సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాఠశాలలు, కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటునకు సంబంధించి కార్యాచరణను స్పష్టం చేసిన పోస్ట్ బడ్జెట్ వెబినార్
ఏవీజీసీ రంగాన్ని ప్రోత్సహించటం భారత ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థకు కీలకం.. పరిశ్రమలు-విద్యా సంస్థల మధ్య బలమైన సహకారానికి ప్రధానమంత్రి పిలుపు
పౌరులకు ప్రజాస్వామ్య వేదికలను కల్పించటంలో క్రియేటర్ ఎకానమీ కీలకమన్న ఐ అండ్ బీ మంత్రి అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 3:20PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్చి 9, 2026న "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటం: విద్య, నైపుణ్యాలు, విశ్వవిద్యాలయ టౌన్ షిప్స్" పేరుతో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో భాగంగా "పాఠశాలలు, కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్" అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన విధంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ (సీసీఎల్ల) ఏర్పాటునకు సంబంధించిన అమలు ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు.
ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చే క్రమంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ వెబినార్ సిరీస్‌లో చెప్పారు. విద్యా సంస్థలు పరిశ్రమలతో సహకారాన్ని బలోపేతం చేసుకుని, పరిశోధనలతో కూడిన విద్యను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. దీని ద్వారా క్యాంపస్లు ఆవిష్కరణలకు, పరిశ్రమల భాగస్వామ్యానికి కేంద్రాలుగా మారతాయని, విద్యార్థులకు వాస్తవ ప్రపంచంపై అవగాహన కలుగుతుందని, దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి మరింత బలోపేతం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సౌకర్యాలతో అత్యాధునిక మోడల్ లాబొరేటరీలు ఇందులో ఉన్నాయని చెప్పారు. సృజనాత్మకత, మీడియా, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో యువతకు ఉన్నత ప్రమాణాలతో విద్యను, వృత్తిపరమైన శిక్షణను ఈ సంస్థ అందిస్తుందని చెప్పారు. క్రియేటివ్ కార్నర్‌ను దూరదర్శన్ ప్రారంభించినందని శ్రీ వైష్ణవ్ తెలిపారు. కంటెంట్ క్రియేటర్లు ప్రతిభను చాటుకోవటానికి, ఆదాయాన్ని పొందేందుకు, దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను చేరుకోవటానికి ఇది గొప్ప అవకాశాన్నిస్తుందని చెప్పారు.
ఈ సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు కీలక ప్రసంగం చేశారు. సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించటానికి బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. తద్వారా ఏవీజీసీ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయిలో భారత్‌ను నిలబెట్టవచ్చని పేర్కొన్నారు.
విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ వీపీ, సీటీఓ శ్రీ చైతన్య చిన్చిలికర్ నేతృత్వంలో జరిగిన బ్రేక్ అవుట్ సెషన్‌లో విధాన నిర్ణేతలు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ ఎకానమీకి పాఠ్యప్రణాళిక రూపకల్పన, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో సమన్వయం, నైపుణ్యాభివృద్ధి మార్గాలపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, క్రియేటివ్ టెక్నాలజీ రంగానికి చెందిన ప్రతినిధులు చర్చా బృంద సభ్యులుగా పాల్గొన్నారు. వారిలో శ్రీమతి ఎ. శ్రీజ (ఎకనామిక్ అడ్వైజర్, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం), డాక్టర్ ఆశిష్ కులకర్ణి (చైర్మన్, ఫిక్కీ ఏవీజీసీ ఫోరమ్), శ్రీ రాజన్ నవాని (ఫౌండర్, గ్రూప్ CEO, జెట్‌సింథసిస్), శ్రీమతి సోనం భగత్ (సీఈఓ, వైగర్), డాక్టర్ విశ్వాస్ దేవ్స్కర్ (సీఈఓ, ఐఐసీటీ), శ్రీ ముంజాల్ ష్రాఫ్ (డైరెక్టర్, సీఓఓ, గ్రాఫిటీ స్టూడియోస్), శ్రీ బీరెన్ ఘోష్ (ఫౌండర్, సీఈఓ, ఆస్ట్రా స్టూడియోస్), శ్రీ మాన్వేంద్ర శుకుల్ (సీఈఓ, లక్ష్య డిజిటల్), శ్రీమతి మాలా శర్మ (గ్లోబల్ వీపీ, ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్నేషనల్, అడోబ్), శ్రీమతి ప్రీతి వ్యాస్ (ప్రెసిడెంట్, మిథిక్)తో పాటు విద్యార్థులు, వాలంటీర్లు ఉన్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటుతో విద్యార్థులకు యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్ వంటి రంగాల్లో స్థిరమైన ఉపాధి మార్గాలు లభిస్తాయని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇది విభిన్న విద్యా విభాగాల బోధన, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్‌కు ప్రాధాన్యతనిచ్చే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు అవసరమైన మెంటార్షిప్, ఇంటర్న్షిప్స్, వాస్తవ ప్రపంచ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు పరిశ్రమలతో బలమైన భాగస్వామ్యాలు ఉండటం అత్యంత ముఖ్యమని భాగస్వామ్య ప్రతినిధులు పేర్కొన్నారు.
మొదట ఈ పథకాన్ని ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, అక్కడి సంసిద్ధత, అభిప్రాయాల ఆధారంగా విస్తరించాలని, టైర్-2, టైర్-3 నగరాల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలని చర్చలో నిర్ణయించారు. ల్యాబ్స్ ఏర్పాటునకు తగిన విద్యాసంస్థలను గుర్తించటం, క్రమబద్ధమైన ఏవీజీసీ పాఠ్యాంశాలను రూపొందించటం, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి, అధ్యాపకుల నైపుణ్యాలను పెంపొందించటం, ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయటం, పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటం వంటివి ముఖ్యమైన కార్యాచరణ అంశాలు.
ఈ సదస్సులో దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాలలు, 50 కళాశాలల ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు, తల్లిదండ్రులు, వ్యక్తిగతంగా వచ్చిన వారితో సహా మొత్తం 16,600 మందికి పైగా పాల్గొన్నారు.
పోస్ట్ వెబినార్ ముగింపు సమావేశంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రసంగిస్తూ.. భారతదేశ శక్తిమంతమైన సంస్కృతిని, సృజనాత్మకతను చాటి చెప్పేందుకు క్రియేటర్ ఎకానమీ పౌరులకు ప్రజాస్వామ్య వేదికగా మారుతుందని, దీని ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతుందని స్పష్టం చేశారు. మీడియా, వినోద రంగం రూపరేఖలను మార్చటంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటునకు మద్దతుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) నైపుణ్యాన్ని వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
యువ భారతీయులు సృజనాత్మక, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి, ప్రపంచ ఏవీజీసీ రంగంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయటానికి ఈ చర్చలు దోహదపడతాయి. 'ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికను రూపొందించటమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2237946)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3