రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణశాఖ మంత్రి అధ్యక్షతన పశ్చిమాసియా పరిస్థితులు.. భారత్ మీద ప్రభావంపై ‘ఐజీఓఎం’ తొలి సమీక్ష సమావేశం
· మధ్య-దీర్ఘకాలిక సన్నద్ధత విధానం అనుసరణ.. సత్వర నిర్ణయాలు అవశ్యమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సూచన
· ఎలాంటి దుష్పరిణామాలు ఎదురైనా దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది: రక్షణ మంత్రి
· రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో సన్నిహిత సమన్వయం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించిన ‘ఐజీఓఎం’
· తప్పుదోవ పట్టించే కథనాలు.. వదంతులు.. బూటకపు వార్తల నిరోధంపై సమాచారం పంచుకోవాలని మంత్రిత్వ శాఖలు-విభాగాలకు ఆదేశం
నాడు పోస్టు చేయడమైనది:
28 MAR 2026 9:11PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితుల పర్యవేక్షణ, పరిణామాలపై చురుకైన ప్రతిస్పందనాత్మక చర్యల సిఫారసు లక్ష్యంగా ఏర్పాటైన ‘మంత్రుల అనధికార బృందం’ (ఐజీఓఎం) తొలి సమావేశానికి రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో- ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, వినియోగదారుల వ్యవహారాలు-ఆహార- ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
ప్రస్తుత ప్రపంచ స్థితిగతుల నడుమ దేశంలో మారుతున్న పరిస్థితిని, వివిధ రంగాలపై దాని ప్రభావాన్ని ‘ఐజీఓఎం’ సమగ్రంగా సమీక్షించింది. చురుకైన, సమన్వయ సహిత దూరదృష్టి గల విధానం అనుసరణ ఆవశ్యకతను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్షణక్షణం మారిపోయే పరిణామాల నేపథ్యంలో అప్రమత్తత ప్రాధాన్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సమీక్షలో భాగంగా ఏడు శాఖ కార్యదర్శులతో కూడిన సాధికార బృందాలు (ఈజీఓఎస్) వర్తమాన పరిస్థితులపై సమగ్ర వివరాలను సమర్పించాయి. కీలక రంగాల వారీగా సమస్యల పరిష్కారం, పరిస్థితుల దిద్దుబాటు దిశగా ఇప్పటికే అమలు చేస్తున్న విధానపరమైన చర్యల గురించి విశదీకరించాయి. దీనిపై శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ- నిశిత పర్యవేక్షణ కొనసాగాలని, మధ్య-దీర్ఘ కాలిక సన్నద్ధత విధాన అనుసరణతోపాటు ఉన్నత స్థాయి సమన్వయం ఉండాలని, సత్వర నిర్ణయాలు తీసుకోవాలని ‘ఈజీఓఎస్’కు మార్గనిర్దేశం చేశారు. విధానపరమైన కృషి యావత్తూ నిర్దిష్ట వ్యవధిలో, సమన్వయంతో సాగాలని ఆయన స్పష్టం చేశారు. భారత్ దృఢంగా, సర్వ సన్నద్ధంగా ఉండే విధంగా సంబంధిత మంత్రుల నుంచి ఆచరణాత్మక సూచనలను కూడా ఆయన కోరారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల యంత్రాంగాలతో సన్నిహిత సమన్వయం ప్రాధాన్యాన్ని సమావేశం ప్రస్ఫుటం చేసింది. అంతేగాక కీలక విధానపరమైన కార్యక్రమాలపై ప్రజలకు సకాలంలో సమాచారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దేశ పారిశ్రామిక రంగంపై తాజా పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయవలసి ఉందని నిర్దేశించింది. వదంతులు, తప్పుదోవ పట్టించే కథనాలు, బూటకపు వార్తల నిరోధానికి చర్యలు చేపడుతూ, పౌరులకు కచ్చితమైన సమాచారం చేరేలా చూడాలని సూచించింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన సమాచారం, పరిణామాలు, సలహాలు-సూచనలను సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ వాట్సాప్ ఛానల్ ద్వారా పంచుకోవాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు.
సమావేశం తర్వాత రక్షణశాఖ మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో- పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నుంచి దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
****
(రిలీజ్ ఐడి: 2246602)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam