పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అంతర-మంత్రిత్వశాఖల తాజా సమాచారం


· గడచిన 3 రోజులలో సుమారు 1.40 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌కుగాను దాదాపు 1.39 కోట్ల మేర సరఫరా అయ్యాయి

· ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు 11,870కి పైగా అవగాహన శిబిరాలను నిర్వహించి 2.10 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లను విక్రయించాయి

· ఈ ఏడాది మార్చి నుంచి సుమారు 7.03 లక్షల పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్ పూర్తి కావడంతోపాటు మరో 2.72 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలు కల్పించగా.. కొత్త కనెక్షన్ల కోసం 7.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి

· భారత్‌కు ‘ఎల్‌పీజీ’తో బయల్దేరిన ‘ఎస్‌వైఎంఐ’.. ‘ఎన్‌వి సన్‌షైన్’ నౌకలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన నేపథ్యంలో కాండ్లా.. న్యూ మంగళూరు నిర్దేశిత వ్యవధి మేరకు సరఫరా పూర్తయింది

· ఓమన్ పరిధిలోని సముద్ర జలాల్లో భారతీయ ఓడ ప్రమాదానికి గురైన సంఘటనలో అందులోని సిబ్బంది అంతా సురక్షితం.. గడచిన 72 గంటల్లో భారతీయ నౌకలతోపాటు భారత నావికులున్న విదేశీ నౌకలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 5:12PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం తెలియజేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, కీలక రంగాల్లో స్థిరత్వం దిశగా చేపడుతున్న చర్యలపై తాజా సమాచారం వెల్లడించారు.

విద్యుత్‌ సరఫరా... ఇంధన లభ్యత

   పశ్చిమాసియాలో నానాటికీ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:

ప్రభుత్వ సూచనలు... పౌరులకు అవగాహన

·        పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతకు భరోసా ఇస్తూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్న నేపథ్యంలో పౌరులు భయాందోళనలకు లోనై, వీటి కొనుగోలు కోసం ఆదుర్దా పడవద్దని సూచించింది.

·        వదంతులను విశ్వసించవద్దని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక సమాచార మార్గాలను అనుసరించాలని సలహా ఇచ్చింది.

·        ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ వేదికలను ఉపయోగించాలి తప్ప సరఫరాదారులను ఆశ్రయించవద్దని సూచించింది.

·        పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

·        ప్రస్తుత పరిస్థితులలో పౌరులంతా తమ రోజువారీ ఇంధన వినియోగంలో పొదుపు పాటించేందుకు తగినవిధంగా కృషి చేయాలని అభ్యర్థించింది.

ప్రభుత్వ సంసిద్ధత... సరఫరా నిర్వహణ

·        ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ఎల్‌పీజీ, గృహ వినియోగ పీఎన్‌జీ, సీఎన్‌జీల 100 శాతం సరఫరా (రవాణా)కు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

·        వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాకు సంబంధించి ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఔషద, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ తదితర రంగాలకూ ప్రాధాన్యం లభిస్తోంది. దీనికితోడు 2026 మార్చి 2, 3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా ప్రాతిపదికన వలస కార్మికులకు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.

·        శుద్ధి కర్మాగారల్లో ఉత్పత్తి పెంపు, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం సహా అటు సరఫరా... ఇటు డిమాండ్‌ వైపు ఆయా రంగాలకు ప్రాధాన్యత వంటి పలు హేతుబద్ధ చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

·        ఎల్‌పీజీ కోసం డిమాండ్‌ ఒత్తిడి తగ్గించే దిశగా కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చింది.

·        చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గు సరఫరా చేయాల్సిందిగా కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ సంస్థలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

·        గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్ల సౌలభ్యాన్ని వేగిరపరచాలని రాష్ట్రాలకు సూచించింది.

రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు.. సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ కృషి

·        నిత్యవసరాల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం సరఫరాపై పర్యవేక్షణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాలపై చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

·        పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా స్థితిగతుల పర్యవేక్షణ, నియంత్రణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలకు పలుమార్లు లేఖ రాయడంతోపాటు వీడియో కాన్ఫరెన్స్‌ మార్గంలోనూ ఈ అంశాన్ని పునరుద్ఘాటించింది.

·        కేంద్ర ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల్లో రెండు లేఖల ద్వారా తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా ఇస్తూ నిరంతర ప్రభుత్వ సమాచార ప్రదాన ఆవశ్యకతను స్పష్టం చేసింది. తదనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్ష కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 02.04.2026న (మంత్రిత్వశాఖలోని పీఎన్‌జీ విభాగ కార్యదర్శి అధ్యక్షత), 06.04.2026న (పీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన సమాచార-ప్రసార శాఖ, వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శులతో) అధికారులు సమావేశమయ్యారు. అనంతరం కింద పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

Ø రోజువారీ విలేకరుల సమావేశం నిర్వహణ.. క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు-సలహాల జారీ.

Ø సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం, బూటకపు వార్తలపై నిశిత పర్యవేక్షణ, నిరోధం.

Ø జిల్లా యంత్రాంగాల ద్వారా దైనందిన చర్యలు ముమ్మరం సహా ‘ఓఎంసీ’ల సమన్వయంతో తనిఖీ-దాడుల కొనసాగింపు.

Ø వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలో  ఉత్తర్వుల జారీ.

Ø రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ‘ఎస్‌కేఓ'ల కోసం సంబంధిత ఉత్తర్వులు జారీ.

Ø పీఎన్‌జీ సహా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రోత్సాహం.

Ø ప్రత్యేకించి గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యంతోపాటు సరఫరా స్థిరత్వం కొనసాగించేలా 5 కిలోల ఎప్‌టీఎల్‌ సిలిండర్ల లక్షిత పంపిణీ.

·          అక్రమ నిల్వ-విక్రయాల నిరోధంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కంట్రోల్‌ రూములు, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

·          అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోజువారీ విలేకరుల సమావేశం ద్వారా తాజా సమాచారం ప్రకటిస్తున్నాయి.

అమలు... పర్యవేక్షణ చర్యలు

·        ఎల్‌పీజీ నిల్వల నిర్వహణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాల నిరోధానికి దేశవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న 2,000కు పైగా దాడులు నిర్వహించారు.

·        దేశమంతటా ఆకస్మిక తనిఖీ ప్రక్రియను ‘ఓఎంసీ’లు బలోపేతం చేయడంతోపాటు నిరంతరం కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు నిన్నటిదాకా 1160 ప్రాంతీయ, ఎల్‌పీజీ సరఫరా కేంద్రాలను తనిఖీ చేశారు.

·        అలాగే, 401 ఎల్‌పీజీ సరఫరాదారులకు జరిమానా విధింపు సహా 76 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను నిలిపివేశారు.

ఎల్‌పీజీ సరఫరా

గృహోపయోగ వంటగ్యాస్‌ తాజా స్థితి:

·        ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది.

·        గృహ వినియోగదారులకు వంటగ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యం లభిస్తోంది.

·        దేశంలో ఎక్కడా ఎల్‌పీజీ సరఫరా కేంద్రాల వద్ద పంపిణీ ఆగిన సమాచారమేదీ లేదు.

·        పరిశ్రమల ప్రాతిపదికన నిన్న ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌ 99 శాతంగా నమోదైంది.

·        దారి మళ్లింపు నిరోధం, సరఫరా నిర్ధారణ కోడ్‌ (డీఏసీ) ఆధారిత సరఫరా దాదాపు 95 శాతానికి పెరిగింది. ప్రతి వినియోగదారు నమోదిత మొబైల్ నంబరుకు డీఏసీ వెళ్తుంది.

·        దేశంలోని ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలు గడచిన మూడు రోజులుగా సుమారు 1.40 కోట్ల బుకింగ్‌లపై 1.39 కోట్ల దాకా సిలిండర్లను సరఫరా చేశాయి.

·        నిన్న ఒక్క రోజునే సుమారు 49.7  లక్షల గృహ వినియోగ బుకింగ్‌లపై 46.06 లక్షల దాకా సిలిండర్లను సరఫరా చేశాయి.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు

·        సంస్కరణ-అనుసంధానిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును సంక్షోభానికి మునుపటికి స్థాయిలో సుమారు 70 శాతానికి పెంచారు.

·        వలస కార్మికులకు 2026 మార్చి 2-3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ప్రాతిపదికన 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి మించి, ప్రతి రాష్ట్రంలో వారికి 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల దైనందిన పరిమాణాన్ని రెట్టింపు చేయాలని 06.04.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సూచించింది. తదనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే ‘ఓఎంసీ’ల సహాయంతో సరఫరా చేయడం కోసం ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అక్కడి ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.

·        గడచిన మూడు రోజులలో సుమారు 1.9 లక్షల మేర 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.

·        దేశంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి 11,870కి పైగా అవగాహన శిబిరాలను నిర్వహించి, సుమారు 2.10 లక్షల దాకా సిలిండర్లను విక్రయించాయి.

·        నిన్న ఒక్క రోజునే 214 శిబిరాల నిర్వహణ ద్వారా 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు దాదాపు 3,480 దాకా అమ్ముడయ్యాయి.

·         ‘ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌” ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో నియమించిన త్రిసభ్య కమిటీ నిరంతరం రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సంప్రదిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ విక్రయ ప్రణాళికను ఖరారు చేస్తుంది.

·        ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటిదాకా 83,549 టన్నుల (మొత్తం 43.97 లక్షలకు పైగా 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్‌పీజీ విక్రయించారు.

·        గడచిన మూడు రోజుల్లోనే 23,820 టన్నులకు పైగా (12.53 లక్షలకు పైగా 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్‌పీజీని విక్రయించారు.

·        ఇందులో నిన్న ఒక్కరోజే 7,836 టన్నులకు పైగా (4.12 లక్షలకు పైగా 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్‌పీజీని విక్రయించారు.

·        ఇక నిన్న ఒక్క రోజునే ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు 357 టన్నుల ఆటో ‘ఎల్‌పీజీ’ని  విక్రయించగా, ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య రోజువారీ సగటు విక్రయం సుమారు 177 టన్నులుగా ఉంది.

సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.

సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థల కోసం పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.

ఐజీఎల్, ఎమ్‌జీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.

ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.

పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తేదీ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన అనుమతుల విధాన ప్రణాళిక'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.

నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం  24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.

పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.

ఎమ్‌వోఈఎఫ్‌సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.

మార్చి 2026 నుంచి, సుమారు 7.03 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. అదనంగా 2.72 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్‌ల సంఖ్య 9.75 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్‌ల కోసం సుమారు 7.49 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

13.05.2026 వరకు 57,200 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను వదులుకున్నారు.

ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు

అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా నిర్వహిస్తున్నారు.

గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

దేశీయ మార్కెట్‌కు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3 & సీ4 స్ట్రీమ్‌ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలనూ భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.

ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగం, పరిశ్రమలకు ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం ద్వారా అందిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మా, రసాయన రంగ కంపెనీలకు ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1120 మెట్రిక్ టన్నుల కేటాయింపు చేశారు.

2026 మే 1వ తేదీ నుంచి ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 6,700 మెట్రిక్ టన్నులకు పైగా సీ3-సీ4 మాలిక్యుల్స్ (ప్రొపైలీన్, బ్యూటైలీన్‌లతో కూడినవి), 2,800 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్‌ను విక్రయించాయి.

రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు

దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు యధావిధిగా పనిచేస్తున్నాయి.

మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పీఎస్‌యూ ఓఎంసీల రిటైల్ అవుట్‌లెట్లలోనూ ధరల పెంపు లేదు.

నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను పేర్కొన్నది:

మార్షల్ దీవుల జెండా కలిగిన ఎల్‌పీజీ రవాణా నౌక 'సైమి'... 19,965 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని భారత్‌కు రవాణా చేస్తోంది. అందులో 21 మంది విదేశీ సిబ్బంది ఉన్నారు. ఈ నౌక 2026 మే 13న 'స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్'ను సురక్షితంగా దాటింది. ఇది మే 16న కాండ్లా రేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

వియత్నాం జెండా కలిగిన ఎల్‌పీజీ రవాణా నౌక 'ఎన్‌వీ సన్‌షైన్'... 46,427 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని భారత్‌కు రవాణా చేస్తోంది. 24 మంది విదేశీ సిబ్బందితో ఈ నౌక మే 14న 'స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్'ను సురక్షితంగా దాటింది. మే 18న ఈ నౌక 'న్యూ మంగళూరు'కు చేరుకుంటుందని భావిస్తున్నారు.

సోమాలియా నుంచి యూఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారతీయ మర పడవ 'హజీ అలీ' (ఎంఎస్‌వీ)... 2026 మే 13 తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ప్రమాదానికి గురయినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా పడవలో మంటలు చెలరేగి, అది నీటిలో మునిగిపోయింది.

నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని ఒమన్ తీర రక్షక దళం రక్షించింది. వీరు ఒమన్‌లోని దిబ్బా నౌకాశ్రయానికి చేరుకున్నారు. సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిసింది. స్థానిక అధికారులతో అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేశారు.

ఒమన్ సుల్తానేట్‌లోని అధికారులతో, భారత రాయబార కార్యాలయ అధికారులతో, సంబంధిత నౌకా వాణిజ్య సంస్థలతో భారత ప్రభుత్వం సన్నిహిత సమన్వయం కొనసాగిస్తోంది.

ఎంఎస్‌వీ హజీ హలీ ఘటన మినహా... గత 72 గంటల్లో భారతీయ నౌకలకు, భారతీయ నావికులు ఉన్న విదేశీ నౌకలకు సంబంధించి మరే ఇతర ఘటన నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం ఉన్న మిగిలిన భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు.

డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: ప్రారంభమైనప్పటి నుంచి ఈ కంట్రోల్ రూమ్ 9266 కాల్‌లు, 20592 కంటే ఎక్కువ ఈమెయిళ్లను నిర్వహించింది. గత 72 గంటల్లో 377 కాల్‌లు, 834 ఈమెయిళ్లూ అందాయి.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 72 గంటల్లో స్వదేశానికి వచ్చిన 62 మంది సహా... ఇప్పటివరకు మొత్తం 3158 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.

దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

నావికుల సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2261226) సందర్శకుల సూచీ సంఖ్య : : 93
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam