సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ మీడియాలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించేందుకు మీడియా, వినోద రంగంలో ఏఐ అకాడమీని ప్రారంభించిన ఐఐఎంసీ


కృత్రిమ మేధ వేగాన్ని, సృజనాత్మకతను పెంచగలదు.. కానీ ఏఐ యుగంలోనూ మానవ విచక్షణ, కచ్చితత్వం, సంపాదకీయ బాధ్యతలే అత్యంత కీలకం: సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి

23 నగరాల్లోని 110 కి పైగా వార్తా సంస్థలు, మీడియా నిపుణుల కోసం నిర్వహించిన ఏఐ నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా స్నాతకోత్సవ మహోత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 29 MAY 2026 5:16PM by PIB Hyderabad

దేశంలో కృత్రిమ మేధ ఆధారిత మీడియా విద్యను, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో నేడు ఏఐఎంఈ అకాడమీ (ఏఐ అకాడమీ ఫర్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌)ను, న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) ప్రారంభించింది. న్యూఢిల్లీలోని ఐఐఎంసీ ప్రాంగణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ ఈ అకాడమీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎంసీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పలివాల్ గౌర్, గూగుల్ డీప్‌మైండ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా పాల్గొన్నారు.ఈ అకాడమీ ప్రారంభోత్సవంతో పాటు గత 10 వారాలుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో విజయవంతంగా సాగిన కృత్రిమ మేధ నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక శిక్షణలో దేశవ్యాప్తంగా 23 నగరాలకు చెందిన 10కి పైగా భారతీయ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 110 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా దాదాపు 100కి పైగా ప్రముఖ వార్తాసంస్థలు, మీడియా కళాశాలల నుంచి వచ్చి ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

 

ఏఐఎంఈ అకాడమీ : ఒక సంస్థాగత మైలురాయి

మీడియా, వినోద రంగంలో కృత్రిమ మేధ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఏఐఎంఈ అకాడమీని ఒక జాతీయ స్థాయి అత్యున్నత కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఐఐఎంసీ సంస్థను కేవలం సంప్రదాయ మీడియా శిక్షణకే పరిమితం చేయకుండా, భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మార్చడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం. దీని కోసం సామర్థ్యాల పెంపు, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహం, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ విధానాల రూపకల్పన, వ్యూహాత్మక సహకారం వంటి అయిదు ముఖ్యమైన అంశాలపై ప్రణాళికను రూపొందించారు.ఈ అకాడమీ ద్వారా దేశ అవసరాలకు సరిపోయే ప్రత్యేక శిక్షణ మాడ్యూళ్లను తయారు చేస్తారు. జర్నలిజంలో కృత్రిమ మేధ పాత్రపై అనువర్తిత పరిశోధనలను ప్రోత్సహిస్తారు. వివిధ వార్తా సంస్థలు ఏఐ సాంకేతికతను ఎలా వాడుతున్నాయో పరిశీలించి, భారతీయ మీడియా వ్యవస్థ అంతటా కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా ఉపయోగించేలా ఈ అకాడమీ కృషి చేస్తుంది.

 

ఐఐఎంసీ సంస్థకు దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ, ధేన్‌కనల్, జమ్మూ, ఐజ్వాల్, అమరావతి, కొట్టాయం వంటి ప్రాంతాల్లో ఆరు కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకత వల్ల దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో కృత్రిమ మేధ సాంకేతిక సామర్థ్యాలను పెంచడానికి ఐఐఎంసీకి ఎంతో అనుకూలత ఉంది. మన దేశంలో ఉన్న బహుభాషా సంస్కృతి, ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు గ్రామీణ ప్రేక్షకులు, ప్రజాస్వామ్య వైవిధ్యం వంటి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను.. మీడియా, ఏఐ రంగంపై జరిగే అంతర్జాతీయ చర్చల వేదికలను ముందుకు తీసుకురావడానికి కూడా ఈ అకాడమీ ఎంతగానో ఉపయోగపడనుంది.

 

సర్టిఫికేట్ ప్రదానోత్సవం: ఏఐ నైపుణ్యాలు సాధించిన వారికి గుర్తింపు

ఈ స్నాతకోత్సవ మహోత్సవంలో సర్టిఫికేట్ ప్రదానోత్సవం అత్యంత ప్రధాన కార్యక్రమంగా నిలిచింది. ఇందులో దూరదర్శన్, ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), పబ్లికేషన్స్ డివిజన్, ఐఐఎంసీ సంస్థకు చెందిన అభ్యర్థులు కృత్రిమ మేధ నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి అధికారికంగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి సత్కరించారు.

 

ప్రభుత్వ ప్రభుత్వరంగ ప్రసార సంస్థలతో పాటు, ప్రైవేటు వార్తా సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థులకు కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో కృత్రిమ మేధపై ప్రాథమిక అవగాహన కల్పించారు. దీనితో పాటు గూగుల్ సంస్థకు చెందిన అధునాతన ఏఐ సాధనాలైన నోట్‌బుక్ ఎల్‌ఎం, జెమిని, ఏఐ స్టూడియో, పిన్‌పాయింట్‌లను ఎలా ఉపయోగించాలో నేర్పించి, వారి నైపుణ్యాలను పెంపొందించారు.

 

కేంద్ర కార్యదర్శి ప్రసంగం: కృత్రిమ మేధ కేవలం ఒక సహాయకారి మాత్రమే, మనుషులకు ప్రత్యామ్నాయం కాదు..

ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశ మీడియా రంగానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో మార్పును తీసుకు వస్తుందని ఆయన  చెప్పారు.

 

ఆయన తన ప్రసంగంలో.. ‘‘ఈ రోజు మనం జరుపుకుంటున్నది కేవలం ఒక సర్టిఫికేట్లు ఇచ్చే వేడుక మాత్రమే కాదు. భారతీయ మీడియా సంస్థలు భవిష్యత్తు సాంకేతికత కోసం తమను తాము ఎలా సిద్ధం చేసుకుంటున్నాయో చెప్పే ఒక పెద్ద మార్పునకు సంకేతం. మన ముందున్న అసలు ప్రశ్న మీడియాపై కృత్రిమమేధ ప్రభావం చూపుతుందా లేదా? అని కాదు..ఎందుకంటే ఆ మార్పు ఇప్పటికే మొదలైపోయింది. మన జర్నలిస్టులు, సంపాదకులు, మీడియా అధ్యాపకులు, ప్రజా సంబంధాల నిపుణులు ఈ కృత్రిమ మేధ సాంకేతికతను ఎంతవరకు ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా, దేశ అవసరాలకు తగ్గట్టుగా మలచుకోగలరనేదే మన ముందున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్న’’ అని స్పష్టం చేశారు.

 

“కృత్రిమ మేధని ఒక సహాయకుడిగా ఉపయోగించవచ్చు, కానీ సంపాదకీయ బాధ్యతకు ప్రత్యామ్నాయంగా కాదు. ఇది వేగాన్ని మెరుగుపరుస్తుంది, కానీ కచ్చితత్వాన్ని పణంగా పెట్టి కాదు. ఇది సృజనాత్మకతకు మద్దతు ఇస్తుంది, కానీ ప్రామాణికతను పణంగా పెట్టి కాదు. ఏఐ యుగంలో మానవ విచక్షణ పాత్ర మరింత ముఖ్యమవుతుంది.”

 

కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే మీడియా సంస్థలైన దూరదర్శన్, ఆకాశవాణి, పీఐబీ, పబ్లికేషన్స్ డివిజన్ వంటివి వివిధ భాషలు, భౌగోళిక ప్రాంతాలకు అతీతంగా సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాయని, అందుకే ఇవి కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకోవడానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరమని కేంద్ర కార్యదర్శి  పేర్కొన్నారు.

 

‘‘కృత్రిమ మేధను ఒక సహాయకుడిగా వాడుకోవచ్చు, కానీ అది సంపాదకీయ బాధ్యతకు ప్రత్యామ్నాయం కాలేదు. ఇది పని చేసే వేగాన్ని పెంచవచ్చు, కానీ ఆ వేగం కోసం మనం కచ్చితత్వాన్ని వదులుకోకూడదు. ఇది సృజనాత్మకతకు మద్దతు ఇవ్వవచ్చు, కానీ అసలైన నమ్మకత్వాన్ని  దెబ్బతీయకూడదు. కృత్రిమ మేధ యుగంలో మానవ విచక్షణ, నిర్ణయాలు మరింత ముఖ్యమైనవిగా మారుతాయి.’’ అని కేంద్ర కార్యదర్శి తెలిపారు.

 

ప్రధానమంత్రి జాతీయ నినాదాలైన ‘మేక్ ఏఐ ఇన్ ఇండియా’ , ‘మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’లకు అనుగుణంగా ప్రభుత్వం కృత్రిమ మేధ పట్ల ‘సానుకూల, సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన’’ విధానాన్ని అవలంబిస్తోందని ఆయన వివరించారు.

 

కృత్రిమ మేధ నైపుణ్యాల శిక్షణా కార్యక్రమం గురించి..

గూగుల్ భాగస్వామ్యంతో ‘హౌ ఇండియా లివ్స్’ శిక్షణా సహకారంతో ఐఐఎంసీ ప్రారంభించిన 10 వారాల ప్రత్యేక కార్యక్రమమే ఈ గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ నైపుణ్యాల శిక్షణా కార్యక్రమం. ఇందులో ప్రింట్, డిజిటల్, టీవీ, రేడియో వంటి వివిధ ప్రైవేటు, ప్రభుత్వ మీడియా సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. 

 

 కార్యక్రమ ముఖ్యాంశాలు... 

·       దేశవ్యాప్తంగా 23 నగరాల నుంచి 10 కి పైగా ప్రాంతీయ భాషలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు.

·       వందకు పైగా వార్తా సంస్థలు, మీడియా కళాశాలలు, ప్రభుత్వ సమాచార కేంద్రాల ప్రతినిధులు శిక్షణ పొందారు.

·       ప్రతి అభ్యర్థికి 40 గంటల కంటే ఎక్కువ సమయం కృత్రిమ మేధ శిక్షణ, ఒకరితో ఒకరు ప్రత్యేక మార్గదర్శక క్లాసులు

·       అభ్యర్థులు కృత్రిమ మేధ సాంకేతికత సహాయంతో 170కి పైగా ప్రాజెక్టులను, కథనాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రచురించారు.

·       కేవలం ఏఐ సహాయంతోనే అభ్యర్థులు స్వయంగా 50 కి పైగా చిన్న చిన్న యాప్స్‌ ను తయారు చేశారు.

·       దేశవ్యాప్తంగా ఉన్న 6 ఐఐఎంసీ కేంద్రాల ద్వారా ఈ శిక్షణా అవగాహన కార్యక్రమాలు సాగాయి.


(రిలీజ్ ఐడి: 2267156) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Kannada , Malayalam