పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా సమాచారం


2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు విక్రయమైన 14.3 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు

2026 మార్చి నుంచి సుమారు 4.40 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా.. కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న 4.88 లక్షల మంది వినియోగదారులు

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరాను పర్యవేక్షించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక పాత్ర

రద్దీ లేకుండా దేశవ్యాప్తంగా యథావిధిగా కొనసాగుతున్న ఓడరేవు కార్యకలాపాలు

కువైట్, ఇజ్రాయెల్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులతో పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించిన విదేశీ వ్యవహారాల మంత్రి

24 గంటల హెల్ప్‌లైన్లను కొనసాగిస్తున్న విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు.. భారతీయులకు అందుతున్న సహాయం

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 4:14PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల మధ్య కీలక రంగాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా పనులు కొనసాగేలా చూడటంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అవసరమైన మద్దతును అందించే విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రజా సూచనలు, పౌర అవగాహన

  • పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు. 

  • వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి. 

  • ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫా‌మ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు. 

  • పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు. 

  • ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు

  • ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్‌పీజీ, గృహావసరాల పీఎన్‌జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

  • వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది. 

  • ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.

  • ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.

  • చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

  • గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

  • నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.

  • 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:

    • ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.

    • సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.

    • జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.

    • సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

    • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

    • పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

    • ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.

  • అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి. 

  • ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.

అమలు, పర్యవేక్షణ చర్యలు

  • ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలు చర్యలు కొనసాగుతున్నాయి. 13.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2950 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు. 

  • ఇటీవల 2026 ఏప్రిల్ 11న కేరళలోని తిరువనంతపురం జిల్లా అట్టింగల్‌లో ఒక ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ ప్రాంగణంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 500 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌‌పీజీ కొరత దృష్ట్యా నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా ఈ దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ప్రస్తుతం ఈ కేసుపై విచారణ చేస్తున్నాయి. 

  • ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఇప్పటివరకు 232 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించాయి.. 56 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.

ఎల్‌పీజీ సరఫరా

గృహావసరాల ఎల్‌పీజీ

  • ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

  • ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

  • పరిశ్రమవ్యాప్తంగా నిన్న ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.

  • సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 92 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు డీఏసీ వస్తుంది. 

  • గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది. 

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు

  • మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.

  • కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా.. ఫార్మా, ఆహార రంగం, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తనాలు, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్‌పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయని తెలియజేసింది. అయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.

  • 2026 ఏప్రిల్ 3 వరకు  ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 4450 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 49,300 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.

  • ఇటీవల 2026 ఏప్రిల్ 12న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఐఓసీఎల్ నిర్వహించిన 5 కిలోల ఎఫ్‌టీఎల్ అవగాహన సదస్సులో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ఒక్క రోజే సుమారు 800 సిలిండర్లు విక్రయమయ్యాయి. 

  • 2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 14.3 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. 

  • 13.04.2026 నాడు దేశవ్యాప్తంగా 1.1 లక్షల కిలోల కంటే ఎక్కువ ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. ఇది 2026 ఫిబ్రవరి నెలలోని రోజువారీ సగటు అయిన 77,000 కంటే చాలా ఎక్కువ.

  • వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.

  • 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,31,645 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్‌పీజీ విక్రయమైంది. 69.28 లక్షలకు పైగా (19 కిలోల బరువు గల) వాణిజ్య సిలిండర్లతో సమానం ఇది. 

  • 13.04.2026 నాడు ఒక్కరోజే 8661 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ విక్రయమైంది. 4.5 లక్షలకు పైగా (19 కిలోల బరువు గల) వాణిజ్య సిలిండర్లతో సమానం ఇది.

సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

·       ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తోంది.  దేశీయ గృహ అవసరాల పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాను రక్షిత ప్రాతిపదికన అందిస్తోంది.

·       అందుబాటులో ఉన్న నిల్వలు, రానున్న ఎల్‌ఎన్‌జీ కార్గో షిప్పులను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపులను మరో 5 శాతం పెంచుతున్నారు. ఈ ప్లాంట్లు తమ ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతం సరఫరాను పొందనున్నాయి. ఈ కేటాయింపు 09.04.2026 నుంచి అమలులోకి వచ్చింది.

·       వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్నఆందోళనలను తొలగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు పీఎన్‌జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.

·       గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్‌, ఎంజీఎల్‌, జీఏఐఎల్ గ్యాస్‌, బీపీసీఎల్‌ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

·       సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.

·       ఎల్‌పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.

·       21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

·       సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా పాతిపదికన పరిశీలించడానికి మూడు నెలలపాటు త్వరిత ఆమోద విధానాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.

·       నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

·       పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి  జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి 30 జూన్ 2026 వరకు పొడిగించింది.

·       పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన వనరులను పెంచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను తయారు చేసింది. ఈ నమూనా విధానం రాష్ట్రాలు తమ సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతులను రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ రాష్ట్రాలైతే ఈ విధానాన్ని అమలు చేస్తాయో, వాటికి అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కోటాను కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు.

·       మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 4.40 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. సుమారు 4.88 లక్షల అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం పేరు నమోదు చేసుకున్నారు.

·       ఇప్పటి వరకు 33,000 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

ముడి చమురు లభ్యత/ రిఫైనరీ కార్యకలాపాలు

·       అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.

·       దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

·       భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ప్రకారం..  దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది. ముఖ్యంగా ఔషధ రంగం, ఆహార, పౌర సరఫరాల శాఖ, రసాయనాల శాఖ వంటి కీలక విభాగాలకు వీటిని అందించనున్నారు. పైన చెప్పిన శాఖలకు సంబంధించిన కంపెనీల కోసం రోజుకు 800 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను కేటాయించారు.

రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు

·       దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.

·       మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.

·       దేశీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిలు‌పై లీటరుకు రూ. 55.50,  విమాన ఇంధనంపై లీటరుకు రూ. 42 ఎగుమతి సుంకాన్ని పెంచింది.

·       పెట్రోలు, డీజిటు సాధారణ రిటైల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. పెట్రోలు బంకుల వద్ద వాటి ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

కిరోసిన్‌ లభ్యత, పంపిణీ చర్యలు

·       సాధారణ కేటాయింపులకు అదనంగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ  48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

·       18 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.

సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు

ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికులను సురక్షితంగా ఉంచడానికి ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖ ఈ కింది విషయాలను పేర్కొంది.

·       ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

·       షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. ప్రారంభమైనప్పటి నుంచి 6,292 కాల్స్ , 13,228 కంటే ఎక్కువ ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది.. గత 24 గంటల్లో 219 కాల్స్, 361 ఈమెయిళ్లు అందాయి.

·       డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 85 మందితో సహా.. ఇప్పటివరకు 2,262 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది.

·       దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

·       భారతీయ నావికుల సంక్షేమ, అంతరాయం లేని నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు, ఇతర సముద్రయాన భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.

యుద్ధ ‍ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత

యుద్ధ ప్రభావ ప్రాంతాల్లో భారతీయ సమాజంతో భారత రాయబార కార్యాలయాలు, పోస్టులు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ.. వారి భద్రత, శ్రేయస్సు కోసం సహాయాన్ని అందిస్తూ, అవసరమైన సలహాలను జారీ చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం:

·       పశ్చిమాసియా దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది.

·       కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రితో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రాంతీయ పరిస్థితులు, అక్కడ ఉన్న భారతీయుల యోగక్షేమాలపై చర్చించారు.

·       ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రితో కూడా విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరు నేతలు చర్చలు జరిపారు.

·       అదే విధంగా సింగపూర్, ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల మంత్రులతోనూ విదేశీ వ్యవహారాల మంత్రి  సంభాషించారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

·       గల్ఫ్,  పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

·       సమాచార మార్పిడి, సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

·       ఆ ప్రాంతంలోని భారతీయ సమాజం రక్షణ, భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

·       భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. భారతీయ పౌరులకు సహాయం అందిస్తున్నాయి.

·       స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.

·       ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి రాయబార కార్యాలయాలు పూర్తి సహాయాన్ని అందిస్తున్నాయి. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సాయం అందించడం, వారు భారత్‌కు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

·       గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి భారత్‌కు సుమారు 9,55,000 మంది ప్రయాణికులు చేరుకున్నారు.

·       యూఏఈలో భద్రతా, కార్యాచరణ కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ- భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్‌ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. ఈ రోజు సుమారు 100 విమానాలు నడుస్తాయని అంచనా.

·       సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

·       ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండటంతో ఖతార్ ఎయిర్‌వేస్ నేడు భారత్‌కు సుమారు 10 విమానాలను నడపనుంది.

·       కువైట్ గగనతలం ఇంకా మూసివేసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్‌ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. కువైట్ నుంచి భారతీయ పౌరుల ప్రయాణం సౌదీ అరేబియా మీదుగా కొనసాగుతోంది.

·       బహ్రెయిన్ గగనతలం తెరుచుకుంది. గల్ఫ్ ఎయిర్ త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ చేయని విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్ నుంచి భారతీయుల ప్రయాణాన్ని సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.

·       టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 2,313 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి ఆర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా భారత్‌కు పంపింది. వీరిలో 1028 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.

·       ఇజ్రాయెల్ గగనతలం పరిమిత విమాన కార్యకలాపాలతో పాక్షికంగా తెరిచి ఉంది. ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్, ఈజిప్టు మీదుగా భారత పౌరుల ప్రయాణం కొనసాగుతోంది.

·        ఇరాక్ గగనతలం తెరుచుకుంది. ఇరాకీ ఎయిర్‌వేస్ భారత్‌కు విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత పౌరుల ప్రయాణానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2252053) సందర్శకుల సూచీ సంఖ్య : : 74
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam