రైల్వే మంత్రిత్వ శాఖ
కాజీపేటలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ కేంద్రం త్వరలో పూర్తి
ఐదేళ్లలో ఇక్కడ 200 రైళ్ల తయారీ: రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 3:59PM by PIB Hyderabad
తెలంగాణ రాష్ట్రంలోని కాజీపేటలో భారత రైల్వేశాఖ నిర్మిస్తున్న రైళ్ల తయారీ కర్మాగారం నిర్మాణ పనులు త్వరలో పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు నేడు న్యూఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశమై ఈ యూనిట్‌లో ఉత్పాదన కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు. ఇదొక బహుముఖ రైల్వే రోలింగ్ స్టాక్ (రైళ్లు, రైలు పెట్టెలు వగైరా) తయారీ యూనిట్. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యాక రాబోయే ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేస్తారు.
కాజీపేట రైలు యూనిట్ తయారు చేసే రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణ సదుపాయం కోసం వినియోగిస్తారు. సాధారణంగా 300 కిలోమీటర్ల దూరంలోని రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే ఈ రైళ్లు పలు స్టేషన్లలో ఆగుతాయి. పట్టణాలు, నగరాల మధ్య పౌరుల ప్రయాణ సౌలభ్యం లక్ష్యంగా ప్రతి ట్రిప్పులో అనేక స్టాప్‌లు ఉంటాయి. కాబట్టి, సమీప పట్టణాల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులు, ఆరోగ్య, ఉద్యోగ అవసరాల కోసం సామాన్య ప్రజలు వంటివారికి ఈ రైళ్లతో ఎనలేని సౌలభ్యం కలుగుతుంది.
నగరాల మధ్య ప్రయాణంలో ప్రజలకు చౌకధరతో ఓ కొత్త అవకాశం కల్పిస్తాయి. దేశవ్యాప్తంగా సమీప పట్టణాలను కలిపే షటిల్ సర్వీసుల తరహాలో ఈ ఇంటర్‌సిటీ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్ల తయారీ, వినియోగం పెరిగితే స్థానిక రవాణా అధికశాతం రహదారుల నుంచి రైలు మార్గాల వైపు మళ్లే అవకాశం ఉంది.
ఈ ఇంటర్‌సిటీ రైళ్లకు ఆటోమేటిక్ తలుపులు, మెరుగైన గాలి-వెలుతురు సదుపాయం సహా ఒక్కొక్కటి 20 పెట్టెలతో సురక్షిత స్వరూపంలో ఆధునిక సౌకర్యాలుంటాయి. ప్రతి పెట్టెలోనూ రెండువైపులా మరుగుదొడ్లు కూడా ఉంటాయి.
అలాగే, కుదుపు రహిత ప్రయాణం కోసం ఆధునిక కప్లర్లతో బోగీలను జోడిస్తారు. ఈ రైళ్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తారు.
ఈ రైళ్లలో పునరుత్పాదక విద్యుత్ బ్రేకింగ్ వ్యవస్థను అమరుస్తారు. దీనివల్ల రైలు బ్రేకు వేసినప్పుడల్లా విద్యుదుత్పత్తికి తోడ్పడటమే కాకుండా ఆ విద్యుత్తు తిరిగి గ్రిడ్‌లోకి వెళ్తుంది. ఈ విధంగా ఇంధన పొదుపు సహా పర్యావరణహిత రవాణా సాధనం కావడం వల్ల రహదారి రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాల స్థాయి గణనీయంగా తగ్గుతుంది.
రైల్వేశాఖ భారీ సంఖ్యలో ఈ రైళ్లను నడపడం ద్వారా దేశంలో పర్యావరణహిత, కాలుష్య రహిత రవాణా సాధనాల సామర్థ్యం పెరుగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2266316)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21