హోం మంత్రిత్వ శాఖ
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026 పై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
ఏ రాష్ట్రానికీ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026 వల్ల దక్షిణ రాష్ట్రాలకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు
ప్రస్తుతం దక్షిణ భారతదేశం నుంచి 129 మంది ఎంపీలు ఉండగా, ఈ బిల్లు తర్వాత ఆ సంఖ్య 195కు పెరుగుతుంది.
నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు; ఉన్న చట్టాన్ని యధాతథంగా మళ్లీ తెచ్చాం.
తమిళనాడు లేదా పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద ఈ చట్టం ప్రభావం ఏమీ ఉండదు; దీనిని 2029 కంటే ముందు అమలు చేసే అవకాశమే లేదు
2029 వరకు జరిగే ఎన్నికలన్నీ ప్రస్తుతం ఉన్న స్థానాలు, ప్రస్తుత విధానం ప్రకారమే జరుగుతాయి.
జనాభా గణన రెండు దశల్లో జరుగుతుంది - మొదట ఇళ్ల జాబితా నమోదు, ఆ తర్వాత వ్యక్తుల వివరాల సేకరణ. ప్రస్తుతం ఇళ్ల లెక్కింపు జరిగే మొదటి దశ కొనసాగుతోంది. ఇళ్లకు కులం ఉండదు కాబట్టి, ఈ దశలో నింపే పత్రంలో కులం తెలిపే అవకాశం లేదు.
వ్యక్తుల లెక్కింపు జరిగేటప్పుడు మాత్రమే కుల గణన అంశం తెరపైకి వస్తుంది.
850 స్థానాలు అనేది అంచనా సంఖ్య మాత్రమే... అది గరిష్ట పరిమితిని సూచిస్తుంది. కచ్చితమైన స్థానాల సంఖ్య 816 ఉంటుంది. ప్రస్తుతం కూడా అంచనా సంఖ్య 543 కాదు, 550 స్థానాలుగా ఉంది.
కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న 28 స్థానాలు 42కు పెరుగుతాయి. మొత్తం స్థానాల్లో ఆ రాష్ట్ర వాటా ఇప్పుడున్న 5.15 శాతంతో పోలిస్తే దాదాపు అంతే స్థాయిలో 5.14 శాతంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. మొత్తం స్థానాల్లో ఆ రాష్ట్ర వాటా 4.60 శాతం నుంచి 4.65 శాతానికి పెరుగుతుంది.
తెలంగాణ స్థానాల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుంది. దాని వాటా 3.13 శాతం నుంచి 3.18 శాతానికి చేరుకుంటుంది
తమిళనాడు ప్రజలకు నేను ఒక భరోసా ఇస్తున్నాను... మీ బలం ఏమాత్రం తగ్గదు; నిజానికి అది పెరుగుతోంది.
తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 స్థానాలు 59కి పెరుగుతాయి. మొత్తం స్థానాల్లో ఆ రాష్ట్ర వాటా 7.18 శాతం నుంచి 7.23 శాతానికి చేరుకుంటుంది.
కేరళలోని 20 స్థానాలు 30కి పెరుగుతాయి.. మొత్తం స్థానాల్లో ఆ రాష్ట్ర వాటా దాదాపు అంతే ఉంటుంది.
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 8:44PM by PIB Hyderabad
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026 పై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ఈ మూడు బిల్లుల వల్ల లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని, అవి పెద్ద ఎత్తున నష్టపోతాయనే అపోహను వ్యాప్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026 వల్ల దక్షిణ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగదని, పైగా మేలు కలుగుతుందని హోం మంత్రి స్పష్టం చేశారు. 50 శాతం పెరుగుదల నమూనా ప్రకారం, లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలు 816కు పెరుగుతాయని, దీనివల్ల అన్ని దక్షిణ రాష్ట్రాల స్థానాల సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు. లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 129 స్థానాలు 195కు పెరుగుతాయని, సభలోని మొత్తం స్థానాల్లో వాటి వాటా కూడా దాదాపు 24 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని హోం మంత్రి వివరించారు.
ప్రస్తుతం ఉన్న 543 మంది సభ్యుల సభలో కర్ణాటకకు 28 మంది సభ్యులు ఉన్నారని, ఇది మొత్తం స్థానాల్లో సుమారు 5.15 శాతమని హోం మంత్రి చెప్పారు. “ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగ సవరణ ఆమోదం పొందిన తర్వాత కర్ణాటక స్థానాల సంఖ్య 28 నుంచి 42కు పెరుగుతుంది. అప్పుడు 816 మంది సభ్యులు ఉండే లోక్‌సభలో కర్ణాటక ప్రాతినిధ్యం సుమారు 5.14 శాతంగా ఉంటుంది, కాబట్టి కర్ణాటకకు ఎటువంటి నష్టం కలగదు” అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 స్థానాలు ఉన్నాయని, 543 మంది సభ్యులున్న సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం సుమారు 4.60 శాతంగా ఉందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ప్రతిపాదిత మార్పుల తర్వాత, సుమారు 50 శాతం పెరుగుదలతో ఈ స్థానాల సంఖ్య 38కి పెరుగుతుందని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం సుమారు 4.65 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా, తెలంగాణకు ప్రస్తుతం 17 స్థానాలు ఉన్నాయని, ప్రస్తుత లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.13 శాతంగా ఉందని చెప్పారు. ప్రతిపాదిత పెరుగుదల తర్వాత, ఆ స్థానాల సంఖ్య 26కు పెరుగుతుందని, దాని ప్రాతినిధ్యం సుమారు 3.18 శాతానికి చేరుకుంటుందని ఆయన వివరించారు.
తమిళనాడు ప్రజల బలం కూడా తగ్గదని, నిజానికి అది పెరుగుతుందని వారికి తాను భరోసా ఇవ్వాలనుకుంటున్నట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. తమిళనాడు ప్రాతినిధ్యం క్షీణించదని, బదులుగా అది వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి 39 మంది సభ్యులు ఎన్నికవుతున్నారు. ఇది 543 మంది సభ్యులున్న సభలో సుమారు 7.18 శాతానికి సమానం. ప్రతిపాదిత 50 శాతం పెరుగుదల తర్వాత, స్థానాల సంఖ్య సుమారు 59కి పెరుగుతుందని, 816 మంది సభ్యులు ఉండే కొత్త సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం సుమారు 7.23 శాతంగా ఉంటుందని శ్రీ అమిత్ షా వివరించారు. అందువల్ల, ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని, బదులుగా పెరుగుతుందని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
కేరళకు ప్రస్తుతం 20 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారని, 543 మంది సభ్యులున్న సభలో ఇది సుమారు 3.68 శాతమని హోం మంత్రి తెలిపారు. ప్రతిపాదిత పెరుగుదల తర్వాత, ఈ సంఖ్య 20 నుంచి 30కి పెరుగుతుందని, ప్రాతినిధ్యం సుమారు 3.67 శాతంగా స్థిరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశం మొత్తం ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం 543 మంది సభ్యుల సభలో దక్షిణ రాష్ట్రాల నుంచి 129 మంది ఎంపీలు వస్తున్నారని, ఇది సుమారు 23.76 శాతమని శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రతిపాదిత 50 శాతం పెరుగుదల తర్వాత, ఈ సంఖ్య 129 నుంచి 195కి పెరుగుతుందని, 816 మంది సభ్యులుండే సభలో వారి ప్రాతినిధ్యం సుమారు 23.87 శాతం, అంటే దాదాపు 24 శాతంగా ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి దక్షిణ రాష్ట్రాల మొత్తం ప్రాతినిధ్య బలం పెరుగుతుందని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రిమండలి కుల గణనను నిర్వహించాలని నిర్ణయించిందని, రాబోయే జనాభా గణనలో కులానికి సంబంధించిన గణాంకాలను కూడా సేకరిస్తామని శ్రీ అమిత్ షా తెలిపారు. జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మొదట ఇళ్ల జాబితా నమోదు, ఆ తర్వాత వ్యక్తుల వివరాల సేకరణ జరుగుతుందని, ప్రస్తుతం ఇళ్ల లెక్కింపు జరిగే మొదటి దశ కొనసాగుతోందని, ఇళ్లకు కులం ఉండదు కాబట్టి ఈ దశలో ఫారమ్‌లో కులం తెలిపే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. జనాభా గణన దశలో వ్యక్తుల వివరాలను సేకరించేటప్పుడు కులానికి సంబంధించిన సమాచారాన్ని కూడా నమోదు చేస్తామని హోం మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుతం ఉన్న నిబంధనలనే యథాతథంగా కొనసాగించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టంలో ఎటువంటి మార్పులు చేయలేదని, చట్టంలోని పుల్‌స్టాప్‌లు, కామాలతో సహా పాత చట్టాన్ని అలాగే పునరావృతం చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ చట్టాన్ని ఏదైనా అవకతవకలకు ఉపయోగించి ఉంటే తాను దానిపై స్పందించలేనని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పునర్విభజన కమిషన్ నివేదిక పార్లమెంటు ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాతే అమలులోకి వస్తుందని హోం మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి, 2029 కంటే ముందు ఈ ప్రక్రియ అమలులోకి వచ్చే ప్రసక్తే లేదని శ్రీ అమిత్ షా తెలిపారు. తమిళనాడులో గానీ లేదా పశ్చిమ బెంగాల్‌లో గానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై ఈ చట్టం ఎటువంటి ప్రభావం చూపదని ఆయన పేర్కొన్నారు. 2029 వరకు జరగబోయే అన్ని ఎన్నికలు ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రకారం, ప్రస్తుత పద్ధతిలోనే ఉంటాయని హోం మంత్రి స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికారం అనేది కేవలం రాజకీయ పార్టీలు లేదా నాయకుల ద్వారా కాకుండా, పౌరుల అభీష్టం, ఆలోచనల ద్వారా నిర్ణయమవుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. 130 కోట్ల మంది ప్రజల తీర్పును ఎవరూ తారుమారు చేయలేరని, అదే సాధ్యమైతే గతంలో ప్రభుత్వ మార్పులు జరిగేవి కావని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో కూడా ప్రజాభిప్రాయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేయలేకపోయారని, ప్రజలు తమ తీర్పును ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే వెల్లడించారని ఆయన చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదని, అటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా ప్రజలు వాటిని తిరస్కరించారనడానికి చరిత్రే సాక్ష్యమని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2252787)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada