ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
విభిన్న అవసరాలను, వాస్తవ సవాళ్లను పరిష్కరించే దిశగా ఇండియా ఏఐ మిషన్ రూపకల్పన: ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్
‘‘అల్గారిథమ్‌ల నుంచి ఫలితాల వరకు: ప్రజల కోసం పనిచేసే
ఏఐను నిర్మించడం’’ అనే సెషన్లో ప్రసంగించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి
ఏఐని ఉపయోగించి ప్రభావంతమైన అప్లికేషన్లను తయారు చేయడం గురించి
చెప్పేదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు: శ్రీ ఎస్.కృష్ణన్
ఏఐని ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన
600కు పైగా అంకుర సంస్థలు, ఇతర సంస్థలను సందర్శించాలని కోరిన కార్యదర్శి
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 3:42PM by PIB Hyderabad
ప్రజా కేంద్రక ఏఐ, సార్వభౌమ సాంకేతిక సామర్థ్యం అనే రెండు ముఖ్యమైన అంశాలను పరిశీలించే అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 రెండో రోజు ప్రారంభమైంది.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ‘‘అల్గారిథమ్‌ల నుంచి ఫలితాల వరకు: ప్రజల కోసం పనిచేసే ఏఐను నిర్మించడం’’ అనే కార్యక్రమం జరిగింది. దీనిలో ప్రభుత్వ సేవలను అందించడంలో, ప్రజా సంక్షేమంలో కృత్రిమ మేధ వ్యవస్థలు మార్పులను ఎలా తీసుకువస్తాయనే అంశంపై దృష్టి సారించారు. అంతిమంగా ఉత్పాదకతను పెంచేవిగా, పరిపాలనను బలోపేతం చేసేవిగా, పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే అప్లికేషన్‌లుగా గణన, నమూనాలు, డేటా ఎలా మారాలనే అంశంపై ఈ చర్చ సాగింది.
విభిన్న అవసరాలను, వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించేలా భారత దేశ ఏఐ మిషన్ రూపుదిద్దుకుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ అన్నారు. ఏఐని ఉపయోగించుకొని ప్రభావవంతమైన అప్లికేషన్లను తయారు చేయడమే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ముఖ్యోద్దేశమని ఆయన చెప్పారు. ‘‘వాస్తవ ప్రభావంతో అప్లికేషన్లను తయారుచేయాలనే ఒకే ఒక్క కారణంతో అవసరమైన గణన, నమూనాలు, డేటాను మేం అందిస్తున్నాం. అంచనాలను మించి ఏఐ విజయవంతం అవుతుందా లేదా అనేది అది ప్రజల జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలను అందించడంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ ఎక్స్‌పోలో మీరు ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, తయారీ రంగాల్లో పని చేస్తున్న వందలాది అంకుర సంస్థలను చూడవచ్చు. ప్రభావం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రభుత్వాల దగ్గర ఎప్పుడూ తగినంత మంది ఉపాధ్యాయులు, వైద్యులు లేదా న్యాయమూర్తులు ఉండకపోవచ్చు. కానీ ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచగలిగితే సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. సరైన వాటిని ఎంచుకోవడం, వాటిని బాధ్యతాయుతంగా విస్తరించడం, గోప్యతను రక్షించడం, ప్రభుత్వ నిధులు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటమే మన ముందున్న సవాలు” అని కార్యదర్శి అన్నారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన 600కు పైగా అంకుర సంస్థలు, ఇతర సంస్థలను సందర్శించి, ఎలాంటి రంగాల్లో ఏఐను ఉపయోగించవచ్చో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో జే-పాల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దాలివాల్, చికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు మైఖేల్ క్రెమెర్, ఇతర విధాన రూపకర్తలు, ఈ రంగంలో ప్రముఖులు పాల్గొన్నారు.
కచ్చితమైన మూల్యాంకనం ప్రాధాన్యాన్ని జే-పాల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దాలివాల్ వివరించారు. ‘‘అభివృద్ధిలో ఎన్నో పరిష్కారాలు వేగంగా వచ్చి వెళ్లిపోవడం మీరు చూసి ఉంటారు. సాంకేతిక సిద్ధాంతపరంగా లేదా ల్యాబ్ వాతావరణంలో ఓ పరిష్కారం అద్భుతంగా అనిపించవచ్చు కానీ అది క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్లో విఫలం అయిపోవచ్చు. అందుకే ఆధారాలు చాలా ముఖ్యం. ఏఐ పని చేస్తుందా లేదా అని మాత్రమే కాకుండా.. అది ఎవరి కోసం, ఏ సందర్భాలలో పనిచేస్తుంది? దాని వల్ల కలిగే ఫలితాలేమిటి? అని మనం ప్రశ్నించుకోవాలి. కచ్చితమైన మూల్యాంకనం లేకపోతే, మనం ఉత్సాహాన్ని చూసి అదే ఫలితం అనుకొని పొరబడే ప్రమాదం ఉంది. ఏఐకి అపారమైన సామర్థ్యం ఉంది. కానీ దానిని వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించినప్పుడు, ప్రజలను, ఫలితాలను కేంద్రంగా చేసుకుని బాధ్యతాయుతంగా విస్తరించినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది” అని అన్నారు.
షికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు మైఖేల్ క్రెమర్ మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ నిబంధనల అమలు, ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో ఏఐ అందిస్తున్న సానుకూల ప్రభావాలను మనం ఇప్పటికే ఆధారాలతో సహా చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధ్యయన ప్రక్రియ ద్వారా, వారానికి కేవలం ఒక్క గంట కేటాయించినప్పటికీ, అభ్యాసంలో వారి వేగం రెట్టింపు అయ్యింది. అయితే దీనికి సాంకేతికత మాత్రమే సరిపోదు. ప్రభుత్వ సేవలను మెరుగుపరచడమనేది ప్రతి సందర్భంలోనూ ప్రోత్సాహకాలతో కూడిన మార్కెట్ కాకపోవచ్చు. అందుకే ఈ అంశంలో దాతృత్వ సంస్థలు, ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులను స్వీకరించడం అంత సులభం కాదు. కొనుగోలు ప్రక్రియలు కూడా ప్రధానమైనవే. ఒక దేశం నుంచి మరొక దేశం నేర్చుకోవడానికి ఈ మూల్యాంకనం ఎంతో కీలకం. ఏఐకి అద్భుతమైన సామర్థ్యం ఉంది, కానీ అది సాకారం కావాలంటే ఆధారాలు, వ్యవస్థాగత మార్పులు, జాగ్రత్తగా అమలు చేయడం లాంటివి అవసరం.
సదస్సు విస్తృత ఎజెండాలో ఈ కార్యక్రమం కీలకమైన భాగంగా నిలిచింది. పెద్ద ఎత్తున అమలు చేయగల పౌర అప్లికేషన్‌లుగా ఏఐ సామర్థ్యాలను ఎలా మార్చాలనే అంశంపై చర్చించేందుకు విధాన నిర్ణేతలను, పరిశోధకులను, పరిశ్రమ ప్రముఖులను ఈ వేదిక ఒక చోట చేర్చింది. ఏఐ ఆధారిత సేవలను ముందుకు తీసుకెళ్లడంలో నిర్మాణాత్మకమైన అమలు విధానం, వివిధ రంగాల మధ్య సమన్వయం ఎంత ప్రధానమైనవో ఈ చర్చలు తెలియజేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2229340)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4