మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడుపై తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2025 8:17PM by PIB Hyderabad

ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఉగ్రవాద ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘఘటనలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళులర్పిస్తూ కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

మంత్రివర్గం ఈ తీర్మానాన్ని కూడా ఆమోదించింది:

ఈ నెల 10న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ద్వారా దేశ వ్యతిరేక శక్తుల దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశమంతా చూసింది. ఈ పేలుడు ఫలితంగా అనేక మంది మరణించారు... చాలా మంది గాయపడ్డారు.

అర్థరహితమైన ఈ హింస బారిన పడిన బాధితులకు కేబినెట్ నివాళులర్పిస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది.

గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కేబినెట్ ప్రార్థిస్తుంది. బాధితులకు సంరక్షణను, మద్దతునందిస్తున్న వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సత్వర ప్రయత్నాలనూ కేబినెట్ అభినందిస్తోంది.

అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్మార్గమైన, పిరికిపంద చర్యను కేబినెట్ ఖండిస్తోంది.

ఉగ్రవాదపు అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఏమాత్రం సహించని విధానం పట్ల భారత్ అచంచలమైన నిబద్ధతను కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది.

భారత్‌కు తమ సంఘీభావం, మద్దతును ప్రకటిస్తున్న ప్రపంచ దేశాలకు కేబినెట్ ధన్యవాదాలు తెలుపుతోంది.

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యంగా, దయతో వ్యవహరించిన అధికారులు, భద్రతా సంస్థలు, పౌరులు సకాలంలో, సమన్వయంతో స్పందించిన తీరును కేబినెట్ ప్రశంసిస్తోంది. వారి అంకితభావం, విధి నిర్వహణలో వారి నిబద్ధత ఎంతో ప్రశంసనీయం.

ఈ ఘటనపై దర్యాప్తును అత్యవసరంగా, వృత్తిపరమైన నిబద్ధతతో కొనసాగించాలని... తద్వారా నేరస్థులు, వారికి సహకరించినవారు, వారిని పెంచిపోషిస్తున్న వారిని గుర్తించి న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని కేబినెట్ ఆదేశించింది. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

దేశ భద్రత, ప్రతి పౌరుడి భద్రత పట్ల ప్రభుత్వ నిరంతర నిబద్ధతకు అనుగుణంగా... భారతీయులందరి ప్రాణాలను, శ్రేయస్సును పరిరక్షించడం పట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2254311) సందర్శకుల సూచీ సంఖ్య : : 42