సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నకిలీ వార్తల కట్టడికి ప్రభుత్వ బహుళ అంచెల వ్యవస్థ
సమాచార విశ్వసనీయతను మెరుగుపరచడమే ఫ్యాక్ట్ చెక్ విభాగం, ఐటీ నియమాలు, మీడియా నిబంధనల లక్ష్యం
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, ఖచ్చితమైన సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 4:09PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ విభాగం (ఎఫ్‌సీయూ) పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ఈ విభాగం గుర్తిస్తుంది. అధికారికంగా వార్తల వాస్తవికతను ధ్రువీకరించి, సరైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా సరిహద్దు జిల్లాలతో సహా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారాన్ని, దేశ వ్యతిరేక కథనాలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వేగంగా గుర్తించి అడ్డుకుంది. అబద్ధపు ప్రచారాలపై తక్షణమే స్పందించి, తనిఖీ చేసి.. వాస్తవ సమాచారాన్ని అందించడం ద్వారా తప్పుదోవ పట్టించే కథనాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఆపింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో డిజిటల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న సుమారు 1,400కు పైగా యూఆర్ఎల్‌లను బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ యూఆర్‌ఎల్‌లలో తప్పుడు, తప్పుదారి పట్టించే, భారత్ వ్యతిరేక వార్తలు, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే సోషల్ మీడియా ఖాతాల నుంచి మతపరంగా సున్నితమైన అంశాలు, భారత సాయుధ దళాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు ఉన్నాయి.
సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం.. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, భద్రత, ప్రజా శాంతి పరిరక్షణకు భంగం కలిగించే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులను నిలిపివేయడానికి ప్రభుత్వం అవసరమైన ఆదేశాలను జారీ చేస్తుంది.
పైన పేర్కొన్న చర్యలతోపాటు వివిధ మీడియా వేదికలపై నకిలీ వార్తలను కట్టడి చేయడానికి, అందుబాటులో ఉన్న చట్టపరమైన, సంస్థాగత యంత్రాంగాల ద్వారా ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటుంది. వీటిలో ముఖ్యమైనవి.
ప్రింట్ మీడియా: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన ‘పాత్రికేయ ప్రవర్తనా నియమావళి’ని వార్తాపత్రికలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలు నకిలీ, పరువు నష్టం కలిగించే, తప్పుదారి పట్టించే వార్తల ప్రచురణను నిరోధిస్తాయి. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఫిర్యాదులు వస్తే..పీసీఐ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం కౌన్సిల్ విచారణ జరుపుతుంది. విచారణ అనంతరం తప్పు రుజువైతే సంబంధిత వార్తాపత్రికను, సంపాదకులను, జర్నలిస్టులను అభిశంసించడం, హెచ్చరించడం, మందలించడం వంటి చర్యలు తీసుకుంటుంది.
టెలివిజన్: కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995 కింద ఉన్న ప్రోగ్రామ్ కోడ్‌ను టెలివిజన్ ఛానళ్లు అనుసరించాలి. అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేసే లేదా సగం నిజాలతో కూడిన విషయాలను ప్రసారం చేయకూడదని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ (సవరణ) నిబంధనలు 2021 ప్రకారం ఛానళ్లు ఈ కోడ్‌ను ఉల్లంఘిస్తే వాటిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అందుబాటులో ఉంది. ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటారు.
డిజిటల్ మీడియా: డిజిటల్ మీడియాలో వార్తలు, సమకాలీన విషయాలను అంశాలను ప్రచురించేవారు, ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురణకర్తల కోసం సమాచార సాంకేతిక (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు 2021 (ఐటీ రూల్స్ 2021) ఒక నైతిక నియమావళిని రూపొందించాయి. ఈ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడు అంచెల సంస్థాగత యంత్రాంగం పనిచేస్తుంది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల (నియంత్రణ) చట్టం 1995 ప్రకారం ప్రోగ్రామ్ కోడ్, ప్రకటనల నియమావళిని పాటించేలా ప్రైవేటు శాటిలైట్ టీవీ ఛానెళ్లు ఖచ్చితంగా పాటించేలా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేస్తుంది.
సరిహద్దు జిల్లాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రామాణికమైన, సకాలంలో, స్థానికంగా సంబంధిత సమాచారాన్ని అందించడంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ప్రసారమయ్యే కార్యక్రమాలు స్థానిక సమాజానికి తక్షణ అవసరాలను తీర్చేవిగా, స్థానిక సమస్యలను పరిష్కరించేవిగా, తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా అరికట్టేవిగా ఉండాలి. కమ్యూనిటీ రేడియోలో ప్రసారమయ్యే అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి, స్థానిక ప్రాంత సభ్యులతో కూడిన ‘అడ్వైజరీ అండ్ కంటెంట్ కమిటీ’ని ఏర్పాటు చేయాలి. ప్రేక్షకులకు సమాచారం సులభంగా అర్థం కావడానికి, మెరుగైన పంపిణీ కోసం ఈ కార్యక్రమాలను ప్రాధాన్యత ప్రకారం స్థానిక భాషలు, మాండలికాలలో ప్రసారం చేయాలి..
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో శ్రీ ఉమ్మేద రామ్ బెనివాల్ అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2248617)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23