మంత్రిమండలి
నార్త్-సౌత్ బ్లాకుల స్థానంలో నూతన కార్యాలయాల పేర్లను 'సేవా తీర్థ్' - 'కర్తవ్య భవన్'లుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
'యుగే యుగీన్ భారత్' జాతీయ మ్యూజియంకు మార్గం సుగమం
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 2:24PM by PIB Hyderabad
ఈ రోజు 2082 విక్రమ నామ సంవత్సర... ఫాల్గుణ కృష్ణ పక్షం... విజయ ఏకాదశి... 1947 శక సంవత్సరం... మాఘ మాసం 24వ రోజు పవిత్ర సందర్భంలో...
ఫిబ్రవరి 13, 2026 తేదీన ప్రధానమంత్రి నూతన కార్యాలయాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఇక మీదట దీనిని 'సేవా తీర్థ్'గా పిలుస్తారు.
దేశాన్ని వలస పాలన సంకెళ్లతో బంధించి ఉంచిన బ్రిటిష్ వారు నార్త్-సౌత్ బ్లాక్‌లను నిర్మించారు. 1947లో దేశం వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందినప్పటికీ, ఈ భవనాల్లోనే అప్పటి ప్రభుత్వం తన విధుల నిర్వహణ కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్‌లోని ఈ భవనం నుంచే పనిచేస్తోంది.
ఈ రోజు సౌత్ బ్లాక్‌లోని ఈ చాంబర్‌లో చివరిసారిగా కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుండటం మాకు సంతోషంగా ఉంది. ఇది కేవలం స్థల మార్పు క్షణం మాత్రమే కాదు... ఇది చరిత్ర, భవిష్యత్తుల సంగమ క్షణం కూడా. బానిసత్వం నుంచి స్వేచ్ఛ వరకు... ఆపై స్వతంత్ర భారత్ వరకు అనేక చారిత్రక సంఘటనలను ఈ భవన సముదాయం ప్రత్యక్షంగా చూసింది, అనుభూతి చెందింది. దేశంలోని 16 మంది ప్రధానమంత్రుల నాయకత్వంలో ఏర్పాటైన మంత్రివర్గాలు తీసుకున్న కీలక నిర్ణయాలకూ ఈ సముదాయం సజీవ సాక్ష్యంగా నిలిచింది. నెహ్రూ జీ నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ వరకు వారందరి పాదముద్రలు ఈ భవనపు మెట్లపై ఉన్నాయి. ఈ భవనం మెట్లు ఎక్కిన నేతల నిర్ణయాలు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి.
గత దశాబ్దాల్లో, ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశాలు రాజ్యాంగ ఆదర్శాల నుంచి, ప్రజల నుంచి వచ్చిన తీర్పు నుంచి, దేశపు ఆకాంక్షల నుంచి స్ఫూర్తిని పొంది అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. ఇక్కడే భారత విజయాలను వేడుకలా జరుపుకున్నారు... వైఫల్యాలను మదింపు చేశారు... సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన, కీలకమైన నిర్ణయాలనూ తీసుకున్నారు.
సౌత్ బ్లాక్ గదులు విభజన కాలపు భయానక దృశ్యాలను... యుద్ధాలు, అత్యవసర పరిస్థితుల సవాళ్లనూ, శాంతి సమయంలో విధానాలపై చర్చలనూ ప్రత్యక్షంగా చూశాయి. టైప్‌రైటర్ల నుంచి డిజిటల్ గవర్నెన్స్ దాకా సాగిన సాంకేతికత అపూర్వ వృద్ధినీ ఇవి అనుభూతి చెందాయి.
ఇక్కడ కూర్చున్న అనేక తరాల అధికారులు దేశాన్ని స్వాతంత్య్రం వచ్చిన వెంటనే అనిశ్చితి నుంచి బయటకు తీసుకువచ్చి, సుస్థిరతా మార్గంలో ముందుకు తీసుకెళ్లే నిర్ణయాలను తీసుకున్నారు. అందరి ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు ఆర్థిక సవాళ్లు, సంక్షోభాల నుంచి బయటపడి మన దేశం ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచింది.
నేటి భారతం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. భారత్ సురక్షితమైన, సమర్థ దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచ వేదికలపైన సుస్పష్టంగా, ప్రభావవంతంగా తన గళాన్ని వినిపోస్తింది.
గడిచిన దశాబ్ద కాలంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వంలో మన దేశం తీసుకున్న అనేక చరిత్రాత్మక నిర్ణయాలకు ఈ సౌత్ బ్లాక్ కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశం మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో స్ఫూర్తిదాయక ప్రదేశంగా మారింది. ఇక్కడి నుంచే ప్రారంభమైన సంస్కరణల ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా ఉత్సాహంతో పరుగులు పెట్టింది. ఇక్కడి నుంచే డీబీటీ, స్వచ్ఛ భారత్ అభియాన్, పేదల సంక్షేమానికి సంబంధించిన ప్రచారాలు, డిజిటల్ ఇండియా, జీఎస్టీ వంటి అనేక సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడి నుంచే ఆర్టికల్ 370 వంటి అడ్డు గోడలను కూల్చివేయడం, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం వంటి సామాజిక న్యాయ సంబంధిత సాహసోపేతమైన, సున్నితమైన నిర్ణయాలను తీసుకున్నారు. భారత్ తన దృఢమైన, నమ్మకమైన భద్రతా విధానం గురించి ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నిచ్చిన సర్జికల్ స్ట్రైక్, ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి నిర్ణయాలూ ఇక్కడి నుంచే వెలువడ్డాయి.
ఈ రోజు మన దేశం అభివృద్ధి చెందిన భవిత సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీని కోసం ఆధునిక, సాంకేతిక, పర్యావరణ అనుకూలమైన కార్యాలయం అవసరం. ఇక్కడ పనిచేసే ప్రతి కర్మయోగి ఉత్పాదకతను పెంచుతూ, వారి సేవా సంకల్పాన్ని ప్రోత్సహించేదే ఈ కార్యస్థలం.
ఈ స్ఫూర్తితోనే సౌత్ బ్లాక్ ప్రారంభోత్సవం జరిగిన దాదాపు 95 సంవత్సరాల తర్వాత అంటే ఈ రోజు 13 ఫిబ్రవరి 2026న, భారత ప్రభుత్వం ఈ భవనాలను ఖాళీ చేసి 'సేవా తీర్థ్', 'కర్తవ్య భవన్'లకు మారుతోంది. ప్రతీకాత్మకంగా ఇది దేశం బానిసత్వపు గతం నుంచి 'అభివృద్ధి చెందిన భారత్' భవిత వైపు వేసిన మరో ముందడుగు. గత కొన్ని సంవత్సరాల్లో... మన దేశంలో చాలా ఏళ్ల పాటు కొనసాగిన 'అధికార' సంస్కృతి స్థానంలో 'సేవా' సంస్కృతి బలోపేతమైంది. నేటి ఈ పరివర్తన ఈ విలువలను మరింత బలోపేతం చేస్తుంది.
వేల సంవత్సరాల నాటి మన నాగరికత నుంచి తరతరాలకు స్ఫూర్తినిచ్చే "యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం"లో నార్త్-సౌత్ బ్లాక్‌లనూ భాగం చేయాలని ఈ రోజు మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మ్యూజియం మన కాలాతీత, శాశ్వత సాంస్కృతిక వారసత్వానికి వేదికగా నిలుస్తుంది. ఇది మన అద్భుతమైన గతాన్ని సుసంపన్న భవిష్యత్తుతో అనుసంధానిస్తుంది.
వలస పాలనా కేంద్రాన్ని... నవ భారత 'సేవా తీర్థ్'గా మార్చిన గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వానికి కేంద్ర కేబినెట్ కృతజ్ఞతలు తెలుపుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2228215)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam