పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2026 5:40PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు సమాచారం అందించటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతోన్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యల గురించి తాజా సమాచారాన్ని అందించారు. ఔషధ (ఫార్మాస్యూటికల్) రంగానికి సంబంధించిన వివరాలను రసాయనాలు- ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం తెలియజేసింది.
ఔషధ రంగంపై తాజా సమాచారం
ప్రస్తుత పరిస్థితులపై రసాయనాలు- ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ (ఫార్మాస్యూటికల్స్) విభాగం ఈ కింది సమాచారాన్ని అందించింది.
· పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన ఆటంకాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇది ముఖ్యంగా మందుల తయారీలో వాడే ద్రావకాలు(సాల్వెంట్స్), ఏపీఐలు (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) లభ్యతపై ప్రభావం చూపుతోంది.
· ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ దేశంలో మందులు, ఫార్మాస్యూటికల్స్ విక్రయ ధరలలో ఎటువంటి పెద్ద పెరుగుదల నమోదు కాలేదు.
· ఔషధ రంగానికి మద్దతునిచ్చేందుకు, అత్యవసర- ప్రాణరక్షక మందుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి రెవెన్యూ శాఖ 2026 ఏప్రిల్ 1 నాటి నోటిఫికేషన్ ద్వారా 40 పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించింది.
· ఔషధ రంగానికి పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలతో బలమైన విలువ గొలుసు అనుసంధానం ఉంది. ముఖ్యంగా మందులు, సిరప్‌ల తయారీకి అవసరమైన కీలకమైన ఫీడ్‌స్టాక్స్, ద్రావకాల కోసం ఫార్మా రంగం వీటిపైనే ఆధారపడి ఉంటుంది.
· ఫార్మాస్యూటికల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు ఎటువంటి అంతరాయం లేకుండా లభించేలా చూసేందుకు ఫార్మాస్యూటికల్స్ విభాగం.. పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖతో పాటు రసాయనాలు- పెట్రోకెమికల్స్ విభాగంతో కలిసి సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది. లభ్యతను బట్టి ఈ ద్రావకాలను ముఖ్యంగా గణనీయమైన మొత్తంలో ప్రొపిలీన్‌ను రసాయనాలు, ద్రావకాల తయారీదారులకు నిష్పత్తి ప్రకారం కేటాయిస్తున్నారు.
· ఔషధ పరిశ్రమకు అవసరమైన కీలకమైన ద్రావకాల్లో ప్రొపిలీన్, అమ్మోనియా, మిథనాల్ ప్రధానమైనవి కాగా.. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తయారీకి బ్యూటనాల్ తక్కువ పరిమాణంలో అవసరమవుతుంది.
· ప్రొపిలీన్ అత్యంత కీలకమైన ముడి పదార్థంగా ఉంది. ఎందుకంటే దీనిని ఐసోప్రోపైల్ ఆల్కహాల్ (ఐపీఏ), ఐసోబ్యూటైల్ బెంజీన్ తయారీలో ఉపయోగిస్తారు. వీటిని ఐబూప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందుల తయారీలో విస్తృతంగా వాడుతారు.
· ప్రస్తుతం ప్రొపిలీన్ సరఫరాలో ఎక్కువ భాగాన్ని బీపీసీఎల్‌కు (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) చెందిన కొచ్చి, ముంబయి చమురు శుద్ధి కేంద్రాల నుంచి సమకూరుస్తున్నారు. ఇక్కడి నుంచి ఐసోప్రోపైల్ ఆల్కహాల్ తయారు చేసే ప్రధాన కంపెనీలకు సరఫరా జరుగుతోంది.
· సంబంధిత విభాగాల మద్దతుతో ఔషధ తయారీ యూనిట్లకు అవసరమైన అమ్మోనియా, ఇతర సంబంధిత ముడి పదార్థాల తగినంత సరఫరాకు ఎరువుల పరిశ్రమ భరోసా ఇచ్చింది.
· మిథనాల్ సరఫరా కొంత ఆందోళన కలిగించినప్పటికీ అస్సాం పెట్రోకెమికల్స్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ - కెమికల్స్ (జీఎన్‌ఎఫ్‌సీ) తగినంత పరిమాణంలో సరఫరా చేయడానికి అంగీకరించాయి. వీటికి సంబంధించిన రవాణా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది.
· మెట్ఫార్మిన్, ఆస్పిరిన్ వంటి ఔషధాల తయారీలో మధ్యస్థ పదార్థాలుగా ఉపయోగించే మిథైలేటెడ్ అమ్మోనియం ఉత్పత్తుల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
· అనేక ప్రాణరక్షక మందుల తయారీలో వాడే కీలక ముడి పదార్థం అయిన మోర్ఫోలిన్‌పై ఉన్న నాణ్యత నియంత్రణ ఉత్తర్వును కెమికల్స్, పెట్రోకెమికల్స్ విభాగం తాత్కాలికంగా నిలిపివేసింది.
· ఔషధాల ప్యాకేజింగ్‌లో వాడే అల్యూమినియం సరఫరాలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రస్తుతం సరఫరా పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో ఈ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
· యాంప్యూల్స్, వయల్స్ సీలింగ్ కోసం ఉపయోగించే ఎల్‌పీజీ, హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్‌డీ) సరఫరాను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఔషధ తయారీ యూనిట్లకు వీటి కొరత ఏమీ లేదు.
· అత్యవసర మందుల ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ సందర్భాన్ని బట్టి కీలకమైన ముడి పదార్థాల సరఫరాకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితి.. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ విషయంలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయొద్దని.. కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
· ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
· ప్రజలు పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహించారు.
· ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మధ్య ప్రభుత్వం గృహావసరాల ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరాకు.. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తోంది.
· సరఫరా, డిమాండ్ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. ఎల్‌పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. కీలక రంగాలకు సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు.
· ఎల్‌పీజీ డిమాండ్ ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3300కి పైగా దాడులు నిర్వహించి దాదాపు 600ల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా 1.16 లక్షలకు పైగా దాడులు నిర్వహించారు.
· ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (పీఎస్‌యూ ఓఎంసీ) ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా 1870కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన 189 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లపై జరిమానాలు విధించాయి.. 53 డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లను సస్పెండ్ చేశాయి.
ఎల్‌పీజీ సరఫరా స్థితిగతులు
గృహావసరాల ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· పరిశ్రమ అంతటా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 92 శాతానికి పెంచారు.
· గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
· 08.04.2026న దేశవ్యాప్తంగా 51.5 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
· కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా.. ఫార్మా, ఆహార రంగం, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తనాలు, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్‌పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయని తెలియజేసింది. అయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.
· ఈ కేటాయింపు కింద బల్క్ ఎల్‌పీజీ పొందాలంటే సంబంధిత పరిశ్రమలు తప్పనిసరిగా 21.03.2026 నాటి లేఖలోని పారా (బీ) ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. పారా (సీ) ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్ కోసం సీజీడీ సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే పైన పేర్కొన్న పరిశ్రమలు తమ తయారీ ప్రక్రియలో ఎల్‌పీజీని ఒక ముఖ్యమైన ముడిసరుకుగా ఉపయోగిస్తున్నా లేదా సహజ వాయువుతో భర్తీ చేయలేని ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తున్నా పీఎన్‌జీ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
· ఈ చర్యలు సరఫరా గొలుసులో అంతరాయాలను నివారించడమే కాకుండా నిత్యావసరాల కొరత ఏర్పడకుండా చూస్తాయని.. ప్రస్తుత ప్రపంచ సంక్షోభాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేలా చేస్తాయని భావిస్తున్నారు.
· కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026 మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు ఉన్న సగటు రోజువారీ సరఫరా ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఇది 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితి కంటే అదనంగా ఉంటుంది. ఈ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో వీటిని కేవలం తమ రాష్ట్రంలోని వలస కార్మికులకు సరఫరా చేయడానికి మాత్రమే వినియోగించాలి.
· గడిచిన 6 రోజుల్లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఎఫ్‌టీఎల్) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 2000 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 20,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· 2026 ఫిబ్రవరి నెలలో రోజువారీ సగటు విక్రయాలు 77,000గా ఉండగా దానికి భిన్నంగా 08.04.2026 నాడు దేశవ్యాప్తంగా 1.06 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· 2026 మార్చి 23 నుంచి వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలతో పాటు విద్యార్థులకు సుమారు 10 లక్షల 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అందాయి.
· వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 99,796 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్‌పీజీ (ఇది 52.5 లక్షల కంటే ఎక్కువ 19-కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది. నిన్న ఒక్కరోజే 6711 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (ఇది 3.5 లక్షల కంటే ఎక్కువ 19-కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
· గృహాలకు పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణా కోసం 100 శాతం సరఫరా సహా, ప్రాధాన్యతా రంగాలకు రక్షిత సరఫరాలు కొనసాగుతున్నాయి.
* అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ చేసిన ఎల్ఎన్‌జీ కార్గో రాకల ఆధారంగా... ఎరువుల కర్మాగారాల ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి చేరుకునేలా, వాటికి కేటాయించే మొత్తం గ్యాస్‌ను 09.04.2026 నుంచి అదనంగా 5 శాతం పెంచుతున్నారు.
* 06.04.2026 నుంచి అమలులోకి వచ్చేలా, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లు సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను మరో 10 శాతం పెంచారు.
* వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
* ఐజీఎల్, ఎమ్‌జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
* సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
* ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును భారత ప్రభుత్వం 18.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
*గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళం వంటి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులను పొందుతున్నాయి.
* పైప్‌లైన్‌లు అందుబాటులో ఉన్నచోట పాఠశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, అంగన్‌వాడీ కిచెన్‌ల వంటి సంస్థలను ఐదు రోజుల్లోగా పీఎన్‌జీతో అనుసంధానించాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.
రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిశీలించడానికి, సీజిడీ మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల పాటు త్వరిత ఆమోద విధాన ప్రణాళికను అమలు చేస్తోంది.
· నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించడం సహా నివాస ప్రాంతాలు, సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తూ ఇంధన భద్రత బలోపేతం ద్వారా భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
· పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను పీఎన్‌జీఆర్‌బీ 2026 జూన్ 30 వరకు పొడిగించింది.
· పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం ఒక రాష్ట్ర సీబీజీ విధాన నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఈ నమూనా విధానం ఉద్దేశించబడింది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు తదుపరి విడతలో అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులకు ప్రాధాన్యమిస్తారు.
· మార్చి 2026 నుంచి సుమారు 3.97 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. దాదాపు 4.30 లక్షల అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్‌ల కోసం నమోదు చేసుకున్నారు.
· MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా 18,000 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను వదులుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో, పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయి.
· గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశంలోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు సహా రిఫైనింగ్ కంపెనీలను, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) నిర్ధారించిన నిర్దిష్ట పరిమాణం, రిఫైనరీ వనరు ఆధారంగా... ఫార్మాస్యూటికల్స్ విభాగం, ఆహార-ప్రజా పంపిణీ విభాగం, రసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగం వంటి కీలక రంగాలకు సీ3, సీ4 స్ట్రీమ్‌లను కనీస పరిమాణాల్లో అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం 01.04.2026 తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.
పై విభాగాలకు సంబంధించిన కంపెనీలకు రోజుకు 800 మెట్రిక్ టన్నుల కేటాయింపులు చేస్తున్నారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల చర్యలు
దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను ఆదుకోవడం కోసం భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
దేశీయంగా తగినంత లభ్యతను నిర్ధారించడం కోసం డీజిల్‌పై లీటరుకు రూ. 21.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై లీటరుకు రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాన్ని విధించారు.
· రిటైల్ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా యథాతథంగా ఉన్నాయి.
వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పౌరులకు సూచించింది. పత్రికా సమావేశాల ద్వారా కచ్చితమైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000ల కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· ఎస్‌కేవో-రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్దేశిత పీఎస్‌యూ ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్ల ద్వారా వంట, దీపాల ప్రయోజనం కోసం పీడీఎస్ సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్‌కేవో) పంపిణీకి 2026 మార్చి 29 నాటి గెజిట్ నోటిఫికేషన్ అనుమతిస్తుంది.
· ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ సంస్థల ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్లు (ప్రాధాన్యంగా కంపెనీ యాజమాన్యంలోనివి లేదా కంపెనీ నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ ఎస్‌కేవోను నిల్వ చేయడానికి అనుమతిస్తున్నారు.
ఈ పీఎస్‌యూ ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్లను ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగం నియమిస్తుంది.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్, లదాఖ్‌లు దీని అవసరం లేదని సమాచారమిచ్చాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లోని ప్రస్తుత నౌకా వాణిజ్య పరిస్థితితో పాటు భారతీయ నౌకలు, సిబ్బంది రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. కింది విషయాలు తెలియజేశారు:
· విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలతో నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తూ... పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు.
· 2026 ఏప్రిల్ 5న హార్మూజ్ జలసంధిని దాటిన భారత జెండా కలిగిన ఎల్‌పీజీ నౌక గ్రీన్ ఆశా... ఈ రోజు ఉదయం జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్‌పీఏ)కి సురక్షితంగా చేరుకుంది.
· నౌకా యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిలో పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 5,647 కాల్‌లు, 12,043 ఈమెయిళ్లను నిర్వహించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 166 కాల్‌లు, 317 ఈమెయిళ్లూ ఉన్నాయి.
· గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో చేరుకున్న 49 మంది సహా, ఇప్పటివరకు మొత్తం 1,803 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో డీజీ షిప్పింగ్ సహకరించింది.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు ఎటువంటి రద్దీ లేకుండా సాధారణంగా కొనసాగుతున్నాయి.
· గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతున్నాయని ధృవీకరించాయి.
· భారతీయ నావికుల సంక్షేమాన్ని, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
భారత మిషన్ల ద్వారా అందిస్తున్న సహాయం సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలను బ్రీఫింగ్ సందర్భంగా పంచుకున్నారు. కింది విషయాలు తెలియజేశారు:
పశ్చిమాసియాలోని పరిణామాలను భారత్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది.
విదేశాంగ మంత్రి 2026 ఏప్రిల్ 11-12 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా, భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆయన యూఏఈ నేతలతో సమావేశమవుతారు.
· భారత్ ఉన్నత స్థాయి సమావేశాల ద్వారా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది.
· పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి 2026 ఏప్రిల్ 9–10 తేదీల్లో ఖతార్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
· గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపైనే ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయి.
· భారత మిషన్లు, పోస్టులు ఇరవై నాలుగు గంటలూ హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తూ, భారత పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు... విమాన, ప్రయాణ పరిస్థితులు... కాన్సులర్ సేవలకు సంబంధించిన సమాచారం సహా ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· ఈ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీ సంఘాలు, వృత్తి నిపుణుల సమూహాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వాములతో భారత రాయబార కార్యాలయాలు సమన్వయం కొనసాగిస్తున్నాయి.
· గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 8,15,000 మంది ప్రయాణికులు భారత్‌కు వచ్చారు.
· యూఏఈలోని విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా యూఏఈ-భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తున్నాయి. ఈ రోజు సుమారు 85 విమానాలు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు దేశానికి సుమారు 8–10 విమానాలను నడపనుంది.
· కువైట్ గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను భారత్‌కు నడుపుతున్నాయి. కువైట్ నుంచి భారత పౌరుల ప్రయాణం సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు కొనసాగుతోంది.
· బహ్రెయిన్ గగనతలం ఇప్పుడు తెరుచుకుంది. గల్ఫ్ ఎయిర్ త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్ నుంచి భారత పౌరులు భారత్‌కు ప్రయాణించడానికి సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
· టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 971 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు సహా మొత్తం 2,170 మంది భారతీయ పౌరులు ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మీదుగా భారత్ తిరిగి వెళ్లేందుకు సౌకర్యం కల్పిస్తోంది.
· ఇజ్రాయెల్ గగనతలం మూసి ఉంది. భారత పౌరులు జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారత్‌కి ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు.
· విమాన కార్యకలాపాలు ఇంకా తిరిగి ప్రారంభం కానప్పటికీ, ఇరాక్ గగనతలం ఇప్పుడు తెరిచి ఉంది. భారత పౌరులు జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు ప్రయాణించడానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
***