పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోల్, డీజిల్ విషయంలో దేశీయ డిమాండ్‌ను పూర్తిగా తీరుస్తున్న భారతదేశపు చమురు శుద్ధి సామర్థ్యం
రిటైల్ ఇంధన విక్రయకేంద్రాల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం
రిటైల్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నష్టాలను భరిస్తోన్న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు
రిటైల్ ఇంధన సరఫరాల మళ్లింపు, అనధికారిక నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2026 8:14PM by PIB Hyderabad
రిటైల్, పారిశ్రామిక అవసరాలతో సహా దేశీయ అవసరాన్నింటినీ తీర్చడానికి దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు శుద్ధి దేశం. కార్యకలాపాలు నిర్వహిస్తున్న 22 చమురు శుద్ధి కేంద్రాలతో సంవత్సరానికి 258.1 మిలియన్ టన్నుల స్థాపిత శుద్ధి సామర్థ్యాన్ని దేశం కలిగి ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వినియోగం 243.2 మిలియన్ టన్నులుగా ఉంది. అదే సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 61.5 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల విషయంలో అతిపెద్ద ఎగుమతిదారులలో భారత్ ఒకటిగా నిలిచింది. వీటికి సంబంధించి ఏ రకమైన సరఫరా సమస్యలూ లేవు.
అందరికీ పెట్రోల్, డీజిల్ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చూడటం కోసం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ.. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ (పీ-ఎన్జీ) కార్యదర్శి ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉంది. దేశంలో ఎలాంటి పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాన్ని లాభంగా మార్చుకునే (ఆర్బిట్రేజ్) ధోరణి నడుస్తుండటంతో కొరత ఉందన్న వాతావరణం కనిపిస్తోంది.
ఈ విషయంలో పనితీరు చాలా స్పష్టంగా ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరల పూర్తి భారాన్ని దేశీయ రిటైల్ అమ్మకాలకు బదిలీ చేయటం లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గృహావసరాల ఎల్‌పీజీ విక్రయాలపై రోజుకు దాదాపు రూ. 550 కోట్ల నష్టాలను భరిస్తున్నాయి. ఈ వెసులుబాటు కేవలం రిటైల్ వినియోగదారులు.. అంటే గృహాలు, ద్విచక్ర వాహనదారులు, పంపుల వద్ద ఇంధనం కొనుగోలు చేసే రైతులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది పారిశ్రామిక కొనుగోళ్లకు వర్తించదు. అక్కడ ఎప్పటిలానే ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే మారుతుంటాయి.
తమ కొనుగోళ్లను పారిశ్రామిక మార్గంలో కాకుండా రిటైల్ పంపుల నుంచి చేస్తుండటం వల్ల సామాన్య ప్రజలకు దక్కాల్సిన సబ్సిడీ ప్రయోజనాన్ని పారిశ్రామిక వినియోగదారులు పొందుతున్నారు. దీనివల్ల వారు ఒకే చోట డిమాండ్‌ను విపరీతంగా పెంచేస్తున్నారు. తద్వారా అసలు ఎలాంటి కొరత లేని ప్రాంతాల్లో సైతం స్థానికంగా కృత్రిమ కొరత ఏర్పడేలా చేస్తున్నారు.
అధిక ధరల కారణంగా ప్రస్తుత నెలలో రిటైల్ విక్రయకేంద్రాలు, బల్క్ వినియోగదారులు రెండు విభాగాల్లోనూ హెచ్ఎస్‌డీ అమ్మకాలు సుమారు 38 శాతం తగ్గినట్లు ప్రైవేట్ చమురు మార్కెటింగ్ కంపెనీలు నివేదిస్తున్నాయి. ఈ అమ్మకాల పరిమాణం పూర్తిగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ రిటైల్ విక్రయకేంద్రాలకు మళ్లుతోంది. దీనికి తోడు పీఎస్‌యూలకు సంబంధించిన బల్క్ వినియోగదారుల అమ్మకాల పరిమాణంలో కూడా దాదాపు 29 శాతం తగ్గుదల నమోదైంది. ఈ డిమాండ్ కూడా రిటైల్ విక్రయకేంద్రాలకే మళ్లుతోంది.
పైన పేర్కొన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో నిబంధనలతో పాటు వాటి ఉల్లంఘనల వల్ల కలిగే పరిణామాలను తమ సభ్యులకు తెలియజేసి అవగాహన కల్పించాలని పరిశ్రమల సంఘాలను కోరింది.
నిత్యావసరాల చట్టం, దాని కింద జారీ అయిన నియంత్రణ ఉత్తర్వుల్లోని సంబంధిత నిబంధనల ప్రకారం రిటైల్ వినియోగదారుల కోసం ఉద్దేశించిన సరఫరాను పొందుతున్న బల్క్ వినియోగదారులు, అక్రమ నిల్వలు చేసేవాళ్లు, నల్లబజారు క్రయవిక్రయాలు, అనధికారిక నిల్వలు, పెట్రోలియం ఉత్పత్తుల మళ్లింపులపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో భారతదేశపు చమురు శుద్ధి సామర్థ్యం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల క్రమశిక్షణతో కూడిన పనితీరు.. కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమల మధ్య చురుకైన సమన్వయం ఇంధన భద్రతను కాపాడటంలో ఒక బలమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. కేవలం ధరల వ్యత్యాస సమస్యను సరఫరా సమస్యగా పొరబడుతూ వచ్చే వదంతులను పట్టించుకోవద్దని ప్రభుత్వం కోరుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2266304)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam