గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ నెల 11–12 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా 13వ బ్రిక్స్ పట్టణీకరణ సదస్సు నిర్వహించనున్న భారత్


‘ప్రజల కోసం నగరాలు: సమ్మిళిత, సమర్థ పట్టణాల భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం’

प्रविष्टि तिथि: 01 JUN 2026 5:42PM by PIB Hyderabad

న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది జూన్ 11-12 తేదీల్లో నిర్వహిస్తున్న 13వ బ్రిక్స్ పట్టణీకరణ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఈ రోజు ప్రీ-ఈవెంట్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత 'మానవత్వమే ప్రథమం'... 'సమర్థత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' అనే ఇతివృత్తాల మార్గదర్శకత్వంలో... 2026 బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహిస్తున్న ఈ సదస్సు కీలకమైన మంత్రుల స్థాయి కార్యక్రమంగా జరుగుతుంది.

 ‘ప్రజల కోసం నగరాలు: సమ్మిళిత, సమర్థ పట్టణాల భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం’ ఇతివృత్తంతో పట్టణీకరణ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ... నగరాల ప్రణాళిక, పరిపాలన, అభివృద్ధిలో ప్రజలకు ప్రాధాన్యమిచ్చే భారత్ విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోందని అన్నారు.

భారత్ వారసత్వం, కొనసాగుతున్న నాయకత్వం

బ్రిక్స్ పట్టణీకరణ సదస్సును భారత్ తొలిసారిగా 2013లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించింది. తద్వారా బ్రిక్స్ సహకార అజెండాలో పట్టణీకరణను అధికారికంగా చేర్చింది. సుస్థిర పట్టణాభివృద్ధి, స్మార్ట్ నగరాలు, పట్టణ సమర్థతపై దృష్టి సారించిన భారత్ 2016లో విశాఖపట్నంలో ఈ సదస్సును మరోసారి నిర్వహించింది. మహమ్మారి అనంతరం ప్రపంచస్థాయిలో పట్టణ పునరుద్ధరణపై దృష్టి సారిస్తూ... 2021లో మరోసారి భారత్ ఈ సదస్సును వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించింది. 

ఇప్పుడు 2026లో జరగనున్న 13వ బ్రిక్స్ పట్టణీకరణ సదస్సుకు భారత్ నాలుగోసారి ఆతిథ్యమిస్తోంది. ఈ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి... బ్రిక్స్ దేశాలు పట్టణ విధాన అనుభవాన్ని పంచుకోవడానికి, ఉమ్మడి ప్రాధాన్యాలను గుర్తించడానికి, విస్తృత బ్రిక్స్ ప్రక్రియకు పట్టణాభివృద్ధి సంబంధిత సూచనలను అందించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ స్థాయి వేదికగా పనిచేస్తోంది.

బ్రిక్స్ దేశాల మధ్య ఉమ్మడి పట్టణ ప్రాధాన్యాలు

గృహ నిర్మాణం, రవాణా, వాతావరణ మార్పుల ముప్పు, పురపాలన సామర్థ్యం, పట్టణ ఆర్థిక వ్యవస్థ, సేవల పంపిణీ వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటూనే అనేక బ్రిక్స్ దేశాలు వేగవంతమైన పట్టణ వృద్ధిని సాధిస్తున్న ఈ కీలక తరుణంలో బ్రిక్స్ పట్టణీకరణ సదస్సు జరుగుతోందని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ సదస్సు సమ్మిళిత పట్టణాభివృద్ధి, వాతావరణ మార్పులను, విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, పటిష్ఠ పురపాలక సంస్థలు, మెరుగైన పట్టణ పరిపాలన కోసం డిజిటల్ ఆవిష్కరణలు వంటి కొన్ని విస్తృత ప్రాధాన్యాలపై దృష్టి సారిస్తోంది.

షెడ్యూల్ చేయబడిన కార్యక్రమం, ఆశించే ఫలితాలు

రెండు రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ పట్టణీకరణ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, పట్టణాభివృద్ధి రంగ నిపుణులు, నిపుణులూ హాజరుకానున్నారు. పదకొండు బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ మంత్రుల స్థాయి ప్రతినిధి బృందాలతో ఈ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానించారు.

సదస్సు మొదటి రోజున ప్రారంభ సమావేశం, ఉమ్మడి బ్రిక్స్ పట్టణ ప్రాధాన్యాలపై ఉన్నత స్థాయి ప్లీనరీ సమావేశం జరుగుతాయి. భారత పట్టణ పరివర్తనపై అవగాహన కల్పించడానికి గానూ ప్రతినిధులను న్యూఢిల్లీలోని ఎంపిక చేసిన పలు ప్రదేశాలకు క్షేత్ర పర్యటనకు తీసుకువెళతారు.

సదస్సు రెండో రోజు ప్రాధాన్య రంగాల గురించిన నిర్ధిష్ట అంశాలపై ప్యానెల్ చర్చలు జరుగుతాయి. సభ్య దేశాలు తమ దేశ అనుభవాలను పంచుకోవడానికి ఈ ప్యానెల్ చర్చల్లో పాల్గొంటాయి. దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలూ జరుగుతాయి.

ఈ చర్చలు పట్టణీకరణ సవాళ్లపై ఉమ్మడి విధాన పరిష్కారాలకు మద్దతునివ్వడంతో పాటు... సమ్మిళిత, సమర్థ, ప్రజా-కేంద్రిత నగరాల నిర్మాణంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.

బ్రిక్స్ కుటుంబంలోని వివిధ దేశాల ప్రతినిధులను న్యూఢిల్లీకి స్వాగతించడానికి, ప్రజల కోసం అబివృద్ధి చేసే నగరాల విషయంలో వారితో కలిసి పనిచేయడానికి భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని కేంద్ర మంత్రి అన్నారు.

***


(रिलीज़ आईडी: 2267900) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , Assamese , English , Urdu , हिन्दी , Bengali-TR , Tamil