సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
లైవ్ ఈవెంట్స్ రంగంలో దేశాన్ని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలిపే ప్రణాళికను సమీక్షించిన లైవ్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ సెల్ 4వ సమావేశం
ఉపాధి, పర్యాటకం, అనుబంధ రంగాల్లో ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా లైవ్ ఈవెంట్లు
వేగవంతమైన, పారదర్శక ఆమోదాలను నిర్ధారించడానికి ఇండియా సినీ హబ్ పోర్టల్‌లో లైవ్ ఈవెంట్‌ల కోసం సింగిల్-విండో అనుమతులు
లైవ్ ఈవెంట్స్ కోసం లైసెన్సులు, అనుమతుల క్రమబద్ధీకరణకు ఈ నెల 31 లోగా నమూనా కార్యనిర్వాహక ఉత్తర్వులను ఆమోదించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం విజ్ఞప్తి
వ్యాపార సౌలభ్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా లైవ్ ఈవెంట్స్ రంగాన్ని ప్రోత్సహించడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
01 MAY 2026 2:34PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ అధ్యక్షతన, లైవ్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ సెల్ 4వ సమావేశం 30 ఏప్రిల్ 2026న విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 6 రాష్ట్రాలు సహా 12 మంది పరిశ్రమ సభ్యుల ప్రతినిధులు హాజరయ్యారు.
పరిశ్రమ అంచనాల ప్రకారం 2025 నాటికి రూ. 14,500 కోట్ల విలువ కలిగిన భారత వ్యవస్థీకృత లైవ్ ఈవెంట్ల రంగం... మీడియా, వినోద రంగంలో అత్యధిక వృద్ధి సాధించిన విభాగంగా ఆవిర్భవించింది. ఈ రంగాన్ని ప్రోత్సహించడం కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జూలై 2025లో లైవ్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ సెల్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఉన్నారు.
కన్సర్ట్ ఎకానమీని జాతీయ వృద్ధికి కీలక చోదక శక్తుల్లో ఒకటిగా నిలపాలని, 2030 నాటికి దేశాన్ని లైవ్ ఈవెంట్ల రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా మార్చాలని, ఈ రంగంలో 1.5 నుంచి 2 కోట్ల వరకు అదనపు ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యాన్ని ఎల్‌ఈడీసీ నిర్దేశించుకుంది. ఈ రంగం విలువ 2028 నాటికి 10 శాతం వృద్ధితో రూ.19,600 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఈ సమావేశం సందర్భంగా, భారత లైవ్ ఈవెంట్స్ పరిశ్రమ వృద్ధికి సమన్వయ రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో ఎల్‌ఈడీసీ పాత్రను ఎంఐబీ కార్యదర్శి ప్రముఖంగా ప్రస్తావించారు. మీడియా, వినోద పరిశ్రమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో లైవ్ ఈవెంట్స్ రంగం ఒకటని, ఇది అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన, పర్యాటక ప్రోత్సాహం సహా ఆర్థిక వృద్ధికీ గణనీయంగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎల్ఈడీసీ చేపట్టిన వివిధ కార్యక్రమాల పురోగతిని ఎంఐబీ సంయుక్త కార్యదర్శి (ప్రసార విభాగం) శ్రీ పృథుల్ కుమార్ సమావేశంలో తెలియజేశారు. లైవ్ ఈవెంట్ అనుమతుల కోసం ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) పోర్టల్‌లో సింగిల్-విండో అనుమతుల వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు ఐసీహెచ్ పోర్టల్‌ను స్వీకరించడం... లైవ్ ఈవెంట్ అనుమతుల ప్రక్రియను డిజిటలైజ్ చేయడంలో, సకాలంలో, పారదర్శకంగా, సమర్థంగా అనుమతులను అందించడంలో సహాయపడనుంది.
“భారత్‌లో లైవ్ ఈవెంట్‌ల కోసం లైసెన్సింగ్, అనుమతులను క్రమబద్ధీకరించే నమూనా కార్యనిర్వాహక ఉత్తర్వులు- 2026” ను ఈ నెల 31 తేదీలోగా ఆమోదించాల్సిన అవసరాన్ని సమావేశంలో స్పష్టం చేశారు. దీనిని 2026 మార్చి 13న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకున్నారు. దేశంలోని లైవ్ ఈవెంట్స్ రంగం కోసం సరళీకృత, ప్రామాణిక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ఈ విధాన ప్రణాళికను రూపొందించారు.
“గ్రీన్‌ఫీల్డ్ వేదిక అభివృద్ధి” పై ముసాయిదా కాన్సెప్ట్ నోట్ గురించి, లైవ్ ఈవెంట్స్ విభాగానికి సంబంధించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఎల్ఈడీసీ చర్చించింది. ఎమ్ఈఎస్‌సీ, ఈఈఎమ్ఏల సహకారంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎమ్‌సీ) త్వరలోనే లైవ్ ఈవెంట్స్‌లో సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టనుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ... “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున లైవ్ ఈవెంట్స్ నిర్వహణ ప్రక్రియలను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా మార్చేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నేను హామీ ఇస్తున్నాను” అని అన్నారు. “ఎల్ఈడీసీ సభ్యులందరూ పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నారు, ఇప్పుడు సమర్థంగా అమలు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది” అని ఆయన జోడించారు.
దేశంలో లైవ్ ఈవెంట్స్ రంగం కోసం సహాయక, వృద్ధి-ఆధారిత వ్యవస్థను ప్రోత్సహించడానికి భాగస్వాములందరితో కలిసి పనిచేయుటను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కొనసాగిస్తుందని శ్రీ చంచల్ కుమార్ ప్రకటించారు.
***
(రిలీజ్ ఐడి: 2257422)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8