ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20 శిఖరాగ్ర సదస్సు: 2వ గోష్ఠిలో ప్రధానమంత్రి ప్రసంగం ముఖ్యాంశాలు
నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2025 9:57PM by PIB Hyderabad
మాననీయులారా!
విశ్వ మానవాళికి ప్రకృతి వైపరీత్యాలు పెను సవాలు విసురుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ప్రపంచ దేశాల జనాభాలో అధిక భాగాన్ని ఇవి ఎంతగానో ప్రభావితం చేశాయి. సమర్థ విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందన దిశగా అంతర్జాతీయ సహకారం బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఈ సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ ఆలోచనకు మద్దతుగా భారత్ తన జి-20 అధ్యక్షత సమయంలో విపత్తుల ముప్పు తగ్గింపుపై కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి కీలక కార్యాచరణకు ప్రాధాన్యమిచ్చిన దక్షిణాఫ్రికాను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా!
విపత్తుల నుంచి పుంజుకునే మన విధానం ‘ప్రతిస్పందన కేంద్రకం’గా కాకుండా ‘అభివృద్ధి కేంద్రకం’గా మారేందుకు చొరవ చూపాలి. ‘విపత్తు ప్రతిరోధక మౌలిక సదుపాయాల కూటమి’ (సీడీఆర్‌ఐ) ఏర్పాటుకు భారత్ చూపిన చొరవకు స్ఫూర్తి ఈ సూత్రమే. ఈ నేపథ్యంలో ‘సీడీఆర్‌ఐ’తో సమష్టి కృషి ద్వారా ఆర్థిక వనరులు, సాంకేతికత, నైపుణ్య సమీకరణ ద్వారా జి-20 దేశాలు ప్రజానీకానికి ఒక పటిష్ఠ భవితపై భరోసా ఇవ్వగలవు.
మిత్రులారా!
అంతరిక్ష సాంకేతికత యావత్ మానవాళికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్ ప్రగాఢంగా విశ్వసిస్తుంది. అందుకే జి-20 ఉపగ్రహ సమాచార సార్వత్రిక భాగస్వామ్యాన్ని మేం ప్రతిపాదిస్తున్నాం. జి-20 దేశాల అంతరిక్ష సంస్థల నుంచి లభించే ఉపగ్రహ సమాచారం-విశ్లేషణలను అశేష ప్రజానీకానికి... ముఖ్యంగా వర్ధమాన దేశాలకు అందుబాటులోకి తేవడంతోపాటు పరస్పర సంధానానికి తోడ్పడుతుంది.
మిత్రులారా!
ప్రపంచ వృద్ధికి కాలుష్య రహిత ఇంధనం, సుస్థిరత అత్యావశ్యకాలు. అలాగే కీలక ఖనిజాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిని మానవాళి ఉమ్మడి వనరుగా పరిగణించాలి. కాబట్టే, జి-20 కీలక ఖనిజాల వర్తుల కార్యక్రమాన్ని భారత్ ప్రతిపాదిస్తోంది. ఇది రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్-లైఫ్ బ్యాటరీల వంటి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
వర్తుల ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల ద్వారా ప్రాథమిక మైనింగ్‌పై పరాధీనత మాత్రమేగాక సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి కూడా తగ్గి, పర్యావరణానికీ ప్రయోజనం కలుగుతుంది. వర్ధమాన దేశాల్లో సంయుక్త పరిశోధనలు, సార్వత్రిక సాంకేతిక ప్రమాణాలు, ప్రయోగాత్మక రీసైక్లింగ్ సదుపాయాల ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది.
మిత్రులారా!
భారత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని 2030కల్లా మూడు రెట్లు, ఇంధన సామర్థ్య శాతాన్ని 2 రెట్లు పెంచేందుకు న్యూఢిల్లీ జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా లక్ష్య నిర్దేశం చేసుకున్నాం. ఈ దిశగా సౌలభ్య వాతావరణ ఆర్థిక సహాయం తో పాటు సాంకేతికత పరిజ్ఞానాన్ని నిర్దిష్ట వ్యవధిలోగా అందించడంపై అభివృద్ధి చెందిన దేశాలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది.
మిత్రులారా!
వాతావరణ మార్పులు, ఇతరత్రా సమస్యల వల్ల మన వ్యవసాయ రంగం సహా ఆహార భద్రతకు ముప్పు మరింత తీవ్రమవుతోంది. అనేక దేశాల్లో ఎరువులు, సాంకేతికత, రుణం, బీమా, మార్కెట్ సౌలభ్యంలో ఇబ్బందులు పెరుగుతున్నందున రైతులు అగచాట్లు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా భారత్ తన వంతు కృషి చేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత-పోషకాహార మద్దతు కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తోంది. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం సహా పంటల బీమా పథకాన్ని కూడా మేం అమలు చేస్తున్నాం. పోషకాహారం, పర్యావరణం.. రెండింటికీ అద్భుత ఆహార ధాన్యాలైన ‘శ్రీ అన్న లేదా చిరుధాన్యాల’ సాగుకు మేమెంతో ప్రాధాన్యమిస్తున్నాం.
ఈ అంశాలకు సంబంధిత దక్కన్ సూత్రాలను ఢిల్లీ జి-20 సదస్సులో మనం ఆమోదించాం. వాటి ఆధారంగా ఇప్పుడు జి-20 భవిష్యత్ ప్రణాళికను రూపొందించే బాధ్యత మనపైనే ఉంది.
మిత్రులారా!
పునరుత్థాన సామర్థ్యాన్ని ఏ దేశానికి ఆ దేశం స్వయంగా సంతరించుకోజాలదు.
కాబట్టి... పోషణ, ప్రజారోగ్యం, సుస్థిర వ్యవసాయం. విపత్తు సన్నద్ధతల అనుసంధానంతో ప్రపంచ భద్రతను బలోపేతం చేసే సమగ్ర వ్యూహాలను జి-20 ప్రోత్సహించాలి.
అనేకానేక ధన్యవాదాలు...
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(రిలీజ్ ఐడి: 2254689)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
हिन्दी
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam