక్స్-అఫీషియో సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పాల్గొంటారు.

***


(रिलीज़ आईडी: 2271219) आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam