ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ నెల 22న ప్రధానమంత్రి మీరట్‌ పర్యటన


దాదాపు రూ.12,930 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

భారత తొలి నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్‌, ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

భారత్‌లోనే అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ఒకే మౌలిక సదుపాయాల కింద పనిచేయనున్న తొలి నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్‌, మీరట్ మెట్రో

దేశంలో సమగ్ర పట్టణ, ప్రాంతీయ రవాణాలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశించనున్న ఈ ప్రాజెక్టులు

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 6:52PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 22న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నగరంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు, శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్‌లో ప్రధానమంత్రి మీరట్ మెట్రో సేవలను, నమో భారత్ రైలును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు, మీరట్‌లో దాదాపు రూ.12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

82 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్ మొత్తాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. భారత తొలి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్)లోని మిగిలిన సెక్షన్లనూ ఆయన ప్రారంభిస్తారు. వీటిలో ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్ మధ్య 5 కిలోమీటర్ల సెక్షన్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సౌత్, మోదీపురం మధ్య 21 కిలోమీటర్ల సెక్షన్లు ఉన్నాయి.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా భారత తొలి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను రూపొందించారు. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన కేంద్రాలను వేగవంతమైన వ్యవస్థ ద్వారా ఢిల్లీతో అనుసంధానిస్తుంది.

ఈ కారిడార్ ప్రారంభ స్టేషన్ సరాయ్ కాలే ఖాన్ నాలుగు నమో భారత్ స్టేషన్లలో ఒకటి. ఇది వ్యూహాత్మకంగా ఒక ప్రధాన మల్టీ-మోడల్ హబ్‌గా ఉంది. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, వీర్ హకీకత్ రాయ్ ఐఎస్‌బీటీ, రింగ్ రోడ్లను అనుసంధానిస్తుంది. శతాబ్ది నగర్, బేగంపూల్, మోదీపురం అనే మూడు నమో భారత్ స్టేషన్లు  మీరట్‌లో ఉన్నాయి.

మీరట్ సౌత్-మోదీపురం మధ్య మీరట్ మెట్రో రైలు సేవలనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇవి దేశంలోనే తొలిసారిగా నమో భారత్ మాదిరి మౌలిక సదుపాయాలతో పనిచేస్తాయి. మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. మెట్రో మొత్తం ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ మార్గంలో నిర్ణీత ప్రాంతాల్లో ఆగుతుంది. నమో భారత్, మీరట్ మెట్రోలను ఒకే మౌలిక సదుపాయాలతో సజావుగా అనుసంధానించడం వల్ల హై-స్పీడ్ ఇంటర్‌సిటీ ప్రయాణం, వేగవంతమైన ఇంట్రా-సిటీ రవాణాను ఇవి నిర్ధారిస్తాయి. దేశంలో పట్టణ, ప్రాంతీయ సమీకృత రవాణాలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. రహదారి ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తుంది. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలనూ గణనీయంగా తగ్గిస్తుంది.

పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే... పట్టణ రవాణా వ్యవస్థను మలుపుతిప్పే... సజావైన, సమర్థమైన, ఆధునిక, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతకు ఈ ప్రాజెక్టులు మరింత ఊతమిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2231073) సందర్శకుల సూచీ సంఖ్య : : 117