సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేవ్స్ ‘ఓటీటీ’లో ‘యోజన.. కురుక్షేత్ర.. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్’ ఉచితం

· ప్రచురణల విభాగం ద్వారా ‘ఇండియా ఇయర్ బుక్‌’ సహా 227 ఈ-పుస్తకాలు ఇకపై పాఠకులకు ఉచితంగా లభ్యం

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2026 4:31PM by PIB Hyderabad

డిజిటల్ విజ్ఞాన సౌలభ్య కల్పన లక్ష్యంగా కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ పరిధిలోని ప్రచురణల విభాగం ద్వారా ప్రధాన పత్రికలు- “యోజన, కురుక్షేత్ర, ఆజ్‌కల్, బాలభారతి, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌ వారపత్రిక”లను ప్రసార భారతి కింద పనిచేసే ‘వేవ్స్ ఓటీటీ’ వేదిక ద్వారా పాఠకులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల ఇకపై దేశవ్యాప్త పాఠకులకు ఈ విజ్ఞాన భాండాగారం నేరుగా లభ్యమవుతుంది.

దేశంలోని పౌరులందరికీ విశ్వసనీయ, విస్తృత సమాచార, సాంస్కృతిక సుసంపన్న కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. దేశవ్యాప్త సామాజిక-ఆర్థిక అంశాలు, గ్రామీణాభివృద్ధి, సాహిత్యం, బాలల విద్య తదితరాలపై విస్తృత విశ్లేషణలకు ఈ నెలవారీ పత్రికలు ఎంతో ప్రసిద్ధి. ఇక  ‘ఎంప్లాయ్‌మెంట్ న్యూస్’ వారపత్రిక యువతరానికి ఉద్యోగావకాశాలు, నియామక ప్రకటనలు, భవిష్యత్‌ మార్గదర్శనం, నైపుణ్యాభివృద్ధిపై విశ్వసనీయ, సకాలంలో సమాచారమిచ్చే వనరుగా ఉపయోగపడుతోంది.

ఈ పత్రికలతో పాటు విస్తృత శ్రేణి ప్రక్రియల సంబంధిత ‘ఈ-పుస్తకాల సమగ్ర ప్రచురణలు కూడా ‘వేవ్స్’ వేదికపై ఉచితంగా అందుబాటులో ఉంటాయి. భారత పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాలపై ప్రామాణిక, సమగ్ర వివరణనిచ్చేదిగా ప్రాచుర్యంగల ప్రతిష్టాత్మక, ప్రధాన ప్రచురణ ‘భారత్ ఇయర్ బుక్’ కూడా ఈ జాబితాలో ఉంది. మొత్తంమీద ప్రస్తుతం 227 ‘ఈ-పుస్తకాలు’ పాఠకులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి.

అంతేకాకుండా తన డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ, ఈ నెలాఖరుకల్లా వేవ్స్ వేదికగా  సుమారు 300 అదనపు ‘ఈ-పుస్తకాల’ను పాఠకులకు చేరువ చేయాలని ప్రచురణల విభాగం యోచిస్తోంది. ఈ మేరకు విజ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించే లక్ష్యంతోపాటు ఈ ప్రచురణలన్నీ నామమాత్రపు ధరతోనూ లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటోంది.

పాఠకుల సౌలభ్యం, పుస్తకాల లభ్యతను మరింత పెంచడంలో భాగంగా ముద్రిత పుస్తకాలను కూడా వేవ్స్ వేదిక ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రచురణల విభాగం వీలు కల్పించింది. ‘ఓఎన్‌డీసీ’ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) చట్రం కింద ‘సీఎస్‌సీ’ గ్రామీణ్ ఈ-స్టోర్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తద్వారా మారుమూల, గ్రామీణ ప్రాంతాలు సహా దేశమంతటా గల పాఠకులకు భౌతిక ప్రతులు నిరంతరం లభ్యమవుతాయి. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా 524 ముద్రిత పుస్తకాలను పాఠకులు కొనుగోలు చేయవచ్చు.

ప్రచురణల పరిధిని విస్తృతం చేయడమే కాకుండా పాఠకుల అభిరుచిలో మార్పులకు అనుగుణంగా డిజిటల్ వేదికల వినియోగంపై ప్రచురణల విభాగం నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. ఉచిత డిజిటల్ సదుపాయాన్ని, చౌక ధరలో లభించే కంటెంట్‌ను, భౌతిక పుస్తకాల లభ్యతను అనుసంధానించడం ద్వారా సమగ్ర, సార్వజనీన పఠనావరణాన్ని సృష్టించాలని ప్రచురణల విభాగం లక్ష్యనిర్దేశం చేసుకుంది.

ఈ నేపథ్యంలో వేవ్స్ ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చిన విస్తృత శ్రేణి పత్రికలు, ‘ఈ-పుస్తకాల’ను సద్వినియోగం చేసుకోవాలని ప్రచురణల విభాగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2250749) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam