ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 4:48PM by PIB Hyderabad
ఖులుమ్‌బాయీ కోక్రాఝర్!
మిత్రులారా,
వాతావరణం అనుకూలించని కారణంగా నేను కోక్రాఝర్ రాలేకపోయాను. మీ అందరికీ నా క్షమాపణలు. గువాహటి నుంచి మాత్రమే మీతో మాట్లాడటానికి సాధ్యమవుతోంది. మీ వద్దకు రావడానికి నేను ఢిల్లీ నుంచి బయలుదేరాను. కానీ గువాహటిలో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తున్నాను. మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నాతో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి, సోదరుడు హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, బోడోల్యాండ్ ప్రాంత కౌన్సిల్ ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడు హగ్రామా మోహిలారీ, అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీటీసీ ప్రతినిధులందరూ, సొసైటీలోని సీనియర్ సభ్యులు, నా ప్రియమైన సోదరీసోదరులారా!
ముందుగా, ఈ ప్రాంతానికి చెందిన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ, ఇతర గొప్ప వ్యక్తులందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నా కనుచూపుమేరలో అందరూ ప్రజలే కనిపిస్తున్నారు. తమ ఆశీర్వాదాలను ఇవ్వడానికి నా మాతృమూర్తులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో వచ్చారు. చాలా పెద్ద సంఖ్యలో మీరు అక్కడికి వచ్చారు. మీ ప్రేమకు రుణపడి ఉంటాను. మీకు సేవ చేయడం ద్వారా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మీ రుణాన్ని తీర్చుకొనేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను.
మిత్రులారా,
కొన్ని వారాల క్రితమే, గువాహటిని నేను సందర్శించినప్పడు, సుసంపన్నమైన బోడో సంస్కృతి ఉత్సవం బాగురంబా దహౌలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. తన భాషను, సంప్రదాయాలను బోడో సమాజం గొప్పగా పరిరక్షించుకుంటున్న పద్ధతిని చూసి నేను గర్వపడుతున్నాను. అది ఆధ్యాత్మిక సంప్రదాయం బాథోవూ అయినా లేదా బైసాగూ ఉత్సవమైనా అన్నీ బారతీయ సాంస్కృతిక శక్తిని మరింత బలోపేతం చేస్తున్నాయి.
మిత్రులారా,
అస్సాం వారసత్వాన్ని పరిరక్షించేందుకు, ఈ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ-ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాలుగున్నర వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తంతో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నాం. వీటిలో రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని బోడోలాండ్ రోడ్లపై వెచ్చిస్తున్నాం. అస్సాం మాల మూడో దశ కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో రోడ్డు సదుపాయం మరింత మెరుగవుతుంది.
మిత్రులారా,
కొద్దిసేపటి క్రితమే, కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గువాహటి-న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులతో సౌకర్యాల కల్పన మాత్రమే కాకుండా, వ్యాపారానికి, పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుంది. వీటి ద్వారా రైతులు పండిచిన పంటలను పెద్ద మార్కెట్లకు సులభంగా చేరవేయవచ్చు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
అనేక దశాబ్దాల పాటు కోక్రాఝర్‌తో సహా ఈ ప్రాంతమంతా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఎంతో నష్టపోయింది. బాంబులు, తుపాకుల శబ్ధం కొండల్లో ప్రతిధ్వనించిన విపత్కర పరిస్థితులను మనమందరం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పుడు ఈ ప్రదేశంలో ‘ఖామ్’ దరువు, శ్రావ్యమైన ‘సిఫుంగ్’ రాగాలు వినిపిస్తున్నాయి. శాంతి, అభివృద్ధిలో బోడోల్యాండ్ కొత్త పథాన్ని నిర్దేశించింది. అస్సాం నూతన అధ్యాయాన్ని లిఖిస్తోంది.
మిత్రులారా,
బీటీఆర్ ప్రాంతంలో ముఖ్యమైన ఆరు రహదారి ప్రాజెక్టులకు ఈ రోజు భూమి పూజ జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో రైలు సదుపాయాన్ని బలోపేతం ప్రధాన చర్యలు చేపట్టాం. ఇక్కడ నిర్మించే రైల్వే వర్క్‌షాపు.. సరకు రవాణాకు అతి పెద్ద కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మారుస్తుంది. భూటాన్ దేశాన్ని కలిపే రైల్వే లైను నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అనేక స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లు కోక్రాఝర్‌లో ఆగుతాయి. బోడోలాండ్లో మెరుగైన రవాణా సదుపాయానికి ఇది రుజువు. ఇలాంటి ప్రాజెక్టులతో వాణిజ్యానికి అతి పెద్ద కేంద్రంగా కోక్రాఝర్ మారనుంది.
మిత్రులారా,
ఈ అభివృద్ధి కార్యక్రమాలకు గాను హగ్రామా మోహిలరీ బృందాన్ని, హేమంత బృందాన్ని అభినందిస్తున్నాను.
మిత్రులారా,
దశాబ్దాల పాటు, కాంగ్రెస్ చేసిన మోసాన్ని బోడోల్యాండ్ ప్రాంతం చూసింది. అనేక తరాల పాటు వాస్తవ దూరమైన కలల్లో బోడోల్యాండ్‌ను కాంగ్రెస్ ఉంచింది. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పుకోవడానికి మాత్రమే కాగితంపై ఒప్పందాలు చేసేవారు.
మిత్రులారా,
దేశం నుంచి, అస్సాం నుంచి కాంగ్రెస్‌ను తప్పించి బీజేపీ-ఎన్డీయేకు అవకాశం ఇచ్చినప్పుడు, మేం నిజాయతీతో పనిచేయడం ప్రారంభించాం. స్వార్థపూరితమైన రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సమాజాల మధ్య చిచ్చు పెట్టిన ప్రాంతంలో బీజేపీ శాశ్వత శాంతి కోసం పనిచేస్తోంది. ఈ ఆలోచనతోనే బోడో శాంతి ఒప్పందం కుదిరింది. మొదటిసారి అన్ని ప్రధాన సంస్థలను, గ్రూపులను ఈ ఒప్పందం ఒక్కచోట చేర్చింది.
మిత్రులారా,
కాంగ్రెస్ గురించి మరో వాస్తవం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ అబద్ధపు హామీల దుకాణం నడుపుతోంది. ప్రతి తప్పుడు వాగ్ధానానికి బహుమతిగా మరో నాలుగు అసత్యాలను బహుమతిగా అందిస్తుంది. ఎందుకంటే ఆ హామీలను నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదు. మరోవైపు బీజేపీ-ఎన్డీయే విధానం మీ ముందు ఉంది. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చెప్పిన వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు నిజాయతీగా కృషి చేసింది. ఇది ఇప్పటి విషయం కాదు. 2003లో అటల్ బిహారీ వాజపేయి గారి నాయకత్వంలో ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ అవకాశాన్ని వదలిపెట్టకుండా సత్యం, నిజాయతీతో మేం పని చేశాం. ఆ సమయంలో ఆరో షెడ్యూల్లో బీటీసీ ఏర్పాటైంది. ఇది బోడోల్యాండ్ అభివృద్ధికి కొత్త బలాన్నిచ్చింది. ఇక్కడ బోడోల్యాండ్ విశ్వవిద్యాలయం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణం జరిగింది. ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఇక్కడకి వచ్చాయి.
స్నేహితులారా,
2020 ఒప్పందం ప్రకారం, మేం చేసిన హామీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేగంగా, నిరంతర కృషితో పూర్తి చేస్తున్నాం. అనుబంధ అధికార భాషా స్థాయిని బోడో భాషకు ఇచ్చాం. బోడోల్యాండ్కు 1500 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇచ్చాం. కోక్రాఝర్‌లో వైద్య కళాశాల ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తముల్పూర్లో మరో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 10 వేల మందికి పైగా అస్సాం యువత తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి పురోగతి సాధిస్తున్నారు. తమ కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారనే సంతోషంతో వారి మాతృమూర్తులంతా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వారు తమ కుటుంబాలతో కలసి ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు.
మిత్రులారా,
బోడో సమాజం విశ్వాసానికి, సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బోడో సమాజం సంప్రదాయ విశ్వాసమైన బాథోవూకు కూడా గొప్ప గౌరవం లభించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి సైతం ప్రత్యేక సాయం అందిస్తున్నాం.
మిత్రులారా,
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మరో అతి పెద్ద పాపం మన దేశం, అస్సాం భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. రోటీ, బేటీ, మాటీ (రొట్టె, కూతురు, భూమి) ఈ మూడు ప్రమాదంలో ఉన్నాయి. చొరబాటుదారుల వెనక కాంగ్రెస్ హస్తం అప్పుడూ, ఇప్పుడూ ఉంది. అనేక దశాబ్దాల పాటు ఇక్కడి అసలైన స్థానికులకు న్యాయపరమైన పత్రాలను ఇవ్వలేదు. గిరిజనులకు చెందిన భూమిని పెద్ద మొత్తంలో చొరబాటుదారులకు కట్టబెట్టింది. దుబ్రి, గోల్పారా జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. వీటివల్ల బోడోల్యాండ్ జనాభాలో సమతౌల్యం దెబ్బ తింటోంది. సమాజంలో సంక్షోభం మొదలైంది. హేమంత నాయకత్వంలో ఈ భూమిని చొరబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అస్సాంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమం నాకు సంతృప్తినిస్తోంది. అస్సాంలో అసలైన స్థానికులకు బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం భూమికి సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలను కూడా అందించింది. ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును అందించిన గిరిజన సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కఠినంగా శిక్షించాలని, దేశంలో చొరబాటుదారులకు చోటు లేదనే స్పష్టమైన సందేశాన్నివ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. అస్సాం నుంచి వచ్చే ఈ సందేశం దేశం మొత్తానికి స్వరంగా మారుతుంది.
స్నేహితులారా,
మనం అస్సాం అభివృద్ధిని నిరంతరం వేగవంతం చేస్తూనే ఉండాలి. అస్సాం ప్రజల ఆశీర్వాదాలతో అభివృద్ధి చెందిన అస్సాం అనే సంకల్పం కచ్చితంగా నెరవేరుతుంది. ఈ విశ్వాసంతోనే మరోసారి అభివృద్ధి ప్రాజెక్టులకు గాను మీకు అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
నమస్కారం.
(రిలీజ్ ఐడి: 2240057)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9