కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పౌరులకు ఇంటర్నెట్‌ను మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పీఎం వాణీ వైఫై సేవల్లో కీలక మార్పులు చేపట్టిన కేంద్రం


క్యూఆర్‌ ఆధారిత ల్యాప్‌టాప్ లాగిన్, సౌకర్యవంతమైన స్వల్పకాలిక ప్లాన్లు, సులభంగా గుర్తించగల పేర్లతో పీఎం వాణి వైఫై సేవలు మరింత సులభం

అందరికీ డిజిటల్ సేవలను అందించడమే లక్ష్యంగా పీఎం వాణి వైఫై వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 12:05PM by PIB Hyderabad

దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి,  ప్రజలకు ఇంటర్నెట్ వాడకాన్ని మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ, ‘పీఎం-వాణి’ (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) వ్యవస్థ ద్వారా వినియోగదారులకు ఉపయోగపడేలా పలు కీలకమైన మార్పులను ప్రవేశపెట్టింది.

 

కొత్తగా తీసుకొచ్చిన మార్పులు

·       ల్యాప్‌టాప్‌లు, ఇతర అదనపు పరికరాల్లో వైఫైను ఉపయోగించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ పద్ధతిని తెచ్చారు.

·       వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా  15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాల కాలపరిమితి గల చిన్న వైఫై ప్లాన్లను ప్రవేశపెట్టారు.

·       పీఎం వాణి వైఫై నెట్‌వర్క్‌లను ప్రజలు సులభంగా గుర్తుపట్టడానికి, మరింత నమ్మకంగా వాడుకోవడానికి వీలుగా అన్ని హాట్‌స్పాట్‌లకు ఒకే రకమైన ప్రామాణిక పేర్లను పెట్టారు

ఈ సంస్కరణలను  22 మే 2026 నాటి సర్క్యులర్ నంబర్లు 1/పీఎం-వాణి/2026,  2/పీఎం-వాణి/2026 ద్వారా టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రవేశపెట్టింది.

 

పీఎం వాణి వ్యవస్థతో ముడిపడి ఉన్న భాగస్వాములందరూ ఈ సవరించిన మార్గదర్శకాలను, సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుంచి ఎనిమిది వారాల లోపు అమలు చేయాలని ఆదేశించారు. దీనివల్ల 2026 జూలై నాటికి ఈ కొత్త సులభతరమైన ఫీచర్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

 

ప్రతి పౌరుడికి సులభంగా, తక్కువ ధరలోనే డిజిటల్ అనుసంధానాన్ని అందించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడానికి ప్రభుత్వం నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సంస్కరణలు ఒక భాగం.

 

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో ఇంటర్నెట్ అందరికీ సులభంగా లభించడం, పరస్పర అనుసంధానం, వినియోగ సౌలభ్యం, ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగించేలా చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పీఎం-వాణి వైఫై వ్యవస్థ ఒక సమగ్ర మార్పునకు లోనవుతోంది.

 

ఈ మార్పుల అమలును వేగవంతం చేయడానికి, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఇటీవల శాఖాధికారులు, భాగస్వాములతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

 

ఈ సంస్కరణల గురించి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ.. ‘‘ప్రజలందరికీ పబ్లిక్ వైఫై సేవలను అందించడానికి పీఎం వాణి మనకున్న ఒక అద్భుతమైన వేదిక. ఇప్పుడు దీని వాడకాన్ని మరింత సులభం చేస్తున్నాం. క్యూఆర్ ఆధారిత లాగిన్ ద్వారా మీ ఫోన్‌తో కేవలం ఒక కోడ్‌ను స్కాన్ చేసి, మీ ల్యాప్‌టాప్‌ను సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిసేపు మాత్రమే ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారుల కోసం 15, 30,  60 నిమిషాల చిన్న ప్లాన్లను అందుబాటులోకి తేవాలని హాట్‌స్పాట్ ఆపరేటర్లకు సూచించాం’’ అని తెలిపారు.

 

నేటి డిజిటల్ యుగంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ప్రయాణికులు, రోజువారీ ప్రయాణం చేసేవారు, ఉద్యోగులు, చిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తూ... పబ్లిక్ వైఫై ఒక ముఖ్యమైన ప్రజా వినియోగ సేవగా అవతరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

క్యూఆర్ గుర్తింపు ద్వారా సులభంగా ల్యాప్‌టాప్ లాగిన్‌

పీఎం వాణి  సేవలను సులభంగా వినియోగించుకునేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు వంటి ఇతర అదనపు పరికరాల కోసం క్యూఆర్ ఆధారిత లాగిన్ పద్ధతిని టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రస్తుతం అనుమతిస్తోంది. లాగిన్ పేజీలో ఉండే క్యూఆర్ కోడ్‌ను, ముందే వెరిఫై చేసిన స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా స్కాన్ చేసి వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగవంతమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది.

 

సౌకర్యవంతమైన స్వల్పకాలిక ప్లాన్లు

రవాణా కేంద్రాలు, మాల్స్ వంటి బహిరంగ ప్రాంతాలలో ఉండే వినియోగదారులకు సహాయపడటానికి టెలికమ్యూనికేషన్ల శాఖ ఆపరేటర్లకు ఒక సూచన చేసింది. చిన్న ప్యాకెట్ల రూపంలో ఉండే 15, 30, 60 నిమిషాల కాలపరిమితో కూడిన ప్లాన్లను అందించాలని కోరింది.

 

ఈ ప్లాన్లు ప్రయాణికులకు, విద్యార్థులకు ఇంటర్నెట్ ఖర్చును బాగా తగ్గిస్తాయి. అదే సమయంలో వైఫై ఆపరేటర్ల ఆదాయాన్ని, హాట్‌స్పాట్‌ల వినియోగాన్ని పెంచుతాయి.

 

ప్రామాణికమైన హాట్‌స్పాట్ గుర్తింపు

వినియోగదారులు అసలైన, నమ్మకమైన నెట్‌వర్క్‌లను సులభంగా గుర్తించడానికి వీలుగా వైఫై పేర్ల విధానాన్ని పీఎం వాణీ బ్రాండింగ్‌తో ప్రామాణీకరించారు. అంటే అన్నింటికీ ఒకే తరహా పేరు వచ్చేలా చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రారంభించిన పీఎం వాణి వ్యవస్థ... పీడీఓలు, పీడీఓఏలు, యాప్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తరించదగిన, తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ వై ఫై మౌలిక సదుపాయాల వాడకాన్ని మరింతగా పెంచడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం.

 

***


(రిలీజ్ ఐడి: 2265447) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Tamil , Kannada