MIFF banner

19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్): ప్రారంభమైన మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియ


మీడియా ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు ప్రకటించిన ఎంఐఎఫ్ఎఫ్

ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) తన 19వ విడతకు సంబంధించిన 'మీడియా ప్రతినిధుల రిజిస్ట్రేషన్' ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఎంతో సంతోషంగా ప్రకటిస్తోంది. ఈ చలనచిత్రోత్సవం 2026 జూన్ 15 నుంచి 21 వరకు ముంబయిలోని గోపాల్‌రావ్ దేశ్‌ముఖ్ మార్గ్‌లో ఉన్న 'ఎన్ఎఫ్‌డీసీ–ఫిల్మ్స్ డివిజన్' ప్రాంగణంలో జరగనుంది.

పూర్తి నిడివి కాని చిత్రాలకు (నాన్-ఫీచర్ సినిమాలు) సంబంధించి దక్షిణాసియాలోనే అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మకమైన చలనచిత్రోత్సవంగా పేరుగాంచిన ఎంఐఎఫ్ఎఫ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులు, కథకులు, సృజనాత్మక ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. సమకాలీన సినిమా రంగంలో మారుతున్న ధోరణులను ప్రతిబింబిస్తూ ఈ ఏడాది వైవిధ్యభరితమైన, ఆలోచింపజేసే డాక్యుమెంటరీలు, తక్కువ నిడివి కాల్పనిక చిత్రాలు, యానిమేషన్, ప్రయోగాత్మక చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు.

చలనచిత్ర నిర్మాణం, డిజిటల్ కథాకథనం, సృజనాత్మక భావ ప్రకటనకు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో వైవిధ్యభరితమైన కథలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం, కళాత్మక చర్చలను ప్రోత్సహించడం, రాబోయే తరం దర్శకులు- కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడంలో మీడియా అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని ఎంఐఎఫ్ఎఫ్ ప్రత్యేకంగా గుర్తిస్తోంది. చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రమాణాలు, సృజనాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడానికి.. విభిన్న సంస్కృతులు, సమాజాల నుంచి వచ్చే ఆకట్టుకునే కథలను వేడుకగా జరుపుకోవడానికి ఈ చలనచిత్రోత్సవం ఒక సమ్మిళిత వేదికగా నిలుస్తోంది.

రిజిస్ట్రేషన్ వివరాలు

మీడియా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. ఇది 2026 జూన్ 7 వరకు కొనసాగుతుంది. మీడియా ప్రతినిధుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. మీడియా ప్రతినిధులు https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా కింది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

19వ ఎంఐఎఫ్ఎఫ్ 2026:

 

పూర్తి నిడివి కాని చిత్రాలకు (నాన్ ఫీచర్ సినిమాలు) సంబంధించి దక్షిణాసియాలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన, అతిపెద్ద చలనచిత్రోత్సవంగా గుర్తింపు పొందిన ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) డాక్యుమెంటరీ, తక్కువ నిడివి కాల్పనిక చిత్రాలు, యానిమేషన్ చిత్ర నిర్మాణ రంగాలకు ఒక శక్తిమంతమైన వేదికగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1990లో ప్రారంభమైన ఎంఐఎఫ్ఎఫ్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులు, కళాకారులు, సినిమా ప్రేమికులను ఆకర్షించే ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికగా ఎదిగింది.

19వ విడత ఎంఐఎఫ్ఎఫ్ అద్భుతమైన అంతర్జాతీయ చిత్రాల ప్రదర్శనతో పాటు చలనచిత్ర రంగానికి సంబంధించిన సరికొత్త కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఒక సరికొత్త, మంచి అనుభూతిని అందించనుంది. 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి సంబంధించిన పోటీ విభాగం కోసం భారత్‌తో కలిపి మొత్తం 47 దేశాల నుంచి 1,459 చిత్రాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఉత్సవంలో 42కు పైగా భారతీయ భాషలతో పాటు విదేశాలకు చెందిన 30కు పైగా భాషల్లో రూపొందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇది ఈ ఉత్సవానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి, సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినీ ప్రముఖుల సృజనాత్మక నైపుణ్యంతో రూపుదిద్దుకున్న అత్యుత్తమ డాక్యుమెంటరీలు, తక్కువ నిడివి గల కాల్పనిక చిత్రాలు, యానిమేషన్లు, నూతన దర్శకుల చిత్రాలు, విద్యార్థులు తీసిన చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాల ప్రదర్శనలతో పాటు రెండో విడత 'డాక్ బజార్', మాస్టర్‌క్లాస్‌లు, ఐడీపీఏ నిర్వహించే 'ఓపెన్ ఫోరమ్' వంటి కార్యక్రమాలు ఈ ఉత్సవంలో సినిమాటిక్, సృజనాత్మక ఆలోచనల మార్పిడిని మరింత పెంపొందిస్తాయి.

శక్తిమంతమైన కథల ప్రపంచంలోకి అడుగుపెట్టండి. ఎంఐఎఫ్ఎఫ్ 2026 వేదికగా ప్రభావవంతమైన సినిమాలు, సృజనాత్మక ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన కథల కలయికతో డాక్యుమెంటరీ, యానిమేషన్, తక్కువ నిడివి కాల్పనిక చిత్ర నిర్మాణ రంగాల విషయంలో ఒక అపూర్వమైన మహోత్సవంలో భాగస్వాములు అవ్వండి.

19వ ఎంఐఎఫ్ఎఫ్ మీడియా అక్రిడిటేషన్ విధానాన్ని కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx 

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2264483   |   Visitor Counter: 47