ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ షూఫ్ భారతదేశ పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 8:47PM by PIB Hyderabad
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ షూఫ్‌తో 19 ఫిబ్రవరి 2026 నాడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 'ఏఐ ఇంపాక్ట్ సదస్సు'కు హాజరైన నెదర్లాండ్స్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ప్రధానమంత్రి షూఫ్ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ సదస్సుకు హాజరైనందుకు ప్రధానమంత్రి షూఫ్‌కు శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. 'ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐ’ వర్కింగ్ గ్రూప్‌కు సహాధ్యక్ష దేశంగా నెదర్లాండ్స్ అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు. ఈ సదస్సుకు ఉన్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి షూఫ్ ప్రధానంగా చెప్పారు. ఈ 'సదస్సు ప్రకటన' భవిష్యత్తు విధానపరమైన చర్చలకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏఐ ఆవిర్భావం సాంకేతిక పరిణామంలో ఒక కీలక మలుపు అని.. ఇది సమాజానికి గొప్ప అవకాశాలను అందిస్తుందని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. సామాజిక పరివర్తన సాధించడానికి ఏఐ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో భారత్, నెదర్లాండ్స్ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వారు ప్రధానంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏఐ, క్వాంటం, సెమీకండక్టర్లతో సహా వర్ధమాన సాంకేతిక రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై నేతలు చర్చించారు.
ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన ఇరు దేశాల నాయకులు.. భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యంలో కనిపిస్తున్న స్థిరమైన పురోగతిని స్వాగతించారు. డబ్ల్యూఏహెచ్ (నీరు, వ్యవసాయం, ఆరోగ్యం), స్వచ్ఛ ఇంధనం, హరిత హైడ్రోజన్, రక్షణ - భద్రత, విద్య - ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య - ఆర్థిక భాగస్వామ్యంలో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక చర్చలు ముగియడం ఒక చారిత్రాత్మక అవకాశమని వారు అంగీకరించారు.
ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేసే విషయంలో వారు నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ వివాదంపై భారత్ వైఖరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేస్తూ.. అక్కడ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు.
వాణిజ్యం- పెట్టుబడులు, డబ్ల్యూఏహెచ్ (నీరు, వ్యవసాయం, ఆరోగ్యం) రంగాలు, ప్రజల మధ్య సంబంధాల వంటి సంప్రదాయ రంగాలతో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా బలపడింది. ఇటీవల ఈ బంధం వ్యూహాత్మక రంగాలైన సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ - భద్రత, పునరుత్పాదక ఇంధనం, విద్య - సముద్రయాన రంగాలకు సైతం విస్తరించింది.
***
(రిలీజ్ ఐడి: 2230646)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam