పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం
వదంతులను అరికట్టేందుకు మీడియా సమావేశాల ద్వారా సరైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్రాలు, యూటీలకు విజ్ఞప్తి
డీ-పీఎన్‌జీ కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలకు ఆదేశం.. జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0 గడువు 30.06.2026 వరకు పొడిగింపు
మార్చిలో 3.1 లక్షల గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి.. మరో 2.7 లక్షల నూతన కనెక్షన్లు ఇవ్వటంతో పాటు గ్యాస్ సరఫరా ప్రారంభం
మార్చి 01, 2026 నుంచి రోజుకు సుమారు 50 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ
వలస కూలీలకు మార్చి 23 నుంచి ఇప్పటివరకు 3.2 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల విక్రయం.. కేవలం నిన్న ఒక్కరోజే 63,000కుపైగా విక్రయాలు
ఇప్పటివరకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 959 మంది భారత నావికులు.. గడచిన 24 గంటల్లో స్వదేశానికి చేరిన 9 మంది...
భారత్ వ్యాప్తంగా సాధారణంగా పోర్టు కార్యకలాపాలు... ఎక్కడా రద్దీ లేదని నివేదిక
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు భారత్‌కు తిరిగి వచ్చిన 5.72 లక్షల మంది ప్రయాణికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
హెల్ప్‌లైన్లతో రాయబార కార్యాలయాలు, ప్రత్యేక కేంద్రాల ద్వారా నిరంతర సేవలు
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 2:55PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం క్రియాశీలకంగా, సమన్వయంతో చర్యలు చేపడుతోంది. నిరంతరం ఇంధన సరఫరాను కొనసాగించటం, సముద్రయాన కార్యకలాపాల భద్రత, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు సహకరించటంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ ప్రయత్నాలకు సంబంధించిన పూర్తి వివరాలు:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హర్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించిన ప్రస్తుత వివరాలు:
ముడి చమురు, రిఫైనరీలు
అధిక సామర్థ్యంతో అన్ని రిఫైనరీలు పనిచేస్తున్నాయి. తగినంత ముడిచమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి.
దేశీయ వినియోగానికి అనుగుణంగా రిఫైనరీల్లో ఉత్పత్తి పెరిగింది.
రిటైల్ కేంద్రాలు
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ కేంద్రాలు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. దీని ప్రభావం నుంచి వినియోగదారులను రక్షించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించి, ఆ భారాన్ని కొంతవరకు తామే భరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) కొరత లేకుండా చూసేందుకు ఎగుమతులపై ప్రభుత్వం విధించిన పన్ను ప్రకారం.. లీటరు డీజిల్‌పై రూ. 21.5, లీటరు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాన్ని విధించింది.
ఇంధన కొరతపై పుకార్ల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో ముందస్తుగా ఇంధనాన్ని కొనుగోలు చేయటంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
అవాస్తవాలను నమ్మవద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. వదంతులను అరికట్టేందుకు మీడియా సమావేశాలను నిర్వహించి ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.
సహజ వాయువులు
డీ-పీఎన్‌జీ, సీఎన్జీ రవాణా విభాగాలకు 100 శాతం గ్యాస్ సరఫరా చేస్తూ వినియోగదారులకు ప్రాధాన్యతనిస్తున్నారు.
గ్రిడ్‌తో అనుసంధానమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సగటు వినియోగంలో 80 శాతం మేర సరఫరా జరుగుతోంది.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై ఆందోళనలను పరిష్కరించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యతతో పీఎన్‌జీ కనెక్షన్లను అందించాలని నగర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతమున్న యూరియా ప్లాంట్లకు గ్యాస్ సరఫరా స్థిరంగా ఉంది. గత 6 నెలల సగటు వినియోగంలో సుమారు 70-75 శాతం మేర సరఫరా జరుగుతోంది. ఈ సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు, పైప్‌లైన్ వ్యవస్థను సజావుగా నిర్వహించేందుకు అదనపు ఎల్‌ఎన్‌జీ కార్గోలు, రీగ్యాసిఫైడ్ ఎల్‌ఎన్‌జీ (ఆర్‌ఎల్‌ఎన్‌జీ)ని సమకూరుస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలతో సహా అన్ని పారిశ్రామిక వినియోగదారులకు అదనంగా అవసరమయ్యే గ్యాస్ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. తద్వారా గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ఆ అవసరాలను తీర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తాయి.
ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీడీజీ కంపెనీలు గృహ, వాణిజ్య అవసరాలకు పీఎన్‌జీ కనెక్షన్లను తీసుకునే వారికి ప్రోత్సాహకాలను ప్రకటించాయి.
సీడీజీ వ్యవస్థ విస్తరణకు అవసరమైన దరఖాస్తుల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, యూటీ ప్రభుత్వాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది.
భారత ప్రభుత్వ 18.03.2026 నాటి లేఖ ప్రకారం.. వాణిజ్య ఎల్పీజీ నుంచి పీఎన్‌జీ వైపు మారేందుకు సహకరించే రాష్ట్రాలు, యూటీలకు కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10% వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను కేంద్రం ప్రతిపాదించింది. సీజీడీ వ్యవస్థను ప్రోత్సహించటానికి సంస్కరణలను చేపట్టిన పలు రాష్ట్రాల నుంచి ఎంఓపీఎన్‌జీ దరఖాస్తులు అందాయి. ఆ దరఖాస్తుల ఆధారంగా కొన్ని రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు చేయాల్సిందిగా సిఫార్సు చేసింది.
పీఎన్‌జీఆర్‌బీ 23.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా గ్యాస్ పైప్‌లైన్ మౌలిక సదుపాయాలున్న చోట.. హస్టల్ వసతి గల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ వంటశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు 5 రోజుల వ్యవధిలోగా పీఎన్‌జీ కనెక్షన్లు అందించేందుకు ప్రయత్నించాలని అన్ని సీజీడీ సంస్థలను ఆదేశించింది.
సీజీడీ మౌలిక సదుపాయాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 నాటి లేఖ ద్వారా "తక్కువ కాలపరిమితితో సీజీడీ మౌలిక సదుపాయాలకు వేగవంతమైన ఆమోద వ్యవస్థ"ను అమల్లోకి తెచ్చింది. రాబోయే 3 నెలల పాటు ఈ విధానం అమల్లో ఉంటుంది. దీనిద్వారా సీజీడీ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియకు ప్రాధాన్యతనిస్తారు.
భారత ప్రభుత్వ 24.03.2026 నాటి గెజిట్ ప్రకటన ప్రకారం.. నిత్యావసర వస్తువుల చట్టం-1955 ద్వారా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు-2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణకు క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అందిస్తుంది. భూసేకరణ, అనుమతుల్లో జాప్యాన్ని నివారించటం ద్వారా నివాస ప్రాంతాలతో సహా అన్నిచోట్లా సహజవాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. పీఎన్‌జీ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయటమే కాక, చివరి వినియోగదారుడికి కూడా గ్యాస్ అనుసంధానతను మెరుగుపరుస్తుంది. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించటం ద్వారా భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లటానికి ఇది తోడ్పడుతుంది.
రక్షణ దళాల నివాస ప్రాంతాలు, యూనిట్ లైన్లలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు స్వల్పకాలిక విధాన మార్పులతో రక్షణ మంత్రిత్వ శాఖ మార్చి 27, 2026న ఉత్తర్వు జారీ చేసింది. ఈ సవరణలు జూన్ 30, 2026 వరకు అమల్లో ఉంటాయి.
ఛైర్‌పర్సన్ (పీఎన్‌జీఆర్‌బీ) 30.03.2026న దూర విధానంలో సమావేశాన్ని నిర్వహించి డీ-పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీడీజీ సంస్థలను ఆదేశించారు. దేశవ్యాప్తంగా పీఎన్‌జీ విస్తరణ వేగంగా స్థిరంగా కొనసాగించేందుకు జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0 (01.01.2026 నుంచి 31.03.2026) గడువును 30.06.2026 వరకు పొడిగించారు.
ఇళ్లు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, మెస్‌లు, క్యాంటీన్లతో కలిపి మార్చి నెలలో మొత్తం 3.1 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లకు సరఫరా ప్రారంభమైంది. అదనంగా, 2.7 లక్షలకు పైగా ఇచ్చిన నూతన కనెక్షన్లకు గ్యాస్ సరఫరా కొనసాగుతోంది.
ఎల్పీజీ
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా ఎల్పీజీ సరఫరా ప్రభావితమైంది.
గృహ ఎల్పీజీ సరఫరా:
ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద గ్యాస్ నిల్వలు అయిపోయినట్లు నివేదికలు లేవు.
నిన్నటి లెక్కల ప్రకారం…. పరిశ్రమ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్స్ 92 శాతానికి పెరిగాయి.
పంపిణీదారుల స్థాయిలో గ్యాస్ పక్కదారి పట్టకుండా నిరోధించటానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీలను 53 శాతం (ఫిబ్రవరి-2026లో) నుంచి నిన్నటికి 83 శాతానికి పెంచారు.
మార్చి 01, 2026 నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు రోజుకు సగటున 50 లక్షలకు పైగా గృహావసర ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేశాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా:
ఇప్పటికే వినియోగదారులకు పాక్షికంగా (20%) వాణిజ్య ఎల్పీజీ సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. అదనంగా, పీఎన్‌జీ సులభతర వాణిజ్య సంస్కరణల ఆధారంగా రాష్ట్రాలకు, యూటీలకు మరో 10 శాతం వాణిజ్య ఎల్పీజీని కేటాయించాలని భారత ప్రభుత్వ 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
భారత ప్రభుత్వ 21.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ ఎల్పీజీ కేటాయింపులను అనుమతించింది. దీనితో మొత్తం కేటాయింపులు 50 శాతానికి చేరతాయి (ఇందులో పీఎన్‌జీ విస్తరణకు సంబంధించి సులభతర వాణిజ్య సంస్కరణల ద్వారా ఇచ్చే 10 శాతం కేటాయింపులు కూడా ఉన్నాయి). ఈ అదనపు 20 శాతం కేటాయింపులను రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార శుద్ధి, డెయిరీ పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా నడిపే రాయితీ క్యాంటీన్లు, అవుట్లెట్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కార్మికుల కోసం ఉద్దేశించిన 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు వంటి వాటికి ప్రాధాన్యత క్రమంలో అందిస్తారు.
భారత ప్రభుత్వ 27.03.2026 నాటి లేఖ ద్వారా వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను అదనంగా మరో 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో మొత్తం వాణిజ్య కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్నట్లుగా 70 శాతానికి చేరతాయి. (ఇందులో 10 శాతం సంస్కరణల ద్వారా అందించే కేటాయింపులు ఉంటాయి). ఈ అదనపు 20 శాతం కేటాయింపులను పరిశ్రమలకు అందజేస్తారు. ఇందులో ఉక్కు, ఆటోమొబైల్, వస్త్ర పరిశ్రమ, డై, రసాయనాలు, ప్లాస్టిక్ రంగాలకు ప్రాధాన్యత ఉంటుంది. వీటిల్లోనూ ప్రాసెస్ పరిశ్రమలకు లేదా సహజ వాయువుకు ప్రత్యామ్నాయంగా వాడలేని ఎల్పీజీతో మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక హీటింగ్ అవసరాలున్న పరిశ్రమలకు మొదటగా ప్రాధాన్యతనిస్తారు.
మార్చి 23, 2026 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వలస కార్మికులకు 3.2 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
నిన్న ఒక్కరోజే వలస కార్మికులకు 63,000లకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను అమ్మారు.
భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెజారిటీ రాష్ట్రాలు, యూటీలు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుల ఉత్తర్వులను జారీ చేశాయి. ఫలితంగా మార్చి 14, 2026 నుంచి ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలు, యూటీల్లోని వాణిజ్య సంస్థలు మొత్తం 47,928 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను సేకరించాయి.
కిరోసిన్
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపుతోపాటు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· భారత ప్రభుత్వం 29.03.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కిరోసిన్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేవలం వంట, వెలుతురు అవసరాల కోసం పీడీఎస్ కిరోసిన్ పంపిణీకి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ సేవా కేంద్రాలలో (ప్రాధాన్యంగా సంస్థ స్వయంగా నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ కిరోసిన్‌ను నిల్వ చేయడానికి అనుమతి ఉంది.
· ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు నిర్దేశిస్తాయి.
· ఇప్పటికే 17 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
· నిత్యవసర వస్తువుల చట్టం 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు 2000 ప్రకారం అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేసే వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెల్లడించింది.
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శులను ఈ కింది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
· రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిరోజూ పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయాలి.
· ప్రత్యేక సమాచార కేంద్రాలను,హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలి.
· సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని తప్పనిసరిగా పర్యవేక్షించి, వాటిని తిప్పికొట్టాలి.
· జిల్లా యంత్రాంగాల ద్వారా రోజువారీ నిఘాను ముమ్మరం చేయాలి. చమురు మార్కెటింగ్ సంస్థల సమన్వయంతో దాడులు, తనిఖీలను కొనసాగించాలి.
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమర్షియల్ ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
· రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
· రోడ్డు వినియోగ అనుమతులు (రైట్ ఆఫ్ వే, రైట్ ఆఫ్ యూజ్), 24x7 పని అనుమతులు మొదలైనవాటిని వేగవంతం చేయడంతో సహా సీజీడీ విస్తరణను వేగవంతం చేయాలి.
· పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి.
· పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారలను నామినేట్ చేయాలి.
· సరైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, వదంతులను అరికట్టడానికి ప్రతిరోజూ విలేకరుల సమావేశాలు నిర్వహించాలని, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎప్పటికప్పుడూ సమాచారం అందించాలని భారత ప్రభుత్వం 27 మార్చి 2026 తేదీ నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను మరోసారి కోరింది.
· ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ వంటి 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
అమలు చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, సరఫరాను అరికట్టడానికి అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాడులు కొనసాగుతున్నాయి. నిన్న 3000కుపైగా దాడులు నిర్వహించగా.. దాదాపు 500కుపైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· సరఫరా సజావుగా సాగేలా చూడటానికి, అక్రమ నిల్వలు/రవాణా కేసులను తనిఖీ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థల అధికారులు నిన్న దేశవ్యాప్తంగా 1200కుపైగా పెట్రోల్ బంకులు, ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
· నిబంధనలు ఉల్లంఘించిన ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పటివరకు సుమారు 540 షోకాజు నోటీసులు జారీ చేశాయి.
ప్రభుత్వ ఇతర చర్యలు
· యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ, పీఎన్‌జీ సరఫరాతోపాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తోంది.
· సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా రిఫైనరీల ఉత్పత్తిని పెంచడం, గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు.. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను క్రమబద్ధీకరించడం వంటివి ఉన్నాయి.
· ఎల్‌పీజీ డిమాండుపై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులందరికీ కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భయాందోళనలతో పెట్రోలు, డీజిలు కొనుగోలు చేయవద్దని సూచించింది. అలాగే ఎల్పీజీ బుకింగ్‌లు కూడా చేయడం మానుకోవాలని తెలిపారు.
· పౌరులు వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సరైన సమాచారం కోసం అధికారిక సంస్థలను మాత్రమే నమ్మాలని సూచించారు.
ఎల్‌పీజీ వినియోగదారులకు విజ్ఞప్తి:
· గ్యాస్ బుకింగ్‌ల కోసం డిజిటల్ విధానాలను ఉపయోగించండి.
· నేరుగా ఎల్‌పీజీ పంపిణీదారులను సంప్రదించడం మానుకోండి.
· పౌరులు పీఎన్‌జీ, ఇండక్షన్, ఎలక్ట్రిక్ స్టవ్‌లు వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను ఉపయోగించాలని విజ్ఞప్తి.
· ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· యుద్ధ ప్రభావ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న భారతీయ నౌకలు, నావికుల రక్షణ, భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం..
· సముద్ర వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే, నౌకా రవాణా కదలికలు, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రతను ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ సముద్ర నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
· 485 మంది భారతీయ నావికులతో కూడిన 18 భారత జెండా నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ సంస్థలు, భారతీయ రాయబార కార్యాలయాలతో షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం 24x7 గంటల పాటు పని చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,699 కాల్స్.. 9,364 ఈమెయిళ్లను పరిష్కరించింది. గత 24 గంటల్లోనే 144 కాల్స్, 290 ఈమెయిళ్లు అందాయి.
· ఇప్పటి వరకు 959 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో డీజీ షిప్పింగ్ సహాయపడింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన తొమ్మిదిమంది కూడా ఉన్నారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు ఎలాంటి రద్దీ లేకుండా సాధారణంగానే కొనసాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సముద్ర వాణిజ్య బోర్డులు తమ పరిధిలోని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
· నావికుల సంక్షేమాన్ని, నిరంతర నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
· యుద్ధ ప్రాంతంలోని భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయనీ.. పౌరుల భద్రత, క్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయం అందిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సమాచారం ప్రకారం:
· నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. భారత్-నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. సెమీకండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, టాలెంట్ మొబిలిటీ (నైపుణ్యం కలిగిన మానవ వనరుల రాకపోకలు) వంటి రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. పశ్చిమ ఆసియాలోని పరిణామాలపై ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అక్కడ శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
· గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారతీయ పౌరుల రక్షణ, భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
· భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కంట్రోల్ రూం నిరంతరం పని చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమన్వయం కొనసాగిస్తోంది.
· ఆ ప్రాంతంలోని రాయబార కార్యాలయాలు, ప్రత్యేక కేంద్రాలూ 24 గంటలూ పనిచేస్తూ, కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇవి భారతీయ సమాజం, సంస్థలు, సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తున్నాయి.
· రాయబార కార్యాలయాలు స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. నావికులు, విద్యార్థులు, భారతీయ పౌరులకు వీసా సదుపాయం, కాన్సులర్ సేవలు, రవాణా సంబంధిత సహాయాన్ని అందజేస్తూనే ఉన్నాయి.
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 5,72,000 మంది ప్రయాణికులు భారతదేశానికి తిరిగి వచ్చారు.
· యూఏఈలో నేడు సుమారు 85 విమానాలు నడుస్తాయని అంచనా. నిర్వహణ, భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో నాన్-షెడ్యూల్డ్ విమానాలు కొనసాగుతున్నాయి.
· ఒమన్, సౌదీ అరేబియా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో నేడు భారత్‌కు సుమారు 8–10 నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడుస్తాయని అంచనా.
· కువైట్, బహ్రెయిన్ దేశాల గగనతలాలు ఇంకా మూసివేసే ఉన్నాయి. సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడుస్తున్నాయి.
· ఇరాన్ గగనతలం మూసివేసిన నేపథ్యంలో భారతీయ పౌరుల ప్రయాణాన్ని అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా కల్పిస్తున్నారు.
· ఇజ్రాయెల్‌లో గగనతల ఆంక్షల దృష్ట్యా భారత పౌరుల ప్రయాణానికి ఈజిప్టు, జోర్డాన్ మీదుగా సౌకర్యం కల్పిస్తున్నారు.
· ఇరాక్‌లో గగనతలం మూసివేత దృష్ట్యా భారతీయ పౌరుల ప్రయాణానికి జోర్డాన్, సౌదీ అరేబియా ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2247351)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
हिन्दी
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam