హోం మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా వరద నిర్వహణ, వడగాలుల సంసిద్ధతను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో 2026 మే 10 ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
విపత్తు నిర్వహణలో సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసిన ఎంహెచ్‌ఏ
కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల వినియోగం, వివిధ సంస్థల మధ్య సమన్వయంపై సమీక్ష
దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిపై చర్చ
प्रविष्टि तिथि:
08 MAY 2026 4:52PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వరద నిర్వహణ, వడగాలుల సంసిద్ధతను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో 2026, మే 10 ఆదివారం కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
విపత్తు నిర్వహణ పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అవలంబిస్తున్న క్రియాశీలక, నిర్ణయాత్మక.. సంపూర్ణ ప్రభుత్వ, సంపూర్ణ సమాజ విధానం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ వ్యవస్థను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణనీయంగా బలోపేతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య మెరుగైన సమన్వయం, ఎన్డీఆర్ఎఫ్ బలగాల బలోపేతం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో "సున్నా ప్రాణ నష్టం" విధానంపై నిరంతరం దృష్టి సారించింది.
ముందస్తు పాలన, ప్రజలే ప్రధానంగా సాగే విపత్తు నిర్వహణ, విపత్తులను తట్టుకోగల దృఢమైన భారత్ నిర్మాణంలో మోదీ ప్రభుత్వానికున్న అంచంచలమైన నిబద్ధతను ఈ ఉన్నత స్థాయి సమీక్ష ప్రతిబింబిస్తోంది.
ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అంచనా వేస్తారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల వినియోగం, వివిధ సంస్థల మధ్య సమన్వయంపై సమీక్షిస్తారు.
దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సమీక్షించనున్నారు. కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పరిరక్షణ, నదీ నిర్వహణ కార్యక్రమాలు, ముందస్తు అంచనాల్లో శాస్త్రీయ పురోగతి వంటి అంశాలను పరిశీలిస్తారు. గతేడాది సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును అంచనా వేయటం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించటం, కార్యకలాపాల సమన్వయంతో పనులను వేగవంతం చేయటంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించే అంశాలు:
-
అధునాతన సాంకేతికత, రియల్-టైమ్ డేటా అనుసంధానం ద్వారా వరదకు సంబంధించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయటం.
-
ఏకకాలంలో సంభవించే విపత్తులను ముఖ్యంగా వరదలు, వడగాలుల వంటి వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సంసిద్ధతను పెంపొందించటం.
-
ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించటం, విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టటం.
-
అవసరమైన సహాయక సామాగ్రి తగినంత నిల్వ ఉండేలా చూసుకోవటం, వైద్య పరంగా సంసిద్ధతతో ఉండటం.
***
(रिलीज़ आईडी: 2259244)
आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam