ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లక్నోలో రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 25 DEC 2025 6:05PM by PIB Hyderabad

భారత్ మాతాకీ - జై!

భారత్ మాతాకీ - జై!

భారత్ మాతాకీ - జై!

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, అత్యంత ప్రజాదరణ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్యాబినెట్లో సీనియర్ మంత్రి, లక్నో పార్లమెట్ సభ్యులు, రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, మంత్రి మండలిలో నా సహచరుడు శ్రీ పంకజ్ చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఇక్కడ ఉన్న ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సోదరీ సోదరులారా,

లక్నో నగరం, ఇప్పుడు కొత్త స్ఫూర్తి కేంద్రాన్ని వీక్షిస్తోంది. దీని గురించి వివరంగా మాట్లాడుకునే ముందు, దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజు.. భారత్‌లో ఉన్న కోట్లాది క్రైస్తవ కుటుంబాలు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకొంటున్నాయి. ఈ క్రిస్మస్ పండగ అందరి జీవితాల్లోనూ సంతోషాన్ని తీసుకురావాలి గాక! ఇదే మన కోరిక.

స్నేహితులారా,

యాదృచ్ఛికంగా డిసెంబర్ 25న దేశ పుత్రులైన – భారతరత్న అటల్ బిహారీ వాజపేయి, భారతరత్న మహామన మదన్ మోహన్ మాలవీయ జయంతిని కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ గొప్ప వ్యక్తులు ఇద్దరూ దేశ గుర్తింపును, ఐక్యతను, గర్వాన్ని సంరక్షించి, దేశ నిర్మాణంలో చెరగని ముద్ర వేశారు.

స్నేహితులారా,

ఈ రోజు డిసెంబర్ 25న మహారాజా బిజిలీ పాశీ జయంతి కూడా.  లక్నోలోని ప్రఖ్యాత బిజిలీ పాశీ కోట ఇక్కడికి సమీపంలోనే ఉంది. మహారాజా బిజిలీ పాశీ వారసత్వంగా అందించిన ధైర్యం, సుపరిపాలన, సమ్మిళిత్వాలను పాశీ సమాజం ముందుకు తీసుకెళుతోంది. కాకతాళీయంగా.. 2000లో మహారాజా బిజిలీ పాశీని గౌరవిస్తూ.. ఓ పోస్టల్ స్టాంపును అటల్ జీ స్వయంగా విడుదల చేశారు.

స్నేహితులారా,

ఈ పవిత్రమైన రోజున, మహామన మాలవీయ జీ, అటల్ జీ, మహారాజా బిజిలీ పాశీకి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

స్నేహితులారా,

కొద్ది సేపటి క్రితమే, రాష్ట్ర ప్రేరణా స్థల్‌‌ను ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. దేశానికి ఆత్మగౌరవం, ఐక్యత, సేవా మార్గాన్ని చూపించిన ఆదర్శాలకు ఈ రాష్ట్ర ప్రేరణా స్థల్ చిహ్నం. ఇక్కడ ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల విగ్రహాల ఎత్తు కంటే వారు అందించిన స్ఫూర్తి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అటల్ జీ ఓ సారి ఏం రాశారంటే:

‘‘నీరవతా సే ముఖరిత్ మధుబన్, పరహిత్ అర్పిత్ అప్నా తన్-మన్, జీవన్ కో శత్-శత్ ఆహుతి మే, జల్నా హోగా, గల్నా హోగా, కదమ్ మిలాకర్ చలనా హోగా’’

(వనం మౌనంగానే మాట్లాడుతుంది...

పరహితం కోసం తనువును, మనసును అంకితం చేయాలి...

జీవన యాగంలో సమిధల్లా  జ్వలించాలి, ద్రవించాలి...

అడుగులో అడుగు వేస్తూ మనమంతా ఒక్కటై సాగాలి)

మనం వేసే ప్రతి అడుగూ, మనం చేపట్టే ప్రతి పనీ దేశ నిర్మాణానికే అంకితం కావాలనే సందేశాన్ని రాష్ట్ర ప్రేరణా స్థల్ అందిస్తుంది. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) అనే సంకల్పాన్ని సమష్టి కృషే సాధిస్తుంది. ఈ అత్యాధునిక స్ఫూర్తి కేంద్రం ప్రారంభం నేపథ్యంలో లక్నోకు, ఉత్తరప్రదేశ్‌కు, ఈ దేశం మొత్తానికి నా శుభాకాంక్షలు. ఇంతకు ముందే వీడియోలో చూపించినట్టుగా.. 30 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించాం. కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ కొండలా చెత్త పేరుకుపోయి ఉండేది. గడచిన మూడేళ్లలో దీనిని పూర్తిగా శుభ్రం చేశాం. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న కార్మికులు, చేతివృత్తుల వారు, ప్లానర్లు, యోగీజీకి, ఆయన మొత్తం బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.

స్నేహితులారా,

దేశానికి దిశానిర్దేశం చేయడంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నిర్ణయాత్మక పాత్రను పోషించారు. భారత్‌లో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానమంత్రుల విధానాన్ని డాక్టర్ ముఖర్జీ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యం అనంతరం.. జమ్మూకాశ్మీర్లో అనుసరించిన విధానం భారత్ ఐక్యతకు, సమగ్రతకు ప్రధాన ముప్పుగా మారింది. 370 వ అధికరణ అడ్డంకిని తొలగించే అవకాశం మా ప్రభుత్వానికి లభించినందుకు బీజేపీ గర్వపడుతోంది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో కూడా భారత రాజ్యాంగం పూర్తిగా అమలవుతోంది.

స్నేహితులారా,

దేశంలో ఆర్థిక స్వావలంబనకు అవసరమైన పునాదిని భారత మొదటి పరిశ్రమల మంత్రి డాక్టర్ ముఖర్జీ వేశారు. భారత్‌లో మొదటి పారిశ్రామిక విధానాన్ని ఆయనే తీసుకొచ్చారు. ఇది పారిశ్రామికీకరణకు అవసరమైన పునాదిని వేసింది. ఇప్పుడు, ఈ స్వావలంబన మంత్రాన్నే మరింత ముందుకు మేం తీసుకెళుతున్నాం. భారత్‌లో తయారైన ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌నే చూడండి! ఓ వైపు విస్తృతంగా చేపడుతున్న ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమంతో చిన్న పరిశ్రమలు, యూనిట్లు బలోపేతమవుతుంటే.. మరో వైపు ఈ రాష్ట్రంలో ప్రధాన రక్షణ కారిడార్ అభివృద్ధి చెందుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతా బ్రహ్మోస్ క్షిపణి శక్తిని చూసింది. ఇది ఇప్పుడు లక్నోలోనే తయారవుతోంది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా ఉత్తర ప్రదేశ్ రక్షణ కారిడార్ పేరుగాంచే సమయం ఎంతో దూరంలో లేదు.

స్నేహితులారా,

అంత్యోదయ స్వప్నాన్ని దశాబ్దాల క్రితమే పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఊహించారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖంపై విరిసే చిరునవ్వే భారత్ సాధించిన ప్రగతికి కొలమానం ఆయన విశ్వసించేవారు. సమగ్ర మానవతావాదం అనే తత్వాన్ని దీనదయాళ్ రూపొందించారు. ఇది శరీరం, మనస్సు, తెలివితేటలు, ఆత్మను సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది. దీనదయాళ్ స్వప్నాన్ని మోదీ తన సంకల్పంగా మార్చుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని, లబ్ధిదారులందరినీ తీసుకొచ్చేలా, సరికొత్త సంతృప్త విధానంతో అంత్యోదయను మేం విస్తరించాం. సంతృప్త స్ఫూర్తి ఉన్నచోట వివక్ష ఉండదు. అదే నిజమైన సుపరిపాలన, నిజమైన సామాజిక న్యాయం, నిజమైన లౌకిక వాదం. మొదటిసారిగా ఎలాంటి వివక్ష లేకుండా కోట్లాది పౌరులు పక్కా ఇళ్లు, టాయిలెట్లు, కుళాయి నీరు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లను పొందుతున్నప్పుడు.. మొదటిసారి కోట్ల మంది పౌరులు ఉచిత ఆహార ధాన్యాలను, ఉచిత వైద్య చికిత్సను పొందుతున్నప్పుడు, చివరి వ్యక్తి వరకు చేరుకొనేలా మనం ప్రయత్నిస్తున్నప్పుడే.. పండిట్ దీన్ దయాళ్ లక్ష్యం వాస్తవ రూపం దాల్చుతుంది.

స్నేహితులారా,

గడచిన దశాబ్దంలో, కోట్లాది మంది భారతీయులు పేదరికాన్ని ఓడించారు. వెనకబాటుకు గురైన వారికి, సమాజంలో చివరి అంచున ఉన్న వారికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం వల్లే ఇది సాధ్యమైంది.

స్నేహితులారా,

2014కు ముందు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల పరిధిలో 25 కోట్ల మంది పౌరులు ఉన్నారు. కేవలం 25 కోట్ల మంది! ప్రస్తుతం దాదాపు 95 కోట్ల మంది భారతీయులు ఈ భద్రతా ఛత్రం కిందకు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రయోజనం పొందుతున్నారు. మీకు ఓ ఉదాహరణ చెబుతాను. ఒకప్పుడు బ్యాంకు ఖాతాలు కొందరికే ఎలా పరిమితమై ఉండేవో.. అలాగే బీమా కూడా కొందరికే అందుబాటులో ఉండేది. అందరికీ బీమా భద్రత కల్పించే బాద్యతను మా ప్రభుత్వం తీసుకుంది. దీనికోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రారంభమైంది. ఇది నామమాత్రపు ప్రీమియంతో రెండు లక్షల రూపాయల వరకు బీమా కవరేజీ అందిస్తుంది. ప్రస్తుతం 25 కోట్లకు పైగా పేద ప్రజలు ఈ పథకంతో అనుసంధానమై ఉన్నారు. అదే విధంగా, ప్రమాద బీమా కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అమలవుతోంది. దాదాపు 55 కోట్ల మంది పేద పౌరులు దీని పరిధిలో ఉన్నారు. వీరంతా గతంలో ఎన్నడూ బీమా గురించి ఆలోచించని వారే.

స్నేహితులారా,

ఈ పథకాల ద్వారా సుమారు రూ.25,000 కోట్ల విలువైన క్లెయిములను చెల్లించాం. ఇది అతి సాధారణ జీవితం గడిపే పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. మరో మాటల్లో చెప్పాలంటే.. ఆపద ఎదురైన సమయాల్లో పేద కుటుంబాలకు ఈ సొమ్ము చేయూతగా నిలుస్తుంది.

స్నేహితులారా,

అటల్ జీ జయంతి అయిన ఈ రోజును సుపరిపాలన దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. చాలాకాలం పాటు ‘గరీబీ హఠావో’ లాంటి నినాదాలనే మంచి పరిపాలనగా ఈ దేశంలో పరిగణించేవారు. కానీ సుపరిపాలనను వాస్తవ రూపంలోకి అటల్ జీ తీసుకువచ్చారు. ప్రస్తుతం డిజిటల్ గుర్తింపు గురించి విస్తృతంగా చర్చ జరగుతోంది. దీనికి సంబంధించిన పునాదిని కూడా అటల్ జీ ప్రభుత్వమే వేసింది. అప్పట్లో ప్రత్యేక కార్డు కోసం ప్రారంభమైన పని ఇప్పుడు ఆధార్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. భారత్‌లో టెలికాం విప్లవాన్ని వేగవంతం చేసిన ఘనత కూడా అటల్ జీకే వెళుతుంది. ఆయన ప్రభుత్వం రూపొందించిన టెలికాం విధానమే ప్రతి ఇంటికీ టెలిఫోన్లు, ఇంటర్నెట్ చేరుకొనేలా ప్రక్రియలను సులభతరం చేసింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న దేశంగా భారత్ ఎదిగింది.

మిత్రులారా!

శ్రీ వాజ్‌పేయి ఇవాళ ఏ లోకంలో ఉన్నా- గడచిన 11 సంవత్సరాల్లో భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా మారిందంటే ఆయనెంతో సంతోషిస్తారు. అందునా పార్లమెంటు సభ్యుడిగా ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ నేడు దేశంలోని మొబైల్‌ తయారీ రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండటం మరింత ఆనందం కలిగిస్తుంది.

మిత్రులారా!

అనుసంధానంపై అటల్ జీ దార్శనికత నేటి 21వ శతాబ్దపు భారత్‌కు బలమైన పునాది వేసింది. ప్రధానిగా ఆయన హయాంలోనే రహదారులతో గ్రామాల అనుసంధాన కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో జాతీయ రహదారుల విస్తరణ దిశగా ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు.

మిత్రులారా!

ఆ క్రమంలో 2000 సంవత్సరం నుంచి ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం కింద ఇప్పటిదాకా సుమారు 8 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మితమయ్యాయి. వీటిలో దాదాపు 4 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు కేవలం గత 10-11 ఏళ్లలోనే పూర్తయ్యాయి.

అలాగే, మిత్రులారా!

దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్‌వే’ల నిర్మాణం అనూహ్య వేగంతో సాగుతోంది. తదనుగుణంగా ఉత్తరప్రదేశ్ కూడా అటువంటి రహదారులు గల రాష్ట్రంగా తన గుర్తింపును సగర్వంగా చాటుకుంటోంది. ఢిల్లీ మెట్రోను ప్రారంభించింది శ్రీ వాజ్‌పేయి కాగా, దేశంలోని 20కి పైగా నగరాల్లో నేడు మెట్రో వ్యవస్థ లక్షలాది ప్రజల జీవితాలను సరళం చేసింది. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం సృష్టించిన సుపరిపాలన వారసత్వానికి కొత్త కోణాలను జోడిస్తూ ఇవాళ కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాయి.

మిత్రులారా!

ముగ్గురు మహనీయులు డాక్టర్ శ్రీ ముఖర్జీ, శ్రీ పండిట్ దీన్‌దయాళ్, శ్రీ వాజ్‌పేయిల నుంచి పొందిన స్ఫూర్తి, దార్శనికత నిండిన వారి కృషి, ఈ మూడు గంభీర విగ్రహాలు కలగలసి ‘వికసిత భారత్’కు బలమైన పునాది వేస్తూ ఇవాళ మనలో నవ్యోత్తేజం నింపుతున్నాయి. అయితే, స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ప్రతి మంచి పని ఘనతనూ ఒకే కుటుంబానికి కట్టబెట్టే ధోరణిని ఎలా పెంచి పోషించారో మనం మరచిపోరాదు. పుస్తకాలైనా, ప్రభుత్వ పథకాలైనా, ప్రభుత్వ సంస్థలైనా, సందుగొందులైనా, రోడ్లయినా, కూడళ్లయినా… ప్రతిదానికీ నామకరణం చేయడంలో ఒకే కుటుంబాన్ని కీర్తించే ఆనవాయితీ తయారైంది. పేర్లు, విగ్రహాలు… తదితరాలన్నీ వారి చుట్టూనే పరిభ్రమించాయి. బీజేపీకి అధికారం సంక్రమించడంతో ఓ కుటుంబం చేతిలో బందీగా ఉన్న దేశానికి ఆ మూస ధోరణి నుంచి విముక్తి లభించింది. ఆ తర్వాత మా ప్రభుత్వం మాతృభూమికి సేవ చేసిన అమరవీరులందరి పాత్రను గుర్తించి, గౌరవిస్తోంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం… ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కొలువైంది. అండమాన్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ద్వీపానికి ఇప్పుడు ఆయన పేరే పెట్టాం.

మిత్రులారా!

బాబాసాహెబ్ అంబేడ్కర్ వారసత్వాన్ని చెరిపివేసే ప్రయత్నాలను ఎవరూ మరువలేరు. ఢిల్లీలో కాంగ్రెస్ పాలకుల కుటుంబం ఈ ఘోర తప్పిదానికి పాల్పడగా, ఉత్తరప్రదేశ్‌లో నాటి సమాజ్‌వాదీ పార్టీ కూడా అదే దుస్సాహసం చేసింది. కానీ, బాబాసాహెబ్ వారసత్వాన్ని మరుగుపరిచే కుట్రలను బీజేపీ అనుమతించలేదు. కాబట్టే, ఢిల్లీ నుంచి లండన్ దాకా బాబాసాహెబ్‌ను గుర్తుచేసే ‘పంచతీర్థాలు’ (5 ప్రదేశాలు) ఆయన వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నాయి.

మిత్రులారా!

వందలాది సంస్థానాలుగా విభజితమైన ఈ దేశాన్ని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఏకం చేశారు. అయినప్పటికీ, స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత ఆయన కృషిని, ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నాలు సాగాయి. సర్దార్ సాహెబ్‌కు నిజంగా దక్కాల్సిన గౌరవమర్యాదలు ఇచ్చింది మా పార్టీయే. ఆయన గౌరవార్థం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించి, ఏక్తా నగర్ పేరిట స్ఫూర్తిదాయక కేంద్రాన్ని రూపుదిద్దింది. అటుపైన ఏటా అక్టోబరు 31న జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రధాన వేడుకను దేశం అక్కడే నిర్వహించుకుంటోంది.

మిత్రులారా!

దేశ స్వాతంత్ర్య సాధన, అనంతర పురోగమనంలో గిరిజన సమాజాల త్యాగాలకూ సముచిత స్థానం లభించలేదు. అయితే, భగవాన్ బిర్సా ముండా వంటి మహనీయుడి గుర్తుగా ఘనమైన స్మారక చిహ్నాన్ని నిర్మించింది మా ప్రభుత్వమే. అలాగే, కొన్ని వారాల కిందటే ఛత్తీస్‌గఢ్‌లో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గిరిజన మ్యూజియం కూడా ప్రారంభమైంది.

మిత్రులారా!

దేశవ్యాప్తంగా ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి… ఇక్కడే- ఉత్తరప్రదేశ్‌లో మహారాజా సుహేల్‌దేవ్ విషయాన్నే గమనించండి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనను స్మరించుకుంటూ స్మారక చిహ్నం నిర్మితమైంది. నిషాద రాజు, శ్రీరాముడు కలుసుకున్న ప్రదేశానికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం కూడా ఇప్పుడు లభించాయి. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ నుంచి చౌరీచౌరా అమరవీరుల దాకా భరతమాత వీరపుత్రుల కృషిని పూర్తి గౌరవంతో, వినయంతో స్మరించుకున్నది బీజేపీ ప్రభుత్వమే.

మిత్రులారా!

అనువంశిక రాజకీయాల ప్రత్యేక లక్షణం ఏమిటంటే- అది నిరంతర అభద్రతా భావనలో కూరుకుపోయి ఉంటుంది. ఇతరులను చిన్నబుచ్చడం అలాంటి నాయకులకు ఒక అవసరంగా మారుతుంది. తద్వారా తమ కుటుంబం ఉన్నతంగా కనిపిస్తూ, వారి వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతుంటాయి. ఇటువంటి మనస్తత్వమే దేశంలో రాజకీయ అంటరానితనానికి దారితీసింది. ఒక్కసారి ఆలోచించండి.. స్వతంత్ర భారత్‌లో చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు గానీ, దేశ రాజధాని ఢిల్లీలోని మ్యూజియం వారిలో అనేక మందిని విస్మరించింది. ఇటువంటి దుస్థితిని చక్కదిద్దింది బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలే. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తే దేశాన్నేలిన గొప్ప ప్రధానమంత్రులందరి మ్యూజియం మిమ్మల్ని స్వాగతిస్తుంది. స్వతంత్ర భారత్‌ను పరిపాలించిన ప్రతి ప్రధానమంత్రికి… వారి పదవీకాలంతో నిమిత్తం లేకుండా సముచిత స్థానం, గౌరవం కల్పించాం.

మిత్రులారా!

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బీజేపీని రాజకీయంగా ‘అంటరాని పార్టీ’గానే పరిగణిస్తున్నాయి. కానీ, అందరినీ సమానంగా గౌరవించాలని బీజేపీ విలువలు ప్రబోధిస్తాయి. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వాల 11 ఏళ్ల పాలనలో మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు, మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీకి ప్రభుత్వం భారతరత్న పురస్కార ప్రదానం చేసింది. శ్రీ ములాయం సింగ్ యాదవ్, ‘తరుణ్ గగోయ్ సహా అనేక మంది ఇతర పార్టీల నాయకులను జాతీయ పురస్కారాలతో సత్కరించింది మా ప్రభుత్వమే. కాంగ్రెస్ లేదా సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఇంతటి సౌహార్ద చర్యలను ఆశించలేం. వారి పాలనలో బీజేపీ నాయకులకు అవమానాలు తప్ప మరేమీ దక్కలేదు.

మిత్రులారా!

బీజేపీ ద్వంద్వ చోదక ప్రభుత్వం వల్ల ఉత్తరప్రదేశ్ ఎనలేని ప్రయోజనాలు పొందుతూ 21వ శతాబ్దపు భారత్‌లో తనదంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటోంది. ఇటువంటి రాష్ట్రం నుంచి పార్లమెంటుకు నేను ప్రాతినిధ్యం వహించడం నిజంగా నా అదృష్టం. ఈ రాష్ట్ర ప్రజలు కష్టజీవులు… వారు తమదైన కొత్త భవిష్యత్‌ గాథను రచిస్తున్నారని నేను సగర్వంగా చెప్పగలను, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ అంటే- శాంతిభద్రతల ఊసులేని రాష్ట్రమనే అంశంపై చర్చకు అంతుండేది కాదు. కానీ, ఇవాళ ఇదే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లడంపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా దేశ పర్యాటక పటంలో యూపీ వేగంగా పురోగమిస్తోంది. అయోధ్యలోని భవ్య రామమందిరం, కాశీ విశ్వనాథ దివ్యధామం ప్రపంచంలో ఈ రాష్ట్ర ప్రతిష్ఠకు కొత్త చిహ్నాలుగా మారాయి. ఇప్పుడు తాజాగా జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణం వంటి ఆధునిక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం గుర్తింపును మరింతగా ప్రకాశింపజేస్తున్నాయి.

మిత్రులారా!

సుపరిపాలన, సౌభాగ్యం, నిజమైన సామాజిక న్యాయానికి ప్రతీకగా మన ఉత్తరప్రదేశ్ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ నేపథ్యంలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ నిర్మాణంపై మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు. నేనిప్పుడు ముగ్గురు మహనీయులు “డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, శ్రీ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి”ల పేర్లు వరుసగా చెబుతాను- అప్పుడు మీరంతా “అమర్ రహే, అమర్ రహే” అని నినదించండి.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ ... అమర్ రహే, అమర్ రహే!

శ్యామా ప్రసాద్ ముఖర్జీ ... అమర్ రహే, అమర్ రహే!

శ్యామా ప్రసాద్ ముఖర్జీ ... అమర్ రహే, అమర్ రహే!

పండిట్ దీన్‌దయాళ్ జీ ... అమర్ రహే, అమర్ రహే!

పండిట్ దీన్‌దయాళ్ జీ ... అమర్ రహే, అమర్ రహే!

పండిట్ దీన్‌దయాళ్ జీ ... అమర్ రహే, అమర్ రహే!

అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ... అమర్ రహే, అమర్ రహే!

అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ... అమర్ రహే, అమర్ రహే!

అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ... అమర్ రహే, అమర్ రహే!

భారత్ మాతా కీ  జై!

వందే మాతరం!

వందే మాతరం!

అనేకానేక ధన్యవాదాలు.

***


(రిలీజ్ ఐడి: 2254320) సందర్శకుల సూచీ సంఖ్య : : 9