ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల విభాగ విస్తరణకు కేబినెట్ ఆమోదం
జమ్మూ, కాశ్మీర్ విమానయాన రంగంలో ఒక కొత్త శకానికి నాంది
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 3:29PM by PIB Hyderabad
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.1,677 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణికుల విభాగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ ఆమోదం తెలిపింది. కాశ్మీర్ లోయలో విమానయాన రంగ మౌలిక సదుపాయాలను, అనుసంధానతను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టు కీలకం. ఈ ప్రాజెక్టులో భాగంగా భద్రతా సిబ్బంది కోసం బ్యారెక్‌లను నిర్మించనున్నారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన బుద్గాం ఎయిర్ బేస్ ప్రాంగణంలోని ఈ విమానాశ్రయం ఇండియా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) పరిధిలో ఉంది. శ్రీనగర్ నుంచి సుమారు 12 కి.మీ దూరంలోని ఈ విమానాశ్రయాన్ని 2005లో అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించారు.
73.18 ఎకరాల్లో విస్తరించనున్న ఈ నూతన ప్రయాణికుల విభాగంలో అత్యాధునిక సౌకర్యాలతో టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తారు. 71,500 చదరపు మీటర్ల (ప్రస్తుతమున్న 20,659 చదరపు మీటర్లు సహా) విస్తీర్ణంలో ఈ టెర్మినల్ ఉంటుంది. రద్దీ సమయాల్లో 2,900 మంది ప్రయాణికులు, ఏడాదికి 10 మిలియన్ల మంది ప్రయాణికులు (ఎంపీపీఏ) రాకపోకలు సాగించేలా ఈ టెర్మినల్‌ను డిజైన్ చేశారు. విస్తరించిన ఏప్రాన్ లో మొత్తం 15 విమాన పార్కింగ్ స్థలాలు ఉండగా..1 వైడ్ బాడీ (కోడ్ ఈ) విమానానికి స్థలం కేటాయించారు (మొత్తం15లో ప్రసుత్తమున్నవి 9 కాగా, 6 కొత్తగా ప్రతిపాదించినవి). 3,658 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు గల రన్ వే ఐఏఎఫ్ నిర్వహణలోనే ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 1,000 కార్లను పార్కింగ్ చేసేలా, మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు.
ఆధునిక డిజైన్, కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వ కలయితో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం ఉంటుంది. ఇందులో చెక్కతో చేసే ప్రత్యేకమైన కళ, స్థానిక కళాకృతుల వంటి సంప్రదాయ అంశాలతో ప్రయాణికులకు సత్వర సేవలు అందించే, విశాలమైన విశ్రాంతి ప్రదేశాలు, అత్యాధునిక భద్రత, చెక్-ఇన్ సదుపాయాలను కల్పించటం ద్వారా కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందిస్తారు.
స్థిరత్వమే అభివృద్ధికి ప్రధానాంశంగా చేపట్టనున్న ఈ నిర్మాణంలో వర్షపు నీటి నిల్వకు అత్యాధునిక వ్యవస్థలు, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సహజంగా వెలుతురు వచ్చే ఏర్పాట్లు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు స్థానికంగా లభించే పర్యావరణ అనుకూల సామాగ్రిని ఉపయోగించారు. ప్రతిష్ఠాత్మకమైన 5 స్టార్ గృహ రేటింగ్ సాధించటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ఈ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే కాక, దాల్ సరస్సు, శంకరాచార్య ఆలయం, మొఘల్ గార్డెన్స్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచటం ద్వారా పర్యాటకం, ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరుగుతాయి. దీంతో ఉపాధి అవకాశాలు ఏర్పడి, పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా ప్రధాన పర్యాటక ప్రాంతంగా, ఆర్థిక కేంద్రంగా శ్రీనగర్ స్థానం బలపడుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించటంలో ప్రయాణికుల విభాగం అభివృద్ధి పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది. ఇది ప్రయాణికులకు మెరుగైన వసతులను, రవాణా సౌకర్యాలను కల్పించటమే కాకుండా కాశ్మీర్ సాంస్కృతిక, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది.
****
(రిలీజ్ ఐడి: 2232256)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam