రైల్వే మంత్రిత్వ శాఖ
ఆగస్టు నుంచి అప్‌గ్రేడెడ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లోకి రైళ్ల మార్పు ప్రారంభం
40 ఏళ్ల నాటి పాత వ్యవస్థ నుంచి అధునాతన వ్యవస్థలోకి రైళ్లను మార్చే క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు రైల్వే మంత్రి ఆదేశం
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 6:15PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ రైల్వే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 40 ఏళ్ల నాటి పాత రిజర్వేషన్ వ్యవస్థ నుంచి అధునాతన వ్యవస్థలోకి రైళ్లను మార్చే క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రులు వి.సోమన్న, రవణీత్ సింగ్ బిట్టు పాల్గొన్నారు.
1986లో ప్రారంభమైన ఈ వ్యవస్థలో 40 ఏళ్లుగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని సమూలంగా మార్చేసి అత్యాధునిక సాంకేతికతో సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరించారు.
రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ ఎన్నో కీలక ఘట్టాలను దాటింది. 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెటింగ్ విధానాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది. నేడు ఈ వ్యవస్థ ఎంతో ప్రాచుర్యం పొంది అధిక సంఖ్యలో ప్రజలు టికెట్ కౌంటర్ల వద్దకు వెళ్లటం తగ్గిపోయింది. ప్రస‌్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 88 శాతం టికెటింగ్ డిమాండ్ ఆన్‌లైన్ వేదికల ద్వారానే తీరుతోంది.
రైల్‌వన్ మొబైల్ యాప్ ప్రయాణికుల్లో ప్రజాదరణ పొందుతోంది. గతేడాది జూలైలో ఇది ప్రారంభం కాగా, ఏడాది లోపే దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు అయ్యాయి.
ఈ యాప్ రైల్వే సంబంధిత సమాచారాన్ని అందించటమే కాక.. టికెటింగ్, ఇతర సేవలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించటం వల్ల దీనికి అధిక ప్రజాదరణ లభించింది.
టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వెయిట్‌లిస్ట్ టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందో లేదో రైల్‌వన్ యాప్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ యాప్ ఏఐ ఆధారిత అంచనాలతో టికెట్ ఖరారయ్యే అవకాశాలను కూడా చూపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఈ సదుపాయానికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో వెయిట్‌లిస్ట్ టికెట్ ఖరారు అంచనాల ఖచ్చితత్వం 53 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడది 94 శాతానికి పెరిగింది.
రిజర్వేషన్, అన్‌రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్ల బుకింగ్, రద్దు, రీఫండ్ వంటి దాదాపు అన్ని రైల్వే సేవలను కలుపుకుని రైల్‌వన్ యాప్ సమగ్ర, ఆధునిక సదుపాయాలను అందిస్తోంది.
టికెట్ వెయిటింగ్ స్టేటస్, రైలు సమాయం, రైలు ఎక్కడ ఉందో తెలిపే లైవ్ రన్నింగ్ స్టేటస్, ప్లాట్‌ఫారమ్ సమాచారం, కోచ్ పొజిషన్ వంటి వాటిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. వీటితో పాటు ప్రయాణికుల సహాయార్థం 'రైల్ మదద్' వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఈ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, నేరుగా ప్రయాణికుల సీట్ల వద్దకు అందిస్తారు. ఇలాంటి ఎన్నో అనుకూలమైన, సేవాధారిత సదుపాయాలతో రైల్‌వన్ యాప్ వేగంగా ప్రజాదరణ పొందింది.
ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా రోజూ 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇందులో 7.2 లక్షల అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వ్‌డ్ టికెట్లు ఉన్నాయి. అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో ప్లాట్‌ఫారమ్ టికెట్లు కూడా ఉన్నాయి. రైల్‌వన్ యాప్‌కు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ 3.16 కోట్ల సార్లు, ఆపిల్ ఫోన్లలో 33.17 లక్షల సార్లు డౌన్‌లోడ్ చేశారు.
దేశ ప్రయాణికులకు భారతీయ రైల్వే జీవనాడి వంటిది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ప్రయాణికుల టికెట్లపై రూ.60,239 కోట్ల రాయితీని అందించింది. అంటే ప్రతి రైల్వే ప్రయాణికుడికి సగటున 43 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రైల్వే సేవలను అందించేందుకు అయ్యే ఖర్చు రూ.100 అయితే, ప్రయాణికుడి నుంచి వసూలు చేసే టికెట్ ధర కేవలం రూ.57 మాత్రమే.
***
(రిలీజ్ ఐడి: 2258903)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5