పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం
రిటైల్ దుకాణాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.. వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచన
వలస కార్మికులతో సహా ప్రాధాన్యతా రంగాలకు అదనపు ఎల్‌పీజీ కేటాయింపు.. నిన్న 37,000కు పైగా చిన్న ఎల్‌పీజీ సిలిండర్ల (5 కేజీలు) విక్రయం
అక్రమ నిల్వ, మార్కెటింగ్‌పై చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచన
ప్రతిరోజూ పత్రికా సమావేశాలు నిర్వహించి, ప్రజలకు క్రమం తప్పకుండా సలహాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి
సముద్ర మార్గంలో నౌకల కదలికలపై నిశిత పర్యవేక్షణ
దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణం
మెరుగుపడిన విమాన కార్యకలాపాలు: ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు తిరిగి వచ్చిన సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
26 MAR 2026 3:29PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తుంది. కీలక రంగాల్లో స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన సన్నద్ధత, ప్రతిస్పందన చర్యలను తీసుకుంటోంది. ఇంధన సరఫరా, సముద్ర కార్యకలాపాలు, ఈ ప్రాంతంలోని భారత పౌరులకు మద్దతుతో సహా కీలక అంశాలపై తాజా సమాచారం ఈ విధంగా ఉంది.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితి వివరాలు:
ముడి చమురు/ రిఫైనరీలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాం.
రిటైల్ అవుట్‌లెట్లు
· దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్లు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పుకార్లు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనతో ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేసినట్లు నివేదికలు అందాయి. దీనివల్ల కొన్ని చోట్ల అసాధారణ అమ్మకాలు, విపరీతమైన రద్దీ కనిపించింది. అయితే దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిలు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని మరోసారి తెలియజేస్తున్నాం.
· వదంతులను నమ్మవద్దని మరోసారి ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
సహజ వాయువు
· వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ డీ-పీఎన్‌జీ, సీఎన్జీ-ట్రాన్స్‌పోర్టు విభాగాలకు 100 శాతం సరాఫరా కొనసాగుతోంది.
· గ్రిడ్‌కు అనుసంధానించిన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80 శాతం సరాఫరా అందుతోంది.
· వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించే ఉద్దేశంతో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్ జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలకు భారత ప్రభుత్వం సూచించింది.
· గృహ, వాణిజ్య పీఎన్ జీ కనెక్షన్లు తీసుకునే వారికి ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం అభ్యర్థించింది.
· ఎల్‌పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడానికి (భూమిని ఉపయోగించుకునే హక్కు (రైట్ ఆఫ్ యూజర్) లేదా రహదారుల గుండా వెళ్లే హక్కు (రైట్ ఆఫ్ వే)) అనుమతులను వేగవంతం చేసేందుకు కొన్ని రాష్ట్రాలు నూతన విధానాలను రూపొందించాయి. ఇందులో భాగంగా పని వేళలను పెంచడం, అనుమతి రుసుములను క్రమబద్ధీకరించడం వంటి చర్యలు చేపట్టాయి.
· పైన పేర్కొన్న ప్రభుత్వ లేఖకు పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ స్పందిస్తూ.. సీజీడీ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో, అంటే అవి అందిన 10 రోజులలోపు పరిష్కరించాలని తన అన్ని కార్యాలయాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
· పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట, నివాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, అంగన్వాడీ కిచెన్‌లు మొదలైన వాటికి 5 రోజులలోపు పీఎన్ జీ కనెక్షన్లు ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సీజీడీ సంస్థలను సీజీడీ సంస్థలను
23 మార్చి 2026 నాటి ఉత్తర్వుల ద్వారా పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి ఆదేశించింది.
· రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 నాటి లేఖ ద్వారా ‘‘తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం త్వరితగతిన ఆమోదించే విధానాన్ని’’ 3 నెలల పాటు ఒక ప్రత్యేక చర్యగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. దీని వల్ల సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు వీలవుతుంది.
· నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
· సీజీడీ సంస్థల నివేదిక ప్రకారం నిన్న ఒక్కరోజే 110 ప్రధాన భౌగోళిక ప్రాంతాల్లో 11,089 పీఎన్ జీ కనెక్షన్లు (కొత్త కనెక్షన్లు, పాత వాటిని పునరుద్ధరించడం) నమోదయ్యాయి.
ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక, రాజకీయ స్థితి కారణంగా ఎల్‌పీజీ సరఫరా ప్రభావితమవుతోంది.
దేశీయ ఎల్‌పీజీ సరఫరా:
· ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్ద కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· గృహావసరాలకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా యథాప్రకారం కొనసాగుతోంది.
వాణిజ్య అవసరాలకు ఎల్‌పీజీ సరఫరా
· వినియోగదారులకు వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను ప్రభుత్వం ఇప్పటికే పాక్షికంగా (20 శాతం) పునరుద్ధరించింది. దీనికి అదనంగా, పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేటాయించగలనని 18.03.2026 నాటి లేఖలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
· రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం 21.03.2026 నాటి లేఖ ద్వారా అనుమతించింది. దీనితో మొత్తంమీద కేటాయింపు 50 శాతానికి (పీఎన్‌జీ విస్తరణ సంస్కరణల ఆధారంగా ఇచ్చే 10% కేటాయింపుతో కలిపి) చేరుకుంటుంది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును ప్రాధాన్య రంగాలకు ఉదాహరణకు.. రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక కాంటీన్లు, ఆహార శుద్ధి కేంద్రాలు లేదా డైరీ, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు నడుపుతున్న రాయితీ క్యాంటీన్లు, లేదా అవుట్‌లెట్లు, సామాజిక వంటశాలలకూ ప్రాధాన్య క్రమంలో సమకూర్చాలి. వలస కూలీలకు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను ఇవ్వాలి.
· గృహేతర ఎల్‌పీజీ కేటాయించడానికి సంబంధించి 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు సమకూరుస్తున్నాయి. 2026 మార్చి 14 నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలు సుమారు 25,922 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని అందుకున్నాయి.
· నిన్న, అయిదేసి కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను 37,000 కన్నా ఎక్కువ సంఖ్యలో విక్రయించారు.
కిరోసిన్
· అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· కిరోసిన్‌ను పంపిణీ చేయడానికి జిల్లాల్లో స్థానాలను గుర్తించాలని ఆయా రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ కోరారు.
· కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ తమకు ఎస్‌కేఓ అవసరం లేదంటూ సమాచారాన్నిచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర -
· అక్రమ నిల్వలు, నల్లబజారును అరికట్టడానికి నిత్యావసర సరకుల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరాను నియంత్రించడంలో రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం 13.03.2026, 18.03.2026 నాటి లేఖల ద్వారా అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ స్పష్టం చేసింది.
· అక్రమ నిల్వలనూ, నల్లబజారు విక్రయాలనూ నివారించడంతో పాటు, వదంతులను వ్యాప్తి చేయడాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కేంద్రం స్పష్టంచేస్తోంది. దీనికి అనుగుణంగా, రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఏసీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆహార, పౌర సరఫరాల కార్యదర్శులతో 2026 మార్చి నెల 25న ఒక వీడియో కాన్ఫరెన్సును పెట్రోలియమ్, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని సూచనలు చేశారు -
• ప్రజలకు సూచనలనూ, సలహాలనూ క్రమం తప్పక జారీ చేయాలి. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ప్రతి రోజూ పత్రికా విలేకరులతో సమావేశాలను నిర్వహించాలి.
• కంట్రోల్ రూములనూ, సహాయక వ్యవస్థలనూ ఏర్పాటు చేయాలి.
• సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలనూ, తప్పుడు సమాచారాన్నీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాటిని తోసిపుచ్చుతూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలి.
• జిల్లా పాలనయంత్రాంగం రోజువారీ పర్యవేక్షణ కార్యక్రమాల్ని అమలుపరచాలి. చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయాన్ని ఏర్పరుచుకొని తనిఖీలు, దాడులూ చేపడుతూ ఉండాలి.
• రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వుల్ని జారీ చేస్తుండాలి.
• రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేటాయించిన అదనపు ఎస్‌కేఓకు సంబంధించి ఎస్‌కేఓ కేటాయింపు ఉత్తర్వుల్ని జారీ చేయాలి.
• ఆర్ఓడబ్ల్యూ, ఆర్ఓయూ అనుమతులు, 24x7 పని పరిమితులు తదితరాలు సహా వివిధ ప్రక్రియలను వేగవంతం చేయాలి.. సీజీడీ విస్తరణ పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు చూడాలి.
• పీఎన్జీకీ, ప్రత్యామ్నాయ ఇంధనాలకీ మొగ్గు చూపడాన్ని ప్రోత్సహించాలి.
• పెట్రోలియమ్, సహజవాయు మంత్రిత్వ శాఖతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారులను నామినేట్ చేయాలి.
అమలు దిశగా చేపడుతున్న చర్యలు
· అక్రమ నిల్వలనూ, నల్లబజారు విక్రయాలనూ అరికట్టడానికి అనేక రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ నిరంతరం దాడులను నిర్వహిస్తున్నారు. నిన్న 2,600 కన్నా ఎక్కువ దాడులు జరిపారు.. ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 450 కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ఎలాంటి అక్రమ నిల్వలూ, నల్లబజారు విక్రయాలు చోటుచేసుకోకుండా సరిచూడటానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులు నిన్న దేశ వ్యాప్తంగా సుమారు 1700 ఆర్‌ఓలతో పాటు ఎల్‌పీజీ పంపిణీదారు సంస్థల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.
· ఇప్పటి వరకు 680 కన్నా ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.. 195 మందిని అరెస్టు చేశారు.
ఇతర చర్యలు:
-
యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, ఆస్పత్రులు, విద్యాసంస్థలతో పాటు గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
-
సరఫరా, డిమాండును క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది. రిఫైనరీ ఉత్పత్తిని పెంచటం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ గడువును 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచటం, ప్రాధాన్యతా రంగాలకు ముందుగా సరఫరా చేసేందుకు అవకాశమిచ్చింది.
-
ఎల్‌పీజీ డిమాండును తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
-
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గు పంపిణీ చేసేలా, రాష్ట్రాలకు ఎక్కువ బొగ్గును కేటాయించేలా కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ కు ఇప్పటికే బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారులందరికీ నూతన పీఎన్‌జీ కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
బహిరంగ ప్రకటన
-
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ నిరంతరం అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పౌరులు ఆందోళనతో అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయటం, గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేయటం వంటి చర్యలు మానుకోవాలని కోరింది. అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాల్సిందిగా సూచించింది.
-
డిజిటల్ పద్ధతుల్లో ఎల్‌పీజీ బుకింగ్స్ చేసుకోవాలని, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూట్రర్ల వద్దకు వెళ్లవద్దని పౌరులకు విజ్ఞప్తి చేసింది.
-
అవకాశం ఉన్నచోట ప్రత్యామ్నాయ ఇంధనాలైన పీఎన్‌జీ, ఇండక్షన్, ఎలక్ట్రిక్ స్టవ్‌లను వినియోగించాలని పౌరులను ప్రోత్సహిస్తోంది.
-
దైనందిన జీవితంలో పౌరులంతా ఇంధనం ఆదా చేసేందుకు కృషి చేయాలని కోరింది.
సముద్రయాన భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
-
మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న భారతీయ నౌకలు, నావికుల రక్షణ కోసం తగిన చర్యలు ఇప్పటికే తీసుకున్నారు.
-
సముద్రయాన వాణిజ్యం నిరంతరం కొనసాగేలా చూస్తూనే.. నౌకల రాకపోకలు, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నౌకా సిబ్బంది భద్రతను ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.
-
ఆ ప్రాంతంలోని భారతీయ నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటలుగా భారతదేశ జెండా ఉన్న నౌకలు ఎలాంటి అవాంతరాలు ఎదుర్కోలేదని నివేదికలు చెబుతున్నాయి.
-
సుమారు 540 మంది భారత నావికులతో ఉన్న 20 భారతదేశ జెండా గల నౌకలు, పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. నౌక యజమానులు, ఆర్పీఎస్ఎల్ (ఆర్ పీఎస్ఎల్) ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ, షిప్పింగ్ డీజీ కార్యాలయం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
-
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం 24x7 గంటల పాటు పని చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,228 కాల్స్, 8,221 ఈమెయిల్స్ పరిష్కారమవగా.. వీటిల్లో గత 24 గంటల్లో వచ్చిన 120 కాల్స్, 312 ఈ-మెయిల్స్ ఉన్నాయి.
-
ఇప్పటివరకు 674 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటంలో షిప్పింగ్ డీజీ సహకరించింది. వీరిలో గత 24 గంటల్లో స్వదేశానికి చేరుకున్న 39 మంది ఉన్నారు.
-
భారతదేశ వ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు రద్దీ లేకుండా సాగుతున్నాయి. ఓడరేవుల్లో కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నట్లు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు స్పష్టం చేశాయి.
-
నావికుల సంక్షేమానికి, ఓడరేవుల కార్యకలాపాలు అంతరాయం లేకుండా సాగేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత దౌత్య కార్యాలయాలు, ఇతర సముద్రయాన భాగస్వాములతో కేంద్ర మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
ఆ ప్రాంతంలోని భారత పౌరుల భద్రత
అక్కడి భారతీయ పౌరులతో భారత దౌత్య కార్యాలయాలు, పోస్టులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. వారి భద్రత, సంక్షేమం కోసం తగిన సూచనలు జారీ చేస్తూనే, అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు:
-
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతాల్లోని పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గమనిస్తోంది. అక్కడున్న భారతీయుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం 24x7 కంట్రోల్ రూం అందుబాటులో ఉంచటంతో పాటు రాష్ట్రాలు, యూటీలతో సమన్వయం చేసుకుంటోంది.
-
భారత రాయబార కార్యాలయాలు, పోస్టులు అహర్నిశలు పనిచేస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ.. స్థానిక అధికారులతో, ప్రవాస భారతీయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. నావికులు, విద్యార్థులు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, స్వల్పకాలిక సందర్శకులకు అవసరమైన వీసా సేవలు, కాన్సులర్ సేవలు, రవాణా వంటి సహకారాలను అందిస్తున్నాయి.
-
ఈ ప్రాంతం నుంచి అదనపు విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో విమాన రాకపోకలు మెరుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు సుమారు 4,50,000 మంది ప్రయాణికులు భారతదేశానికి తిరిగి వచ్చారు.
-
యూఏఈ: విమానయాన సంస్థలు షెడ్యూల్ చేయని విమానాలను పరిమితంగా నడుపుతున్నాయి. ఈ రోజు వివిధ విమానాశ్రయాల నుంచి సుమారు 80 విమానాలు నడిచే అవకాశముంది.
-
సౌదీ అరేబియా, ఒమన్: భారతదేశానికి విమానాలు నిరంతరంగా నడుస్తున్నాయి.
-
ఖతార్: గగనతలాన్ని పాక్షికంగా అనుమతిస్తున్నారు. షెడ్యూల్ చేయని 8-9 విమానాలు ఈ రోజు నడిచే అవకాశం ఉంది.
-
కువైట్, బహ్రెయిన్: గగనతలాన్ని మూసివేశారు. జజీరా ఎయిర్ వేస్, గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక విమానాలు దమ్మామ్ (సౌదీ అరేబియా) మీదుగా ఇండియాకు వస్తున్నాయి.
-
ఇరాన్: అర్మేనియా, అజర్ బైజాన్ మీదుగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
-
ఇజ్రాయెల్: జోర్డాన్ మీదుగా ప్రయాణించవచ్చు.
-
కువైట్, బహ్రెయిన్, ఇరాక్: సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2245746)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9