హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని భుజ్‌ పరిధిలో భారత్‌-పాక్‌ సరిహద్దు వెంబడి జి-7.. జి-13 సైనిక శిబిరాలకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభోత్సవం


అనంతరం జి-7 సైనిక శిబిరం వద్ద సరిహద్దు భద్రత దళం జవాన్లతో మాటామంతీ

మైనస్ 45 నుంచి ప్లస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నడుమ దేశానికి ‘తొలి రక్షణ కుడ్యం’గా బీఎస్ఎఫ్ తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తోందని ప్రశంస.. 2000 మందికిపైగా అమరవీరుల త్యాగాలకు నివాళి

కఠిన.. దుర్గమ భూభాగంలో బీఎస్ఎఫ్ పటిష్ట భద్రత మౌలిక సదుపాయాల్లో భాగంగా నిర్మించిన జి-7.. జి-13 సరిహద్దు సైనిక శిబిరాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుత నిదర్శనాలని వ్యాఖ్య

ప్రజలు.. పౌర పరిపాలన.. సైన్యం.. బీఎస్ఎఫ్ సహిత ‘చతుర్భుజ భద్రత వలయం’ మన కొత్త మంత్రం... ఇకపై ఇది ‘సరిహద్దు భద్రత’కు పరిమితం కాకుండా సమగ్ర ‘ప్రాదేశిక భద్రత’కు ప్రతీక అవుతుంది

మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ‘లోప రహిత భద్రత వలయం’ నిర్మిస్తోంది.. భౌతిక కంచె నిర్మాణం వీలుకాని ప్రదేశాల్లో సాంకేతిక కంచె ఏర్పాటు ద్వారా అభేద్య రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది

నిఘా బురుజులు.. అనుసంధాన రహదారులు.. తాగునీరు.. వైద్య సౌకర్యం.. ఆధునిక కంచె వగైరాల ద్వారా సరిహద్దు భద్రత స్వరూపంలో మోదీ ప్రభుత్వం సమూల మార్పులు తెస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో ఏళ్ల తరబడి కొనసాగిన ప్రతిష్టంభన మా ప్రభుత్వం ఏర్పడగానే తొలగింది.. నిర్దేశిత గడువుకన్నా ముందే- కేవలం వారంలోనే కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్‌కు భూమి అప్పగింత

ఒకనాడు భద్రతపరంగా సున్నిత ప్రాంతాలైన సర్ క్రీక్.. హరామీ నాలా నేడు అభేద్యంగా మారిన నేపథ్యంలో రెండేళ్లలోనే శాశ్వత భద్రత లభిస్తుంది

బీఎస్ఎఫ్ శౌర్యపరాక్రమాలను ప్రజలకు చాటడం కోసం గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో... “మా బిడ్డలు బీఎస్ఎఫ్‌లో చేరడం మాకెంతో గర్వ కారణం” అని ఎందరో తల్లులు అక్కడి పుస్తకంలో రాశారు

బీఎస్ఎఫ్ కార్యాచరణ పరిధిలోకి మరిన్ని ప్రాంతాలను చేర్చే దిశగా చర్చల కొనసాగింపు... మరోవైపు సాంకేతిక పరిజ్ఞానంతో సిబ్బందికి సౌకర్యాల మెరుగుదలపై ప్రభుత్వ యోచన

నాడు పోస్టు చేయడమైనది: 29 MAY 2026 4:53PM by PIB Hyderabad

   కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు గుజరాత్‌లోని భుజ్‌లో రెండు సరిహద్దు సైనిక దళ (బీఎస్‌ఎఫ్‌) శిబిరాలను ప్రారంభించారు. అనంతరం జి-7 శిబిరం వద్ద బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో కొంతసేపు ముచ్చటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి సహా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, నిఘా సంస్థ  (ఐబీ) (IB) డైరెక్టర్, సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ- “బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అత్యంత కఠిన వాతావరణం, సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల నడుమ కర్తవ్య నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రదేశాన్ని సందర్శించి, దేశ సరిహద్దుల రక్షణలో వారు చిరునవ్వుతో బాధ్యతలు నిర్వర్తించడం చూస్తే, మనమెంత హాయిగా జీవిస్తున్నామో అర్థమవుతుంది. దేశమాతను రక్షించడంలో అలుపెరగని వారి కర్తవ్య నిర్వహణతో పోల్చినపుడు మేమెంతో అలసిపోతున్నామని చెప్పే హక్కు మనకుండదు” అని స్పష్టం చేశారు.

బీఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తికాగా, దేశంలోనే అత్యంత సవాళ్లలో కూడిన రెండు సరిహద్దుల రక్షణ బాధ్యతను ఆ దళం తన భుజాలకెత్తుకున్నదని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. ఈ సరిహద్దులలో మోహరించిన సిబ్బంది మైనస్‌ 45 డిగ్రీల నుంచి ప్లస్‌ 45 డిగ్రీల మధ్య శీతోష్ణ పరిస్థితులను తట్టుకుంటూ అనూహ్య ప్రతికూల పరిస్థితులను  ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో- కచ్‌లోని కఠిన ఎడారి, సర్ క్రీక్ సముద్ర ప్రాంతం, హరామీ నాలా వంటి చిత్తడి నేలలు ఉంటాయి. రాజస్థాన్‌ వంటి మరికొన్ని చోట్ల ఇసుక దిబ్బల మధ్య తీవ్ర ఉష్ణోగ్రతను భరిస్తూ బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. అదేవిధంగా కాశ్మీర్‌లోని మంచు శిఖరాల నుంచి సుందర్బన్స్ అడవులదాకా... గంగాసాగర్ తీరాల వరకూ.. మేఘాలయ-అస్సాం కొండలు, అటవీ ప్రాంతాల వరకూ విస్తరించిన ప్రాంతాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అప్రమత్తతతో రక్షిస్తుంటారు. ఈ మేరకు ఆరు దశాబ్దాలుగా “తొలి రక్షణ కుడ్యం”గా వారు అద్భుత రీతిలో కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఇప్పటిదాకా ఈ దళాల్లోని 2 వేల మంది సిబ్బంది దేశం కోసం ప్రాణార్పణం చేశారని గుర్తుచేశారు. అందుకే, కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఈ దళాలపై అత్యంత గౌరవం ప్రదర్శిస్తారని చెప్పారు. వారు ధైర్యసాహసాలతో సరిహద్దులను రక్షిస్తున్నారు కాబట్టే, తామంతా గుండెలమీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నామని కృతజ్ఞతలు చెబుతున్నారని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అంకితభావాన్ని, శౌర్యపరాక్రమాలను సామాన్యులందరికీ విశదం చేయడం కోసం గుజరాత్‌లోని బనస్కాంతలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాన్ని గత ఒక్క నెలలోనే 2.50 లక్షల మందికి పైగా ప్రజలు తిలకించి బీఎస్‌ఎఫ్‌ త్యాగనిరతి ఎంతటిదో అవగతం చేసుకున్నారని గుర్తుచేశారు. తొలినాళ్లలో ఈ దళం పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ‘ఫీడ్‌బ్యాక్ ఫామ్‌’' ద్వారా ఒక అధ్యయనం నిర్వహించామని ఆయన ప్రస్తావించారు. ఆ సందర్భంగా తమ బిడ్డలు పెరిగి, పెద్దయ్యాక ‘బీఎస్‌ఎఫ్‌’లో చేరితే తామెంతో గర్విస్తామని ఎందరో మహిళలు రాశారని తెలిపారు. దేశం కోసం అటువంటి కఠిన పరిస్థితుల నడుమ విధులు నిర్వర్తించడం నిజంగా ఎనలేని త్యాగానికి, సాహసోపేత జీవనానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు కూడా దేశ పౌరులు ఈ ‘ఫీడ్‌బ్యాక్ ఫామ్‌’ను ఆన్‌లైన్‌లో నింపవచ్చునని తెలిపారు.

కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఓ సందర్భంలో తాను బీఎస్‌ఎఫ్‌ పనితీరును సమీక్షించానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంగా ‘హరామీ నాలా’, ‘సర్ క్రీక్’ ప్రాంతాల్లో భద్రత సంసిద్ధత కొంత బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అందుకే, అన్నివిధాలా ‘అభేద్య’ భద్రత వలయం ఏర్పాటు దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిఘా బురుజులు, అనుసంధాన రహదారులు, తాగునీటి సరఫరా, వైద్య సదుపాయాలు, వసతి కల్పన సహా కొత్త కంచె  నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో, శత్రు దృష్టి నుంచి మన ప్రాంతం సదా సురక్షితంగా మారుతుందని ఆయన వివరించారు.

ఇక ‘సర్ క్రీక్’, భుజ్ సెక్టార్లలో సరిహద్దు భద్రత సిబ్బంది దృఢమైన రక్షణ కుడ్యంలా నిలిచి ప్రజలకు సంపూర్ణ భద్రతనిస్తున్నారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. సైనికులకు ఎదురయ్యే ఇబ్బందులను కనీస స్థాయికి పరిమిత చేసేవిధంగా అన్ని సదుపాయాలనూ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా శ్రీ మోదీ ప్రభుత్వం రేయింబవళ్లు కృషి చేస్తోందని, ఇందుకు బడ్జెట్ పరంగా పరిమితులేవీ అడ్డురావని తెలిపారు. మరోవైపు సాంకేతికత సద్వినియోగంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతంలో క్రమంగా పటిష్ఠ భద్రత వలయం ఏర్పాటు చేయడంలో విజయం సాధించామని తెలిపారు. ఇందులో భాగంగా ఇక్కడ నిఘా బురుజుల నిర్మాణం సహా సరిహద్దు సైనిక శిబిరాలుండే ప్రాంతాన్ని నేల మట్టంకన్నా ఎత్తుగా ఉండేవిధంగా తీర్చిదిద్దామన్నారు.

‘బీఎస్ఎఫ్‌’ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సరిహద్దు భద్రతలో బీఎస్ఎఫ్ భావనను సమూల రీతిలో మార్చాలని నిర్ణయించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ మేరకు భవిష్యత్తులో సరిహద్దు భద్రత అనే సంప్రదాయ విధానానికి బదులు, చతుర్భుజ భద్రత వలయం ఏర్పాటు చేసి, ‘ప్రాదేశిక భద్రత’ పేరిట కొత్త భావనను పరిచయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ సిబ్బందితో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగాలు, స్థానిక పోలీసులు, సైన్యం కూడా ప్రాథమికంగా బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ‘స్మార్ట్ బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్’ కింద, సరిహద్దుల వెంబడి భద్రత వలయం పటిష్టానికి కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఇందుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని చెప్పారు. ఈ మేరకు డ్రోన్లు, రాడార్లు, వాచ్‌టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రత సిబ్బంది మోహరింపు తదితరాల ద్వారా పటిష్ట  భద్రత వలయం ఏర్పాట కాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వలయం ఏర్పాటు పూర్తయితే మన సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలన్నా ఎవరూ సాహసించరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సరిహద్దు భద్రత దళానికి అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం అసంపూర్ణంగా ఉండటమే మన భద్రత వ్యవస్థలో అత్యంత కీలక లోపమని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక పరిస్థితులను మార్చలేకపోయినా, కంచె నిర్మాణ అనుకూల ప్రాంతాల్లోనూ లోగడ భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. అయితే, ఇటీవల ప్రజల ఆశీస్సులతో తమ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన ఒక్క వారంలోనే, సరిహద్దు కంచె కోసం భూమి కేటాయించేందుకు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే కొంత భూమిని అప్పగించారని, సరిహద్దు కంచె నిర్మాణం పూర్తయ్యాక చొరబాట్లను వందశాతం అరికట్టగలమని ఆయన ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. దీంతోపాటు అడవులు, నదీ మార్గాల గుండా చొరబాట్ల నిరోధం కోసం ఆయా ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞాన సహిత కంచె ఏర్పాటును వేగిరపరుస్తున్నామని చెప్పారు. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది శౌర్యపరాక్రమాలు, ధైర్యసాహసలు, విధి నిర్వహణపై వారి అంకితభావం వంటివి భవిష్యత్తుల్లోనూ మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతాయని ఆయన ప్రకటించారు.

సరిహద్దు భద్రత దళం స్ఫూర్తిని యావద్దేశం గౌరవిస్తున్నదని, వారి నిబద్ధతకు శిరసాభివందనం చేస్తున్నదని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. గుజరాత్‌ పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిర శాంతికి వారి అప్రమత్తతే కారణమని ఆయన స్పష్టం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2266841) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Kannada