ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా సంక్షోభ పరిష్కార సంసిద్ధతపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమీక్ష సమావేశం


· “భారత జట్టు”గా సమష్టి కృషితో ఈ పరిస్థితిని దేశం విజయవంతంగా అధిగమించగలదని ఆశాభావం

· ఆర్థిక-వాణిజ్య స్థిరత్వ పరిరక్షణ.. ఇంధన భద్రతకు భరోసా.. పౌర ప్రయోజనాల రక్షణ.. పరిశ్రమలు-సరఫరా వ్యవస్థల బలోపేతం వంటివే ప్రభుత్వ ప్రాథమ్యాలు

· సరఫరా వ్యవస్థలు సజావుగా పనిచేయడం తో పాటు అక్రమ నిల్వ.. మితిమీరిన లాభార్జనపై రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలి

· వ్యవసాయ రంగంలో.. ప్రధానంగా ఎరువుల నిల్వ-పంపిణీ-పర్యవేక్షణ దిశగా ముందస్తు ప్రణాళిక అత్యావశ్యకం

· మారుతున్న పరిస్థితులపై సత్వర స్పందన కోసం అన్ని స్థాయులలో పటిష్ఠ సమన్వయ యంత్రాంగం తప్పనిసరి

· నౌకా రవాణా.. నిత్యావసరాల సరఫరా.. సముద్ర కార్యకలాపాల సంబంధిత కొత్త సమస్యల పరిష్కారం లక్ష్యంగా సరిహద్దు-తీర రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి

· తప్పుదోవ పట్టించే కథనాలు.. వదంతుల నిరోధం సహా వాస్తవ-విశ్వసనీయ సమాచార ప్రదానంపై అత్యంత శ్రద్ధ చూపాలి

· గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడంలో ప్రధానమంత్రి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రుల అభినందన

· ప్రపంచ అనిశ్చితి నడుమ ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. రాష్ట్రాలకు వాణిజ్య వంటగ్యాస్‌ కేటాయింపు పెంపు వంటి నిర్ణయాలపై ముఖ్యమంత్రుల హర్షం

· రాష్ట్రాల్లో పెట్రోల్.. డీజిల్.. వంటగ్యాస్‌ నిల్వలు తగినమేర ఉన్నందున పరిస్థితులు నిలకడగా ఉన్నట్లు ఆత్మవిశ్వాసం ప్రకటించిన ముఖ్యమంత్రులు

· క్లిష్ట పరిస్థితులను సమర్థంగా అధిగమించడంలో కేంద్రంతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తామని ముఖ్యమంత్రుల పునరుద్ఘాటన

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 9:22PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు, ఫలితంగా తలెత్తిన సంక్షోభ ప్రభావాన్ని భారత్‌ అధిగమించడంలో దేశవ్యాప్త సంసిద్థతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రులందరూ విలువైన సూచనలిచ్చారని ప్రధానమంత్రి అభినందించారు. అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొనడంలో వారి సలహాలు కీలక పాత్ర పోషించగలవని ఆయన అన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా నిభాయించాలంటే అప్రమత్తత, సన్నద్ధత, సమన్వయ సహిత చర్యల అత్యావశ్యకమని స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితిని ప్రస్తావిస్తూ- ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొనడంలో మన దేశానికి పూర్వానుభవం ఉందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ మేరకు కోవిడ్-19 సమయంలో సరఫరా వ్యవస్థలు, వాణిజ్యం సహా దైనందిన జనజీవనంపై మహమ్మారి ప్రభావం తగ్గించడంలో కేంద్ర-రాష్ట్రాలు “భారత జట్టు”గా సమష్టి తత్వంతో పని చేశాయని వివరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అదే సహకార, సమన్వయ స్ఫూర్తితో గడ్డు పరిస్థితిని భారత విజయవంతంగా అధిగమించగలదని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుత సంక్షోభంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయని, తదనుగుణంగా వ్యవహరించేందుకు నిరంతర పర్యవేక్షణ, సానుకూల వ్యూహం అవసరమని ప్రధానమంత్రి స్పష్టీకరించారు. ఈ దిశగా కేంద్రంలో మార్చి 3వ తేదీ నుంచే అంతర-మంత్రిమండలి బృందం నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ సకాలంలో, సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆయన వెల్లడించారు. ఆర్థిక-వాణిజ్య స్థిరత్వ పరిరక్షణ, ఇంధన భద్రతకు భరోసా, పౌర ప్రయోజనాల రక్షణ, పరిశ్రమలు-సరఫరా వ్యవస్థల బలోపేతం వంటివి ప్రభుత్వ ప్రాథమ్యాలని ప్రధానమంత్రి వివరించారు.

ఈ క్రమంలో రాష్ట్రాల కీలక పాత్రను పునరుద్ఘాటిస్తూ- కేంద్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి రాష్ట్రాల స్థాయిలో సమర్థంగా అమలు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంలో తక్షణ ప్రతిస్పందన, సమన్వయం దిశగా కేంద్ర-రాష్ట్రాల మధ్య నిరంతర సంప్రదింపులు, సకాలంలో సమాచార ఆదానప్రదానం, ఉమ్మడి నిర్ణయాలు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

సరఫరా వ్యవస్థలు సజావుగా పనిచేయడంతోపాటు అక్రమ నిల్వ, మితిమీరిన లాభార్జనపై రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు. అంతరాయాల నివారణ దిశగా రాష్ట్ర, జిల్లా స్థాయులలో కంట్రోల్‌ రూముల ఏర్పాటు. పాలనపరమైన అప్రమత్తత కొనసాగింపు ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ పంటకాలంలో రైతులకు ఇబ్బందులు రాకుండా వ్యవసాయ రంగంలో.. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీలపై పర్యవేక్షణకు ముందస్తు ప్రణాళిక అవసరం ఎంతయినా ఉందని వివరించారు.

ప్రజల్లో అనవసర భయాందోళనల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు తప్పుదోవ పట్టించే కథనాలు, వదంతుల నిరోధం సహా వాస్తవ-విశ్వసనీయ సమాచార ప్రదానంపై అత్యంత శ్రద్ధ అవసరమని ప్రధానమంత్రి హెచ్చరించారు. అలాగే ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల విషయంలోనూ అప్రమత్తత అవశ్యమని స్పష్టం చేశారు. నౌకా రవాణా, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల సంబంధిత కొత్త సమస్యల పరిష్కారం లక్ష్యంగా సరిహద్దు-తీర రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ- నిత్యావసరాల లభ్యతపై హామీ ఇవ్వడం ద్వారా పౌరులలో అనవసర భయాందోళనల నివారణ సులువు కాగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమాసియా దేశాల్లోని భారత పౌరుల విషయంలో ప్రభావిత కుటుంబాలకు సకాలంలో సాయం, సత్వర సమాచారం అందేవిధంగా ఆయా రాష్ట్రాలు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నోడల్ అధికారుల నియామకం సహా జిల్లా స్థాయి సహాయక వ్యవస్థల అవసరాన్ని గుర్తుచేశారు.

దేశ ఆర్థిక, సరఫరా వ్యవస్థలను బలోపేతం కోసం ఇటీవలి సంవత్సరాల్లో చేపట్టిన చర్యలు ప్రస్తుత పరిస్థితులలో ఫలితమిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలు, ‘ఎంఎస్‌ఎంఈ’ల సమస్యల పరిష్కారంతోపాటు ఉత్పత్తి-ఉపాధి స్థిరత్వ సాధనకు వారితో నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులపై సత్వర ప్రతిస్పందన లక్ష్యంగా ప్రధాన కార్యదర్శుల స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్ష సహా జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ, అన్ని స్థాయులలో పటిష్ఠ సమన్వయ యంత్రాంగాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతయినా ఉందని స్పష్టం చేశారు.

తక్షణ స్పందన, దీర్ఘకాలిక సంసిద్ధతలపై ఏకకాలంలో దృష్టి సారించాలని ప్రధానమంత్రి రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. జీవ ఇంధనాలు, సౌరశక్తి, గోబర్ధన్ కార్యక్రమం, విద్యుత్‌ రవాణా వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలని కోరారు. అలాగే పైపుల ద్వారా సహజ వాయువు కనెక్షన్ల విస్తరణలో రాష్ట్రాలు తమ వంతు కృషిని వేగిరపరచాలని ఆయన సూచించారు. రాష్ట్రాల చురుకైన సహకారంతో దేశీయంగా చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యకలాపాలను పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన వివరించారు.

ఈ సవాళ్లను ఎదుర్కొనడం సమష్టి బాధ్యతని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. “భారత జట్టు”గా భుజం కలిపి పనిచేయడం ద్వారా దేశం ఈ పరిస్థితులను విజయవంతంగా అధిగమించగలదని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ- పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా వంటగ్యాస్‌ను సకాలంలో అందించడం, పెట్రోల్-డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వంటి సానుకూల చర్యలు తీసుకుంటున్నదని గుర్తుచేశారు. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడంలో రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా సమష్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ టి.వి.సోమనాథన్‌ సమగ్ర వివరణ ఇచ్చారు. తదనుగుణంగా తీసుకున్న నిర్ణయాల గురించి చెబుతూ- రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సిఫారసులు చేశారు.

గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడంలో ప్రధానమంత్రి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు. ఈ సంక్షోభ సమయాన ప్రవాస భారతీయుల సంక్షేమానికి భరోసా ఇస్తూ ప్రధానమంత్రి వివిధ దేశాలతో దౌత్యపరంగా సంప్రదింపులు నిర్వహించడాన్ని వారు ప్రశంసించారు.

రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ నిల్వలు అవసరాల మేరకు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రులు తెలిపారు. నిత్యావసరాల సరఫరాకు అంతరాయం వాటిల్లకుండా నిరంతర పర్యవేక్షణ కోసం యంత్రాంగాలను ఏర్పాటు చేయడంతో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని వారు ఆత్మవిశ్వాసంతో తెలిపారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయంపై వారు హర్షం వెలిబుచ్చారు. అంతర్జాతీయ అనిశ్చితి నడుమ ఇది పౌరులకు గణనీయ ఉపశమనం ఇస్తుందని పేర్కొన్నారు.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య వంటగ్యాస్‌ కేటాయింపు పరిమాణంలో ప్రస్తుతం 50 శాతం ఇస్తుండగా, దాన్ని సంక్షోభానికి ముందు స్థాయి 70 శాతానికి పెంచాలన్న కేంద్ర నిర్ణయాన్ని ముఖ్యమంత్రులు స్వాగతించారు. మారుతున్న పరిస్థితులను సమర్థంగా నిభాయించడం సహా పౌర ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రంతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవడంపై తమ నిబద్ధతను ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246480) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Gujarati , Odia , Kannada