సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘ఐఐఎంసీ’లో ప్రారంభమైన ఎంఏ, పీజీ డిప్లొమా అడ్మిషన్లు
2026 జూన్ 7 వరకు ఈ-కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
ఆరు క్యాంపస్‌లలో ఐఐఎంసీ విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయనున్న మూడు కొత్త ఎంఏ కోర్సులు
प्रविष्टि तिथि:
03 JUN 2026 4:09PM by PIB Hyderabad
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మీడియా విద్యా సంస్థ- ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో(ఐఐఎంసీ)’ ఆరు ఎంఏ, నాలుగు పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ-కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంఏ, పీజీ డిప్లొమా కోర్సులన్నింటికీ కేవలం ఈ-కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను https://iimc.admissions.nic.in/ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. ఈ-కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2026 జూన్ 7 చివరి తేదీ. మొదటి విడత సీట్ల కేటాయింపును జూన్ 9న ప్రకటిస్తారు.

ఈ ఏడాది ఐఐఎంసీ.. హెల్త్ కమ్యూనికేషన్, మీడియా అండ్ కమ్యూనికేషన్ గవర్నెన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ బ్రాండ్ మేనేజ్‌మెంట్ అనే మూడు కొత్త ఎంఏ కోర్సులను ప్రవేశపెట్టింది. వీటితో కలిపి ఐఐఎంసీ ఇప్పుడు తన ఆరు క్యాంపస్‌లలో (ఢిల్లీ, డెంకనాల్, ఐజ్వాల్, అమరావతి, జమ్మూ, కొట్టాయం) మొత్తం ఆరు ఎంఏ కోర్సులను అందిస్తోందని అడ్మిషన్ల ఇన్ఛార్జ్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ (డాక్టర్) రాకేశ్ కుమార్ గోస్వామి తెలిపారు.
ఐఐఎంసీకి ఎంతో పేరు తెచ్చిన పాత కోర్సులైన నాలుగు పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, రేడియో- టెలివిజన్ జర్నలిజం, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌లలో పీజీ డిప్లొమా కోర్సులు ఈ జాబితాలో ఉన్నాయి.
కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (సీఓక్యూపీ17) లో చెల్లుబాటు అయ్యే సీయూఈటీ-పీజీ మార్కులు సాధించిన భారతీయ విద్యార్థులు ఎంఏ కోర్సులకు అర్హులు. ఇదే సబ్జెక్టులో అర్హత కలిగిన సీయూఈటీ-పీజీ మార్కులు ఉన్న గ్రాడ్యుయేట్లు పీజీ డిప్లొమా కోర్సులకు అర్హులు. 2026 ఆగస్టు 1 నాటికి పీజీ డిప్లొమా ప్రవేశాల గరిష్ఠ వయోపరిమితి జనరల్ విభాగ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఎస్సీ- ఎస్టీ- దివ్యాంగులకు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ప్రవేశాల నోటీసు, ప్రాస్పెక్టస్, ప్రక్రియ విధానాన్ని చదవాలని ఐఐఎంసీ సూచించింది. రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాధాన్యతలలో మార్పుల కోసం ఎలాంటి అభ్యర్థనలను అంగీకరించరు. కాబట్టి సంబంధిత దరఖాస్తును నింపేటప్పుడు కోర్సులు, క్యాంపస్‌ల ప్రాధాన్యతలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి.
కేటాయించిన కోర్సులో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవడానికి అభ్యర్థులు రూ. 20,000 (సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్) చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మిగిలిన ట్యూషన్ ఫీజును నిర్దేశిత గడువులోగా చెల్లించాలి.

అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం హైస్కూల్ సర్టిఫికేట్, డిగ్రీ ఫైనల్ మార్క్‌షీట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు నిర్దేశిత తేదీ, సమయం లోపల అవసరమైన పత్రాలను సమర్పించాలి. రిజర్వేషన్ విభాగాలకు చెందిన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించలేకపోతే.. ఒక అండర్‌టేకింగ్ ఇచ్చి నిర్ణీత గడువులోగా సంబంధిత పత్రాలన్నింటినీ సమర్పించొచ్చు.
ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఐఐఎంసీ అధికారిక వెబ్‌సైట్ iimc.gov.inను సందర్శించాలని ఐఐఎంసీ సూచించింది. ఏదైనా సందేహం ఉంటే admissions@iimc.gov.in కు ఈమెయిల్ చేయొచ్చు.
***
(रिलीज़ आईडी: 2268525)
आगंतुक पटल : 9