|
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
చారిత్రాత్మక 'సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం' (సీఈపీఏ) ద్వారా వాణిజ్యానికి కొత్త ఉత్తేజాన్ని అందించిన భారత్, ఒమన్ దేశాలు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్య నవశకానికి నాంది పలుకుతూ ఒక పరివర్తనాత్మక సీఈపీఏను ప్రారంభించిన ఇరు దేశాలు వికసిత్ భారత్- 2047 కోసం ఒక కొత్త వాణిజ్య కారిడార్: ఒమన్‌కు భారత్ చేసే ఎగుమతుల్లో 99.38 శాతానికి సుంకాల రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్న సీఈపీఏ ఒప్పందం ఒమన్‌తో సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశాల్లో అమెరికా తర్వాత రెండోదిగా నిలిచిన భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం, ఎగుమతులు, ఉపాధి కల్పన, వ్యూహాత్మక ఆర్థిక ఏకీకరణను గణనీయంగా పెంపొందించనున్న భారత్-ఒమన్ సీఈపీఏ సంపూర్ణ సుంకాల రద్దు, లభించనున్న పోటీతత్వ ప్రయోజనాలతో వ్యవసాయం- సముద్ర ఉత్పత్తులు, జౌళి, రత్నాలు- ఆభరణాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, పాదరక్షలు- వాహనాలు వంటి శ్రామికులు ఎక్కువగా ఉండే రంగాల్లో భారీగా పెరగనున్న ఎగుమతులు భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ను వేగవంతం చేస్తూ సుంకేతర అడ్డంకులను తొలగించే విషయంలో సంచలనాత్మక వాణిజ్య సులభతర చర్యలు: ఒమన్ ఓడరేవులలో 'ఈఐసీ' ధ్రువీకరణ పత్రాలకు లభించనున్న ఆమోదం మత్స్య సంపద, మాంసం, గుడ్లు, సముద్ర ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల రంగాల్లో భారతదేశ మార్కెట్ ఆధిపత్యాన్ని మరింత బలపరచనున్న ఈ ఒప్పందం జీసీసీ, తూర్పు ఆఫ్రికాకు ప్రవేశ ద్వారం: భారతదేశ ప్రాంతీయ వాణిజ్య అనుసంధానాన్ని మరింత విస్తరింపజేయనున్న ‘సోహార్, దుక్మ్, సలాలా’లలోని ఒమన్ లాజిస్టిక్స్ హబ్‌లు సేవా రంగంలో 127 ఉప- రంగాలకు సంబంధించిన అత్యుత్తమ ప్రతిపాదనలు చేస్తూ ఒమన్ చరిత్రలోనే పెద్ద నిర్ణయం: భారతీయ నిపుణులు, అంకురాలు, విజ్ఞాన ఆధారిత సంస్థలకు లభించనున్న అపార అవకాశాలు మెరుగైన వృత్తిపరమైన అవకాశాలు: ఐసీటీ గరిష్ఠ పరిమితి 20 శాతం నుంచి 50 శాతానికి పెంపు.. ఇంజనీర్లు, వైద్యులు, ఐటీ నిపుణులు, ఉపాధ్యాయులు, కన్సల్టెంట్‌ల కోసం ప్రత్యేక వృత్తిపరమైన నిబద్ధతలు భారతీయ రైతులు, దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటం కోసం డెయిరీ, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వంటనూనెలు, నూనెగింజలు, రబ్బరు, తోలు, మసాలా దినుసులకు సంబంధించిన సున్నితత్వంతో కూడిన రంగాలను మార్కెట్ యాక్సెస్ నుంచి మినహాయింపు ఔషధ రంగానికి వేగవంతమైన మార్కెట్ యాక్సెస్: యూఎస్ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, టీజీఏ ఆమోదిత ఉత్పత్తులకు 90 రోజులలోపు మార్కెటింగ్ యాక్సెస్
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 3:46PM by PIB Hyderabad
నేడు భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవటమే కాకుండా వ్యూహాత్మక వాణిజ్య, పెట్టుబడి సహకారంలో ఒక పరివర్తనాత్మక నూతన అధ్యాయానికి నాంది పలికింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్ అల్ సైద్ సమక్షంలో 2025 డిసెంబర్ 18న మస్కట్‌లో ఈ భారత్-ఒమన్ సీఈపీఏ ఒప్పందంపై సంతకాలు అయ్యాయి. ఇరుపక్షాల అంతర్గత ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం 2026 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చింది.
కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, భారత్‌లోని ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ సమక్షంలో ఈ ఒప్పందం అధికారికంగా కార్యాచరణలోకి వచ్చింది. ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని దీని కింద ప్రాధాన్యతా క్రమంలో లభించే సుంకాల ప్రయోజనాలను పొందే మొట్టమొదటి ఎగుమతుల కన్సైన్‌మెంట్లను ప్రారంభించారు. ముంబయి, కోల్‌కతా, చెన్నైల నుంచి బయలుదేరిన ఈ మొదటి సరుకు రవాణాలో వ్యవసాయ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఉన్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి ఒమన్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. దీనితో పాటు తన అధునాతన ఓడరేవు మౌలిక సదుపాయాల ద్వారా విస్తృతమైన జీసీసీ మార్కెట్‌కు ఒక వ్యూహాత్మక ప్రవేశ ద్వారంగా ఈ దేశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10.61 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం.. సానుకూల వృద్ధి ధోరణిని నమోదు చేస్తూ 2025-26 నాటికి 11.18 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రమబద్ధమైన చర్చల ప్రక్రియ ద్వారా విజయవంతంగా చేసుకున్న ఈ ఒప్పందం.. కేవలం సుంకాల తగ్గింపునకే పరిమితం కాకుండా వస్తు సేవలు, వృత్తిపరమైన నిపుణుల రాకపోకలు, నియంత్రణ సహకారం, సుంకేతర అడ్డంకుల విషయంలో రక్షణలు, సహకార అంశాలతో కూడిన దీర్ఘకాలిక ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దోహదపడుతుంది. ఇది జీసీసీ ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న భారత ఆర్థిక- వాణిజ్య ముద్రను, వ్యూహాత్మక ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది.
గల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి ఒమన్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. దీనితో పాటు తన అధునాతన ఓడరేవు మౌలిక సదుపాయాల ద్వారా విస్తృతమైన జీసీసీ మార్కెట్‌కు ఒక వ్యూహాత్మక ప్రవేశ ద్వారంగా ఈ దేశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10.61 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం.. సానుకూల వృద్ధి ధోరణిని నమోదు చేస్తూ 2025-26 నాటికి 11.18 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
గల్ఫ్ ప్రాంతంతో మరింత బలపడుతున్న భారత సంబంధాల్లో మరొక ప్రధాన ఘట్టాన్ని భారత్-ఒమన్ సీఈపీఏ తెలియజేస్తోంది. ఇది తయారీ రంగ పోటీతత్వం, ఉపాధి కల్పన, సేవల ఎగుమతులు, ప్రపంచ విలువ గొలుసులలో విలీనానికి తోడ్పడే పటిష్ఠమైన, విశ్వసనీయమైన, వైవిధ్యభరితమైన వాణిజ్య భాగస్వామ్యాలను నిర్మించాలనే భారత విస్తృత వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది.
సీఈపీఏ అమలులోకి రావడంపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు:
"భారత్-ఒమన్ సీఈపీఏ అనేది ఒమన్‌తో భారత్ సంబంధాలలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని తెలియజేస్తోంది. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను చేకూర్చే వాణిజ్య భాగస్వామ్యాలను ఏర్పరచాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచేదిగా ఈ ఒప్పందం మారుతుంది. భారతదేశ ఎగుమతుల్లో 99.38 శాతానికి సుంకాల రహిత ప్రవేశం లభించడంతో ఈ ఒప్పందం మన ఎగుమతిదారులకు కొత్త ద్వారాలను తెరుస్తుంది.. మన నిపుణులకు అపార అవకాశాలను అందిస్తుంది. ఒమన్ మన నమ్మకమైన భాగస్వామి.. మన ప్రజల మధ్య ఒక వారధి.. గల్ఫ్, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు ఒక ప్రవేశ ద్వారం. దీనివల్ల మన అవకాశాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. ప్రాంతీయ, ప్రపంచ విలువ గొలుసుల్లో భారత్ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించే రంగాలకు గణనీయమైన ప్రయోజనాలను అందించడం ద్వారా ఇది ఉద్యోగాల సృష్టికి తోడ్పడుతుంది.. పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.. ప్రాధాన్యత కలిగిన మార్కెట్ యాక్సెస్‌ను పొందుతున్న ఇతర దేశాల సరఫరాదారులతో భారతీయ పరిశ్రమలు సమాన ప్రాతిపదికన పోటీ పడేలా చేస్తుంది.”
వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. " సరఫరా గొలుసు వైవిధ్యీకరణ, మారుతున్న ఉత్పత్తి నెట్‌వర్క్‌లు, కొత్త ఆర్థిక కారిడార్ల ఆవిర్భావం వల్ల ప్రపంచ వాణిజ్య నమూనాలు పునర్నిర్మాణమవుతోన్న తరుణంలో ఈ నిర్మాణాత్మక మార్పులను అనుకూలంగా మార్చుకోవడానికి భారత్, ఒమన్‌లను సీఈపీఏ ఒక వ్యూహాత్మక స్థితిలో నిలుపుతుంది. వాణిజ్యం, సేవలు, పెట్టుబడులు, లాజిస్టిక్స్ రంగాల్లో మరింత సన్నిహిత ఏకీకరణను పెంపొందించడం ద్వారా ఈ ఒప్పందం మరింత పటిష్ఠమైన విలువ గొలుసులు, మెరుగైన ఆర్థిక పోటీతత్వం, ప్రాంతీయ- ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది. భారత్-ఒమన్ సీఈపీఏ.. మన పరస్పర బలాలు, లోతైన నియంత్రణ సహకారం, వృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా మన ద్వైపాక్షిక ఆర్థిక బంధానికి సరికొత్త శక్తిని అందిస్తుంది. ఈ ఒప్పందం కేవలం సుంకాల సరళీకరణకు సంబంధినదే కాదు అంతకు మించినది. ఇది మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది.. సేవల వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.. ఇరు మార్కెట్లలో పనిచేసే వ్యాపారాలకు మరింత స్పష్టత- నిలకడను కల్పిస్తుంది" అని అన్నారు.
గల్ఫ్‌కు ప్రవేశ ద్వారం: వికసిత్ భారత్ 2047 కోసం వాణిజ్యం, సేవలు, శ్రేయస్సును పెంపొందించడం
వస్తు వాణిజ్యం: పరివర్తనాత్మకంగా 99.38 శాతానికి సుంకరహిత ప్రవేశం
-
విలువ పరంగా ఒమన్‌కు భారతదేశం చేసే ఎగుమతుల్లో 99.38 శాతానికి ఈ సీఈపీఏ సుంకరహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఇది ఒమన్‌కు చెందిన 98.08 శాతం టారిఫ్ లైన్లకు వర్తిస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో భారత్ సాధించిన అత్యంత సమగ్రమైన మార్కెట్ యాక్సెస్‌లలో ఇది ఒకటి.
-
అన్ని సుంకరహిత మినహాయింపులు తక్షణమే అమలులోకి వస్తాయి. తద్వారా భారతీయ ఎగుమతిదారులకు నిలకడ, పోటీతత్వం అందుతుంది.
-
గతంలో ఎంఎఫ్ఎన్ విధానం కింద భారతదేశ ఎగుమతులలో కేవలం 15.33 శాతం మాత్రమే ఒమన్‌లోకి సుంకరహితంగా ప్రవేశించేవి. ఇప్పుడు ఈ సీఈపీఏ ఒప్పందంతో దాదాపు 28 బిలియన్ డాలర్ల ఒమన్ దేశ దిగుమతి మార్కెట్‌లో భారతీయ ఎగుమతిదారులు అపారమైన ధరల పోటీతత్వాన్ని సాధిస్తారు.
-
రత్నాలు-ఆభరణాలు, జౌళి, తోలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఔషధాలు వంటి ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించే రంగాల్లో పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఈ ఒప్పందం ఎంఎస్ఎంఈలు, తయారీ రంగం, ఉద్యోగాల సృష్టిని గణనీయంగా వేగవంతం చేస్తుందన్న అంచనా ఉంది.
-
ఒమన్‌తో ఎటువంటి ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు లేని ఇతర దేశాల సరఫరాదారులతో పోలిస్తే భారతీయ ఎగుమతిదారులు ఇప్పుడు సమానమైన లేదా అంతకంటే మెరుగైన నిబంధనలతో మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వగలరు.
-
‘సోహార్, దుక్మ్, సలాలా’లలోని ఒమన్ వ్యూహాత్మక లాజిస్టిక్స్ హబ్‌లు భారతీయ ఎగుమతిదారులకు కేవలం ఒమన్‌కే కాకుండా మరింత విస్తృతమైన జీసీసీ, తూర్పు ఆఫ్రికా మార్కెట్‌లకు సైతం అద్భుతమైన మార్కెట్ యాక్సెస్‌ను కల్పిస్తాయి.
క్రమబద్ధీకరించిన మార్కెట్ యాక్సెస్, సున్నితత్వం కలిగిన రంగాల రక్షణ
-
సున్నితమైన రంగాల విషయంలో బలమైన రక్షణ చర్యలను కొనసాగిస్తూనే విలువ పరంగా ఒమన్ నుంచి వచ్చే 94.81 శాతం దిగుమతులకు వర్తించేలా 77.79 శాతం టారిఫ్ లైన్లపై భారత్ సుంకాల సరళీకరణను అందించింది.
-
మినహాయింపుల జాబితా కింద రక్షణ కలిగిన ఉత్పత్తులలో పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వంటనూనెలు, నూనెగింజలు, రబ్బరు, తోలు, మసాలా దినుసులు, కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.
-
దేశీయ పరిశ్రమలను, తయారీ రంగ పోటీతత్వాన్ని కాపాడటం కోసం ఎంపిక చేసిన కొన్ని సున్నితమైన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల కొరకు 'టారిఫ్ రేట్ కోటాలు', 'కనీస దిగుమతి ధర' విధానాలను కూడా ఇందులో చేర్చారు.
-
ఈ క్రమబద్ధీకరించిన రాయితీల వ్యవస్థ భారతదేశ ఎగుమతి ఆకాంక్షలను ఆహార భద్రత, రైతు సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి రక్షణతో చక్కగా సమతుల్యం చేస్తుంది.
సముద్ర ఉత్పత్తులు: ప్రాంతీయ సముద్ర ఆహార విలువ గొలుసుల్లో భారత ఉనికిని పెంపొందించడం
-
గతంలో ఉన్న 5 శాతం వరకు దిగుమతి సుంకాల స్థానంలో రొయ్యలు, చేపలు, కటిల్‌ఫిష్‌లతో సహా అన్ని సముద్ర ఉత్పత్తులు ఇప్పుడు తక్షణ సుంకరహిత ప్రవేశాన్ని పొందుతాయి.
-
2025లో ఒమన్ సముద్ర ఉత్పత్తుల దిగుమతులు 35.3 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత ఎగుమతులు కేవలం 10 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇది ఇంకా ఉపయోగించుకోని అపారమైన మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.
-
ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్ వంటి దేశంలోని ప్రధాన తీరప్రాంత రాష్ట్రాల నుంచి ఎగుమతులను గణనీయంగా పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నారు.
-
భారతీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు మెరుగైన పోటీతత్వాన్ని, వేగవంతమైన కస్టమ్స్ అనుమతులను సాధించడమే కాకుండా గల్ఫ్ ప్రాంత ఆహార సరఫరా గొలుసుల్లో మరింత పటిష్ఠమైన అనుసంధానాన్ని పొందుతారు.
రత్నాలు, ఆభరణాలు: ప్రపంచ ఆభరణాల వాణిజ్యంలో భారతదేశ నాయకత్వాన్ని పెంపొందించడం
-
రత్నాలు, ఆభరణాలపై గతంలో ఉన్న 5 శాతం వరకు దిగుమతి సుంకాలు తక్షణమే పూర్తిగా రద్దు అవుతాయి.
-
ఇటలీ, టర్కీ, థాయిలాండ్, చైనా వంటి పోటీ దేశాలతో పోల్చితే భారతీయ ఎగుమతిదారులు మార్కెట్‌లో మెరుగైన నిర్మాణాత్మక ధరల ప్రయోజనాన్ని పొందుతారు.
-
ఒమన్ దేశ మొత్తం రత్నాలు, ఆభరణాల వార్షిక దిగుమతి మార్కెట్ 1.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో ఒమన్‌కు భారత్ చేసిన ఎగుమతులు 2025లో 25.78 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో పాలిష్ చేసిన సహజ వజ్రాల ఎగుమతులు 18.48 మిలియన్ డాలర్లు కాగా బంగారు ఆభరణాల ఎగుమతులు 6.67 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
-
రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగి 150 మిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనా ఉంది. ఒమన్ విధిస్తున్న సుంకాలను ఎదుర్కొంటున్న ఇతర దేశాల సరఫరాదారుల కంటే భారతీయ సరఫరాదారులు ఇప్పుడు ధరలు, పోటీ విషయంలో అద్భుతమైన వ్యవస్థీకృత ప్రయోజనాన్ని కలిగి ఉన్నారు.
-
రత్నాలు, ఆభరణాల రంగానికి కొత్త మార్గాలు సుగమం కావడంతో సూరత్ (వజ్రాలు), జైపూర్ (రత్నాలు), ముంబయి, కోల్‌కతా, చెన్నైలలోని పారిశ్రామిక క్లస్టర్లు ఈ వృద్ధిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల ఈ క్లస్టర్ల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న అంచనా ఉంది.
వ్యవసాయం, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు: ప్రపంచ మార్కెట్ల కోసం భారతదేశ వ్యవసాయ సామర్థ్యాన్ని ఉపయోగించటం
-
ఒమన్ వ్యవసాయ దిగుమతుల్లో 17.8 శాతం వాటాతో భారత్ ఆ దేశానికి రెండో అతిపెద్ద వ్యవసాయ సరఫరాదారుగా ఉంది. 2025 నాటికి భారత ఎగుమతులు 9.13 శాతం సీఏజీఆర్‌తో 552.85 మిలియన్ డాలర్లకు పెరిగాయి. 'అపెడా' షెడ్యూల్డ్ ఉత్పత్తుల ఎగుమతులు మరింత వేగంగా 12.36 శాతం సీఏజీఆర్‌తో 477 మిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి.
-
సుంకాల రద్దు వల్ల తేనె, మసాలా దినుసులు, జీడిపప్పు, బాస్మతి బియ్యం, వెన్న, తియ్యటి బిస్కెట్లు వంటి ఉత్పత్తుల్లో భారతదేశ పోటీతత్వం మరింత బలోపేతం అవుతుంది.
-
ఒమన్ దిగుమతి చేసుకునే పశుమాంసంలో 94 శాతం కంటే ఎక్కువ, తాజా గుడ్ల దిగుమతులలో 98 శాతం కంటే ఎక్కువ వాటాను ప్రస్తుతం భారతదేశమే కలిగి ఉంది. దీనితో గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు అత్యంత ముఖ్యమైన వ్యవసాయ ఎగుమతి గమ్యస్థానాలలో ఒమన్‌ను ఒకటిగా నిలిపింది.
-
కీలకమైన వస్తు ఎగుమతుల్లో బాస్మతి, పార్ బాయిల్డ్ బియ్యం, జీడిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సోయాబీన్ మీల్, స్వీట్ బిస్కెట్లు, వెన్న, ఎముకలు లేని ఫ్రోజెన్ పశుమాంసం, ఫలదీకరణం చెందిన గుడ్లు ఉన్నాయి. ఇవి రైతులు, ఆహారాన్ని ప్రాసెస్ చేసేవారు, వ్యవసాయ ఎగుమతిదారుల కోసం ఒక విస్తృతమైన, ఎదుగుతున్న వ్యాపార అవకాశాలను తెలియజేస్తున్నాయి.
-
ఆల్ఫాన్సో, కేసర్, దశేరి రకాలతో కూడిన మామిడి పండ్ల ఎగుమతులు సుంకరహిత ప్రవేశం ద్వారా గల్ఫ్ మార్కెట్లలో మరింత మెరుగైన పోటీతత్వాన్ని సాధిస్తాయి.
-
ఈ ఒప్పందం వల్ల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న రైతులు, వ్యవసాయ ప్రాసెసర్లు, ఆహార ఎగుమతిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఔషధ రంగం: నియంత్రణపరమైన పురోగతి ద్వారా మార్కెట్ యాక్సెస్‌ను పెంపొందించడం
-
ఈ ఒప్పందం మందులు, వ్యాక్సిన్‌లు, పెన్సిలిన్లు, స్ట్రెప్టోమైసిన్లు, టెట్రాసైక్లిన్‌లతో కూడిన ఔషధ పదార్థాలకు కచ్చితమైన సుంకరహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది.
-
2025లో ఒమన్ ఔషధాల మార్కెట్ విలువ 302.84 మిలియన్ డాలర్లుగా ఉండగా 2031 నాటికి ఇది 6.6 శాతం సీఏజీఆర్‌తో 473.71 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా ఉంది. ఇది భారతదేశ ఔషధాల ఎగుమతిదారులకు ఒక గణనీయమైన, నిరంతరం ఎదుగుతున్న అవకాశాన్ని అందిస్తుంది.
-
యూఎస్ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్‌ఆర్ఏ, టీజీఏలు ఇప్పటికే ఆమోదించిన ఉత్పత్తులు.. ముందస్తు తనిఖీ అవసరం లేకుండానే 90 రోజులలోపు మార్కెటింగ్ అనుమతి పొందడానికి అర్హత సాధిస్తాయి. ఒకవేళ తనిఖీలు తప్పనిసరైన పక్షంలో 270 పని దినాల వ్యవధిలో ఈ అనుమతులు లభించేలా ఆ దేశం చర్యలు తీసుకుంటుంది.
-
జీఎంపీ, తనిఖీ నివేదికల పరస్పర అంగీకారం వల్ల నిబంధనలను అనుసరించే విషయంలో భారం గణనీయంగా తగ్గడమే కాకుండా భారతీయ ఔషధ ఎగుమతిదారుల మార్కెట్ ప్రవేశం మరింత వేగవంతం అవుతుంది.
-
దీనివల్ల భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు గల్ఫ్ హెల్త్‌కేర్ మార్కెట్‌లో మరింత స్పష్టత, వేగవంతమైన అనుమతులు, మెరుగైన పోటీతత్వాన్ని సొంతం చేసుకుంటాయి.
-
రాబోయే సంవత్సరాల్లో ఒమన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుందన్న అంచనా ఉంది. ఇది భారతీయ ఎగుమతిదారులకు అద్భుతమైన, భారీ వ్యాపార అవకాశాలను సృష్టిస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువులు: భారతదేశ తయారీరంగం ఎగుమతి ప్రయోజనాన్ని బలోపేతం చేయడానికి సుంకాల విషయంలో పూర్తి నిలకడ
-
గతంలో ఉన్న 5 శాతం వరకు ఎంఎఫ్ఎన్ సుంకాల స్థానంలో అన్ని ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఇప్పుడు సుంకరహిత మార్కెట్ యాక్సెస్‌ను పొందుతాయి.
-
దీనివల్ల ప్రయోజనం పొందే ప్రధాన రంగాలలో యంత్రాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఇనుము-ఉక్కు, పారిశ్రామిక యంత్రాలు ఉన్నాయి.
-
2025లో ఒమన్ దాదాపు 1.7 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది భారతీయ తయారీదారులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ప్రస్తుతం ఒమన్‌కు భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 146 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ పెద్ద వ్యత్యాసాన్ని పూరించడానికే సుంకాల విషయంలో సీఈపీఏ పూర్తి నిలకడను అందిస్తోంది. బోర్డులు, క్యాబినెట్‌లు, స్టాటిక్ కన్వర్టర్లు, టీవీ రిసెప్షన్ ఉపకరణాలతో సహా అన్ని ఎలక్ట్రానిక్స్ విభాగాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
-
పీఎల్ఐ పథకం కింద పనిచేస్తున్న వాటితో సహా భారతీయ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఎగుమతి సంస్థలు ఒమన్ మార్కెట్‌లో తమ వాటాను మరింత పెంచుకుంటాయన్న అంచనా ఉంది.
-
భారతదేశ ఇంజనీరింగ్ ఎగుమతులకు ఒమన్ ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒమన్‌కు ఇంజనీరింగ్ ఎగుమతులు 875.83 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆటోమొబైల్స్, ఇనుము-ఉక్కు, ఇనుమేతర లోహాలు ప్రధానమైనవి. గతంలో 0–5 శాతం వరకు ఉన్న ఎంఎఫ్ఎన్ సుంకాల స్థానంలో ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ ఉత్పత్తులు సుంకరహిత మార్కెట్ యాక్సెస్‌ను పొందుతాయి. ఒమన్‌కు చేసే ఇంజనీరింగ్ ఎగుమతులు 2030 నాటికి 1.3 నుంచి 1.6 బిలియన్ డాలర్లకు పెరుగుతాయన్న అంచనా ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉపయోగించే ఇనుము- ఉక్కు, ఎలక్ట్రిక్- పారిశ్రామిక యంత్రాలు, మోటార్ వాహనాలు (5 శాతం సుంకం పూర్తిగా రద్దు అయింది), రాగి ఉత్పత్తుల విభాగాల్లో కీలకమైన ప్రయోజనాలు ఉంటాయన్న అంచనా ఉంది.
సేవలు: సేవా రంగాన్ని కొత్త పుంతలను తొక్కించేలా ఒమన్ అత్యుత్తమ నిబంధనలు
-
2024లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సేవల వాణిజ్యం 863 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారతదేశం 447 మిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును కలిగి ఉంది. ఒమన్ మొత్తం ప్రపంచ సేవల దిగుమతులు 12.52 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇందులో భారత్ కేవలం 5.31 శాతం వాటాను కలిగి ఉంది. ఇది మన దేశానికి ఇంకా ఉపయోగించుకోని అపారమైన మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.
-
ఈ సీఈపీఏ ఒప్పందం కింద సేవా రంగంలోని 127 ఉప-రంగాల్లో విస్తృతమైన, లోతైన మార్కెట్ యాక్సెస్ నిబద్ధతలను ఒమన్ ప్రకటించింది. ఈ నిబద్ధతలు జీఏటీఎస్ లేదా బెస్ట్ ఎఫ్‌టీఏ ప్లస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఏదైనా ఒక జీసీసీ దేశం భారత్‌కు అందించిన అత్యంత సమగ్రమైన సేవల నిబంధనలు ఇవే కావటం విశేషం.
-
ఈ ఒప్పందం కంప్యూటర్- అనుబంధ సేవలు, వృత్తిపరమైన సేవలు (న్యాయ లేదా చట్టపరమైన, అకౌంటింగ్, ఇంజనీరింగ్, మెడికల్- అనుబంధ సేవలు), ఆడియో-విజువల్ సేవలు, ఇతర వ్యాపార సేవలు, పరిశోధన - అభివృద్ధి(ఆర్- డీ సేవలు), టెలికమ్యూనికేషన్స్ సేవలు, నిర్మాణ సేవలు, విద్యా సేవలు, పర్యావరణ సేవలు, ఆరోగ్య సేవలు, ఆర్థిక సేవలు, పర్యాటక- ప్రయాణ అనుబంధ సేవలు వంటి రంగాల్లో భారతీయ నిపుణులకు, సేవా సంస్థలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి.
-
కీలకమైన ఉప-రంగాలలో ఎంఎఫ్ఎన్ నిబద్ధతలు.. ఇతర తృతీయ పక్ష దేశాలకు అందించే ఎలాంటి మెరుగైన లేదా అనుకూలమైన నిబంధనలనైనా స్వయంచాలకంగా భారత్‌కు కూడా వర్తింపజేసేలా హామీ ఇస్తున్నాయి.
-
ద్వైపాక్షిక ఎఫ్‌టీఏలలో మొదటిసారిగా అకౌంటింగ్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటీ, విద్య, నిర్మాణ రంగాలకు చెందిన నిర్దిష్ట విభాగాల నిపుణుల కోసం కచ్చితమైన నిబద్ధతలను ఒమన్ ప్రకటించింది.
-
నిపుణుల రాకపోకల విషయంలో మెరుగైన ఈ నిబంధనలు దాదాపు 6,000 భారత్–ఒమన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యాపారానికి సంబంధించి వచ్చే వారు ఒమన్‌లో 90 రోజుల వరకు ఉండొచ్చు. స్వతంత్ర నిపుణులు 180 రోజుల వరకు ఉండొచ్చు. ఇంట్రా-కార్పొరేట్ ట్రాన్స్‌ఫరీలు 4 సంవత్సరాల వరకు ఒమన్‌లో నివసించొచ్చు. ఈ నిబంధనలు భారతదేశ నిపుణులైన మానవ వనరులకు స్పష్టమైన, చట్టబద్ధంగా అమలు చేయదగిన రాకపోకల మార్గాలను కల్పిస్తాయి.
-
సామాజిక భద్రత ఒప్పందంపై (ఎస్ఎస్ఏ) భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఒమన్‌లోని భారతీయ కార్మికులు, యజమానులకు సామాజిక భద్రత ప్రయోజనాల పరస్పర నిరంతరాయతను ఈ ఎస్ఎస్ఏ అందిస్తుంది. అంతేకాకుండా ఇరు దేశాల్లోనూ విరాళాలు (డ్యూయల్ కాంట్రిబ్యూషన్స్) చెల్లించాల్సిన అవసరం లేకుండా నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
స్మార్ట్ నియంత్రణ, వాణిజ్యాన్ని సులభతరం చేయటం
-
భారతదేశానికి చెందిన ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ (ఈఐసీ) జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను ఒమన్ తప్పనిసరిగా అంగీకరిస్తుంది. దీనివల్ల ఒకే రకమైన పరీక్షలు, తనిఖీలను మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం తప్పుతుంది.
-
భారత్‌కు చెందిన ఎన్‌పీఓపీ ఆర్గానిక్ ధ్రువీకరణ, హలాల్ ధ్రువీకరణ విధానాలను ఒమన్ అధికారికంగా గుర్తించింది.
-
ఈ ఒప్పందంలో ప్రత్యేకంగా ఉన్న ఎస్‌పీఎస్, టీబీటీ అధ్యాయాలు సుంకేతర అడ్డంకులను తగ్గిస్తాయి. అలాగే ఇరు దేశాల మధ్య పారదర్శకతను, నియంత్రణపరమైన సహకారాన్ని పెంపొందిస్తాయి.
-
ప్రామాణిక కార్గో క్లియరెన్స్ కాలపరిమితులు, త్వరగా పాడైపోయే వస్తువుల కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్-ట్రాక్ విధానాలు పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఎగుమతిదారులకు లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి.
పెట్టుబడులు: ఆర్థిక నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడం
-
తయారీ, లాజిస్టిక్స్, ఇంధనం, సేవా రంగాలతో కూడిన ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులను సులభతరం చేయడానికి సీఈపీఏ ఒక నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేస్తుంది.
-
తగ్గిన నిబంధనల భారం, నియంత్రణ విషయంలో స్పష్టత పెరగటం, విస్తృత మార్కెట్ యాక్సెస్ వంటివి భారతదేశ ఎంఎస్‌ఎంఈల పోటీతత్వాన్ని గణనీయంగా బలోపేతం చేస్తాయన్న అంచనా ఉంది.
-
జీసీసీ విలువ గొలుసుల్లో మెరుగైన అనుసంధానం సాధించడం ద్వారా అంకురాలు, మహిళలు, వ్యవస్థాపకులు, సేవా రంగ నిపుణులు ఎంతో లబ్ధి పొందుతారని ఆశిస్తున్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యం: బలమైన గమనం, వాణిజ్యానికి పునరుత్తేజం
-
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, ఒమన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.18 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది నిరంతరం బలంగా వృద్ధి చెందుతోంది. సీఈపీఏ అమలులోకి రావడంతో మెరుగైన మార్కెట్ యాక్సెస్, పరస్పర సహకారం, పెట్టుబడి ప్రవాహాలు, పటిష్ఠమైన ఆర్థిక సమన్వయం ద్వారా రాబోయే సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా విస్తరిస్తుందన్న అంచనా ఉంది.
-
ఈ ఒప్పందం వాణిజ్యం, పెట్టుబడులు, సేవలు, లాజిస్టిక్స్, నియంత్రణ భాగస్వామ్యాలను కలుపుకుంటూ భారత్, ఒమన్‌ల మధ్య ఒక పటిష్ఠమైన ఆర్థిక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. 'వికసిత్ భారత్ -2047' విజన్ కింద ప్రపంచవ్యాప్తంగా ఏకీకృతమైన, పటిష్ఠమైన, అత్యంత పోటీతత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే భారత్ ప్రయాణంలో భారత్-ఒమన్ సీఈపీఏ మరొక చారిత్రాత్మక ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2267907)
|