ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీలంక అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 9:49PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడం కోసం భారత్‌లో పర్యటిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు గౌరవ అనుర కుమార దిసనాయకేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 2024 డిసెంబర్‌లో చేపట్టిన భారత్ పర్యటన తర్వాత... అధ్యక్షుడు దిసనాయకే రెండో భారత పర్యటన ఇది.
2025 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి శ్రీ మోదీ శ్రీలంకలో పర్యటించారు. ఆ పర్యటన సహా ఇటీవలి ఉన్నత స్థాయి పర్యటనల ద్వారా సాధించిన ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. భౌతిక, డిజిటల్, ఇంధన కనెక్టివిటీ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత వేగవంతం చేయడం పట్ల ఇరువురు నేతలు సమష్టి నిబద్ధతను ప్రకటించారు. అభివృద్ధి లక్ష్యాల పురోగతిలో సాంకేతికత పాత్రను గుర్తిస్తూ... కృత్రిమ మేధ విస్తరణలో సహకారంపైనా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
దిత్వా తుఫాను తర్వాత భారత్ అందించిన వేగవంతమైన, బేషరతు మద్దతుకు అధ్యక్షుడు దిసనాయకే కృతజ్ఞతలు తెలిపారు. మొదటగా ప్రతిస్పందించిన భారత్... 'ఆపరేషన్ సాగర్ బంధు' కింద అత్యవసర సహాయ సామాగ్రిని అందించడమే గాక శోధన, రక్షణ ప్రయత్నాలకూ మద్దతునిచ్చిందన్నారు. 450 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయ ప్యాకేజీ ద్వారా పునర్నిర్మాణం కోసం భారత్ అందిస్తున్న మద్దతులో పురోగతి పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీలంకలో ఇటీవల ముగిసిన పవిత్ర దేవ్నిమోరి స్మారక వస్తు ప్రదర్శన విజయవంతమవడాన్ని స్వాగతిస్తూ, నాగరికత సంబంధాల బలం భారత-శ్రీలంక భాగస్వామ్యానికి అసమాన ప్రయోజనాలను అందిస్తోందని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు.
శ్రీలంక సుస్థిర అభివృద్ధి అవసరాలను తీర్చడానికి, హిందూ మహాసముద్ర ప్రాంత సుస్థిరతకు తోడ్పాటును అందించేలా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయడానికి ఇరువురు అంగీకరించారు.
(రిలీజ్ ఐడి: 2231325)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3