పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల స్థాయి సమీక్షా సమావేశం
భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 70 శాతం ఇప్పుడు హార్ముజ్ జలసంధి వెలుపలి నుండే సరఫరా
సురక్షితంగా కొనసాగుతున్న ఇంధన సరఫరా
మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో దాదాపు 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్
హార్ముజ్ జలసంధి ద్వారానే సుమారు 90 శాతం దిగుమతులు
ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిణామాల కారణంగా ఈ సరఫరా మార్గంపై ప్రభావం
ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిలో 25 శాతం వృద్ధి
రెస్టారెంట్లు, హోటళ్లు, వాణిజ్య వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరాను సమీక్షిస్తున్న ముగ్గురు సభ్యుల కమిటీ
పర్షియన్ జలసంధిలో ఉన్న 28 భారతీయ జెండా కలిగిన నౌకలపై నిరంతర నిఘా
దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న ఓడరేవులు కార్యకలాపాలు.. ఎగుమతి, దిగుమతుల (ఎగ్జిమ్) వాణిజ్య కొనసాగింపు కోసం ప్రత్యేక చర్యలు
గల్ఫ్ దేశాలలోని (జీసీసీ) కోటి మంది ప్రవాస భారతీయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 7:56PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై నేడు జాతీయ మీడియా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత ప్రభుత్వం చేపట్టిన సన్నద్ధత, ముందస్తు చర్యల గురించి పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు - నౌకాయాన - జలమార్గాల మంత్రిత్వ శాఖ, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఇంధన సరఫరా సన్నద్ధత, సముద్ర భద్రత, విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తాజా సమాచారాన్ని అందించారు.
ఇంధన సరఫరా, లభ్యత
ఇంధన సరఫరా, ఇంధన లభ్యతపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారి మీడియాకు వివరించారు. దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి, నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన తెలియజేశారు.
ముడి చమురు
-
భారతదేశ ముడి చమురు సరఫరా సురక్షితంగా ఉంది. భారతదేశ రోజువారీ వినియోగం సుమారు 55 లక్షల బ్యారెళ్లుగా ఉంది. వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేయటం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చమురు పరిమాణం సాధారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే దాని కంటే ఎక్కువగా ఉంది.
-
ప్రస్తుతం సుమారు 40 దేశాల నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ వైవిధ్యీకరణ ఫలితంగా గతంలో 55 శాతంగా ఉన్న హార్ముజ్ జలసంధి వెలుపలి మార్గాల దిగుమతులు ఇప్పుడు 70 శాతానికి చేరుకున్నాయి.
-
దీనికి అందనంగా మరో రెండు ముడి చమురు నౌకలు ఇప్పటికే మార్గ మధ్యంలో ఉన్నాయి. ఇవి రాబోయే కొద్ది రోజుల్లో భారత్‌కు చేరుకుంటాయి. తద్వారా ముడి చమురు సరఫరా పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది.
-
దేశ వ్యాప్తంగా ఉన్న చమురు శుద్ధి కేంద్రాలు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి 100 శాతానికి పైగా సామర్థ్యంతో నడుస్తున్నాయి.
సహజ వాయువు
-
భారతదేశపు మొత్తం సహజ వాయు వినియోగం సుమారు 189 ఎంఎంఎస్‌సీఎండీ కాగా అందులో 97.5 ఎంఎంఎస్‌సీఎండీ దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. అనివార్య కారణాల వల్ల సుమారు 47.4 ఎంఎంఎస్‌సీఎండీ సరఫరాపై ప్రభావం పడింది.
-
ఈ అంతరాయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ సరఫరామార్గాల ద్వారా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ కంపెనీలు కొత్త వనరుల నుంచి ఎల్‌ఎన్‌జీ నౌకలను కూడా ఖరారు చేశాయి. ప్రస్తుతం రెండు ఎల్‌ఎన్‌జీ నౌకలు దేశానికి వస్తున్నాయి.
-
గ్యాస్ సరఫరాను నిర్వహించడానికి, ప్రాధాన్యత కలిగిన రంగాలను రక్షించడానికి ప్రభుత్వం 2026 మార్చి 9న 'నిత్యావసర సరుకుల చట్టం' కింద 'సహజ వాయువు కంట్రోల్ ఆర్డర్' జారీ చేసింది.
-
గృహ అవసరాలకు వాడే పీఎన్‌జీ సరఫరా, వాహనాలకు వాడే సీఎన్‌జీకి ఎటువంటి కోతలు లేకుండా 100 శాతం సరఫరా ఉంటుంది.
-
గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానమైన టీ పరిశ్రమలు, ఉత్పాదక యూనిట్లు, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు వారి గత ఆరు నెలల సగటు సరఫరాలో సుమారు 80 శాతం అందుతుంది.
-
ఎరువుల కర్మాగారాలకు సుమారు 70 శాతం సరఫరా అందుతుంది. అదే సమయంలో అధిక ప్రాధాన్యత కలిగిన రంగాలను రక్షించడానికి చమురు శుద్ధి కేంద్రాలు, పెట్రోకెమికల్ కేంద్రాల సరఫరాలో సుమారు 35 శాతం తగ్గింపు ఉంటుంది.
ఎల్‌పీజీ
-
భారతదేశపు ఎల్‌పీజీ వినియోగంలో సుమారు 60 శాతం దిగుమతి అవుతోంది. ఈ దిగుమతుల్లో సుమారు 90 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా వస్తాయి. ప్రస్తుతం అక్కడున్న పరిణామాల వల్ల ఈ సరఫరా మార్గం ప్రభావితమైంది.
-
చమురు శుద్ధి కేంద్రాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లలో ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపిలీన్, బ్యూటేన్ స్ట్రీమ్‌లను ఎల్‌పీజీ పూల్‌కు మళ్లించడం ద్వారా ఎల్‌పీజీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని 2026 మార్చి 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యల ఫలితంగా దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి సుమారు 25 శాతం పెరిగింది. ఈ మొత్తం దేశీయ ఉత్పత్తిని గృహ వినియోగదారులకు మళ్లిస్తున్నారు.
-
గృహేతర ఎల్‌పీజీ అవసరాల కోసం ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
-
రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య వినియోగదారులకు ఎల్‌పీజీ కేటాయింపులను సమీక్షించడానికి.. అందుబాటులో ఉన్న ఎల్‌పీజీ సరఫరాను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పంపిణీ చేయడానికి వీలుగా ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల నుంచి ముగ్గురు కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
-
ఇటీవల రూ. 60 పెరిగిన తర్వాత ఢిల్లీలో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ప్రస్తుత ధర రూ. 913గా ఉంది. అయితే పీఎంయూవై లబ్ధిదారులకు సిలిండర్ ధర రూ. 613 వద్దే కొనసాగుతోంది.
-
పీఎంయూవై గృహాలకు సంబంధించి ఇటీవలి ధరల పెరుగుదల రోజుకు 80 పైసల కంటే తక్కువ భారాన్నే మోపుతుంది.
-
2023 జూలై నుంచి సౌదీ కాంట్రాక్ట్ ధర సుమారు 41 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వ మద్దతు కారణంగా పీఎంయూవై సిలిండర్ ధర అదే కాలంలో సుమారు 32 శాతం తగ్గింది.
-
ఎల్‌పీజీ విక్రయాల వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఏర్పడిన నష్టాల భర్తీ కోసం ప్రభుత్వం రూ.30,000 కోట్ల పరిహారాన్ని ఆమోదించింది.
-
క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం కొంతమంది ఆందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయడం, నిల్వ చేసే ధోరణి కనిపిస్తోంది. అయినప్పటికీ గృహ వినియోగ ఎల్‌పీజీ సాధారణ డెలివరీ సమయం సుమారు 2.5 రోజులుగానే ఉంది. కాబట్టి వినియోగదారులు ఆందోళనతో సిలిండర్లను బుక్ చేయొద్దని సూచిస్తున్నాం.
-
పంపిణీదారుల స్థాయిలో గ్యాస్ మళ్లింపును నిరోధించడానికి 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' వ్యవస్థను సుమారు 90 శాతం వినియోగదారులకు పెంచాం.
-
తాత్కాలిక డిమాండ్ నిర్వహణ చర్యలో భాగంగా ఎల్‌పీజీ బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన కనీస సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచాం.
-
డిస్ట్రిబ్యూటర్ల వద్ద పేరుకుపోయిన ఆర్డర్లను పూర్తి చేయడానికి, పంపిణీ సజావుగా సాగేలా చూడటానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయి.
-
ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటానికి.. గృహ అవసరాలను, ప్రాధాన్యత కలిగిన రంగాలను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
సముద్ర భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ జల సంధి ప్రాంతంలో ప్రస్తుత సముద్ర స్థితిగతులు.. భారతీయ సిబ్బంది, నౌకలు, సముద్ర వాణిజ్య కార్యకలాపాలను రక్షించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ మీడియాకు వివరించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:
-
ప్రస్తుతం పర్షియన్ జల సంధి ప్రాంతంలో 28 భారతీయ జెండా కలిగిన నౌకలు నడుస్తున్నాయి. వీటిలో 24 నౌకలు హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో 677 మంది భారతీయ సిబ్బందితో ఉండగా 4 నౌకలు జలసంధికి తూర్పు దిశలో 101 మంది భారతీయ సిబ్బందితో ఉన్నాయి. వారి భద్రత, రక్షణను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
-
పరిణామాలను పర్యవేక్షించడానికి, సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు 2026 ఫిబ్రవరి 28 నుంచి మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌లో 24 గంటల పనిచేసే కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చింది.
-
భారతీయ జెండా కలిగిన నౌకలు, భారతీయ సిబ్బంది మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని.. అలాగే సిబ్బంది వివరాలను సమర్పించడంతో పాటు రిపోర్టింగ్ ప్రోటోకాల్స్‌ను పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 2026 ఫిబ్రవరి 28న సూలనలను జారీ చేసింది.
-
భారతీయ సిబ్బందికి అవసరమైన చోట రక్షణ, సహాయం అందించడానికి అధికారులు, నౌకల నిర్వాహకులు, నియామక సంస్థలు, భారత రాయబార కార్యాలయాలు, స్థానిక అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎగుమతిదారులకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడానికి, ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) వాణిజ్యం కొనసాగేలా చూసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ఓడరేవులకు ఆదేశాలు జారీ చేశాం.
-
నౌకల కదలికలను ప్రధాన ఓడరేవులు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నౌకలు, సరకు స్థితిగతులపై క్రమం తప్పకుండా నివేదికలను అందిస్తున్నాయి.
-
భారతీయ సిబ్బంది, భారతీయ జెండా కలిగిన నౌకల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పర్షియన్ జల సంధి ప్రాంతంలో మారుతున్న సముద్ర స్థితిగతులను మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.
-
సముద్ర వాణిజ్యం, సిబ్బందికి అవసరమైన మద్దతును అందించడానికి పరిశ్రమలోని భాగస్వాములతో మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోంది.
-
భారతీయ సిబ్బంది భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి.. అలాగే భారతదేశ సముద్ర ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఆ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత
ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ పౌరుల పరిస్థితిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ప్రవాస భారతీయుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి భారత రాయబార కార్యాలయాల ద్వారా జరుగుతున్న కృషిని వివరిస్తూ ఇలా పేర్కొంది:
-
గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల్లో సుమారు ఒక కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి సంక్షేమం, భద్రత.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం.
-
యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇజ్రాయెల్‌తో సహా పలు గల్ఫ్, పశ్చిమాసియా దేశాల నాయకులతో ప్రధాన మంత్రి మాట్లాడారు.
-
విదేశీ వ్యవహారాల మంత్రి కూడా ఈ దేశాలలోని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు, ఇరాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
-
ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు భారతీయ పౌరుల కోసం క్రమం తప్పకుండా సూచనలను(అడ్వైజరీ) జారీ చేస్తున్నాయి.
-
రాయబారులు, కాన్సుల్ జనరల్స్ అక్కడి భారతీయులతో కలిసి వారి భద్రత, రక్షణను నిర్ధారిస్తున్నారు.
-
మస్కట్, రియాద్, జెడ్డా వంటి ప్రాంతాల నుంచి పర్యాటకులు, ట్రాన్సిట్ ప్రయాణికులతో సహా చిక్కుకుపోయిన భారతీయులను అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి తిరిగి రావడానికి భారత బృందాలు సహాయం చేశాయి.
-
భారతీయ పౌరులకు సహాయం అందించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.
-
వాణిజ్య నౌకలు దాడికి గురైన సంఘటనల్లో ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఒకరి ఆచూకీ తెలియటం లేదు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
-
గాయపడిన కొంతమంది భారతీయ పౌరులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారికి భారత బృందాలు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో గాయపడిన ఒక భారతీయ పౌరుడు వేగంగా కోలుకుంటుండగా దుబాయ్‌లో గాయపడిన మరొకరు భారత కాన్సులేట్‌తో సంప్రదింపుల్లో ఉన్నారు.
-
ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 9,000 మంది భారత పౌరులు ఉన్నారు. అక్కడి భారత అధికారులు.. నిరంతరం వారిని సంప్రదిస్తున్నారు.
-
ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులను టెహ్రాన్ వెలుపల ఉన్న సురక్షితమైన నగరాలకు తరలించాం.
-
ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల్లోకి భూ సరిహద్దుల ద్వారా ప్రవేశించే విషయంతో పాటు అక్కడి నుంచి వాణిజ్య విమానాల ద్వారా భారత్‌కు తిరిగి రావడానికి అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది.
-
తాజా సమాచారం, నిరంతర అప్‌డేట్ల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ప్రజలు అనుసరించాలి.
ప్రజలకు సమాచారం అందించటం, నిత్యావసర సరకుల పర్యవేక్షణ
ఈ సమీక్షా సమావేశంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఈ కింది విషయాలను చెప్పారు:
-
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్‌లతో కేంద్ర హోం కార్యదర్శి సమావేశం నిర్వహించారు.
-
నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాం.
-
ప్రజలకు క్రమం తప్పకుండా, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర స్థాయి ప్రతినిధిని నియమించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చారు.
-
ధ్రువీకరణ కలిగిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారిక సామజిక మాధ్యమ ఖాతాలు, జిల్లా యంత్రాంగాలు, మీడియా భాగస్వాముల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి.
-
సమాచారాన్ని ప్రజలకు చేరవేటంలో స్థానిక యంత్రాంగాన్ని సాధనంగా వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులు ప్రజలతో నేరుగా మమేకమై.. వారికి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరులుగా వ్యవహరించాలి.
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని.. సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థల మధ్య నిరంతర సమన్వయాన్ని కొనసాగిస్తోందని ఈ సమీక్షా సమావేశం ప్రధానంగా తెలియజేసింది. ఇంధన భద్రతను నిర్ధారించటం, ఆ ప్రాంతంలోని భారతీయ పౌరులను రక్షించటం, సముద్ర కార్యకలాపాల భద్రతను కాపాడటం, నిత్యావసర వస్తువుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పునరుద్ఘాటించారు. మారుతున్న పరిస్థితుల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి.. దేశ ప్రయోజనాలను కాపాడటానికి సకాలంలో తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2238757)
సందర్శకుల సూచీ సంఖ్య : : 130
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam