పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలితో చర్చించిన శ్రీ హర్‌దీప్ సింగ్ పూరీ
భారత ఇంధన భద్రతా వ్యూహంలో వెనిజువెలా కీలకమని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
భౌగోళిక రాజకీయ అవాంతరాల నడుమ 2026 ఏప్రిల్ - మే నెలల్లో భారత్‌కు ప్రధాన ముడి చమురు సరఫరాదారుల్లో ఒకటిగా నిలిచిన వెనిజువెలా.. అభివృద్ధికి విస్తృత అవకాశాలు
प्रविष्टि तिथि:
05 JUN 2026 10:32AM by PIB Hyderabad
గౌరవ వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ ఎలోయినా రోడ్రిగ్జ్ గోమెజ్‌తో భారత కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరీ 2026 జూన్ 4న న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, వివిధ ప్రభుత్వ రంగ చమురు కంపెనీల చైర్‌పర్సన్లతో కలిసి మంత్రి ఆమెతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య శాశ్వత ఇంధన భాగస్వామ్యాన్ని నిర్మించుకునే అవకాశాలపై వారిద్దరూ చర్చించారు.
దీర్ఘకాలిక స్నేహసంబంధం ప్రాతిపదికగా భారత్, వెనిజువెలా మధ్య ఒక సహజసిద్ధమైన భాగస్వామ్యం నెలకొన్నదని ఈ సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. వెనిజువెలా ఇంధన రంగ పునర్నిర్మాణానికి భారత్ బలంగా మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి భారతీయ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భారత ఇంధన వైవిధ్యీకరణ వ్యూహంలో వెనిజువెలా కీలక పాత్ర పోషిస్తుందన్న మంత్రి.. ఆ దేశంతో ఇంధన వాణిజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు భారత్ ఎంతో ఆసక్తితో ఉందని వెల్లడించారు.
భారత్‌ను వెనిజువెలాకు నమ్మకమైన భాగస్వామిగా పేర్కొంటూ.. తమ దేశంలో సంస్కరణలు చేపట్టిన చమురు, గ్యాస్ రంగంలో క్రియాశీలక భాగస్వాములు కావాల్సిందిగా భారతీయ కంపెనీలకు తాత్కాలిక అధ్యక్షురాలు ఆహ్వానం పలికారు. ఇంధన రంగంలో భారత్ - వెనిజువెలా మధ్య ఉన్న పరస్పర అనుకూలతలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య మరింత బలమైన సహకారం దిశగా అవకాశాలను అన్వేషించడం కోసం ఒక ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం వెనిజువెలాలో పర్యటించాలని ఈ సందర్భంగా ఆమె ఆహ్వానించారు.
నేపథ్యం
ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలున్న దేశం వెనిజువెలా. ఏళ్లుగా భారత్‌కు ముడిచమురును సరఫరా చేస్తోంది. వెనిజువెలా నుంచి వచ్చే భార ముడిచమురును శుద్ధి చేసే ప్రత్యేక సాంకేతిక సామర్థ్యం భారత అత్యాధునిక రిఫైనరీ రంగానికి ఉంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సరఫరాలో ఆటంకాలు గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు దిగుమతులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో.. ఇంధన దిగుమతి వనరుల వైవిధ్యీకరణలో వెనిజువెలాను వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ పరిగణిస్తోంది. 2026 ఏప్రిల్, మే నెలల్లో భారత్‌కు అత్యధికంగా ముడిచమురును సరఫరా చేసిన దేశాల్లో వెనిజువెలా ఒకటిగా నిలిచింది. భవిష్యత్తులో ఈ దిశగా ఇరు దేశాల సంబంధాల విస్తరణకు విస్తృత అవకాశాలున్నాయనేందుకు ఇది నిదర్శనం. 2025-26లో వెనిజువెలా నుంచి భారత్ సగటు నెలవారీ దిగుమతులు 64.027 టీఎంటీలుగా ఉండగా.. 2026-27 ఏప్రిల్ - మే నాటికి అది 1,047.148 టీఎంటీలకు పెరిగింది.
వెనిజువెలా చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగంలో కూడా భారత ప్రభుత్వ రంగ సంస్థలు 2008 నుంచే సుస్థిరంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఆ సంస్థల దీర్ఘకాలిక నిబద్ధతకు ఇది నిదర్శనం.
ఒరినోకో బెల్ట్‌లో ఉన్న శాన్ క్రిస్టోబల్, పెట్రోకారాబోబో-1 ప్రాజెక్టుల్లో.. వెనిజువెలా చమురు రంగంలో భారత్ మొత్తం పెట్టుబడి దాదాపు 1 బిలియన్ డాలర్లుగా ఉంది.
***
(रिलीज़ आईडी: 2269209)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam