హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని బికనీర్ వద్ద సాంచు పోస్టులో మహిళల కోసం బ్యారక్‌లను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

బీఎస్ఎఫ్ సిబ్బందితో మాట్లాడిన హోంమంత్రి

రాజస్థాన్‌లోని 180 బీఎస్ఎఫ్ అవుట్‌పోస్టులకు సమాంతర రహదారుల నిర్మాణం, అత్యాధునిక కంచెల ఏర్పాటు, పైపు ద్వారా తాగునీరు.. సరిహద్దు ప్రాంతాల స్వరూపాన్ని సమూలంగా మారుస్తున్న మోదీ ప్రభుత్వం

భౌగోళికంగా పెను సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో దృఢంగా నిలిచిన బీఎస్ఎఫ్

2,000 మంది అమరవీరుల మహోన్నత త్యాగానికి నివాళులు

బీఎస్ఎఫ్, సైన్యం, సరిహద్దు ప్రాంత పౌరులు, స్థానిక యంత్రాంగాలతో కూడిన 'చతుర్ముఖ భద్రతా గ్రిడ్' సరిహద్దు భద్రతకు ఆధారం

సరిహద్దు భద్రత ఏ ఒక్కరి బాధ్యతో కాదు... మనందరిదీ

'చొరబాట్ల నిర్మూలన' మన బాధ్యత… చతుర్ముఖ భద్రతా వలయంతోనే సాధ్యం

సరిహద్దుకు 50 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో 'అసహజ జనాభా మార్పుల'పై బీఎస్ఎఫ్ నిఘా అవసరం

అనధికార నిర్మాణాల గురించి స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి

రాబోయే 6 నెలల్లో సరిహద్దు వెంబడి డ్రోన్ నిరోధక వ్యవస్థలు

సరిహద్దు భద్రత కోసం త్వరలోనే అందుబాటులోకి ప్రపంచ స్థాయి సాంకేతికత

సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు

బీఎస్ఎఫ్ కార్యకలాపాల పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు విస్తరించిన మోదీ ప్రభుత్వం

సరిహద్దు గ్రామాల్లో ప్రజా సంక్షేమ పథకాల వంద శాతం అమలు కోసం 'వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్'ను బీఎస్ఎఫ్ ముందుండి నడిపించాలి

మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా అరికట్టేందుకు బీఎస్ఎఫ్ కఠిన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలి

మన సరిహద్దుల లోపలి నుంచే అంతర్గతంగా ముప్పు సృష్టించేందుకు యత్నించే వారిపై నిఘా ఉంచాలి

వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 7:58PM by PIB Hyderabad

బికనేర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) 'సాంచు పోస్ట్' వద్ద భద్రతా సిబ్బందితో కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ముచ్చటించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన బ్యారక్‌లను వీడియో అనుసంధానం ద్వారా కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ), బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి... బీఎస్ఎఫ్ ఆవిర్భావం నుంచీ సరిహద్దుల వద్ద ఉండే తీవ్రమైన ఎండ, చలి, వర్షం, దట్టమైన అడవులు, మంచు కొండలు, 45 డిగ్రీల నుంచి మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా మన సరిహద్దు రక్షకులు తమ కర్తవ్య నిష్ఠ, శౌర్యం, ధైర్యం, అత్యున్నత త్యాగాల స్ఫూర్తితో దేశ సరిహద్దులను రక్షించే బాధ్యతను నిర్వర్తించారని శ్రీ అమిత్ షా కొనియాడారు. 2,000 మందికి పైగా సరిహద్దు రక్షకులు చేసిన త్యాగం కేవలం బీఎస్ఎఫ్, భారత ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, 140 కోట్ల మంది భారతీయులందరికీ తీర్చలేని రుణమని ఆయన అన్నారు. సరిహద్దు రక్షకులను చూసి యావద్దేశం గర్విస్తోందని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు.

దేశానికి చెందిన ఆడబిడ్డలు ప్రతి రంగంలోనూ లింగ-సమానత్వ ప్రాతిపదికన భాగస్వామ్యం కలిగి ఉండాలనే లక్ష్యంతో వారికి సమాన అవకాశాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. సరిహద్దు భద్రతలో మహిళల పాత్ర, వారికి అవసరమైన సదుపాయాల కల్పనపైనా గత ప్రభుత్వాలు తగినంత దృష్టి సారించలేదనీ... జాతీయ భద్రతకు సేవలందించడంలో దేశపు ఆడబిడ్డలు పురుషుల కంటే రెండు అడుగులు ముందే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి, సరిహద్దు భద్రతా విధుల్లోని మహిళా సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలనూ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. రాజస్థాన్‌లో 79 బ్యారక్‌లను మంజూరు చేశామనీ... వీటిలో సుమారు రూ.39 కోట్ల వ్యయంతో 67 బ్యారక్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని శ్రీ షా తెలియజేశారు. వీటిలో 14 బ్యారక్‌లను ఈ రోజు ఆయన ప్రారంభించారు. బీఎస్ఎఫ్ పహారా కాస్తున్న సరిహద్దుల వెంబడి మొత్తం 356 బ్యారక్‌లను సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మహిళా సిబ్బందికి విధి నిర్వహణ మరింత సౌకర్యవంతంగా మారుతుందన్నారు.

2014లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దేశ భద్రతా స్వరూపంలో మౌలిక మార్పు వచ్చిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సాయుధ దళాల ఆధునీకరణ, సరిహద్దు భద్రతా దళాల ఆధునీకరణ వేగంగా సాగుతోందన్నారు. ఉగ్రవాదుల ప్రయత్నాలన్నింటికీ తగిన సమాధానం ఇవ్వాలనే విధానాన్ని భారత ప్రభుత్వం అవలంబించిందని ఆయన తెలిపారు. చొరబాటును పూర్తిగా నిరోధించడం మన బాధ్యత... చతుర్భుఖ భద్రతా గ్రిడ్ ద్వారానే దీనిని సాధించవచ్చని హోంమంత్రి అన్నారు.

‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో బీఎస్ఎఫ్ సిబ్బంది ప్రశంసనీయ పనితీరును కనబరిచారని శ్రీ అమిత్ షా అన్నారు. బీఎస్ఎఫ్ నాయకత్వంలో జరిగిన ప్రతి ఆపరేషన్‌లోనూ వారు పూర్తి నిశ్చయంతో దృఢంగా నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు జిల్లాల్లో నివసిస్తున్న ప్రజల మనోధైర్యాన్ని నిలబెట్టడంలోనూ బీఎస్ఎఫ్ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. బీఎస్ఎఫ్ సిబ్బంది గర్వకారణమైన తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అవసరమైన ప్రతిసారీ పాకిస్థాన్‌కు తగిన విధంగా సమాధానమిచ్చారని కొనియాడారు.

చరిత్రాత్మక 'సాంచు పోస్ట్'ను సందర్శించడం పట్ల కేంద్ర హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 1965 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఈ సాంచులో 500 మందికి పైగా జనాభా ఉండేదనీ... అప్పట్లో ఆర్ఏసీ పోస్ట్ అక్కడికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వెనక వైపున ఉన్న రంజిత్‌పురా గ్రామంలో ఉండేదని ఆయన తెలిపారు. పాకిస్తాన్ సాంచును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందన్న సమాచారం అందిన వెంటనే మూడు ఆర్ఏసీ యూనిట్లు, 13వ గ్రెనేడియర్స్ బెటాలియన్‌కు చెందిన వీర సైనికులు తీవ్రమైన ప్రతిదాడితో సాంచు మన సరిహద్దులో సురక్షితంగా ఉండేలా, పాకిస్తాన్ సైన్యం తోకముడిచేలా చేశారని ఆయన వివరించారు. ప్రస్తుతం బీఎస్ఎఫ్ 12వ బెటాలియన్‌లో భాగంగా ఉన్న ఆ మూడు ఆర్ఏసీ యూనిట్లు ప్రతియేటా ఎంతో గర్వంగా 'విజయ ఉత్సవం' జరుపుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ఈ విజయ దినోత్సవానికి "సాంచు దివస్" అని నామకరణం చేశారు. భారత సైనిక చరిత్రలో ఈ పోస్ట్ స్వర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ ఎడారి అంతటా విస్తరించి ఉండే ఒక లేటరల్ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని శ్రీ అమిత్ షా తెలిపారు. సుమారు 1,096 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి, 520 కిలోమీటర్ల పొడవైన ఆక్సియల్ రహదారి బీఎస్ఎఫ్ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటుగా... రవాణా అనుసంధానాన్నీ మెరుగుపరుస్తాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. సరికొత్త నమూనాలో కంచె నిర్మాణ పనులూ కొనసాగుతున్నాయనీ, రాజస్థాన్‌లోని దాదాపు 180 సరిహద్దు పోస్టులకు పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసే ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలిపారు.

బీఎస్ఎఫ్ ఘనమైన సాంప్రదాయిక పాత్రను ఇప్పుడు కొత్త కోణంలో చూడాలని శ్రీ అమిత్ షా అన్నారు. సరిహద్దు భద్రతతో పాటుగా అక్రమ రవాణా, చొరబాట్లు, సరిహద్దు అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిరంతర అప్రమత్తతతో బీఎస్ఎఫ్ తన సన్నద్ధతను బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాల కిందటే భారత ప్రభుత్వం సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించిందని హోంమంత్రి తెలిపారు. ఈ 50 కిలోమీటర్ల జోన్‌లోని గ్రామాల్లో ఏదైనా అక్రమ నిర్మాణం జరిగితే స్థానిక ప్రభుత్వాలకు తెలియజేయడం మన బాధ్యత అని ఆయన అన్నారు. 50 కిలోమీటర్ల పరిధిలోని జనాభాలో అసహజ మార్పు పట్ల బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉంటూ... దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. డ్రోన్లు, ఇతర మార్గాల ద్వారా జరిగే మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను కఠిన చర్యలతో అరికట్టడం దళం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

రాబోయే ఆరు నెలల్లో భారత ప్రభుత్వం డ్రోన్ నిరోధక వ్యవస్థల ఏర్పాటును ప్రారంభిస్తుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. డ్రోన్లు భారత గడ్డపై దిగిన తర్వాత వాటిని ఎవరు స్వీకరిస్తున్నారు... వాటి ద్వారా చేరవేసిన సామాగ్రిని ఎవరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు వంటి విషయాలను తెలుసుకోవడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండాలని శ్రీ షా పేర్కొన్నారు. వీటిని సమర్థంగా అరికట్టడానికి స్థానిక ప్రభుత్వాల అధికారులు, జిల్లా పోలీసులతో సన్నిహిత సమన్వయం అత్యవసరమనీ... దీనికి సంబంధించిన ప్రతిస్పందన ఫలితాల-ఆధారితంగా ఉండాలని ఆయన సూచించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించిన ప్రణాళిక ప్రకారం సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ అమిత్ షా అన్నారు. బీఎస్ఎఫ్ నాయకత్వంలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా సరిహద్దు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలయ్యేలా కృషి జరగాలని ఆయన అన్నారు. సరిహద్దు గ్రామాల్లో భావి తరాలకు అవగాహన కల్పిస్తూ, వారికి సాధికారత కల్పించాలని సూచించారు. అప్పుడే బీఎస్ఎఫ్, సాయుధ బలగాలు, అప్రమత్తత గల పౌరులు కలిసి ఒక పటిష్ఠ భద్రతా వ్యవస్థను నిర్మించగలరని ఆయన అన్నారు.

సరిహద్దుల అవతల నుంచి వచ్చే అన్ని రకాల ముప్పుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరమని కేంద్ర హోంమంత్రి అన్నారు. మన సరిహద్దుల్లోనే ఉండి అంతర్గత ముప్పులను సృష్టించే వారిపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలి... వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలూ తీసుకోవాలని పేర్కొన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత భద్రంగా మార్చే బాధ్యత బీఎస్ఎఫ్‌పై ఉందని శ్రీ షా అన్నారు. ఈ రెండు సరిహద్దుల వెంబడి మనం చతుర్ముఖ భద్రతా గ్రిడ్‌ను బలోపేతం చేయాలన్నారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవాలంటే బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, సరిహద్దు ప్రాంత నివాసితులు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందుకే దీనికి చతుర్ముఖ గ్రిడ్ అని పేరు పెట్టామన్నారు. సరిహద్దు భద్రత ఏ ఒక్కరి వ్యక్తిగత బాధ్యత కాదు... మనమంతా పంచుకోవాల్సిన సమష్టి బాధ్యత అని శ్రీ షా వ్యాఖ్యానించారు.

మొక్కలు నాటే కార్యక్రమాలకూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు గణనీయ తోడ్పాటునందించాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో వారు దాదాపు 7 కోట్ల 35 లక్షల మొక్కలను నాటారని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో... భారీ సంఖ్యలో నాటిన ఈ వృక్షాలు భవిష్యత్తులో అత్యంత ప్రయోజనకరంగా మారుతాయని శ్రీ షా జోడించారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా 'ఖేజ్రీ' మొక్కను నాటారు. ఎడారి ప్రాంతానికి ఖేజ్రీ వృక్షం…. కల్పవృక్షం వంటిదని ఆయన అభివర్ణించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2265797) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil