ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోహన్నెస్‌బర్గ్‌ జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2025 10:08PM by PIB Hyderabad

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నగరంలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రమఫోసా అధ్యక్షతన నిర్వహించిన జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ఇవాళ పాల్గొన్నారు. ఈ సదస్సులలో పాల్గొనడం ఆయనకిది 12వ సారి కాగా, సదస్సు ప్రారంభం నాటి రెండు గోష్ఠులలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ సదస్సు సందర్భంగా తనకిచ్చిన ఆత్మీయ ఆతిథ్యంపై అధ్యక్షుడు రమఫోసాకు ధన్యవాదాలతోపాటు శిఖరాగ్ర సదస్సును  విజయవంతంగా నిర్వహించడంపై అభినందనలు తెలిపారు.

సదస్సు ప్రారంభోత్సవంలో భాగంగా “ఏ ఒక్కరూ వెనుకబడకుండా సార్వజనీన-సుస్థిర ఆర్థిక వృద్ధి” ఇతివృత్తంగా నిర్వహించిన గోష్ఠిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. నిపుణుల వలస, పర్యాటకం, ఆహార భద్రత, ఏఐ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు సహా మహిళా సాధికారత రంగాల్లో దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఈ బృందం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలో, న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న కొన్ని చారిత్రక నిర్ణయాల అమలుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఆఫ్రికాలో తొలిసారి జి-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్న తరుణంలో  వృద్ధి సంబంధిత కొత్త ప్రమాణాల పరిశీలనకు సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యంగా వృద్ధిలో అసమతౌల్యం, మితిమీరిన ప్రకృతి వనరుల వినియోగం తదితరాలను పరిష్కరించే విధంగా ఈ ప్రమాణాలు రూపొందాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత నాగరికతా జ్ఞానాధారిత “సమగ్ర మానవతావాదం” భావనను పరిశీలించాలని ఆయన సూచించారు. మానవులు, సమాజం, ప్రకృతిని సమగ్ర దృష్టితో చూడటమే ఈ భావనకు మూలమని, ఆ మార్గంలో మాత్రమే ప్రగతికి, భూగోళానికి మధ్య సామరస్యం సాధించగలమని ఆయన వివరించారు.

సర్వజన శ్రేయస్సు, వృద్ధి, ప్రగతి దిశగా భారత్‌ అనుసరించే విధానాన్ని వివరిస్తూ... జి-20 పరిశీలనార్థం కింద పేర్కొన్న ఆరు దృక్కోణాలను ప్రధానమంత్రి ప్రతిపాదించారు:

*       జి-20 అంతర్జాతీయ సంప్రదాయ విజ్ఞాన భాండాగారం: భావితరాల ప్రయోజనార్థం  మానవాళి ఈ సమష్టి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోగలదు.

*       జి-20 ఆఫ్రికా నైపుణ్యాభివృద్ధి సంస్థ: ఆఫ్రికా యువతకు నైపుణ్య శిక్షణ కోసం 10 లక్షల మంది ధ్రువీకృత శిక్షకులను తయారు చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. తద్వారా స్థానిక సామర్థ్యాల సృష్టితోపాటు ఈ ఖండంలో దీర్ఘకాలిక ప్రగతికి ప్రోత్సాహం లభిస్తుంది.

*       జి-20 అంతర్జాతీయ ఆరోగ్య రక్షణ స్పందన బృందం: ఇందులో జి-20 దేశాల ఆరోగ్య సంరక్షణ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో దీన్ని వినియోగించుకోవచ్చు.

*       జి-20 ఉపగ్రహ సమాచార సార్వత్రిక భాగస్వామ్యం: ఈ కార్యక్రమం కింద జి-20 అంతరిక్ష సంస్థల ఉపగ్రహ సమాచారాన్ని వర్ధమాన దేశాల్లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, విపత్తు నిర్వహణ తదితర కార్యకలాపాల కోసం అందుబాటులోకి తెస్తారు.

*       జి20 కీలక ఖనిజా వర్తుల కార్యక్రమం: రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్-లైఫ్ బ్యాటరీ ప్రాజెక్టులు సహా వివిధ రకాల ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. సరఫరా వ్యవస్థల భద్రత బలోపేతం దిశగా కాలుష్య రహిత ప్రగతి మార్గాన్వేషణకు దోహదం చేస్తుంది.

*       మాదకద్రవ్యాలు-ఉగ్రవాదుల మధ్య బంధం విచ్ఛిన్నానికి జి-20 కార్యక్రమం: ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడమే కాకుండా ఉగ్రవాద ఆర్థిక మూలాల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంది.

   “పునరుత్థాన ప్రపంచం- విపత్తు ముప్పులను తగ్గించడంలో జి-20 సహకారం... వాతావరణ మార్పు; సముచిత ఇంధన మార్పిడి.. ఆహార వ్యవస్థలు” ఇతివృత్తంగా నిర్వహించిన గోష్ఠిలోనూ ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ దిశగా భారత్‌ ప్రారంభించిన విపత్తు ముప్పుల తగ్గింపు కార్యాచరణ బృంద వ్యవస్థను కొనసాగించడంపై వివిధ దేశాలను ఆయన అభినందించారు. భారత్‌ ఏర్పరచిన ‘విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి’ పేర్కొంటున్న రీతిలో విపత్తుల నుంచి కోలుకునే విధానం “ప్రతిస్పందన కేంద్రకం”గా కాకుండా “అభివృద్ధి-కేంద్రకం”గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆహార భద్రతను బలోపేతం దిశగా వాతావరణ మార్పు కార్యాచరణపై మరిన్ని సామూహిక కార్యక్రమాలు చేపట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోషకాహార భద్రత, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడంలో చిరుధాన్యాల విలువను ఆయన వివరించారు. జి-20కి భారత్‌ అధ్యక్షత వహించిన సమయంలో ఆహార భద్రతపై ప్రతిపాదించిన దక్కన్ సూత్రాలకు ఆమోదాన్ని ప్రస్తావిస్తూ- ఆహార భద్రతపై జి-20 భవిష్యత్‌ ప్రణాళిక రూపకల్పన కోసం అలాంటి విధానం ప్రాతిపదిక కావాలని ఆయన పేర్కొన్నారు. వర్ధమాన దేశాలకు సముచిత ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్దిష్ట వ్యవధిలోగా అభివృద్ధి చెందిన దేశాలు అందజేయాలని, దీనికి సంబంధించి వాతావరణ కార్యాచరణ నిబద్ధతను చాటుకోవాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ పాలన స్వరూపంలో వర్ధమాన దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని ప్రధానమంత్రి కోరారు. న్యూఢిల్లీలో శిఖరాగ్ర సదస్సు నిర్వహించినపుడు ఆఫ్రికా సమాఖ్యకు జి-20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం కీలక ఘట్టమని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సార్వజనీన స్ఫూర్తిని జి-20కి పరిధికి మించి కూడా విస్తరించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ రెండు గోష్ఠులలో ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాలను ఇక్కడ చూడవచ్చు [సెషన్ 1; సెషన్ 2]

 

***


(రిలీజ్ ఐడి: 2254690) సందర్శకుల సూచీ సంఖ్య : : 22