వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తన 35 ఏళ్ల అనుభవాలపై కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రచన ‘అప్నాపన్‌’


ఈ నెల 26న పుస్తకాన్ని సంయుక్తంగా ఆవిష్కరించనున్న పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు... పూర్వ ప్రధానమంత్రి శ్రీ దేవెగౌడ

ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వం.. వ్యక్తిత్వం.. దేశ ప్రగతిపై ఆయన అంకితభావంపై ఈ పుస్తకం విస్తృత అవగాహన కల్పిస్తుంది

ఏక్తా యాత్ర నుంచి నేటిదాకా శ్రీ నరేంద్ర మోదీతో తన ప్రస్థానాన్ని ‘అప్నాపన్‌’లో వివరించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

కార్యదక్షత.. సుపరిపాలన.. అవగాహన.. దృఢ సంకల్పాలకు ‘అప్నాపన్‌’ ఒక ప్రతీక: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
విధాన రూపకల్పన.. సంస్థాగత వ్యూహాలు.. రాష్ట్రాల్లో మంత్రిమండలి స్థాయి నిర్ణయాల అమలుపై కీలకాంశాలను ఈ పుస్తకం వెల్లడిస్తుంది

మూడు దశాబ్దాల శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజా జీవితాన్ని.. ప్రధానమంత్రి శ్రీ మోదీతో ఆయన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 4:12PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తన 35 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని, అనుభవాలను వివరిస్తూ ‘అప్నాపన్‌’ పేరిట పుస్తకం రచించానని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- దశాబ్దాలపాటు సాగిన సంస్థాగత కార్యకలాపాలు, ప్రజా సేవ, పరిపాలన, దేశ ప్రగతి వంటి వివిధ అంశాలకు సంబంధించి ప్రధానమంత్రితో తన సన్నిహిత అనుబంధం, వ్యక్తిగత అనుభవాల సమాహారంగా ఈ పుస్తకాన్ని ఆయన అభివర్ణించారు. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలోని పూసాలోగల ‘ఎన్‌ఏఎస్‌సీ’ ప్రాంగణంలో ఉదయం 10:30 గంటలకు పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు, పూర్వ ప్రధానమంత్రి శ్రీ హెచ్.డి.దేవెగౌడ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.

ఈ పుస్తక పఠనం ద్వారా ప్రధానమంత్రి మోదీ వ్యక్తిత్వం, నాయకత్వ శైలి, అవగాహన, కార్యదక్షతల గురించి అత్యంత సామీప్య అనుభూతితో వ్యక్తిగత కోణంలో అర్థం చేసుకునే అవకాశం పాఠకులకు లభిస్తుందని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.

సుదీర్ఘ ప్రజా జీవనంలో శ్రీ నరేంద్ర మోదీతో కలిసి పనిచేస్తున్న రోజుల్లో తనకు కలిగిన స్ఫూర్తి, అనుభవాలు, భావోద్వేగాలు, విలువలను ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని తెలిపారు. మూడున్నర దశాబ్దాల కిందట 1991 నాటి ‘ఏక్తా యాత్ర’తో మొదలైన తమ అనుబంధం నేటివరకూ సుదీర్ఘంగా కొనసాగుతున్నదని ఆయన గుర్తుచేశారు. సంస్థాగతంగా కార్యకర్తల నడుమ ఏర్పడే ఒక సాధారణ పరిచయంతో మొదలైన సంబంధం ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా తాను నిర్వర్తించిన వివిధ బాధ్యతల ద్వారా కాలక్రమంలో ప్రగాఢ అనుబంధంగా పరిణతి చెందిందని వివరించారు. ప్రపంచం శ్రీ నరేంద్ర మోదీని ఒక నిర్ణయాత్మక, ప్రభావశీల నేతగా పరిగణిస్తుందని చెబుతూ- తనకు మాత్రం ఆయనలో ఓ “సాధకుడు, కర్మయోగి” దేశ ప్రయోజనాలకే తననుతాను అర్పించుకున్న మహోన్నత వ్యక్తిత్వం దర్శనమిస్తుందని శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు అవిశ్రాంతంగా పనిచేసినా అలుపెరుగని ప్రధానమంత్రి మోదీ ప్రతి ఉదయాన్నీ అదే శక్తితో, స్పష్టతతో, మాతృభూమిపై అంకితభావంతో పునఃప్రారంభిస్తారని కొనియాడారు.

శ్రీ మోదీతో ఏక్తా యాత్ర నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ- ఆ సమయంలో దాన్నొక రాజకీయ ప్రచారంగా కొందరు వ్యాఖ్యానించినప్పటికీ ప్రధానమంత్రి ఒక జాతీయ చైతన్య ఉద్యమంగా దాన్ని మలచారని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో  త్రివర్ణ పతాకావిష్కరణతో శ్రీ మోదీ దార్శనికత ఆగిపోలేదని, యువతరంలో దేశభక్తిని ప్రతిష్టను, అంకితభావాన్ని రగిలించిందని చెప్పారు.

నాయకత్వమనేది ప్రసంగాలకు పరిమితం కాబోదంటూ- క్రమశిక్షణ, త్యాగం, నిబద్ధత, ప్రజలతో ప్రగాఢ అనుబంధ భావనతో అది మూర్తీభవిస్తుందనే వాస్తవాన్ని ఆ యాత్ర సందర్భంగానే తాను గ్రహించానని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇలాంటి ఎన్నో అనుభవాలే ఈ పుస్తక రచనకు తనను పురికొల్పాయని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీ కార్యదక్షతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సంస్థాగత విస్తరణ, ఎన్నికల వ్యూహరచన, ఆలోచనలను క్షేత్రస్థాయికి వర్తింపజేయడం, కార్యకర్తలతో మమేకం కావడం వంటి లక్షణాలు ఆయన శక్తిసామర్థ్యాలను స్పష్టంగా నిర్వచిస్తాయని చౌహాన్ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సంక్లిష్ట, దీర్ఘకాలిక సమస్యలను చర్చలు, స్పష్టత, సంకల్ప బలంతో ఎలా పరిష్కరించవచ్చునో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.

ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యక్తిత్వం ఎంత దృఢమైనదో.. అంతే సున్నితమైనదని కేంద్ర మంత్రి అన్నారు. ఏక్తా యాత్ర నాటి ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ- పతాకావిష్కరణ సమయంలో భద్రత కారణాల వల్ల లాల్ చౌక్‌ వద్దకు చేరుకోలేక అంకిత భావంగల పలువురు కార్యకర్తలు నిస్పృహ చెందడంపై నరేంద్ర మోదీ ఆవేదన చెందారని తెలిపారు. ఆ క్షణంలో ప్రధానమంత్రి భావోద్వేగాన్ని, పార్టీ కార్యకర్తలతో ఆయనకుగల సన్నిహిత బంధాన్ని తాను అనుభూతి చెందానని శ్రీ చౌహాన్‌ అన్నారు.

సాధారణంగా నాయకత్వం సంస్థాగత దృఢత్వంతో మాత్రమే ముడిపడి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, శ్రీ నరేంద్ర మోదీకి కార్యకర్తలు, పేదలు, రైతులు, తల్లులు, అక్కచెల్లెళ్లు, చిట్టచివరి అంచెనగల ప్రతి ఒక్కరిపైనా ప్రగాఢ సహానుభూతి స్పష్టంగా కనిపిస్తుందని శ్రీ చౌహాన్‌ తెలిపారు. ప్రధానమంత్రి నాయకత్వ పటిమను విశిష్టమైనదిగా, దీర్ఘకాలిక ప్రభావం చూపగలదిగా నిలిపేది ఈ మానవతా దృక్పథమేనని పేర్కొన్నారు. సాంకేతికత ప్రాధాన్యాన్ని అనేకమంది నాయకులు, కార్యకర్తలు గుర్తించడానికి చాలా ముందుగానే ప్రధాని మోదీ పసిగట్టారని చెప్పారు. సుపరిపాలన, పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం, సేవల ప్రదానం తదితరాలతో సాంకేతికతను ఆయన ఎంత సమర్థంగా సంధానించారో ఆ తర్వాత దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు.

ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 సంక్షోభ కాలాన్ని ప్రస్తావిస్తూ- దేశవ్యాప్తంగా అనిశ్చితి, ఆందోళన నెలకొన్న వేళలోనూ తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓర్పు, సంయమనం, దూరదృష్టి ప్రదర్శించారని చౌహాన్ గుర్తుచేశారు. ఇటువంటి సంక్షోభాలు నాయకత్వ పటిమకు కఠిన పరీక్ష పెడతాయని పేర్కొన్నారు. అంతటి సంక్లిష్ట సమయంలోనూ దేశానికి దిశానిర్దేశం చేయడంతోపాటు ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పారని తెలిపారు.

‘అప్నాపన్‌’ పుస్తక సారాంశాన్ని వివరిస్తూ- ఇది కేవలం సంఘటనలను గుదిగుచ్చిన రచన కాదని శ్రీ చౌహాన్ అన్నారు. దేశంలో మార్పును కాంక్షిస్తూ సాహసంతో కూడిన ఒక ఆలోచన, దార్శనికత, పని విధానం, దేశ పురోగమన స్ఫూర్తిని ప్రతిబింబించే పత్రంగా దీన్ని పరిగణించాలన్నారు. సంస్థాగత నిర్మాణం నుంచి పరిపాలన దాకా... అవగాహన నుంచి నిర్ణయాత్మకత వరకూ... సంకల్పం నుంచి సాకారం వైపు ప్రస్థానాన్ని పాఠకులు ఈ పుస్తక పఠనం అనుభూతి చెందగలరని ఆయన వ్యాఖ్యానించారు.

‘అప్నాపన్‌’ పాఠకులలో... ముఖ్యంగా యువతరంలో నవ్యోత్తేజం రగిలించగలదని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రూపాంతరీకరణ దిశగా ఒక దేశాన్ని నడిపించాలంటే ఉన్నత పదవులేవీ అవసరం లేదంటూ- దృఢ సంకల్పం, క్రమశిక్షణ, సేవాభావం, ప్రజలతో హృదయానుగత బంధం ఉంటే చాలుననే సందేశాన్నిస్తుందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని ప్రజలు సన్నిహితంగా అర్థం చేసుకునేలా తన వ్యక్తిగత అనుభవాలను పాఠకులకు పంచుకునే ప్రయత్నం చేశానని శ్రీ చౌహాన్‌ చెప్పారు. దేశంలో సామాజిక, రాజకీయ పరిణామ ప్రక్రియను అవగతం చేసుకోవాలని భావించే వారికీ ఈ పుస్తకం విలువైన పరిశోధన గ్రంథంగా ఉపయోగపడగలదని ఆయన వ్యాఖ్యానించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2261228) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada